మన దేశంలో వ్యవసాయం ఎందుకు నష్టదాయకంగా మారుతోంది? ఆరుగాలం శ్రమించే రైతన్నలు ఎందుకు అప్పుల పాలవుతున్నారు? దిక్కుతోచని స్థితిలో చిక్కుకుని అన్నదాతలు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు? మనం అనుసరిస్తున్న ఆధునిక వ్యవసాయ విధానం ఎందుకు తలకు మించిన భారంగా పరిణమిస్తోంది?

ఈ ప్రశ్నలన్నిటికీ భాస్కర్ హిరాజీ సావే గారు ఇచ్చే సమాధానం ఒక్కటే. మనం ప్రకృతిని వికృతిగా మార్చుతున్నాం. సహజమైన ప్రకృతి చక్ర గమనాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాం. దాని వల్లే ఇంత అనర్థం జరుగుతోంది. బండెడు రసాయన ఎరువులతో సాగిస్తున్న మన నవీన వ్యవసాయం మూలంగానే రైతు సంక్షోభంలో చిక్కుకున్నాడని భాస్కర్ సావే తొలిసారిగా గుర్తించారు. దానికి ప్రత్యామ్నాయం స్వచ్ఛమైన ప్రకృతి వ్యవసాయమేనని ఆయన ప్రతిపాదించారు. ప్రతిపాదించడమే కాదు, చేసి చూపించారు. సావేజీది సైడ్ ఎఫెక్టులు లేని సేద్యపద్ధతి.

సుభాష్ పాలేకర్ గో ఆధారిత వ్యవసాయం గురించి విననివారుండరు. ఆయన ప్రకృతి వ్యవసాయం విశిష్టతని మనకు వివరిస్తున్నారు. అలాంటి పాలేకర్ తనకు గురుతుల్యుడిగా భావించినవారే శ్రీ భాస్కర్ సావే. దశాబ్దాల ముందే సావేజీ సేంద్రియ వ్యవసాయ విశిష్టతను, ఆవశ్యతకను చాటిచెప్పారు. అందుకే భాస్కర్ సావేగారిని ప్రకృతి వ్యవసాయ గాంధీ(GANDHI OF NATURAL FARMING)గా వ్యవహరిస్తారు. ఆయన కూడా గాంధీజీలాగే గుజరాత్‌కు చెందినవారు. గుజరాత్ కోస్తా ప్రాంతంలో వల్సాద్ జిల్లా అంబర్ గాఁవ్ దగ్గర డెహ్రీ అన్న గ్రామంలో సావేజీ జీవించారు. ఇది ముంబైకి 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

సావేజీ 1922 జనవరి 22న ఒక రైతు కుటుంబంలో జన్మించారు. తండ్రికి తోడుగా వ్యవసాయ కార్యకలాపాలలో పాలుపంచుకునేవారు. 1950ల్లో ఆయన ఆధునిక రసాయన వ్యవసాయం వైపు ఆకర్షితులయ్యారు. ఒక కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ ఏజన్సీని కూడా ఆయన తీసుకున్నారు. ఆ పరిసర గ్రామాల్లో ఉత్తమ ఏజంట్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే రానురాను రసాయన ఎరువుల వల్ల వ్యవసాయవ్యయాలు పెరుగుతున్నాయనీ, నెమ్మదిగా పంట దిగుబడులు తగ్గుతున్నాయనీ సావే గమనించారు. నీటివాడకం క్రమేపి పెరుగుతోందని, రసాయన విషాల వల్ల భూసారం కాస్తా తగ్గిపోతోందని ఆయన గ్రహించారు. భగవంతుడి ప్రకృతి చక్రాన్ని తాను అడ్డుకుని పాడుచేస్తున్నానని సావే భావించారు. ఆధునిక వ్యవసాయ విధానం పట్ల భ్రమలు తొలగిపోయాయి. జాతిపిత మహాత్మా గాంధీ ప్రకృతి సిద్ధాంతాల స్ఫూర్తితో ఆయన ప్రకృతి వ్యవసాయ ప్రస్థానం ప్రారంభమైంది. వ్యవసాయంలో అహింసను, ఆధ్యాత్మికతను ఆయన ప్రవేశపెట్టారు.

