లాతూర్ కరువు గుర్తుందా? 2016లో మహారాష్ట్రలోని ఈ జిల్లాకు లక్షలకొద్దీ లీటర్ల నీటిని రైల్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేశారు. ఆ రైళ్ల దగ్గర తోపులాటలు, గొడవలు జరగకుండా పోలీసు బలగాలను కూడా మోహరించారు. ఎక్కడన్నా కాస్త నీళ్లుంటే అక్కడ కూడా ఇదే దృశ్యం. ఒకనాడు భూకంపం తాకిడికి ఛిన్నాభిన్నమైన జిల్లా ఇది. ఆ తర్వాత కరువు పగబట్టి విలయతాండవం చేసింది. లాతూర్‌లో 40 వేల చేతి పంపులుంటే వాటిల్లో 50 శాతానికి పైగా ఎండిపోయాయి. తాగేందుకు సైతం గుక్కెడు నీళ్లు దొరక్క అల్లాడిన ప్రాంతమిది. కానీ ఇప్పుడు (2020-21) పరిస్థితి మారింది. దుర్భిక్షమనే దుర్భరస్థితి నుండి ఆ ప్రాంతం బయటపడింది. దాహార్తి హాహాకారాల పీడకల ఇక గడచిపోయింది. కష్టం తీరిపోయింది.
అక్కడి భూములన్నీ ఇప్పుడు పచ్చటి పంటలతో కళకళలాడుతున్నాయి. రైతన్నల కళ్లల్లో మళ్లీ ఆనందం వెల్లివిరుస్తోంది. పాతాళ గంగమ్మ ఉబికి ఉబికి పైకొచ్చి జలధారలతో నేలతల్లికి అభిషేకాలు చేస్తోంది. ఇప్పుడిక వాటర్ రైళ్లు అక్కర్లేదు. నీటి కోసం అంగలార్చనవసరం లేదు. ఈ అద్భుతం జరగడానికి రెండు ప్రధాన కారణాలు. ఒకటి ఆ ప్రాంతంలో ప్రవహించే మంజీరా నదికి పూడిక తీయించడం. రెండవది అక్కడి రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మరలడం.

Mahadev Gomare

ప్రకృతి వ్యవసాయమే గట్టెక్కించింది…

కృష్ణ నరోడ్ (26) లాతూర్‌కు సమీపంలోని గంగాపూర్‌కు చెందిన రైతు. ఇప్పుడు ఆయన నాలుగు ఎకరాల పొలంలో బంగారం  పండుతోంది. చెరకు, గోధుమ, అల్లం వంటివాటిని ఆయన సాగు చేస్తున్నారు. పండ్ల చెట్లూ ఉన్నాయి. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించిన కృష్ణ నరోడ్ త్వరలోనే తన శ్రమకు మంచి ఫలితం అందుకోబోతున్నారు. తన పంటపై ఈ ఏడాది కనీసం 6 లక్షల రూపాయల మేరకు ఆదాయం వస్తుందని ఆయన ఆశిస్తున్నారు. కొద్ది సంవత్సరాల కిందట బాధలు పడలేక ఆయన అసలు వ్యవసాయమే వదిలేద్దామనుకున్నారు. కానీ ప్రకృతి వ్యవసాయం అవలంబించాక పరిస్థితులు నాటకీయంగా మారిపోయాయి. కృష్ణ నరోడ్ ఒక్కరే కాదు, చుట్టుపక్కల ఉన్న రైతులంతా ప్రకృతి సాగువైపు మరలడంతో వారి పరిస్థితులు మెరుగుపడ్డాయి.
ఇక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే నివాసం ఉండే మంగళ మారుతి వాఘ్మరే (51) ఒక మహిళా రైతు. ఈసారి తన పొలంలో మునగ, శీతాఫలం, మామిడి విరగకాసాయి. అంతర పంటల సాగు లాభదాయకంగా ఉంటోందని ఆమె చెబుతున్నారు. తన పొలంలో పండిన పండ్లు ఎంతో రుచిగా ఉంటాయనీ, మార్కెట్లో వాటికి రెట్టింపు ధర వస్తోందనీ సంతోషం వ్యక్తం చేశారు మంగళ మారుతి.

