ఆర్గానిక్ ఆహారానికి ఇప్పుడు దేశంలో ఆదరణ పెరుగుతోంది. రసాయనాలు వాడకుండా పండించే కూరగాయలు, ఆహారధాన్యాల పట్ల పలువురు మక్కువ చూపుతున్నారు. అయితే సేంద్రియ విధానాల్లో సాగైన ఆహారం మాత్రమే కాకుండా సంపూర్ణ ఆర్గానిక్ జీవనశైలిని చాలా మంది కోరుకుంటున్నారు. అంటే దైనందిన జీవితంలో నిత్యం ఉపయోగించే వివిధ వస్తువులు కూడా ఆర్గానిక్ అయివుంటే మంచిదన్న భావన క్రమంగా పెరుగుతోంది. కాస్మొటిక్స్‌కు సంబంధించి పలు ఆర్గానిక్ ఉత్పత్తులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అలాగే మనం రోజూ వాడే  తువాళ్లు, పరుపులు, దుప్పట్లు, తలగడలు, వాటి కవర్లు కూడా ఆర్గానిక్‌ దూదివే అయి ఉంటే ఎలా ఉంటుందన్న ఆలోచన అమీ సాతాకు వచ్చింది. ఈ సరికొత్త ఆలోచన నుంచే దేశంలో మొట్ట మొదటి బెడ్ అండ్ బాత్ బ్రాండ్ “అమోవ్‌” (Amouve) పుట్టింది. అమోవ్ అంటే Love of Dreams అని అర్థం.

బెంగళూరుకు చెందిన ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్త అమీ సాతా మిగతావారి కంటే భిన్నంగా ఆలోచించారు. స్వీడన్‌కు వెళ్లినప్పుడు ఆమీ సాతా తను బస చేసిన ఒక హోటల్లో ఆర్గానిక్ బెడ్ షీట్లను తొలిసారిగా చూశారు. అవి ఎంతో మృదువుగా ఉన్నాయి. అవన్నీ ఇండియా నుండి ఎగుమతి అయిన పత్తితోనే తయారు చేశారని తెలిశాక అమీ సాతా ఎంతో ఆశ్చర్యపోయారు. అవి తనకు బాగా నచ్చేశాయి. వాటిని చూశాక సేంద్రియ పత్తితో భారతదేశంలో కూడా ఆర్గానిక్ పరుపులు, తువాళ్లు తయారు చేయాలన్న ఆలోచన వచ్చింది తనకు. అలా పిన్న వయసులోనే అమీ సాతా తన కలల కంపెనీ అమోవ్‌ను 2017లో ప్రారంభించారు. అప్పటి నుండి ఇక తిరిగి వెనక్కి చూసుకున్నదే లేదు. నాణ్యతలో ఏ మాత్రమూ రాజీ పడకుండా అమీ సాతా మంచి వ్యాపార విజయం సాధించారు.

అమోవ్ ఉత్పత్తులు

రసాయనాల పత్తి హానికరం

అమోవ్ తయారుచేసే తువాళ్లు, దుప్పట్లు, పరుపులు చాలా మృదువుగా మన్నిక కలిగి ఉంటాయి. అలాంటి వాటిని వాడడం వల్ల మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. రసాయనాల తాలూకు సమస్యలకు వీటితో చెక్ పెట్టవచ్చు. మార్కెట్లో దొరికే చాలా రకం పరుపులు, దుప్పట్లు పాలిస్టర్ ఫ్యాబ్రిక్‌వై ఉంటాయి. అవి హానికారకమైన plastic microfibres ను విడుదల చేస్తాయి. మరోవైపు మార్కెట్‌లో విక్రయించే దూది పరుపులు, దుప్పట్లు, తువాళ్లలో కూడా వాడే పత్తి అంతా రసాయన వ్యవసాయం వల్ల లభించిందే అయి ఉంటుంది. వాటిని ఉపయోగించడమంటే రసాయనాలతో తయారయ్యే హానికారకమైన దూదిని వాడుతున్నట్లే. అలాంటి పక్కపై కనుక నిద్రిస్తే రసాయనాల పత్తి నుండి వెలువడే విషవాయువులను మనం పీల్చక తప్పదు. అలాంటి దూది మనకు తెలియకుండానే మన చర్మానికి అలెర్జీలు కలిగిస్తుంది. అంతేకాదు, అలాంటి దూది వల్ల నిద్రలేమి (insomnia), శ్వాసకోశ వ్యాధులు (respiratory problems), ఎగ్జిమా (eczema), కంటి వెంట నీరు కారడం వంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి.