1960లో సావే ఆర్గానిక్ వ్యవసాయం మొదలుపెట్టారు. తన వ్యవసాయక్షేత్రానికి కల్పవృక్ష (Kalpavruksh) అని పేరు పెట్టారు. రసాయన ఎరువులు లేకుండా కేవలం సేంద్రియ ఎరువులతో సేద్యం సాగించారు. అనేక ప్రయోగాలు చేశారు. కేవలం పది శాతం పెట్టుబడితో 100 శాతం లాభం పొందవచ్చని ఆయన నిరూపించారు. బీడుపడిన భూముల్లో, అతి తక్కువ పెట్టుబడులతో అత్యధిక దిగుబడిని సాధించి చూపారు. ఆరోగ్యకరమైన పంటలు పండించి దేశానికే ఆదర్శంగా నిలిచారు. అతి స్వల్పంగా, పరిమితంగా నీటి వనరులను ఉపయోగించడం ద్వారా ఆయన ఆశ్చర్యకరమైన ఫలితాలను సాధించారు. పదిహేను ఎకరాల భాస్కర్ సావే “కల్పవృక్ష” క్షేత్రం ఇవాళ దేశవిదేశాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలను ఒక అధ్యయన కేంద్రం. ప్రకృతి వ్యవసాయంవైపు అడుగులు వేసే రైతన్నలకు ప్రేరణదాయకం.

సావేజీ తన పదకొండు ఎకరాల్లో పండ్ల తోటలు వేశారు. రెండు ఎకరాల్లో కొబ్బరి మొక్కల నర్సరీని ఏర్పాటు చేశారు. మరో రెండు ఎకరాల్లో వరి, పప్పుధాన్యాలు, కూరగాయల వంటివి వేశారు. వారి తోటలో 350 దాకా సపోటా చెట్లు, 350 వరకు కొబ్బరి చెట్లు ఉంటాయి. వీటి మధ్యలో అరటి, బొప్పాయి, పనస, జామ, శీతాఫలం, మునగ, కరివేపాకు చెట్లు పెంచారు. ఈ తోట భూమిలో అంతటా ఎర్రలు లేదా వానపాములు (earthworms) పుష్కలంగా ఉంటాయి. అవే భూసారాన్ని పెంచుతూ ఉంటాయి. ఈ వ్యవసాయ క్షేత్రంవో రెండు ఆవులు, రెండు దూడలూ ఉన్నాయి. కేవలం ప్రకృతి సూత్రాలను అనుసరించిన “కల్పవృక్ష” వ్యవసాయ క్షేత్రం అధిక దిగుబడిలో రికార్డులు సృష్టించింది. ఈ క్షేత్రంలోని కొబ్బరి చెట్లు కొన్ని ఏడాదికి నాలుగేసి వందలకు పైగా కొబ్బరి కాయలు కాస్తాయి. మొత్తం మీద చూస్తే సగటున ఒక్కో కొబ్బరి చెట్టుకు 350 దాకా కొబ్బరికాయలు దిగుతాయి. ఇక్కడి సపోటా చెట్లకి సగటున ఏడాదికి 300 కిలోల దాకా కాయలు కాస్తాయి. దేశం మొత్తంలో ఇంత కాత ఇంకెక్కడా కనిపించదు.
ప్రకృతి వ్యవసాయ మౌలిక సూత్రాలు-
భాస్కర్ సావే సిద్ధాంతాన్ని అనుసరించి ప్రకృతి వ్యవసాయం అహింసను అనుసరించాలి. ప్రకృతిలోని ప్రతి ప్రాణికీ మనలాగే జీవించే సమానహక్కు ఉందని గుర్తించాలి. ప్రకృతిలోని ప్రతిదీ ఒక పరమార్థాన్ని నెరవేరుస్తుందని సావేజీ చెప్పేవారు. అలాగే వ్యవసాయం అన్నది ప్రకృతికీ, ఇతర జీవులకూ చేసే పవిత్రమైన సేవ అని భావించాలి. వ్యవసాయాన్ని లాభార్జన దృష్టితో చూసి దాని పవిత్రతను దిగజార్చకూడదు.
వ్యవసాయం నిరంతర ప్రకృతి పునరుత్పత్తి ప్రక్రియలో భాగం మాత్రమే. (खेती धंदा नहीं, धर्म है – kheti dhanda nahin, dharm hai (agriculture is not a business, but one’s duty/religion) మనిషికి తను పండించే పంటలకు సంబంధించిన ఫలసాయం పొందే హక్కు మాత్రమే ఉంటుంది. పంటల తాలూకు బయోమాస్, వ్యర్థాలు తిరిగి భూమికే చెందుతాయి. ఈ వ్యవసాయక్షేత్రంలో రుచికరమైన నవాబీ కోలమ్ (Nawabi Kolam) వెరైటీ వరి సాగు అవుతుంది. దీని దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ క్షేత్రమంతా చెట్లతో, మొక్కలతో, పచ్చని పైర్లతో నిండి ఉంటుంది. మండు వేసవిలో కూడా ఎంతో చల్లగా ఉంటుంది. నిజానికి వ్యవసాయానికి నీరు ఎక్కువగా అవసరం ఉండదనీ, కావలసింది తేమ మాత్రమేననీ భాస్కర్ సావే విశ్వసించారు. మొక్కలు నాటాక, లేదా పైరు వేశాక అనవసరంగా వాటి మధ్య తిరుగాడకూడదనీ, అది మొలకెత్తడంపైన, ఎదుగుదలపైన ప్రభావం చూపుతుందనీ ఆయన వివరించారు.
భాస్కర్ సావేజీ అసామాన్య వ్యవసాయ విజయం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. జపాన్‌కు చెందిన ప్రసిద్ధ వ్యవసాయ తత్త్వవేత్త, The One-Straw Revolution గ్రంథ రచయిత మాసనోబు ఫుకువోక (Masanobu Fukuoka) స్వయంగా “కల్పవృక్ష” క్షేత్రాన్ని సందర్శించారు. ప్రపంచంలోనే ఈ వ్యవసాయక్షేత్రం అత్యుత్తమమైందని ఆయన ప్రశంసించారు.