లాతూర్ : అప్పుడు – ఇప్పుడు

మహాదేవ్ గోమారే నదుల పునరుజ్జీవ ఉద్యమం

కొన్నాళ్ల కిందటిదాకా లాతూర్ జిల్లా నీటి కరువుకు ప్రసిద్ధి. రైతుల ఆత్మహత్యలకు పేరుపడింది. కానీ మహాదేవ్ గోమారే అనే వ్యవసాయవేత్త, సామాజిక ఉద్యమకారుడు నదుల పునరుజ్జీవనతో పాటు సుస్థిర వ్యవసాయంవైపు రైతులను మరల్చడంతో పరిస్థితులు మారాయి. ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ కార్యకర్త కూడా అయిన మహాదేవ్ గోమారేను మరాఠ్వాడలో The Water Man of Latur అని కూడా ఆప్యాయంగా పిలుచుకుంటారు. ఆయన Sri Sri Institute of Agricultural Sciences and Technology Trustను నిర్వహిస్తున్నారు. లాతూర్ జిల్లాలో ఐదు నదులను మహాదేవ్ గోమారే పూనికతో పునరుజ్జీవింపజేశారు. జల్ జాగృతి అభియాన్ ద్వారా ఆయన అనేక చెరువులకు మళ్లీ జీవం పోసారు.
మంజీరతో పాటు పలు నీటి వనరుల పూడికతీతపై ఆయన మొదట దృష్టి సారించారు. 143 కిలోమీటర్ల పొడవునా పారే మంజీర నదిలోను, దాని ఉప నదుల్లోను ఆయన స్థానిక ప్రజల సహకారంతో పూడిక తీయించారు. దీంతో ఆ చుట్టుపక్కల ఉన్న 900 గ్రామాలకు మళ్లీ నీటి వసతి చేకూరింది. జీవవైవిధ్యంతో ఆ ప్రాంతమంతా తిరిగి కళకళలాడడం మొదలుపెట్టింది. మహాదేవ్ గోమారే ఏకంగా 9 లక్షల క్యూబిక్ మీటర్ల మేరకు సిల్ట్‌ తీయించడంతో మంజీర తిరిగి జలకళ సంతరించుకుంది. నది లోతు, వెడల్పు పెరిగాయి.

హమ్మయ్య! మంజీర తిరిగి బ్రతికింది!

మంజీరా పరివాహక ప్రాంతంలో తీసిన పూడిక మట్టిని ఆయన చుట్టుపక్కల పొలాల్లో వేయించారు. సారవంతమైన ఆ మట్టి భూసారాన్ని పెంచింది. మరోపక్కన ఆయన రైతులకు ప్రకృతి వ్యవసాయం నేర్పారు. ఆర్గానిక్ ఎరువుల ఉపయోగాన్ని ప్రోత్సహించారు. ఆయన సూచనలతో లాతూర్ జిల్లాలోని వేలాది మంది రైతులు దేశీ గోమయాన్ని ఎరువుగా వాడడం ప్రారంభించారు. గోమాత్రాన్ని క్రిమిసంహారకంగా ఉపయోగించడం అలవాటు చేసుకున్నారు. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకాన్ని పూర్తిగా ఆయన నిలిపి వేయించారు. ప్రతి పొలంలో ఆయన కనీసం 40 చెట్ల చొప్పున నాటించారు. మూడు నాలుగేళ్లలో ఇవి పెరిగి భూసారాన్ని కాపాడాయి. నేలకోత నివారించబడింది. వేపచెట్లు ఇందుకు చాలా ఉపయోగపడతాయని మహాదేవ్ గోమారే అంటారు.

అలాగే జీఎం సీడ్స్ స్థానే దేశీ విత్తనాల వ్యవసాయాన్ని ఆయన ప్రోత్సహించారు. దీని ద్వారా చీడపీడలు బాగా తగ్గాయి. ఆయన రైతుల చేత ఒకే పంట విధానం కూడా మాన్పించారు. లాతూర్ పరిసర ప్రాంతాల్లో పెద్ద యెత్తున సామాజిక అడవుల పెంపకం చేపట్టారు. ఇందులో భాగంగా 70 రకాల చెట్లను విరివిగా పెంచారు. స్థానిక వాతావరణానికి, వర్షపాతానికి తగ్గట్టుగా పంటలను ఎంచుకున్నారు. ప్రధానంగా పండ్లతోటల పెంపకంపై దృష్టి పెట్టారు. ఈ చర్యలన్నీ రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచాయి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాయి. ఇప్పుడు పెద్ద సంఖ్యలో యువత కూడా సాగుబడి వైపు ఆకర్షితమవడం విశేషం. వీరంతా చిన్న, మధ్య తరహా రైతులే. వ్యవసాయ ఉత్పాదకాల పెట్టుబడి తగ్గడంతో రైతుల ఆదాయం దానంతటదే పెరిగింది. మన దేశంలో సుమారు 14 కోట్ల రైతు కుటుంబాలు చిన్న కమతాలే కలిగి ఉన్నాయి. మొత్తం వ్యవసాయ భూమిలో ఇది 86 శాతంగా ఉంది. కాబట్టి ఈ చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెరగాలంటే ముందు వ్యవసాయ ఉత్పాదకాల పెట్టుబడులు తగ్గాలి. దిగుబడి పెరగాలి. అప్పుడే వీరికి ఆదాయం సమకూరుతుంది. సుస్థిర వ్యవసాయ పద్ధతులతోనే ఇది సాధ్యం. కనీస మద్దతు ధర కోసం ప్రభుత్వం దయాదాక్షిణ్యాలపై రైతులు ఆధారపడడం తగ్గేది అప్పుడే.

ఆసక్తిగలవారు మరిన్ని వివరాలకు ఈ క్రింది చిరునామాను సంప్రదించవచ్చు.
Mahadev Gomare
Prakrutik Vidyapeeth, Babhalgaon
Dist. Latur, Maharashtra
Mobile: 9403011000

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here