అరోగ్యానికి ఆర్గానిక్ ఆహారం అన్న భావన క్రమంగా బలం పుంజుకుంటోంది. ఇందులో భాగంగా పుట్టిందే “కుటుంబ రైతులు” (family farmers) పరికల్పన. గుజరాత్‌ ప్రభుత్వ యంత్రాంగం ఈ సరికొత్త ఆలోచనను అమలు చేస్తోంది. “ఫ్యామిలీ డాక్టర్” అన్నది మనకు తెలుసు. మనకి ఏ ఆరోగ్యసమస్య వచ్చినా కుటుంబ వైద్యుడిని సంప్రదించడం పరిపాటి. “కుటుంబ రైతులు” అన్నది కూడా ఇంచుమించు అలాంటిదే. ఇందులో ముందుగా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలను సంప్రదించి వారి కుటుంబాలకు కావలసిన తాజా కూరగాయలు, పండ్లు, ఆహారధాన్యాలను సరఫరా చేసే రైతులను గుర్తిస్తారు. ఈ రైతులు సరఫరా చేసేవన్నీ రసాయన రహితంగా కేవలం ఆర్గానిక్ పద్ధతుల్లో పండించినవే అయి ఉంటాయి. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే, ఒక్కో కుటుంబానికి ఒక్కో రైతును కేటాయిస్తారు. ఆ రైతు, ఆ కుటుంబానికి ఏమేం కావాలో తెలుసుకుని వాటిని సప్లై చేయడం జరుగుతుంది.
ఉదాహరణకు భావ్‌నగర్‌కి చెందిన భార్గవ్ ధాండియా అనే వ్యాపారవేత్తకు కానుభట్ అనే ఒక రైతును కేటాయించారు. ఆయన భావ్‌నగర్‌కు సుమారు యాబై కిలోమీటర్ల దూరంలోని తలాజా మున్సిపాలిటీకి చెందిన తిమానా గ్రామంలో వ్యవసాయం చేస్తారు. భార్గవ్ ధాండియా స్వయంగా కానుభట్ పొలానికి కారులో వెళ్లి తనకు కావలసిన కూరగాయలు, పండ్లను కొనుగోలు చేసి తెచ్చుకుంటారు. నిజానికి మండీలలో దొరికేవాటితో పోల్చితే వీటి ధర కాస్త ఎక్కువే. అయినప్పటికీ తాజాదనంతో పాటు సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో సాగయ్యే ఆహారాన్ని కోరుకునేవారు ఇలా రైతుల దగ్గరికే వెళ్లి కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు.

ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టిన రైతులు

సౌరాష్ట్ర జల్‌ధార ట్రస్ట్ (Saurashtra Jaldhara Trust) తొలుత “ఫ్యామిలీ ఫార్మర్” ఆలోచనను తెర ముందుకు తెచ్చింది. మథుర్ భాయ్ సావానీ ఈ ఆలోచనను సూరత్ పరిసర ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు. సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ విధానాలను అనుసరిస్తున్న రైతులకు సహాయంగా ఉండాలన్నదే ఈ ఆలోచన వెనకున్న లక్ష్యం. అంతేకాక పెద్ద సంఖ్యలో రైతులను ప్రకృతి సాగు వైపు మరల్చడం కూడా దీని ఉద్దేశ్యం. ఇందుకోసం వారు www.familyfarmerabhiyaan.com పేరుతో ఒక వెబ్‌సైట్‌ కూడా ప్రారంభించారు. ఇందులో రిజిస్టర్ అయిన వినియోగదారులకు ఫ్యామిలీ ఫార్మర్ అభియాన్ (Family Farmer Abhiyaan) అవసరమైన సహాయసహకారాలను అందిస్తుంది. కుటుంబాలతో అనుసంధానించబడిన రైతులు అసలు ఎలా వ్యవసాయం చేస్తున్నారు? పొలంలో ఏయే ఎరువులు వాడుతున్నారు? ఏయే క్రిమిసంహారకాలు ఉపయోగిస్తున్నారు? వంటి సమాచారాన్ని ఫోటోలు, వీడియోల రూపంలో వినియోగదారులకు ఎప్పటికప్పుడు అందిస్తారు. అంటే తాము కొనుగోలు చేసే ఆహారధాన్యాలు, కూరగాయల తాలూకు సమాచారమంతా కస్టమర్లకు అందుబాటులో ఉంటుందన్నమాట. ఇలా 763 రకాల కూరగాయలు, పండ్లు, ఆహారధాన్యాలు ఇప్పుడు ఈ వెబ్‌సైట్ ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి రావడం విశేషం.
ఇక భావ్‌నగర్‌కు సంబంధించి భారత పారిశ్రామిక సమాఖ్య (Confederation of Indian Industry – CII) యువజన విభాగం యంగ్ ఇండియన్స్ (Young Indians – Yi) ఈ “ఫ్యామిలీ ఫార్మర్స్” ఆలోచన అమలులో చురుకుగా భాగం పంచుకుంటోంది. అలా ఒక్కో రైతును ఒక్కో ఫ్యామిలీకి అనుసంధానం చేయడం వల్ల అవసరమైన దినుసుల సరఫరా ఎంతో తేలిక అవుతోంది. పదిమందినీ అడగకుండా ఒకే రైతును సంప్రదించి తమకు ఏమేం కావాలో ఆ కుటుంబం చెబుతుంది. ఆ రైతు వాటిని ఎప్పుడు కావాలో అప్పుడు సరఫరా చేయడం ఈ పద్ధతిలోని ప్రత్యేకత. ఈ ఆలోచన నచ్చి సుమారు 400 మంది రైతులు ఇందులో భాగస్వాములయ్యారు. వారంతా ఇప్పుడు రసాయన వ్యవసాయం మాని ప్రకృతి సాగు మొదలుపెట్టారు.
“మనకి ‘ఫ్యామిలీ డాక్టర్లు’ ఉంటారు. అలాంటప్పుడు ‘ఫ్యామిలీ ఫార్మర్’ మాత్రం ఎందుకు ఉండకూడదు? ఈ ఆలోచనతో మేము జిల్లా ప్రభుత్వ అధికారులను సంప్రదించాం” అని ఫలక్ సేఠ్ చెప్పారు. ఒక ఆయుర్వేద కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ఫలక్ సేఠ్ ప్రస్తుతం భావ్‌నగర్ “యంగ్ ఇండియన్స్” శాఖకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.