అమోవ్ వ్యవస్థాపకురాలు అమీ సాతా

మనం రోజులో సగటున సుమారు 8 గంటల పాటు బెడ్‌ పై పడుకుంటాం. కానీ పడుకున్నప్పుడు ఎలాంటి పడకపై ఉన్నామన్న ఆలోచన మనకు సాధారణంగా కలగదు. మన జీవితంలో చెప్పుకోదగిన కాలం మనం బెడ్‌పై గడుపుతాం. కాబట్టి మంచాలపై వాడే పరుపులు, దుప్పట్లు కూడా నాణ్యమైనవై ఉండి ఆరోగ్యకరంగా ఉండాలి. నిజానికి రసాయన ఎరువులు, క్రిమి సంహారకాల పత్తితో తయారయ్యే తువాళ్లు ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచివి కావు. మనం తినే తిండి ఆర్గానిక్ అవునా.. కాదా.. అని ఎలాగైతే తరచి చూస్తున్నామో, అలాగే మనం వాడే పరుపులు, దుప్పట్లు, తువాళ్లు కూడా ఆర్గానిక్ అయి వుండాలని కోరుకోవాలి. అప్పుడే ఆర్గానిక్ జీవనశైలిని అనుసరించగలుగుతామన్నది అమీ సాతా చెబుతున్న మాట.

తెలంగాణ పత్తి రైతులకు అండగా…

సర్టిఫైడ్ ఆర్గానిక్ పత్తి నుండే అమోవ్ తన ఉత్పత్తులను తయారు చేస్తుంది. రైతు సహకార సంఘాలను ఏర్పాటు చేసి వాటి నుండే నేరుగా పత్తిని కొనుగోలు చేస్తుంది. ఆర్గానిక్ పత్తిని పండించే రైతులకు ఎక్కువ మొత్తం చెల్లించి పత్తిని సేకరిస్తుంది. దీంతో రైతులకు కూడా ఇది లాభదాయకమవుతోంది. అమీ సాతా కంపెనీ పత్తి సేకరణలో ఎక్కడా మధ్యదళారీల ప్రమేయం ఉండదు. అలా ఆమె సూమారు 500 మంది రైతులను ఆర్గానిక్ పత్తి సాగులో భాగం చేశారు. అమీ సాతా కంపెనీ ప్రధానంగా తన ఉత్పత్తులకు కావలసిన పత్తిని తెలంగాణ గ్రామాల నుండే సమకూర్చుకోవడం మరో విశేషం. అమోవ్ వల్ల తెలంగాణలో ఆర్గానిక్ పత్తి సాగు పెరగడమే కాకుండా రైతులకు కూడా ప్రయోజనం చేకూరుతోంది. ఇప్పటిదాకా 860 మంది పత్తిరైతులను రుణభారం నుండి తాము విముక్తం చేయగలిగామని అమోవ్ వెబ్‌సైట్ సగర్వంగా ప్రకటిస్తుంది.

