పట్టుదల, నిబద్ధత, శ్రద్ధ, అభినివేశం.. కృష్ణప్ప దాసప్ప గౌడను విజేతగా నిలిపాయి. ప్రకృతి సేద్యంపై ఉన్న అచంచల విశ్వాసం ఆయనను ఇవాళ వార్తల్లో వ్యక్తిని చేసింది. శూన్యం అనుకున్నదాని నుండి ఆయన బంగారం పండించి చూపారు. మట్టిని నమ్మితే ఫలితం ఉండి తీరుతుందని మరోసారి నిరూపించారు. కృష్ణప్ప కర్ణాటక టి.నరసీపూర్ తాలూకాలోని బన్నూరు గ్రామానికి చెందిన ఒక రైతు. ఆ పరిసర గ్రామాలలో “బన్నూరు కృష్ణప్ప”గా ఆయన ఇప్పుడు పాపులర్. సుభాష్ పాలేకర్ సూచనల మేరకు 2005 నుండి ఆయన ఒక ఎకరంలో ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టారు. రెండేళ్లలో అనుకున్న ఫలితం వచ్చింది. దీంతో ఆయన ఐదు ఎకరాలకు తన ప్రకృతి సేద్యాన్ని విస్తరించారు. కృష్ణప్ప పొలం అంతా నిజానికి వర్షాధారమైనదే. అయితే ఇందులో ఆయన జపానుకు చెందిన ప్రసిద్ధ ప్రకృతి వ్యవసాయ తత్త్వవేత్త మసానోబు ఫుకువోక పద్ధతులను అనుసరించారు. ఫుకువోక విధానాలనే సుభాష్ పాలేకర్ మన దేశ వాతావరణ పరిస్థితులకు తగినట్లుగా మార్చారు. వ్యవసాయం గో ఆధారితంగా ఉండాలని ప్రతిపాదించారు.

ఏం పండిస్తున్నారంటే…

పాలేకర్ సూచించిన పద్ధతల ప్రకారం కృష్ణప్ప తన వ్యవసాయ క్షేత్రంలో పెద్ద వృక్షాలతో పాటు మధ్యరకం చెట్లను, చిన్నచిన్న పొదలను, తీగజాతులను కలిపి పెంచడం ప్రారంభించారు. ప్రతి మొక్కకూ తగినంత సూర్యరశ్మి లభించేలా జాగ్రత్త తీసుకున్నారు. ఇలా చెట్లను పెంచడం వల్ల ఆ ప్రాంతమంతా వనంలా తయారైంది. ప్రస్తుతం ఈ వ్యవసాయ క్షేత్రంలో టేకు, మామిడి, అరటి, కొబ్బరి, బత్తాయి, మిరియాలు,  పసుపు, అల్లం, కాఫీ, చెరకు, వరి వంటివి సాగు చేస్తున్నారు. “వ్యవసాయం అన్నది ఒక విజ్ఞానశాస్త్రం. అడవుల్లో ఉండే చెట్లకి ఎవరు నీరు పోస్తున్నారు? ఎవరు ఎరువులు వేస్తున్నారు? ఆ చెట్లన్నీ ఆరోగ్యంగా ఉండి మంచి పండ్లను ఇస్తుంటాయి. అదంతా సహజంగా జరుగుతుంది. ఆ సూత్రాన్నే మేము Zero Budget Natural Farming (ZNBF)లో అనుసరించాం” అని కృష్ణప్ప చెబుతారు. ఫుకువోక ప్రతిపాదించిన సూత్రాన్నే తాము పాటించి వ్యవసాయంలో సఫలత సాధించామని ఆయన అంటారు. ప్రకృతి పనిలో మనిషి జోక్యం చేసుకోకూడదన్నదే మసానోబు ఫుకువోక సిద్ధాంతం. “ము” (జపనీస్ భాషలో శూన్యం అని అర్థం) అనే సూత్రాన్ని ఆయన విశ్వసించారు. దాన్నే వ్యవసాయానికి వర్తింపజేశారు. పంటలు మనిషి జోక్యం లేకుండా సహజంగానే పండాలని ఆయన ప్రతిపాదించారు.

