అంతా అనుకున్నది అనుకున్నట్టు జరిగితే త్వరలోనే దక్షిణాదిలో తొలి ఆర్గానిక్ విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. కర్ణాటకలోని శివమొగ్గలో సేంద్రియ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లలో లాగే కర్ణాటకలోనూ సేంద్రియ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉందని ఆ రాష్ట్ర వ్యవసాయ మంత్రి బీ సీ పాటిల్ తెలిపారు.
2020 ఫిబ్రవరి 11న బెంగళూరులో సేంద్రియ వ్యవసాయంపై జరిగిన ఒక సమీక్షా సమావేశంలో పాటిల్ (పై ఫోటోలో ఎడమ నుండి మూడవ వ్యక్తి) మాట్లాడారు. ప్రజలు క్రమంగా సేంద్రియ ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతున్నారని, వాటికి మంచి డిమాండ్ ఉందని ఆయన అన్నారు. అందుకే కర్ణాటకలో సేంద్రియ వ్యవసాయానికి తాము ప్రాధాన్యత ఇవ్వదలచామని ఆయన తెలిపారు. గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లలో సేంద్రియ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయనీ, శివమొగ్గలో కూడా అలాంటి విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని సేంద్రియ వ్యవసాయ కమిటీ (Organic Farming Committee) సభ్యులు సూచిస్తున్నారనీ ఆయన చెప్పారు. దీనిపై తాము చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుని అమలు చేస్తామని అని ఆయన ప్రకటించారు. రసాయన ఎరువుల వాడకం పెరగడం వల్ల భూసారం క్షీణిస్తోందని మంత్రి తెలిపారు. దీని వల్ల పండే పంటలు కూడా అనారోగ్యకరంగా మారుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. రసాయన ఎరువుల మూలంగా భూసారం దెబ్బతింటోందనీ, కనుక దాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందనీ ఆయన పేర్కొన్నారు. రసాయన వ్యవసాయం వినియోగదారులకు మాత్రమే కాకుండా రైతుల ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తోందని పాటిల్ అభిప్రాయపడ్డారు.

సేంద్రియ ఉత్పత్తుల మార్కెట్ విస్తరించేందుకు ప్రతి జిల్లా ఏదో ఒక ఆర్గానిక్ పంటను ఎంచుకుని దానిపై దృష్టి కేంద్రీకరించాలని మంత్రి సూచించారు. అలాగే క్షేత్రస్థాయిలో ఉన్న ఆర్గానిక్ వ్యవసాయ నిపుణులు రైతులకు సేంద్రియ సాగుపై తగిన సమాచారం అందించాలని ఆయన కోరారు. అలాగే ఆర్గానిక్ ఎరువులను ప్రభుత్వ ఏజన్సీలు ధ్రువీకరించాలని బీ సీ పాటిల్ అభిప్రాయపడ్డారు.
గుజరాత్‌లోని పంచ్‌మహల్ జిల్లాలో హలోల్ వద్ద ఆర్గానిక్ అగ్రికల్చరల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 2017లో గుజరాత్ ఆర్గానిక్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ చట్టాన్ని కూడా తెచ్చింది. ఇది దేశంలోనే తొలి సేంద్రియ వ్యవసాయ విశ్వవిద్యాలయం. తగిన స్థలం లభించక చాలా కాలం ఈ యూనివర్సిటీ ఏర్పాటులో జాప్యం జరిగింది. అయితే 2020-21 బడ్జెట్‌లో గుజరాత్ ప్రభుత్వం దీని కోసం రూ. 12 కోట్లను కేటాయించింది. గుజరాత్‌లో గోఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం ఒక్కో ఆవుకు రూ. 900 చొప్పున రైతులకు అందజేస్తున్నారు. అలా ఏటా రూ. 10,800 మేరకు ప్రకృతి వ్యవసాయం రైతులకు సహాయం అందుతోంది.
ఇక ఛత్తీస్‌గఢ్‌లో చాలా కాలం నుంచే ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. బస్తర్, బిలాస్ పూర్, అంబికాపూర్ జిల్లాల్లో ప్రభుత్వం ఆర్గానిక్ ఫార్మింగ్ మిషన్‌ను 2013లోనే ప్రారంభించింది. గోధన్ న్యాయ్ పేరుతో ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం గోవుల పెంపకానికి ఒక ప్రత్యేక పథకం అమలు చేస్తోంది. ఇవి గోశాలలుగా పనిచేస్తున్నాయి. వాటి పేడ నుండి ఎరువు తయారు చేస్తారు. ఇందుకు కేజీకి రూ. 2 చెల్లిస్తారు. ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించి ఛత్తీస్ గఢ్‌లో సర్టిఫికేట్ కోర్సులు నిర్వహిస్తున్నారు. గుజరాత్, ఛత్తీస్ గఢ్, కర్ణాటక రాష్ట్రాల స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాలు కూడా సేంద్రియ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు నెలకొల్పే దిశగా అడుగులు వేస్తే రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ఏపీలో ఇప్పటికే జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం ఒక కార్యక్రమంగా అమలవుతోంది. కనుక ఆర్గానిక్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రంగం సిద్ధంగా ఉన్నట్టే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here