ఇడుక్కికి చెందిన పన్నూజ్‌ జాకబ్‌ ఉద్యోగం నుంచి రిటైర్‌ అయిన తర్వాత హాబీగా వ్యవసాయం చేస్తున్నాడు. ఇప్పుడు ‘మంగలం ఫుడ్స్‌’ బ్రాండ్‌ పేరుతో రోజూ 20 కిలోల తాజా ఆర్గానిక్‌ కూరగాయలు అమ్ముతున్నాడు. తద్వారా జాకబ్‌ కు చక్కని వ్యాపకం దొరికినట్లయింది. దాంతో పాటు ఆదాయమూ బాగానే సంపాదిస్తున్నాడు. జాకబ్‌ కుటుంబ నేపథ్యం వ్యవసాయమే.

ఆర్గానిక్‌ వ్యవసాయాన్ని హాబీగా చేయాలని జాకబ్‌ నిర్ణయించుకున్నాడే కానీ.. తొలి రోజుల్లో భారీ స్థాయిలో వ్యవసాయం చేసేందుకు అతనికి భూమి దొరకడం సమస్యగా మారింది. దాంతో తమ ఇంటి టెర్రస్ పైనే మెల్లిగా కూరగాయల సాగు మొదలుపెట్టాడు. తమ ఇంటికి ఎదురుగా ఉండే మూడు అంతస్థుల భవనాన్ని అద్దెకు తీసుకున్నాడు జాకబ్‌. దానిపై ఉన్న 3,500 చదరపు అడుగుల టెర్రస్‌ పైనే తాను అనుకున్న విధంగా ఆర్గానిక్‌ కూరగాయల సాగు చేయడం ప్రారంభించాడు. ప్రతి పనిని ఎంతో క్రమశిక్షణతో, పరిశుభ్రంగా నిర్వహించే తాను ఆ చిన్న టెర్రస్‌ పైనే శ్రద్ధగా కూరగాయల సాగు మొదలెట్టినట్టు జాకబ్‌ తెలిపాడు.జాకబ్‌ ముందుగా కొన్ని గ్రో బ్యాగ్స్‌ లో టమోటా, మిర్చి, వంగ, బెండ, దోసకాయ విత్తనాలు నాటాడు. రెండేళ్లయ్యే సరికి జాకబ్‌ టెర్రస్‌ మీద గ్రోబ్యాగ్స్‌ ను పెంచాడు. కూరగాయల వెరైటీలు కూడా ఎక్కువ చేశాడు. కూరగాయల మొక్కలకు సులువుగా నీటి సదుపాయం అందించేందుకు డ్రిప్‌ ఇరిగేషన్‌ విధానం అవలంబించాడు. అన్ని గ్రోబ్యాగ్స్‌ ను అడుగున్నర ఎత్తున్న ఇనుప స్టాండ్‌ లపై అమర్చాడు. ప్రతి గ్రో బ్యాగ్ కింద మట్టితో తయారు చేసిన రూఫ్‌ టైల్స్‌ వినియోగించాడు.  ఆరేళ్ల క్రితం మొక్కలను అధిక వర్షం, ఎండ వేడి నుంచి రక్షించేందుకు టెర్రస్‌ పై ఒక షెడ్‌ ఏర్పాటు చేశాడు జాకబ్‌. ఆ షెడ్‌ ఏర్పాటు చేయడానికి జాకబ్‌ కు వ్యవసాయ విభాగం సబ్సిడీ కూడా అందజేసింది. దీంతో షెడ్‌ ఏర్పాటు చేయడానికి తనకు ఖర్చు భారం బాగా తగ్గిపోయిందని జాకబ్‌ తెలిపాడు.