లేబర్ అవసరం చాలా తక్కువ

కృష్ణప్ప అనుసరించింది పూర్తిగా పర్యావరణానికి అనుకూలమైన వ్యవసాయ విధానం. ప్రకృతి వ్యవసాయంలో ఖర్చు చాలా తక్కువగా ఉండడం రైతుకు కలిసివస్తుందని చెబుతారు కృష్ణప్ప. “చాలా మంది రైతులు వ్యవసాయంలో లేబర్ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. కానీ ప్రకృతి వ్యవసాయంలో ఎక్కువ లేబర్ అవసరం ఉండదు. అలాగే మనం పెట్టే పెట్టుబడి కూడా చాలా తక్కువ. ఈ విధానంలో మనకు 10 శాతం వ్యవసాయ శ్రామికులు సరిపోతారు. అంతర పంటల ద్వారా అదనపు ఆదాయం కూడా వస్తుంది” అని కృష్ణప్ప వివరిస్తారు. ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల రైతుకు ఎకరానికి ఏడాదికి 3 నుండి 4 లక్షల రూపాయలదాకా తప్పక ఆదాయం లభిస్తుందని కృష్ణప్ప చెబుతున్నారు. కృష్ణప్ప లోగడ రసాయన వ్యవసాయం చేసిన రోజుల్లో ఎకరానికి 20 వేల రూపాయలు మాత్రం సంపాదించేవారు. కానీ ప్రకృతి సేద్యం తర్వాత ఇప్పుడు అంతా కలిపి ఎకరానికి 6 లక్షలు రావడం విశేషం. ప్రకృతి వ్యవసాయంలో దేశీ విత్తనాలను వాడతారు. మొక్కలను నాటడంలో కూడా కొన్ని మెళకువలు అనుసరిస్తారు. అంచెల పద్ధతిలో సాగు సాగుతుంది. రసాయనాల వాడకం లేకుండా పండించే ఈ ఆర్గానిక్ పంటలకు ప్రస్తుతం మంచి మార్కెట్ కూడా ఉంటోంది. జనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని కోరుకుంటున్నారనీ, ఈ దృష్ట్యా ప్రభుత్వం కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనీ కృష్ణప్ప కోరుతున్నారు. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల భూసారం దెబ్బతిన్నదనీ, జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం (ZBNF) దాన్ని పునరుద్ధరిస్తుందనీ ఆయన చెబుతారు. అడవులను అధ్యయనం చేయడం ద్వారా ప్రకృతి వ్యవసాయ విధానం రూపుదిద్దుకుందని ఆయన వివరిస్తారు. పొలం పనులు చేసుకుంటూనే కృష్ణప్ప ఆదివారాల్లో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. “నేను చదివింది కేవలం ఎస్ఎస్ఎల్‌సి మాత్రమే. కానీ ఇవాళ నేను పాలేకర్ ప్రకృతి వ్యవసాయ మెళకువలను గురించి విదేశీయులకు కూడా బోధిస్తున్నాను” అని కృష్ణప్ప మెరిసే కళ్లతో గర్వంగా చెబుతారు. కృష్ణప్ప వ్యవసాయ క్షేత్రం చూసిన మరికొందరు కూడా ప్రకృతి వ్యవసాయంవైపు అడుగులు వేయడం మరో విశేషం.
కృష్ణప్ప వ్యవసాయ క్షేత్రం

కృష్ణప్ప స్ఫూర్తితో మరికొందరు…

కృష్ణప్ప స్ఫూర్తితో తాను సైతం రెండెకరాల్లో వ్యవసాయం మొదలుపెట్టాలనుకుంటున్నానని బెంగళూరుకు చెందిన హెచ్ చేతన్ చెప్పారు. కృష్ణప్ప తన వ్యవసాయ క్షేత్రంలో స్థానిక వంగడాలను ఉపయోగించి పంటలు పండిస్తున్నారనీ, ఇది దేశీవంగడాల వ్యాప్తికి తోడ్పడుతుందనీ ఆయన అన్నారు. పెద్దగా పెట్టుబడి లేకుండానే సేంద్రియ వ్యవసాయ విధానం ద్వారా మంచి దిగుబడి సాధించవచ్చన్నారు. సేద్యంలో నష్టపోతున్న రైతులకు ఈ పద్ధతులు వరప్రదాయినులుగా ఉంటాయని చేతన్ అభిప్రాయపడ్డారు. “వరుస నష్టాల వల్ల చాలామంది రైతులు వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు. కానీ వారు ZBNFను అనుసరించి అంతర పంటలను పండిస్తే సమస్యల నుండి తప్పక బయటపడగలరు. ప్రకృతి వ్యవసాయం రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు ఒక మంచి పరిష్కారమార్గం” అని కృష్ణప్ప చెబుతారు.

వరప్రదాయిని జీవామృతమే…

జీవామృతం సిద్ధం చేస్తున్న కృష్ణప్ప
కృష్ణప్ప తన వ్యవసాయ క్షేత్రంలో పంటలకు సుభాష్ పాలేకర్ సూచించిన జీవామృతాన్ని ఉపయోగిస్తారు. ఇది పొలంలో వానపాములను (earthworms), పంటలకు మంచిచేసే సూక్ష్మజీవావరణాన్ని పెంచి భూసారాన్ని కాపాడుతుంది. దేశీ ఆవు పేడ, గోమూత్రం, నీరు, బెల్లం, పప్పుధాన్యాల పిండి సాయంతో కృష్ణప్ప జీవామృతాన్ని తయారు చేసుకుంటారు. అలాగే తెగుళ్లను నివారించేందుకు కృష్ణప్ప బీజామృతాన్ని వాడతారు. వివిధ రకాలైన మొక్కలను పెంచడం ద్వారా మట్టిలో తేమశాతాన్ని పెంచుతారు. ఇది పంటలు ఏపుగా పెరిగేందుకు ఉపకరిస్తుంది. ప్రకృతి వ్యవసాయం అంతా సేంద్రియ పద్ధతుల్లో బయో ఫెర్టిలైజర్లతోను, బయో ఫెస్టిసైడ్లతోను సాగుతుంది కనుక పండే పంటలు ఆరోగ్యకరమైనవిగా ఉంటాయి. ఆసక్తిగలవారు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం కృష్ణప్ప దాసప్ప గౌడను సంప్రదించవచ్చు. ఫోన్ : 9880587545.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here