రైతుల పంటపొలాల్లో ఫ్యామిలీ ఫార్మర్ అభియాన్ ప్రతినిధులు

 రైతులకు, వినియోగదారులకు మధ్య ప్రత్యక్ష సంబంధాలు

(ఫ్యామిలీ ఫార్మర్ అభియాన్ లోగో)

“ఆర్గానిక్ వ్యవసాయోత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. అవి అందుబాటులోకి ఉంటున్నాయి కూడా. కానీ ఏ రైతులు రసాయనాలు లేకుండా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారో వినియోగదారులకు తెలియకపోవడం ఒక సమస్య. అలాగే రైతులకు కూడా తాము పండించినవాటికి ఎవరికి విక్రయించాలో తెలియడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ‘ఫ్యామిలీ ఫార్మర్స్’ కాన్సెప్ట్‌ ద్వారా రైతులకు, వినియోగదారులకు మధ్య నేరుగా సంబంధాలు ఏర్పడతాయి” అని భావ్‌నగర్ జిల్లా అభివృద్ధి అధికారి (డీడీఓ) వీ జే బరన్వాల్ వివరించారు. రైతులు, వినియోగదారుల మధ్య సంబంధాలు నెలకొల్పడానికి తాము ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.
గుజరాత్‌లోని ప్రతి జిల్లాలోనూ “ప్రాకృతిక్ ఖేతీ సంయోజక్ సమితి” పేరుతో ప్రకృతి వ్యవసాయం చేసే రైతు సమన్వయ సమితులున్నాయి. వాటి ద్వారా రైతులు మిగతా ప్రకృతి వ్యవసాయ రైతుల వివరాలను తేలికగా తెలుసుకోగలుగుతారు. తమకు అధికారులు కేటాయించిన వినియోగదారులకు మిగతా చోట్ల నుండి కూడా అవసరమైనవాటిని సేకరించి సరఫరా చేసేందుకు ఇది వారికి ఉపయోగపడుతుంది. అంతేకాక ఆర్గానిక్ వ్యవసాయం చేసే రైతులకు అవసరమైన గిడ్డంగి సదుపాయాలను కూడా ప్రభుత్వ యంత్రాంగం సమకూర్చుతోంది. ఎక్కడెక్కడ ఏయే రైతులు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారో జిల్లా ప్రభుత్వ యంత్రాంగం గుర్తించి ధ్రువీకరణపత్రం జారీ చేస్తుంది. అలాగే “గుజరాత్ ఆర్గానిక్ ప్రాడక్ట్స్ సర్టిఫికేషన్ ఏజెన్సీ” ద్వారా కూడా ప్రకృతి రైతులకు సర్టిఫికేట్లు ఇస్తారు. ఇలా ఆర్గానిక్ రైతులను గుర్తించే వెసులుబాటు గుజరాత్ రాష్ట్రంలో ఉంది.
ఇదిలావుండగా “యంగ్ ఇండియన్స్” సంస్థ క్రమంగా రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వంటి సంస్థలను సంప్రదించి కుటుంబ రైతుల సంఖ్యను పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం ఒక శుభారంభమైతే జరిగింది. ఈ “ఫ్యామిలీ ఫార్మర్” ఆలోచనని మిగతా రాష్ట్రాల్లోనూ అమలు చేస్తే ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకేగాక, ఆరోగ్యకరమైన ఆహారం కోరుకునే వినియోగదారులకు కూడా ప్రయోజనం కలుగుతుంది.

మరిన్ని వివరాలకు ఈ క్రింది చిరునామాను సంప్రదించవచ్చు.
Mathurbhai Savani
President Saurashtra Jaldhara Trust
C-302, Sardar Complex, Above Varacha Bank,
Katargam, Surat 395004, Gujarat
+91 261-2532153
+91 261-2532251 (www.familyfarmerabhiyaan.com)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here