ధర్మేంద్ర అనగానే “షోలే” సినిమా గుర్తుకు వచ్చి తీరుతుంది. ఆయన అసలు పేరు ధరమ్‌ సింగ్ దేవల్. ఆయన అలనాటి బాలీవుడ్ హీ మ్యాన్. రాజస్థాన్‌లోని బికనేర్ నుండి ఎంపీగా కూడా ప్రాతినిధ్యం వహించారు. 2012లో ‘పద్మ భూషణ్’ అవార్డు సైతం అందుకున్నారు. ధర్మేంద్ర బాలీవుడ్ డ్రీమ్ గర్ల్‌గా పాపులర్ ‌అయిన హేమమాలిని భర్త కూడా. అదంతా అలా ఉంచితే దశాబ్దాల పాటు బాలీవుడ్‌ను ఎదురులేకుండా ఏలిన హీరో ధర్మేంద్ర ఇప్పుడేం చేస్తున్నారు?
ధర్మేంద్ర వయసు ఇప్పుడు 85 ఏళ్లు. అయినప్పటికీ ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. గత కొన్నేళ్లుగా ధర్మేంద్ర ఉల్లాసంగా వ్యవసాయంతో కాలం గడుపుతున్నారు. విశాలమైన తన 100 ఎకరాల లోనావాలా ఫామ్‌హౌస్‌లో ఆయన ఆర్గానిక్ వ్యవసాయం కొనసాగిస్తుండడం విశేషం. ఆయన తన పొలంలో వరి, కూరగాయలు, పండ్లు సాగు చేస్తున్నారు. తరచు ఆయన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన వ్యవసాయం గురించిన అనుభవాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. తన వీడియోలతో పాటు Go Organic, Grow Organic అని కామెంట్ చేస్తూ సేంద్రియ వ్యవసాయం పట్ల ఆయన తన మక్కువను చాటుకుంటారు.
“నేను జాట్‌ని. జాట్‌లు తమ భూమిని, పంట పొలాలను ప్రేమిస్తారు. నేను ప్రస్తుతం లోనావాలాలోని నా ఫామ్‌హౌస్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాను. సేంద్రియ వ్యవసాయం అంటే నాకెంతో ఇష్టం. నేనిప్పుడు ఆర్గానిక్ పద్ధతుల్లో వరి పండిస్తున్నాను. నా దగ్గర కొన్ని గేదెలు కూడా ఉన్నాయి” అని ధర్మేంద్ర ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

“నేను రైతుబిడ్డను. బాల్యంలో ఉన్నప్పుడు మా పొలాలలో శ్రమించాను. కబడ్డీ, హాకీ వంటివి ఆడేవాడిని. చిన్నప్పుడు గబగబా మర్రి చెట్లు ఎక్కి దూకేవాడిని. నేను ఎప్పుడూ తాజాగా ఉండే సాధారణ ఆహారాన్నే తీసుకునేవాడిని. మాకు ఫ్రిజ్ ఉండేది కాదు, కాబట్టి ఒక గ్లాసు పాలు నా బ్రేక్ ఫాస్ట్‌గా ఉండేది” అని ధర్మేంద్ర గుర్తు చేసుకుంటారు.
కరోనా వైరస్ వ్యాప్తిపై ధర్మేంద్ర వ్యాఖ్యలు కూడా ఆలోచింపజేసేవిగా ఉంటాయి. నేలతల్లి మనని పునరాలోచించమంటోందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్ వల్ల ప్రకృతి కొంత తేటబడిందన్నారు. మనిషి సింపుల్‌గా జీవించడంలోనే ఆనందం ఉంటుందన్నారు. రసాయనాల వినియోగంతో, వాహనాల, పరిశ్రమల పొగతో అంతులేని కాలుష్యాన్ని సృష్టించామనీ, అది ఇక మీదట నియంత్రణలో ఉండాలని కరోనా వైరస్ మనకు తెలియజెప్పిందనీ ధర్మేంద్ర అంటారు.
ధర్మేంద్ర సేంద్రియ వ్యవసాయంపై తన పొరుగున ఉన్న సలీం దివాన్‌కు సలహాలు కూడా ఇస్తున్నారు. ‘బాలీవుడ్ డైరీస్’ (Bollywood Diaries)తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సలీం దివాన్, ధర్మేంద్ర ఇరుగు, పొరుగువారు. సలీం దివాన్ తాజా చిత్రం ‘అలియా బసు గాయబ్ హై’ త్వరలో విడుదల కాబోతోంది. సలీం దివాన్ Rajasthan Herbals International కంపనీకి సీఈఓ కూడా.

‘షోలే’ హీరోని కలసుకున్నాక సలీం దివాన్ చాలా ఇంప్రెస్ అయ్యారు. “నటనకు సంబంధించి ధర్మేంద్రజీ నాకెప్పుడూ స్ఫూర్తిదాయకమే. కానీ ఇప్పుడు నాకు ఆయన వ్యవసాయంలో కూడా ప్రేరణదాయకమయ్యారు. ధర్మేంద్రజీ సేంద్రీయ వ్యవసాయ విధానాలను నేర్చుకున్నారు. నేను కలిసినప్పుడు సేంద్రియ వ్యవసాయంపై ఆయన నాకు వివరణాత్మక అవగాహన ఇచ్చారు” అని సలీం చెప్పారు. ధర్మేంద్ర సలహా సూచనలతో సలీం దివాన్ కూడా తన ఫామ్‌హౌస్‌లో సేంద్రియ వ్యవసాయం మొదలుపెడుతున్నారు.
ఎనిమిది పదులు వయసులో కూడా ధర్మేంద్ర ఆర్గానిక్ వ్యవసాయం చేయడం, కావలసినవారికి సలహాలు ఇస్తుండడం విశేషం..అభినందనీయం.

ధర్మేంద్ర ఆర్గానిక్ వ్యవసాయ క్షేత్రం వీడియో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here