రసాయన రహిత వ్యవసాయం అన్నది ఇప్పుడు దేశాన్ని విశేషంగా ఆకర్షిస్తున్న ఒక నినాదం. రసాయన ఎరువులు, కెమికల్ క్రిమిసంహారకాల వాడకం తగ్గించాలని పలువురు వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు ఆ దిశగా దూసుకుపోతోంది. ఒకప్పుడు రసాయన క్రిమిసంహారక మందుల వాడకం అత్యధికంగా ఉండిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఆర్గానిక్ పురుగు మందుల వినియోగం పెరిగింది.
గత ఐదేళ్లలో ఏపీలో కెమికల్ పెస్టిసైడ్స్ వాడకం ఏకంగా 40 శాతానికి పైగా తగ్గడం చెప్పుకోదగిన విశేషం. వ్యవసాయ మంత్రిత్వశాఖ వార్షిక నివేదికలను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో రసాయన క్రిమిసంహారక మందుల వాడకం గణనీయంగా తగ్గిపోయినట్లు వెల్లడి అవుతోంది. 2014-15లో 4,050 మెట్రిక్ టన్నుల మేరకు ఏపీలో రసాయన పురుగు మందుల వాడకం ఉండేది. ఆ తర్వాతి సంవత్సరం (2015-16) అది ఒకేసారి 2,713 మెట్రిక్ టన్నులకు తగ్గింది. 2016-17లో అది 2,015 మెట్రిక్ టన్నులుగా నమోదైంది. 2018-19లో అది మరింత తగ్గి 1,689 మెట్రిక్ టన్నులకు పరిమితమైంది. ఇక 2019-20లో అది 1,579 మెట్రిక్ టన్నులకు తగ్గిపోయింది.

తొలుత చంద్రబాబు నాయుడు హయాంలో సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయానికి ప్రాముఖ్యం హెచ్చడంలో రైతులు ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతులవైపు మొగ్గు చూపారు. ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా Zero Budget Natural Farming (ZBNF) ను ప్రోత్సహిస్తూ వచ్చింది. ఏపీ ప్రభుత్వం 2020 జనవరిలో జర్మనీకి చెందిన KfW బ్యాంకుతో జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయంపై ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ప్రకృతి వ్యవసాయాన్ని వచ్చే ఐదేళ్లపాటు కొనసాగించేందుకు ఈ ఒప్పందం వీలు కల్పించింది. ఇందుకుగాను KfW బ్యాంకు ఏపీకి రూ. 711 కోట్లను రుణంగా సమకూర్చుతుంది. ఇందులో సుమారు 8 కోట్ల రూపాయలను ప్రకృతి వ్యవసాయం అధ్యయనం కోసం జర్మనీ బ్యాంకు గ్రాంటుగా అందిస్తోంది. దీనికి తోడు ఏపీ ప్రభుత్వం మరో 304 కోట్ల రూపాయలను ప్రకృతి వ్యవసాయంపై వ్యయం చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా 591 గ్రామాలలో 2.39 లక్షల మంది రైతులకు ప్రకృతి వ్యవసాయం చేపట్టేందుకుగాను ప్రోత్సాహం లభిస్తోంది. రసాయన పురుగు మందుల వాడకం బాగా తగ్గిపోవడానికి ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలు ఒక ప్రధాన కారణం.
Zero Budget Natural Farming (ZBNF)ను ఏపీలో పెద్ద యెత్తున చేపట్టాక రైతులు ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతులను అనుసరించడం మొదలు పెట్టారు. ఆర్గానిక్ పంటలకు మార్కెట్లో మంచి గిరాకీ కూడా ఉంటోంది. గో ఆధారిత వ్యవసాయ పద్ధతిలో పండించిన పంటలకు గిట్టుబాటు ధరలూ లభిస్తున్నాయి. దీంతో క్రమంగా రసాయనాల వాడకం తగ్గిపోయింది.
పరంపరాగత్ కృషి వికాస్ యోజన (PKVY) కింద కేంద్రం కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. రైతులు వ్యవసాయంలో రసాయనాలను తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిరుడు తన ఎర్రకోట ప్రసంగంలో పిలుపునిచ్చారు. Zero Budget Natural Farming (ZBNF) గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 2019 బడ్జెట్ ప్రసంగంలో సైతం ప్రస్తావించారు. రైతలు రాబడిని రెట్టింపు చేయడానికి పాలేకర్ వ్యవసాయ పద్ధతులు తోడ్పడతాయని ఆమె అన్నారు. మొత్తంమీద ఏపీలో పర్యావరణ హిత ప్రకృతి వ్యవసాయానికి ఆదరణ పెరగడం స్వాగతించదగిన పరిణామం.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here