నిజానికి రసాయన ఎరువులు వేసి జీఎం విత్తనాల పత్తి పండించడం వల్ల రైతులు కాన్సర్ వంటి అనేక ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. భారతదేశంలో పత్తి రైతు సగటు ఆయుః ప్రమాణం 35 సంవత్సరాల వయసు మాత్రమే. పత్తి సాగులో వాడే విషతుల్యమైన రసాయనాల వల్ల రైతుల ఆరోగ్యం దెబ్బతింటోంది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే పురుగు మందుల్లో 24 శాతం పత్తి సాగులోనే వాడుతున్నారు. పత్తి రైతుల ఆత్మహత్యలకు రసాయన వ్యవసాయమే అసలు కారణం. GMO కంపనీలు సాగిస్తున్న విధ్వంసం ఇది. ఆర్గానిక్ పత్తి సాగును వీలైనంత పెంచడమే దీనికి ఏకైక పరిష్కారం. ఆర్గానిక్ పత్తి సాగు పర్యావరణానికి హాని కలిగించదు. రైతు, వినియోగదారు మాత్రమే కాక పర్యావరణం గురించిన స్పృహ కూడా తమకు ముఖ్యమైనవని అమీ సాతా చెబుతారు. రసాయన పత్తి వ్యవసాయం పర్యావరణానికి ఎంతో హానికరమని ఆమె వివరిస్తారు. రసాయన పద్ధతుల్లో పండే పత్తి కారణంగా భూగర్భజలాలు కలుషితమై పోతున్నాయంటారు. దేశంలో రైతుకు ప్రయోజనం చేకూరే సుస్థర వ్యవసాయాన్ని ఆమె కోరుకుంటారు.

వ్యాపార ప్రయోజనాలే కాకుండా రైతుల బాగోగుల గురించి శ్రద్ధ వహించడం, పర్యావరణ దృష్టి కలిగి ఉండడం అమీ సాతా ప్రత్యేకత. అమోవ్ కంపెనీ ఉత్పత్తులన్నీ అత్యుత్తమ నాణ్యత కలిగి ఉండి Global Organic Textile Standard ధ్రువీకరణ పొందినవే. వీటన్నిటికీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉంది. మొదట్లో ఆన్‌లైన్ వ్యాపారం మాత్రమే నిర్వహించిన అమీ సాతా ఇప్పుడు హైదరాబాద్‌తో సహా ముంబై వంటి పలు నగరాల్లో ఆఫ్‌లైన్ బిజినెస్ కూడా ప్రారంభించారు. హైదరాబాద్‌లో Danube Home భాగస్వామ్యంతో అమోవ్ తన ఉత్పత్తులను విక్రయిస్తోంది.

అమోవ్ ఆర్గానిక్ పద్ధతుల్లో పండిన పత్తిని మాత్రమే ఉపయోగించి పూర్తిగా ఆర్గానిక్ బెడ్ అండ్ బాత్ ఉత్పత్తులను అందిస్తోంది. వీటిలో ఎక్కడా జీఎం విత్తనాలతో పండించిన పత్తి ఉండదు. కేవలం దేశీ విత్తనాలతో పండే పత్తిని మాత్రమే ఈ ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. ఈ పత్తి ప్రాసెసింగ్ కూడా రసాయన రహితమైనదే. అమోవ్ తువాళ్లు 700 జీఎస్ఎం క్వాలిటీ కలిగి ఎంతో మృదువుగా ఉంటాయి.

ఆర్గానిక్ జీవన శైలి అంటే ఆరోగ్యకరమే కాకుండా పర్యావరణహితకరం కూడా. ప్రపంచంలో 35 మిలియన్ల హెక్టార్లలో పత్తిని సాగు చేస్తున్నారు. ఈ పత్తి సాగులో రసాయన ఎరువులను, క్రిమి సంహారకాలను విచ్చలవిడిగా వాడుతున్నారు. ఇది సృష్టిస్తున్న కాలుష్యం ఇంతా అంతా కాదు. దీన్ని ఇకనైనా మానకపోతే మరింత అనర్థం తప్పదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరికొందరు అమీ సాతాలు మనకు తప్పక అవసరం.

ఆసక్తిగలవారు మరిన్ని వివరాల కోసం ఈ క్రింది చిరునామాను సంప్రదించవచ్చు.

Amouve
Ph: 088505 18520
Email: care@amouve.com
Facebook: www.facebook.com/amouve/
Instagram: www.instagram.com/amouve_bedding

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here