ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి మనకు తెలుసు. ఆవుపేడతో అలుక్కోవడమూ తెలుసు. ఇప్పుడు గోమయం పెయింట్ కూడా వచ్చేసింది. అంటే ఆవుపేడతో తయారు చేసిన పెయింట్ అన్నమాట. భార‌తదేశంలో తొలిసారిగా ఖాదీ, గ్రామీణ ప‌రిశ్ర‌మ క‌మిష‌న్ ఆవుపేడ‌తో త‌యారు చేసిన ఈ సరికొత్త పెయింట్‌ని కేంద్ర ర‌వాణ, ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ఇటీవల ఆవిష్క‌రించారు.”ఖాదీ ప్రాకృతిక్ పెయింట్” పేరుతో ఇది మార్కెట్‌లో లభ్యమౌతుంది.
ఈ పెయింట్‌కు బ్యాక్టీరియాను, శిలీంద్రాల‌ను నివారించే గుణం క‌లిగి ఉంటుంది. ఆవుపేడ‌తో త‌యారు చేసిన ఈ పెయింట్ అందుబాటు ధ‌ర‌లో ఉండ‌డ‌మే కాదు, ఎటువంటి ఇబ్బందికరమైన వాసనలు లేకుండా ఉంటుంది. గడ్కరీ నివాసంలో జరిగిన ఈ పెయింట్ ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్ర ప‌శుసంవ‌ర్ధక‌ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌, ఎంఎస్ఎంఈ శాఖ స‌హాయ మంత్రి ఎస్ హెచ్ ప్ర‌తాప్ చంద్ర సారంగీ, కెవిఐసి (Khadi & Village Industries Commission) చైర్మ‌న్ ఎస్ హెచ్ విన‌య్ కుమార్ స‌క్సేనా కూడా పాల్గొన్నారు. కార్య‌క్ర‌మంలో నితిన్ గడ్కరీ ప్రసంగిస్తూ, దేశంలో అత్యుత్తమ గోసంతతిని వృద్ధిపరిచేందుకు కృషి జరుగుతోందన్నారు. పాల ఉత్పత్తిని పెంచే విధంగా దేశీ ఆవులపై పరిశోధనలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఆవుపాలతోబాటు గోమయం, గోమూత్రం కూడా ఇకపై రైతులకు అదనపు ఆదాయాన్ని అందిస్తాయన్నారు. వచ్చే ఐదేళ్లలో గ్రామీణ పరిశ్రమలను ఐదు లక్షల కోట్లు ఆర్జించే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. స్వయంగా తన ఇంటి గోడలను ఖాదీ ప్రాకృతిక్ పెయింట్ వేయించుకున్నాననీ, నాణ్యతలో ఇది నెరోలాక్, ఏషియన్ పెయింట్‌లతో పోల్చితే తక్కువదేమీ కాదని నితిన్ గడ్కరీ చెప్పారు.

ఖాదీ ప్రాకృతిక్ పెయింట్ ధర తక్కువ

కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఈ పెయింట్ ధర లీటరు డిస్టెంప‌ర్ రూ. 120, ఎమ‌ల్ష‌న్ రూ. 225 గా నిర్ణ‌యించారు. ఇది పెద్ద పెయింట్ కంపెనీలు విక్రయిస్తున్న పెయింట్ ధ‌ర‌ల్లో స‌గం మాత్ర‌మే. ఖాదీ ప్రాకృతిక్ పెయింట్ రెండు రూపాల‌లో ల‌భ్యం అవుతుంది. ఒకటి డిస్టెంప‌ర్ పెయింట్‌ కాగా రెండవది ప్లాస్టిక్ ఎమ‌ల్ష‌న్ పెయింట్‌. కుమ‌ర‌ప్ప నేష‌న‌ల్ హాండ్‌మేడ్ పేప‌ర్ ఇనిస్టిట్యూట్, జైపూర్ (కెవిఐసి యూనిట్‌) దీనిని అభివృద్ధి పరిచింది. పూర్తిగా ప‌ర్యావ‌ర‌ణ అనుకూల‌మైన విషపూరితంకాని పెయింట్‌గా దీన్ని రూపొందించారు.
ఈ పెయింట్‌లో సీనం, పాద‌ర‌సం, క్రోమియం, ఆర్సెనిక్‌, కాడ్మియం వంటి భారీ ధాతువులేవీ ఉండ‌వు. స్థానికంగా ఉపాధిని కల్పించడంతో పాటు గోశాల‌ల‌కు అద‌న‌పు ఆదాయాన్ని ఇది స‌మ‌కూర్చ‌గ‌ల‌దని భావిస్తున్నారు. ఆవుపేడ‌ని గోడలకు పెయింట్‌గా ఉప‌యోగించ‌డం వల్ల సహజమైన వాతావరణం ఏర్పడి కాలుష్యాన్ని నివారిస్తుంది.
ఖాదీ ప్రాకృతిక్ డిస్టెంప‌ర్, ఎమ‌ల్ష‌న్ పెయింట్‌లను మూడు ప్ర‌తిష్ఠాత్మ‌క జాతీయ ప్ర‌యోగ‌శాల‌లు ప‌రీక్షించాయి. నేష‌న‌ల్ టెస్ట్ హౌస్ (ముంబై), శ్రీ‌రామ్ ఇనిస్టిట్యూట్ ఫ‌ర్ ఇండ‌స్ట్రియ‌ల్ రీసెర్చ్‌ (న్యూఢిల్లీ), నేష‌న‌ల్ టెస్ట్ హౌస్ (ఘాజియాబాద్‌) ఈ పెయింట్ పూర్తిగా పర్యావరణహితకరమైనదని ధ్రువీకరించాయి. ఈ పెయింట్ ఎనిమిది రకాలుగా ఉత్కృష్టమైందని ఈ అధ్యయన సంస్థలు తేల్చాయి. ఈ పెయింట్‌ వాడడం వల్ల “అష్టలాభ్” అంటే 8 ఉపయోగాలున్నాయి. అవి 1. పర్యావరణ హితకరం , 2. యాంటీ బాక్టీరియల్, 3. యాంటీ ఫంగల్, 4. నేచురల్ థర్మల్ ఇన్సులేటర్, 5. ధర చాలా చౌక, 6. హెవీ మెటల్స్ ఉండవు, 7. నాన్ టాక్సిక్, 8. వాసన ఉండదు. పైగా Bureau of Indian Standards సర్టిఫికేషన్ కూడా దీనికి లభించింది.