భాస్కర్ సావే వ్యవసాయక్షేత్రంలో మాసనోబు ఫుకువోక

ఇలా ఎందరినో భాస్కర్ సావే ప్రభావితం చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాల సైంటిస్టులు, విద్యార్థులు నిత్యం కల్పవృక్ష క్షేత్రానికి వచ్చి ప్రకృతి వ్యవసాయంలోని మెళకువలు తెలుసుకుంటూ ఉంటారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రబోధించేందుకు “కల్పవృక్ష” వ్యవసాయ క్షేత్రం పది రోజుల కోర్సును కూడా నిర్వహిస్తోంది.సేద్యాన్ని ఆధ్యాత్మిక దృష్టితో చూడడం, రైతు సహజ ప్రకృతి చక్రంలో భాగం కావాలని ప్రతిపాదించడంవంటివి భాస్కర్ సావేగారిని విశిష్ట వ్యవసాయ తత్త్వవేత్తగా, ఆర్గానిక్ వ్యవసాయ వైతాళికుడిగా నిలిపాయి. వ్యవసాయంతోనే ఆగిపోకుండా భాస్కర్ సావే ఆర్గానిక్ మెడిసిన్ పద్ధతులను కూడా ప్రతిపాదించారు. పన్నెడు లవణాలతో ఒక వైద్యవిధానాన్ని ఆయన సూచించారు. ప్రకృతిలో మమైక్యమై జీవించి, ప్రపంచాన్ని గాంధేయ సహజ వ్యవసాయ పద్ధతులవైపు నడిపించిన భీష్మాచార్యులు సావేజీ 2015 అక్టోబర్ 24న దివంగతులయ్యారు. ఆయన ఇవాళ భౌతికంగా మన మధ్య లేకున్నా “కల్పవృక్ష”తరుచ్ఛాయల్లో ఆయన ఎన్నటికీ సజీవులే. ఆయన అనన్య స్ఫూర్తి అజరామరమే.

శ్రీ భాస్కర్ సావే ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడవచ్చు.

భాస్కర్ సావే గారి ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై మరిన్ని వివరాలకు ఈ క్రింది చిరునామాను సంప్రదించవచ్చు.

Bhaskar Save Natural Farming Learning Centre, Address: Kalapavruksha, Coast Highway, near Village Dehri, via Umergan Station, Dist, Valsad, Gujarat 396170, Phone: +91-260-2995177 Contact Persons: 1) Abhijay Save: Mobile +91-9723531071 Email – abhijaysave@gmail.com 2) Bharat Mansata: Mobile +91-9967371183 Email –bharatmansata@yahoo.com)

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here