మన జీడీపీలో వ్యవసాయరంగం వాటా 14 శాతం. గ్రామీణ ఉద్యోగిత కల్పనలో కూడా ఇది ప్రధానరంగంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయరంగానికి సంబంధించి మరింతగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం, యువత సృజనాత్మకతకు అవకాశం కల్పించి తగిన వ్యవసాయ యంత్రపరికరాలను తయారు చేసుకోవడం ఇప్పుడు మన దేశం ముందున్న లక్ష్యం. ఈ లక్ష్యసాధనలో భాగంగా జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (NABARD) సహకారంతో ఐఐటి ఖరగ్‌పూర్ ‘వ్యవసాయ-ఆహార-సాంకేతిక బృహత్ సమ్మేళనాన్ని’ (Agri-Food Techathon) నిర్వహిస్తోంది. AFT 2021గా వ్యవహహించే ఈ ఈవెంట్‌ను 2021 జనవరి 25న కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ లాంఛనంగా ప్రారంభిస్తారు. వ్యవసాయ-ఆహార రంగానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిలో యువతను భాగం చేయడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం. AFT 2021 ప్రారంభ కార్యక్రమంలోనే ‘అగ్రి-బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్‌’కు కూడా శంకుస్థాపన చేస్తారు. వ్యవసాయ-ఆహార సాంకేతికతకు సంబంధించిన నవ్య ఆవిష్కరణలను ఈ కేంద్రం ప్రోత్సహిస్తుంది. ఈ సృజనాత్మక ఆవిష్కరణల ద్వారా వ్యవసాయ సాంకేతిక రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు (Agri-preneures) తయారవుతారు.

Prof. V K Tewari, Director, IIT Kharagpur

ఇది యువత సృజనాత్మకతకు వేదిక

“భారతదేశంలో ఆటోమేషన్, డిజిటైజేషన్ వేగవంతమయ్యాయి. గ్రామీణ ఉపాధి కల్పనకు అవి దోహదపడాలి. వ్యవసాయరంగంలో కూడా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. ఈ లక్ష్యసాధన కోసం అగ్రి-ఫుడ్ టెకాథాన్ ద్వారా దేశంలోని ప్రతిభావంతులైన యువజనులను ఇందులో భాగస్వాములను చేయదలచాం” అని ఐఐటి ఖరగ్‌పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి కె తివారీ వివరించారు. “ఈ టెకాథాన్ యువత సృజనాత్మకతకు వేదిక కల్పిస్తుంది. వ్యవసాయ, ఆహార సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వ్యవసాయరంగంలోని పలు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. దేశీయ సాంకేతిక ఉత్పత్తులకు వీలు కలుగుతుంది. యువతకు ఉద్యోగిత కల్పించబడుతుంది. ‘ఆత్మనిర్భర్ భారత్’ ధ్యేయసాధనకు ఇది ఎంతో దోహదపడుతుంది” అని ఆయన చెప్పారు.
AFT 2021 జనవరి నుండి మార్చి దాకా కొనసాగుతుంది. ఇందులో 750 యూనివర్సిటీలు, కాలేజీలకు చెందిన విద్యార్థులతో పాటు పారిశ్రామికవేత్తలు, 20-25 సంవత్సరాల మధ్య వయసు కలిగిన గ్రామీణ యువజనులు పాల్గొంటారు. దేశవ్యాప్తంగా జరిగే ఈ టెకాథాన్‌లో భాగంగా పలు సదస్సులు, సమావేశాలు, ఆయా రంగాలకు చెందిన నిపుణుల ప్రసంగాల కార్యగోష్ఠులు జరుగుతాయి.

వ్యవసాయ యంత్ర పరికరాలు, గ్రీన్‌హౌస్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ, ఆహారధాన్యాల పంపిణీ వ్యవస్థ నిర్వహణ, భూసారం పెంపొందించే సాంకేతికత, భూసార పరీక్షలు, ఆహార ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, స్టోరేజ్ వంటి పలు అంశాలపై ఈ టెకాథాన్‌లో ఆయా రంగాలకు చెందిన నిపుణులు ప్రసంగిస్తారు. ఇదంతా వీడియో కాన్ఫరెన్స్ విధానంలో జరుగుతుంది. ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఏఆర్ఐ న్యూ ఢిల్లీ, సీఐఏఈ భోపాల్‌కు చెందిన ప్రొఫెసర్లు ఈ సమ్మేళనాల్లో పాలుపంచుకుంటారు. వీరితో పాటు సికిల్ ఫౌండేషన్, ఎస్ ఫామ్స్ ఇండియా, ఫసల్, న్యూట్రీగ్రీన్, ఆర్గానిక్ ఫార్మిగ్, క్రాపిన్, బి2వి, ఖేతీ, ఖాద్యం, క్రోఫార్మ్, విల్లా మార్ట్ వంటి పలు కంపెనీల సీఈఓలు కూడా ఈ టెకాథాన్‌లో పాల్గొంటారు. వారి అనుభవాలను పంచుకుంటారు.

30కి పైగా నిపుణుల బృందాలు

AFT 2021లో భాగంగా ఐఐటీ ఖరగ్‌పూర్, అగ్రి-బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్‌తో కలిసి పని చేసేందుకుగాను 30కి పైగా అత్యుత్తమ సామర్థ్యం కలిగిన నిపుణుల బృందాలను ఏర్పాటు చేస్తారు. ఈ బృందాలకు పరిశోధనలోను, వ్యవసాయ సాంకేతికతలోను, వ్యవసాయ వ్యాపార నిర్వహణలోను అవసరమైన సహకారాన్ని అందిస్తారు. వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిలో పెట్టుబడులు పెట్టేవారికి తగిన సదుపాయాలు కల్పిస్తారు.
అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్, సెంటర్ ఫర్ రూరల్ అండ్ ఇన్నోవేటివ్ సస్టైనబుల్ టెక్నాలజీస్, రాజేంద్ర మిశ్రా స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వంటి సంస్థలు AFT 2021ను నిర్వహిస్తాయి. టెకాథాన్‌లో భాగంగా గ్రామీణ ప్రజల అభివృద్ధి కోసం తక్కువ పెట్టుబడులతో రూపకల్పన చేసే టెక్నాలజీలను, స్టార్టప్‌లను ప్రోత్సహించడం జరుగుతుందని అగ్రి బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్‌ ఇన్‌చార్జ్‌ ప్రొఫెసర్ హెచ్ ఎన్ మిశ్రా తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంలో నిరుద్యోగ గ్రామీణ యువతకు, రైతులకు తాము శిక్షణ కూడా ఇస్తామని ఆయన చెప్పారు. ముఖ్యంగా సాగు సమస్యలున్న ఆయా జిల్లాల్లో వాతావరణ పరిస్థితులకు తగినట్లు వ్యవసాయ విధానాలను రూపొందించడం, వ్యవసాయోత్పత్తులకు అదనపు విలువను జోడించడం, వ్యవసాయ దినుసులకు మార్కెట్‌ను అనుసంధానించడం, రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలపై ఈ AFT 2021 దృష్టి కేంద్రీకరిస్తుంది.
మరిన్ని వివరాలకు ఈ క్రింది చిరునామాను సంప్రదించవచ్చు.
Branding and Communications,
Office of International Relations,
Indian Institute of Technology Kharagpur,
Pin – 721302, India
Email: media@iitkgp.ac.in
https://kgpchronicle.iitkgp.ac.in/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here