గోచర భూములు అంటే గోవులు స్వేచ్ఛగా తిరుగుతూ గడ్డి తినడానికి ఉద్దేశించిన భూములు అని అర్థం. గోసంతతి అంటే అర్థం సంతానం మొత్తమని. అంటే ఆవులు, ఎద్దులు, ఆడ దూడలు, మగ దూడలని గ్రహించాలి. గోచర భూములన్నవి పూర్వం ప్రతి గ్రామంలోనూ ఉండేవి. అవి దేవాలయాల అధీనంలో కొనసాగేవి. ఇప్పుడవి కొన్ని చోట్ల ఆక్రమణలకు గురైతే, ఇంకొన్ని చోట్ల ఇతర అవసరాలకు వినియోగించబడుతున్నాయి. దీంతో క్రమంగా గోచర భూములు కనమరుగే అయ్యాయి. ప్రస్తుతం పాల కోసమే ఆవులను పెంచే పరిస్థితి రావడం వల్ల గోపాలన భారంగా మారింది. ఇక్కడ అంతా ఒక విషయాన్ని గమనించాలి. ఆవు ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే పాలనిస్తుంది. కానీ మట్టిని సారవంతం చేసే గోమయాన్నీ, మూత్రాన్నీ రోజూ ఇస్తూనే ఉంటుంది. ఈ కోణం నుంచి చూస్తే గోవు మనకిచ్చే గోమయం కానీ, గోమూత్రం కానీ నిజానికి వెలకట్టలేనివి. అవి భూసారాన్ని నిలుపుతాయి. నిరంతరం పెంచుతాయి. అందుకే గోచర భూములను మళ్లీ మనం ఏర్పాటు చేసుకోవాలి. గోవు ఆధారంగా దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి రూపుదిద్దుకోవాలి. కాస్త స్థితిమంతులైనవారు, తగిన వనరులు ఉన్నవారు ఎక్కడికక్కడ గ్రామాలలో గోచర భూములను ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకు స్వచ్ఛందంగా వారు ముందుకు రావాలి. చొరవ చూపాలి. దేశీయ గోజాతులను కాపాడుకోవడానికి కృత్రిమ గర్భధారణ (artificial insemination) వంటి పద్ధతుల అవసరం లేకుండా ఆంబోతుల సంచారం కూడా ఉండే విధంగా గోచర భూముల నిర్మాణం మళ్లీ జరగాలి.
గోపాలనపై శ్రీ విజయ రామ్ వేసిన పెయింటింగ్
గడ్డి, చిన్నచిన్న మొక్కలు తింటూ స్వేచ్ఛగా తిరుగాడే ఆవులు, బర్రెలు, మేకలు, గొర్రెల వంటివి మట్టిలో తమ వ్యర్థాలను (పేడ, మూత్రము) విసర్జిస్తాయి. దీంతో నేలలో నత్రజని, కార్బన్ సహజంగా వృద్ధి చెందుతాయి. దీని వల్ల పచ్చగడ్డితో పాటు మొక్కలూ ఏపుగా పెరుగుతాయి. గడ్డి నేలంతా పరుచుకుంటే మట్టిలో పడిన వాననీరు ఆవిరి కాకుండా ఉంటుంది. అలా మట్టిలో కొన్ని నెలలపాటు తేమ కొనసాగుతుంది. మట్టిలో తేమ ఉండడం వల్ల ఆ చుట్టుపక్కల చెట్లు పెరిగేందుకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆ చెట్లతో వనాలు తయారవుతాయి. అందుకే చిన్నచిన్న పట్టణాల పరిసర ప్రాంతాల్లో గోచర భూముల సంఖ్య పెరగాలి. ఇవి సహజ పర్యావరణాన్ని కాపాడతాయి. పశుసంచారం వల్లనే పచ్చగడ్డి, చిన్నచిన్న మొక్కలు.. వాటి వల్ల పెద్ద పెద్ద చెట్లు మనగలుగుతాయి. పశువులను స్వేచ్ఛగా తిరగాడనివ్వడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరతాయి. వాటిని కేవలం షెడ్లలో ఉంచి పెంచితే జీవసంపదకు, పర్యావరణానికీ కలిగే ఉపయోగమేదీ లేదు.
శ్రీ విజయ రామ్ చిత్రించిన పెయింటింగ్
ఇక్కడ మరో విషయం గమనించాలి. మేకలు, గొర్రెలు, బర్రెలతో పోల్చితే ఆవు పేడలో మట్టికి మేలు చేసే సూక్ష్మజీవులు ఎన్నో ఉన్నాయి. ఆవులు 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో కూడా ఎండలో తిరగగలుగుతాయి. తక్కువ ఉష్ణోగ్రతలో సైతం మనగలుగుతాయి. ఎద్దులు ఎంతటి ఎండలోనైనా పని చేస్తాయి. అవి తడిని ఇష్టపడవు. కానీ బర్రెలు (గేదెలు) తడిని, తేమను ఇష్టపడతాయి. ఎండకి తట్టుకోలేక నీటిలోను, బురదలోను దిగుతాయి. ఆవులతో పోల్చితే బర్రెలు ఎక్కువ ఎండను తట్టుకుని పని చేయలేవు. ఎద్దులలో చైతన్యం ఎక్కువగానూ, దున్నపోతులలో చైతన్యం తక్కువగా ఉంటుంది. ఇది రైతులకు అనుభవంలో ఉన్న విషయమే. దీన్ని బట్టి గోసంతతి ప్రత్యేకత ఏమిటో తెలుస్తుంది. ఇక మేకలు, గొర్రెలు చిన్న చిన్న మొక్కలను ఇష్టంగా తింటాయి. ఆవులు గడ్డి తినేందుకే ఇష్టపడతాయి. ఆవు కొరికిన గడ్డి మళ్లీ రెండు వారాలకు పెరుగుతుంది. ఎక్కడైతే గడ్డి సరిగా పెరగలేదో చూసి ఆవు అక్కడ పేడ వేస్తుంది. ఇదిగో.. నేను ఎరువు ఇస్తున్నాను..తీసుకో..అన్నట్టు ఆవు పేడ వేస్తుంది. మేకలు, గొర్రెలు తిన్న మొక్కలు మళ్లీ అప్పుడే మొలకెత్తవు. కొత్త మొక్కలు తిరిగి వర్షాకాలంలోనే వస్తాయి. ఇదీ ఆవులకూ, ఇతర జంతువులకూ మధ్య ఉండే భేదం. కాబట్టి గోసంచారం, గోపాలన అన్నవి కేవలం ఆవులకు, వాటిని పెంచేవారికి మాత్రమే మేలు చేసేవి కావని గ్రహించాలి. గోపాలన సమాజానికి, పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేకూర్చుతుంది. అందుకే మన పెద్దలు ఆవును ‘గోమాత’ అని వ్యవహరించారు. గోమాతను సేవించడం కన్నతల్లి రుణం తీర్చుకోవడం వంటిదే. భూమి, గోసంచారం, వ్యవసాయం.. ఈ మూడింటినీ ఎన్నటికీ వేరు చేయరాదు. వీటిని కలిపే చూడాలి. ఇది మానవాళి ఆర్థిక వ్యవస్థకు, ఆరోగ్యానికి, జీవవైవిధ్యానికి ఎంతో అవసరం.

– విజయ రామ్

SAVE సంస్థ వ్యవస్థాపకులు
ప్రకృతి వ్యవసాయ ప్రచార కేంద్రం, భాగ్యనగరం

040-27635867, 040-27654337, letssave@gmail.com

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here