పొలంపని కేవలం జీవనాధారమైన వృత్తి మాత్రమే కాదు, అది శరీరానికి మంచి కసరత్తు కూడా. నిజానికి తోటపనిలోని శారీరక శ్రమను మించిన ఎక్సర్‌సైజ్ మరేదీ ఉండదేమో. దీనికి చిదంబరం నాయర్ జీవితమే చక్కని ఉదాహరణ. కేరళలోని కోలికోడ్‌కు చెందిన చిదంబరం నాయర్ వయసు ఇప్పుడు 93 సంవత్సరాలు. ఆయన లోగడ స్కూల్ టీచర్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. చిన్నతనం నుంచే ఆయనకు తోటపని అలవాటు. తొమ్మిదిపదుల వయసులోనూ ఆయన మిస్టర్ ఫిట్. ఆయన దేహదారుఢ్యం ఏ మాత్రం చెక్కుచెదరలేదు. ఇప్పటికీ ఆయన రోజూ ఎప్పటిలాగే పొద్దున్నే లేచి పొలం వెళ్లి వ్యవసాయం పనులు చేస్తారు. తను పండించినవి మాత్రమే తింటారు. ఈ వయసులో కూడా ఇంత చలాకీగా ఎలా ఉంటున్నారని అడిగితే తన ఆరోగ్యరహస్యం పొలంపనులేనని గర్వంగా చెబుతారు చిదంబరం నాయర్. మట్టివాసనే తనకు ప్రోద్బలమని ఆయన తన్మయంగా అంటారు. ఆయన పొలంపనులన్నీ ఆర్గానిక్ పద్ధతుల్లోనే సాగడం మరో విశేషం.
“వ్యవసాయమే ప్రపంచంలో అన్నిటికీ మూలాధారం. మనం ఈ సంగతి మరిచిపోయిననాడు మన సమస్యలన్నీ మొదలవుతాయి” అని చెబుతారు చిదంబరం నాయర్.

వ్యవసాయం పట్ల మక్కువ

చిదంబరం నాయర్ చిన్నతనంలో ఇంట్లో కాస్త స్థలంలో పెరటి తోట ఉండేదట. ఆడుతూ పాడుతూ చిదంబరం నాయర్ ఆ పెరటి తోటలోనే మొక్కలు నాటడం, వాటికి నీరు పోయడం, ఎరువులు వేయడం లాంటివి చేసేవారు. ఈ తోటపని రానురాను ఆయనకు ఒక హాబీగా మారిపోయింది. వ్యవసాయం పట్ల మక్కువతో ఆయన తమ కుటుంబానికి చెందిన ఒక బీడు భూమిని బాగు చేసుకోవాలనుకున్నారు. దాన్ని నెమ్మదిగా వ్యవసాయయోగ్యంగా మార్చుకున్నారు. అంతే. ఇక ఆయన వెనక్కి తిరిగి చూసుకున్నదే లేదు.

“నేను 27 ఏళ్ల పాటు ఒక ప్రైమరీ స్కూల్ టీచర్‌గా పని చేశాను. ఆనాళ్లలో బడికి వెళ్లే ముందు ఉదయం 9 గంటలదాకా పొలంపనులు చూసుకునేవాడిని. స్కూలు వదిలాక పిల్లలు ఇళ్లకేసి పరుగులు తీస్తే, నేను పొలంకేసి పరిగెత్తేవాడిని” అని చిదంబరం నాయర్ తన జ్ఞాపకాలను పంచుకుంటారు.
చిదంబరం నాయర్ తన 7 ఎకరాల పొలంలో 350దాకా కొబ్బరి చెట్లు పెంచారు. వరితో పాటు అరటి, టొమాటో, కర్రపెండలం, కంద వంటివాటిని ఆయన సేంద్రియ విధానంలో పండిస్తారు. ఇంటికి అవసరమైనంత ఉంచుకుని మిగతావాటిని మార్కెట్లో విక్రయిస్తారు. రసాయన వ్యవసాయం కన్నా ఆర్గానిక్ వ్యవసాయంలో శ్రమ కాస్త ఎక్కువ అని చిదంబరం చెబుతారు. సేంద్రియ వ్యవసాయం చేయాలంటే ముందుగా భూసారాన్ని పెంచాలనీ, అందుకు ప్రకృతి సిద్ధమైన ఎరువులను, క్రిమిసంహారకాలను తయారుచేసుకోవలసి ఉంటుందనీ ఆయన వివరిస్తారు. అయితే ఆర్గానిక్ పద్ధతుల్లో పండినవి ఎంతో ఆరోగ్యకరమైనవనీ, వాటికి ఏవీ సాటిరావనీ ఆయన చెబుతారు.