అలా ఏళ్లు గడిచిన కొద్దీ జాకబ్‌ తన మిద్దె తోటలో గుమ్మడి, కాలీఫ్లవర్‌ లాంటి రకాలు కూడా పండిస్తున్నాడు. వాటితో పాటు ఆనప, కాకర, పొట్లకాయ లాంటి తీగ జాతి కూరగాయలు కూడా సాగుచేస్తున్నాడు. వాటిని తన సొంత బ్రాండ్‌ ‘మంగలం ఫుడ్స్‌’ పేరుతో తాను నిర్ణయించిన ధరల ప్రకారం విక్రయిస్తున్నాడు. అలా జాకబ్ ప్రతి రోజూ 20 నుంచి 25 కిలోల తాజా ఆర్గానిక్‌ కూరగాయలు అమ్ముతున్నాడు. జాకబ్‌ తాను తమ టెర్రస్‌ పై పండించిన తాజా కూరగాయలను నీట్‌ గా ప్యాక్ చేసి, సమీపంలోని సూపర్‌ మార్కెట్‌ కు తీసుకెళ్లి కొన్ని గంటల్లోనే అమ్మేస్తున్నాడు.సేంద్రీయ ఎరువులను వాడడమే తన విజయానికి కారణమని జాకబ్‌ ఎంతో సంతోషంగా చెబుతున్నాడు. సేంద్రీయ ఎరువు, చేప వ్యర్థాల మిశ్రమాన్ని జాకబ్‌ వినియోగిస్తున్నాడు. అత్యధిక స్పైసీ మిర్చితో జాకబ్‌ తన ఆర్గానిక్‌ కూరగాయల మొక్కలకు పురుగుమందుగా వాడుతున్నాడు. మిర్చిలను ఎండబెట్టి, పౌడర్‌ చేసి, దాంట్లో నీరు కలిపిన ద్రావణాన్ని జాకబ్‌ మొక్కల ఆకులపై పిచికారి చేస్తాడు. అయితే.. సహజసిద్ధమైన పురుగుమందు తయారీ చేసేటపుడు పూర్తిస్థాయిలో జాగ్రత్త తీసుకోవడం అవసరం అని జాకబ్‌ హెచ్చరిస్తున్నాడు.

జాకబ్‌ పండిస్తున్న ఆర్గానిక్‌ కూరగాయలంటే జనం ఎంతో ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు. మార్కెట్‌ లో కిలో టమోటా ధర రూ.10 ఉన్నా లేదా రూ.100 ఉన్నా జాకబ్‌ పండించే ఆర్గానిక్‌ టమోటా మాత్రం 90 రూపాయలకే అమ్ముతుంటాడు. అయినా.. వినియోగదారులు జాకబ్‌ పండించిన టమోటాలనే ఎంతో ఇష్టపడి ఖరీదు చేస్తుండడం విశేషం. అదే విధంగా తాను పండించే మిర్చిని రూ. 120కి, బెండకాయలను రూ.70కి అమ్ముతానని జాకబ్‌ తెలిపాడు. మామిడి, చికూ లాంటి పండ్ల జాతులను కూడా జాకబ్‌ తన టెర్రస్‌ గార్డెన్‌ లో సాగు చేస్తున్నాడు. జాకబ్‌ టెర్రస్‌ తోటలో వినియోగించిన మట్టినే మళ్లీ మళ్లీ వినియోగిస్తుంటాడు. ఒక పంట పండించిన తర్వాత జాకబ్‌ ఆ మట్టికి ఆర్గానిక్‌ ఎరువులను కలుపుతుంటాడు. అలా కలిపిన మిశ్రమాని మళ్లీ పోషకాలు వచ్చే దాకా జాకబ్‌ తన టెర్రస్‌ లో ఓ మూలకు పోగుపెడుతుంటాడు.జాకబ్‌ కృషికి గుర్తింపుగా కేరళ ప్రభుత్వం బెస్ట్‌ టెర్రస్‌ ఫార్మర్‌ ఆఫ్ ది డిస్ట్రిక్ట్‌ అవార్డు అందజేసింది. ఈ అవార్డుతో తాను మరిన్ని ఎక్కువ కూరగాయల మొక్కల్ని పెంచేలా మరింత ప్రోత్సాహం ఇచ్చిందని జాకబ్‌ తెలిపాడు. తన ఆర్గానిక్‌ టెర్రస్ సాగు ద్వారా లాభాల కన్నా మానసిక సంతృప్తి బాగా లభిస్తోందని జాకబ్‌ ఆనందంగా చెప్పాడు. టెర్రస్‌ పై ఆర్గానికి కూరగాయల సాగు ద్వారా తన రిటైర్‌ మెంట్‌ జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతోందన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here