ఇక మనం ప్రకృతి వ్యవసాయం వైపు మరలాలనీ, సంప్రదాయ పంటలను సాగు చేయాలనీ ఈశా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు సద్గురు శ్రీ జగ్గీ వాసుదేవ్ ఉద్ఘాటించారు. కోయంబత్తూరు సమీపంలోని ఈశ యోగా సెంటర్‌లో జరిగిన 2021 మట్టు పొంగల్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సత్సంగంలో సద్గురు ప్రసంగిస్తూ ప్రకృతి వ్యవసాయం విశిష్టతను  వివరించారు. విద్యావంతులు, యువత ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టాలని ఆయన సూచించారు.
ఈశా వ్యవసాయ ఉద్యమం ద్వారా ప్రకృతి సాగు నేర్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సద్గురు చెప్పారు. అయితే అలా నేర్చుకున్నవారు గ్రామాలకు వెళ్లి కనీసం పదేసి మందికి ప్రకృతి సేద్యం గురించి చెప్పాలన్నారు. అలా చేయడం ద్వారా దేశంలో గొప్ప కదలిక వస్తుందన్నారు. పర్యావరణానికి మేలు చేసే ప్రకృతి సేద్యం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమౌతుందని సద్గురు వ్యాఖ్యానించారు.
“ఒకనాడు బియ్యం జీవామృతంగా పరిగణించబడితే ఇవాళ డాక్టర్లు దాన్ని విషతుల్యమంటున్నారు. దానివల్ల మధుమేహం వస్తుందంటున్నారు. పూర్వం సుమారు రెండు వేల రకాల వరి వంగడాలు ఉండేవి. ఇప్పుడు ల్యాబ్స్‌లో తయారు చేసిన నాలుగైదు రకాలనే సాగు చేస్తున్నారు. ఎక్కువ దిగుబడినివ్వడమే మన లక్ష్యమైపోయింది. దిగుబడి ఆరాటంలో పడి పోషక విలువలను మనం విస్మరించాం” అని సద్గురు పేర్కొన్నారు.

పోషక విలువలు కలిగిన ఆహార ధాన్యాలను పండించి సుస్థిర వ్యవసాయం కొనసాగించాలంటే నిస్సారమైపోయిన పంటభూముల్లో సేంద్రియ పదార్థాన్ని తిరిగి నింపవలసి ఉందని సద్గురు అభిప్రాయపడ్డారు. ఈశా ప్రకృతి వ్యవసాయక్షేత్రంలో పండిస్తున్న నల్ల బియ్యం (కావుని) వరి పైరు ఆరు అడుగుల ఎత్తుకు ఎదిగిందని ఆయన చెప్పారు. రైతులు నాణ్యత కలిగి ఉండి అధిక దిగుబడినిచ్చే దేశీ వంగడాలతో ప్రకృతి వ్యవసాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈశా యోగా సెంటర్‌లో 4,200 మంది నివసిస్తున్నా, ఒక్కరికి కూడా గత ఏడాది కాలంలో కరోనా వైరస్ సోకలేదని ఆయన చెప్పారు. యోగసాధనలోని విశిష్టత ఇదేనని ఆయన వివరించారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేయాలని సందర్శకుల్లో ఒకరు అడిగిన ప్రశ్నకు సద్గురు బదులిస్తూ, రాష్ట్రాన్ని త్వరితగతిన అభివృద్ధి చేసేవారిని ఎన్నుకోవాలని కోరారు. తాను రాజకీయాలకు అతీతంగా ఉంటానని సద్గురు స్పష్టం చేశారు. అయితే కావేరీ నదిని పునరుజ్జీవింపజేసేవారికి, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేవారికి ఓటు వేయాలని ఆయన కోరారు. సద్గురు ప్రకృతి సాగును బలంగా ప్రతిపాదించడం, ఈశా సెంటర్‌లో ఆర్గానిక్ వ్యవసాయం చేస్తుండడం విశేషం. లోగడ తాను ప్రకృతి వ్యవసాయ విధానాలపై నమ్మాళ్వార్ అయ్యతో ముచ్చటించిన వీడియోను ఇటీవల సద్గురు సోషల్ మీడియాలో షేర్ చేశారు కూడా.

ఇదిలావుండగా, ఈశా సెంటర్‌ గోశాలలో పెంచుతున్న కంగాయం, ఒంగోల్, కాంక్రేజ్, గిర్ వంటి పలు దేశీ జాతుల పశువులను అందంగా అలంకరించి ఈ వేడుకల్లో ప్రదర్శించారు. అవి చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సద్గురు జగ్గీ వాసుదేవ్ స్వయంగా బసవన్నకు పూమాల వేసి పూజలు జరిపారు. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ పొంగల్ వేడుకల్లో పెద్దసంఖ్యలో రైతులు, భక్తులు, సందర్శకులు పాల్గొన్నారు.

సద్గురు కార్యక్రమాలకు సంబంధించి ఆసక్తిగలవారు మరిన్ని వివరాల కోసం ఈ క్రింది చిరునామాను సంప్రదించవచ్చు.

Isha Yoga Center
Velliangiri Foothills, Ishana Vihar Post,
Coimbatore – 641 114, India
Telephone: 83000 83111, 0422 4283111, 0422 3583111
Email: info@ishafoundation.org

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here