ఆ పెయింట్‌లలో విషతుల్యమైన ధాతువులు

నిజానికి మార్కెట్లో లభించే అనేక పెయింట్లు విషతుల్యమైన ధాతువులను కలిగి ఉంటున్నాయి. 2008, 2009 సంవత్సరాల్లో నిర్వహించిన శాంపిల్ పరీక్షల్లో 72 శాతం పెయింట్లు Bureau of Indian Standards నిర్దేశించిన మోతాదుకు మించి సీసం (lead) కలిగి ఉన్నట్లు తేలింది. విషతుల్య ధాతువులు, భారీ లోహాలు కలిగి ఉండే పెయింట్లను ఇళ్లలో గోడలకు వేసుకోవడం పిల్లల IQ levelsపై ప్రభావం చూపుతున్నట్లు పలు అధ్యనాలు చెబుతున్నాయి. ఢిల్లీ కేంద్రంగా పని చేసే Toxic Link అనే ఒక స్వచ్ఛంద సంస్థ కూడా 2017లో అధ్యయనం జరిపి పెయింట్‌లలో మోతాదుకు మించిన సీసం ఉంటోందని తేల్చింది.
అలా కాకుండా వివిధ ప‌రీక్షా పారామితుల‌లో ఖాదీ ప్రాకృతిక్ పెయింట్ విజ‌య‌వంతంగా ఆమోదం పొందింది. పెయింట్ వేయ‌డం, థిన్నింగ్ ల‌క్ష‌ణాలు, ఆరిపోయే స‌మ‌యం, అంతిమ న‌గిషీ లేక మెరుగు వంటి విష‌యాల‌లో ఈ పెయింట్ విజ‌య‌వంత‌మైన ఫ‌లితాల‌ను ఇచ్చింది. ఈ పెయింట్ 4 గంట‌ల‌లోపు ఆరిపోవ‌డ‌మే కాక‌, మృదువుగా, స‌మాన‌మైన మెరుగును క‌లిగి ఉంటుంది. ఈ రంగును లోప‌లి గోడ‌ల‌కు, బ‌యిటి గోడ‌ల‌కూ కూడా వేసుకోవ‌చ్చు. అటు డిస్టెంప‌ర్, ఇటు ఎమ‌ల్ష‌న్ పెయింటూ కూడా మూలవర్ణం తెలుపులో ల‌భ్య‌మ‌వుతాయి, దీనికి త‌గిన రంగు ప‌దార్ధాన్ని క‌లుపుకుని, ఏ రంగునైనా త‌యారు చేసుకోవ‌చ్చు. 2 నుండి 30 లీటర్ల దాకా వివిధ ప్యాకింగ్స్‌లో ప్రాకృతిక్ పెయింట్ లభిస్తుంది. వంద కిలోల ఆవు పేడ నుండి 35-40 కిలోల పెయింట్ తయారు చేయవచ్చునని చెబుతున్నారు. ధర తక్కువ, మన్నిక ఎక్కువ కనుక ఖాదీ ప్రాకృతిక్ పెయింట్‌కు మంచి ఆదరణ లభిస్తుందని, గోశాలల స్వావలంబనకు ఇది దోహదపడగలదని భావిస్తున్నారు. మొత్తంమీద క్రమంగా మన దేశంలో ఆర్గానిక్ జీవనశైలికి మార్గం సుగమమౌతోంది. ఇది ఒక సానుకూల పరిణామం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here