ఆర్గానిక్ సాగు ఎంతో బాగు

“ఆర్గానిక్ వ్యర్థాలు భూసారాన్ని నిలుపుతాయి. నేలను సజీవంగా ఉంచుతాయి. కాలుష్యాన్ని తగ్గిస్తాయి. నీటిని పొదుపు చేస్తాయి. నేలకోతను నివారిస్తాయి. దిగుబడిని పెంచుతాయి. నేను నా పొలంలో రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలు వాడను. ఎండించిన ఆవుపేడని ఎరువుగా వాడతాను. ఆర్గానిక్ కంపోస్టుతో పాటు వేరుశెనగ ముద్దలను ఉపయోగిస్తాను” అని చిదంబరం నాయర్ వివరిస్తారు.
చిదంబరం నాయర్ ప్రతి రోజూ రాత్రి 8.30 గంటలకు నిద్రకు ఉపక్రమిస్తారు. పొద్దున 6 గంటలకల్లా నిద్రలేస్తారు. స్నానం తర్వాత పొలానికి వెళతారు. తిరిగి వచ్చేది సాయంత్రమే. వచ్చాక భోజనం చేసి నిద్రపోతారు. ఇదీ చిదంబరం నాయర్ దినచర్య. నాయర్ కేవలం శాకాహారభోజనమే చేస్తారు. అదే తన శరీర ఆరోగ్యాన్ని కాపాడుతుందని ఆయన చెబుతారు. ఆయన నూనె పదార్థాలు, జంక్ ఫుడ్ అస్సలు ముట్టరు. చిదంబరం నాయర్ ఎంత చలాకీగా ఉంటారంటే, వంటలో ఆయన తన భార్యకు సహాయం కూడా చేస్తారు.

చిదంబరం నాయర్ కుమారుడు రాధాకృష్ణన్ తన తండ్రిని గురించి గొప్పగా చెబుతారు. తన చిన్నతనం నుంచీ తన తండ్రిని పొలంలో చూస్తున్నానని ఆయన గుర్తు చేసుకుంటారు. తమ కుటుంబం మార్కెట్ నుంచి కొనేవి చాలా తక్కువగా ఉంటాయనీ, చాలా సంవత్సరాలుగా తాము నూనెల వాడకం మానేశామనీ ఆయన చెబుతారు. వారు తండ్రి పొలం నుంచి తెచ్చేవాటినే ఇంట్లో ఉపయోగిస్తారు. చివరికి వారి దుస్తులు కూడా తండ్రి మగ్గంతో నేసినవే కావడం మరో విశేషం.
చిదంబరం నాయర్‌ భార్య పేరు కార్త్యాయని. వారికి నలుగురు సంతానం. వారి పేర్లు మోహన్ దాస్. రాధాకృష్ణన్, కోమలవల్లి, ఉష. వారిలో పెద్ద కొడుకు మోహన్ దాస్ వ్యవసాయ అధికారిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఇక ఇద్దరు కూతుళ్లు గృహిణులు.
చిదంబరం నాయర్‌‌కు తన వ్యవసాయం పనుల్లో కుటుంబ సభ్యుల సహాయం అవసరం ఉండదు. ఈ వయసులో కూడా ఆయన ఇంకా పొలంపనులు చేయడం ఇంట్లోవారికి ఇష్టం కూడా లేదు. పొలంపనుల్లో పడి వేళకి సరిగా భోజనం కూడా చెయ్యరన్నది తండ్రిపై వారి ఫిర్యాదు. కానీ పెద్దాయన ఇవేవీ పట్టించుకోరు.
“తొంబై ఏళ్ల వయసులో పొలంపనులు చేయడమేమిటని మా కుటుంబ సభ్యులు వారిస్తూ ఉంటారు. కానీ వ్యవసాయం శరీరానికి మంచి కసరత్తు. అదే నన్ను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇంతదాకా నేను ఆసుపత్రికి వెళ్లిందే లేదు” అని చిదంబరం నాయర్ సంతృప్తిగా చెబుతారు. ఇంత పెద్ద వయసులో కూడా ఆయనకు కాస్త వినికిడి శక్తి తగ్గిందే తప్ప ఇంకే ఆరోగ్యసమస్యలూ లేవు. ఈ జీవితం పొలానికే అంకితం అంటారాయన. చిదంబరం నాయర్ చెదరని వ్యవసాయ స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం. భారతీయ గ్రామీణ వ్యవసాయ జీవన విధానం విశిష్టతకు చిదంబరం నాయర్ ఒక చక్కని ఉదాహరణ. అలాగే ఫిట్ ఇండియా మూవ్‌మెంట్‌కు సైతం చిదంబరం నాయర్ ఒక ఐకాన్‌గా నిలుస్తారు.

(The Better India సౌజన్యంతో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here