భారతీయ సంప్రదాయ వ్యవసాయ విధానమైన ప్రకృతి సాగు విధానాన్ని తిరిగి వాడుకలోకి తీసుకురావాలనీ, అదే దేశ వ్యవసాయ భవిష్యత్తుకు దిక్సూచి అవుతుందనీ ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. ‘జాతీయ రైతు దినోత్సవం’ (కిసాన్ దివస్) సందర్భంగా 2020 డిసెంబర్ 23వ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు హైదరాబాద్‌లోని తన నివాసంలో సేంద్రియ-ప్రకృతి వ్యవసాయ నిపుణులైన ఐదుగురు రైతులతో సంభాషించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని రైతులతో చేస్తున్న మాటామంతి కార్యక్రమంలో భాగంగా ఉపరాష్ట్రపతి ఈ రైతులతో గంటన్నరసేపు మాట్లాడి వారి అనుభవాలను, అనుసరిస్తున్న విధానాలను, ఫలితాలను గురించి అడిగి తెలుసుకున్నారు. వీరంతా తమ అనుభవాలను, ఫలితాలను తెలియజేస్తూ ప్రకృతి సాగు పద్ధతుల్లో వ్యవసాయం లాభసాటిగా ఉందని తెలిపారు.
వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చడానికి చేపట్టాల్సిన చర్యలను, సలహాలను, సూచనలను ఆయన అడిగి తెలుసుకున్నారు. సేంద్రియ వ్యవసాయం, సహజ వ్యవసాయం ద్వారా ఎదురౌతున్న సమస్యలు, అనంతర ఫలితాల గురించి కూడా ఉపరాష్ట్రపతి విపులంగా చర్చించారు.

దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయంపై మరింత దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ప్రస్తుతం దేశంలో ఆహార భద్రత, ఆహార నిల్వలు ఉన్నప్పటికీ పెరుగుతున్న దేశ జనాభాను దృష్టిలో ఉంచుకుని తదనుగుణంగా ఆహారోత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని రైతులకు శ్రీ వెంకయ్య నాయుడు అన్నారు.

మేలు రకం వంగడాలు అవసరం

వ్యవసాయరంగంలో మార్పులతోపాటు పౌష్టికాహారం ఇచ్చే పంటలపైనా దృష్టి సారించాల్సిన ఆవశ్యతను ఆయన ప్రస్తావించారు. తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాల ఉత్పత్తిపై కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. మేలురకాలైన వంగడాలను కనుగొని, వాటిని అందరికీ అందుబాటులోకి తెచ్చే విషయంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు ప్రత్యేకమైన చొరవతీసుకోవాలని ఉప రాష్ట్రపతి సూచించారు.
దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనలకు చర్చలే సరైన పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయపార్టీలు తమ ఎన్నికల ప్రణాళికల్లో వ్యవసాయరంగ అభివృద్ధిపై వాటి ఆలోచనలను స్పష్టంగా వెల్లడించాలనీ, తదనంతరం వాటిని పాటించాలని ఆయన సూచించారు.
ఇప్పటివరకు అనుసరించిన విధానాలను ఒకసారి అవలోకనం చేసుకుని అధునాతన పద్ధతులను, సాంప్రదాయ విధానాలను మేళవించి మన వ్యవసాయ రంగాన్ని మరింత పటిష్ఠపరుచుకోవాల్సిన అవసరం ఉందని శ్రీ వెంకయ్య నాయుడు అన్నారు. రైతులకు అవసరమైన శీతల గిడ్డంగులు, రవాణా సదుపాయాలను మెరుగుపరచాల్సిన అవసరాన్నీ ఆయన నొక్కిచెప్పారు. దేశవ్యాప్తంగా తరచు వివిధ రంగాల్లో విశేష కృషిచేస్తున్న వారితో మాటామంతీ జరుపుతూ వారి అభిప్రాయాలను ప్రభుత్వ పెద్దలకు తెలియజేస్తున్నానని ఆయన వెల్లడించారు.
ఈ ఏడాది కరోనా మహమ్మారి ఉపద్రవం నేపథ్యంలోనూ మన రైతులు చేసిన కృషిని ఉపరాష్ట్రపతి అభినందించారు. మన దేశ ప్రజలకు అవసరమైన పౌష్టికాహారాన్ని ఉత్పత్తి చేయడంతోపాటు ప్రపంచానికి అవసరమైన ఆహారధాన్యాలను ఉత్పత్తి చేయడంపైన కూడా దృష్టిపెట్టాలని ఆయన వారికి సూచించారు.
వ్యవసాయం భారతీయ మూల సంస్కృతి అని అభిప్రాయపడిన ఉపరాష్ట్రపతి, దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లి సేద్యాన్ని లాభసాటిగా మార్చాలన్నారు. అలాగే యువతరం కూడా వ్యవసాయం వైపు వచ్చేలా ప్రోత్సహించాలన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ గుడివాడ నాగరత్నం నాయుడు, వారి కుమార్తె హర్షిణి, శ్రీ సుఖవాసి హరిబాబు, శ్రీ దేవరపల్లి హరికృష్ణ, శ్రీ బైరపాక రాజు దంపతులు, శ్రీమతి లావణ్యారెడ్డి, శ్రీ రమణారెడ్డి దంపతులు వారి కుమారుడు, ‘రైతునేస్తం’ పత్రిక సంపాదకుడు పద్మశ్రీ యడ్లపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

ఉప రాష్ట్రపతి సంభాషణ వీరితోనే…

శ్రీ గుడివాడ నాగరత్నం నాయుడు : ‘గోమాత, భూమాత, సూర్యరశ్మి’ ఈ మూడింటి అనుసంధానమే వ్యవసాయమని ప్రగాఢంగా విశ్వసిస్తారు చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీ నాగరత్నం నాయుడు. ఆ దిశగా ఆయన తక్కువ నీటిని వినియోగిస్తూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. సమగ్ర వ్యవసాయ విధానాన్ని, జీవవైవిధ్యాన్ని విజయవంతంగా ఆచరిస్తూ చక్కటి ఫలితాలు సాధిస్తున్నారు.
శ్రీ సుఖవాసి హరిబాబు : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో శ్రీ హరిబాబు జీవవైవిధ్య ఉద్యాన ప్రకృతి వ్యవసాయ క్షేత్రానికి రూపకల్పన చేశారు. 10 ఎకరాల క్షేత్రంలో పండ్లమొక్కలు, ఔషధ మొక్కలు, కలప మొక్కలను నాటారు. దేశీ ఆవు జాతులను, గొర్రెలు, కోళ్లు, బాతులను కలిపి విజయవంతంగా సమీకృత వ్యవసాయం చేస్తున్నారు.
శ్రీ దేవరపల్లి హరికృష్ణ : అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని సైతం వదులుకుని వచ్చి వ్యవసాయం వైపు దృష్టి సారించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆయన రసాయనాలు లేకుండా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. దిగుబడిని మరింత పెంచడం కోసం ఆధునిక సాంకేతికతను, భారతీయ వ్యవసాయ పరిజ్ఞానంతో జోడించి చక్కటి ఫలితాలు సాధిస్తున్నారు.
శ్రీ బైరపాక రాజు : లోగడ వ్యవసాయం సరిగా సాగక ఆత్మహత్య చేసుకోవాలనుకున్న పరిస్థితి నుంచి ఇవాళ పదిమందికి ఆదర్శంగా నిలిచే స్థితికి ఎదిగారు. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం గుమ్మకొండ గ్రామానికి చెందిన రాజు దేశవాళీ విత్తనాల రకాలను సొంతగా సిద్ధం చేస్తూ హైబ్రిడ్ రకాలతో సమానంగా దిగుబడి వచ్చేలా కృషి చేస్తున్నారు. తోటి రైతులనూ ప్రోత్సహిస్తున్నారు.
శ్రీమతి లావణ్యారెడ్డి, శ్రీ రమణారెడ్డి దంపతులు : నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన వీరు పదేళ్లుగా సేంద్రియ వ్యవసాయ విధానాన్ని అవలంబిస్తూ తమ ఉత్పత్తులకు తామే మార్కెటింగ్ చేసుకుంటున్నారు. వీరు వరి, పప్పుధాన్యాలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. ఇందుకుగాను పలు రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నారు.
రైతు దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి తమతో కలిసి సంభాషించడం పట్ల వీరంతా సంతోషం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here