ఎనభై నాలుగేళ్ల హేమారావు ప్రతిరోజూ తమ టెర్రస్‌ మీదకు ఓ చిన్న బుట్టను చేత్తో పట్టుకుని వెళ్తుంది. తమ అపార్ట్‌ మెంట్‌ కాంప్లెక్స్‌ పై టెర్రస్‌ మీద తిరుగుతుంది. మొత్తం 12 వేల చదరపు అడుగుల టెర్రస్‌ అంతటా బ్లూ కలర్‌ డ్రమ్ముల్లో ఎంతో ఇష్టపడి పచ్చగా కళకళలాడేలా పెంచుకున్న కూరగాయల మొక్కలను మరింత జాగ్రత్తగా పరిశీలిస్తూ తిరుగుతుంది. టెర్రస్‌ గార్డెన్‌ లో ఎంతో మక్కువతో పెంచిన మొక్కల నుంచి తమ కుటుంబానికి కావాల్సిన తాజా కూరగాయలు కోసుకుని తన బుట్టలో వేసుకుని కిందికి వస్తుంది. గడిచిన కొన్నేళ్లుగా ఆ వృద్ధ మహిళకు ఉదయం ఈ విధంగానే మొదలవుతుంది. హేమారావు తొలుత తమ టెర్రస్‌ పై 6 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆర్గానిక్‌ కూరగాయల సాగు ప్రారంభించారు. తర్వాత మరికొందరు కూడా మిగతా స్థలంలో ఆర్గానిక్‌ సాగు చేస్తున్నారు.

తమ టెర్రస్ గార్డెన్‌ లో సహజ విధానంలో పండించిన కూరగాయలతో వండుకున్న కూరల్ని తమ కుటుంబంలోని ఐదుగురం తింటుంటే ఎంతో ఆనందంగా ఉంటుందని హేమారావు కొడుకు ఆదిత్య సంతోషంగా చెబుతున్నాడు. తమ అమ్మ ఇలా చేయడాన్ని హాబీ అనండి.. లేదా ఇంకేమైన పేరుతో పిలవండి.. రసాయనాలు లేకుండా ఆర్గానిక్‌ విధానంలో పండించిన కూరగాయలు తమకు ఎన్నో విధాల ప్రయోజనం కలుగుతోంది అంటున్నాడు.బెంగళూరులోని బెల్లందూర్‌ లోని తమ టెర్రస్‌ పై తాము పెంచుతున్న ఆర్గానిక్‌ కూరగాయల్ని చూసిన చుట్టుపక్కల అపార్ట్‌ మెంట్లలో నివాసం ఉండే అనేక స్ఫూర్తి పొందడం తమకు ఆనందంగా ఉందని ఆదిత్య చెప్పాడు. హేమారావు కుటుంబం అంతా ఆర్గానిక్‌ విధానంలో వివిధ రకాల తాజా కూరగాయల పండించుకుంటుండడంతో తాము మార్కెట్‌ పై ఆధారపడాల్సిన అవసరమే లేకుండా పోయిందంటాడు. హేమారావు తమ టెర్రస్‌ గార్డెన్‌ లో వారానికి 12 కిలోల తాజా కూరగాయలు పండిస్తున్నారు.

వాస్తవానికి తమది హైదరాబాద్‌ అని, 1999లో బెంగళూరుకు నివాసం మార్చుకున్నామని 47 ఏళ్ల ఆదిత్య వెల్లడించాడు. ప్రస్తుతం తాము నివాసం ఉంటున్న  ‘ఇట్టిన అనయ్‌ అపార్ట్‌ మెంట్‌’ కన్నా ముందు తమకు రెండు ఎకరాల మధ్యలో ఓ బంగ్లా ఉండేదని, అక్కడ తమ అమ్మ హేమారావు పెరటితోటలో అనేక రకాల కూరగాయాలు పండించేదని చెప్పాడు. అయితే.. 2012లో ప్రస్తుతం తాము ఉంటున్న అపార్ట్‌ మెంట్‌ మారడంతో తమ తల్లికి కూరగాయలను స్వయంగా పండించలేకపోతున్నాననే బాధ ఉండేదన్నాడు. తమ టెర్రస్‌ మీద ఆర్గానిక్‌ కూరగాయలు పండించడం ఓ మధురానుభూతి అయితే.. తద్వారా తమ కూరల అవసరాలు తీరుతున్నాయని, అంతేకాకుండా పలు ఆరోగ్య లాభాలు కూడా కలుగుతున్నాయంటాడు ఆదిత్య.

హేమారావు.. ఆమె కోడలు చిత్రలేఖకు టెర్రస్ మీద ఆర్గానిక్‌ కూరగాయల సాగు ఓ దినచర్యగా మారిపోయిందంటాడు ఆదిత్య. తమ అపార్ట్‌ మెంట్‌ నిర్మాణం తన తల్లిని పరిమితం చేయకపోతే.. ఇక ఆమె ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కూడా టెర్రస్‌ గార్డెన్‌ లోనే సమయం వెచ్చించి, ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పొంది ఉండేదంటాడు.తన తల్లి ఉత్సాహాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు తాను కొన్ని పాత డ్రమ్ములు ఇంటికి తెచ్చినట్లు ఆదిత్య వివరించాడు. ఆ డ్రమ్ముల్లో తన తల్లి ఆర్గానిక్ విధానంలో కూరగాయల మొక్కల పెంపకం ప్రారంభించినట్లు చెప్పాడు. క్రమేమీ ఇప్పుడు తమ టెర్రస్ గార్డెన్‌ కొత్తిమిర, తులసి, పుదీనా, పాలకూర లాంటి పచ్చని ఆకుకూరలు, పొట్లకాయలు, బీట్‌ రూట్‌, ముల్లంగి, క్యారట్‌, ఆలుగడ్డ లాంటి దుంపకూరలతో  కళకళలాడుతోందని సంతోషంగా చెప్పాడు. అలాగే తమ టెర్రస్ గార్డెన్‌ లో టమోటా, వేరుశెనగ, యాలకులు, మిర్చి, కాప్సికమ్‌, బఠాణీ, బీన్స్‌ లాంటి పంటలు, బొప్పాయి లాంటి పండ్లను కూడా పండిస్తున్నామని ఆదిత్య వివరించాడు.

తమ కాలనీలో ఏర్పాటు చేసిన సీవేజ్‌ ట్రీట్‌ మెంట్‌ ప్లాంట్‌ లో కొబ్బరి పొట్టు, మట్టితో తయారు చేసిన మిక్స్‌ ను ఖాళీ ప్లాస్టిక్‌ డబ్బాల్లో నింపుతామని ఆదిత్య చెప్పాడు. ఇలా తయారైన మిక్స్‌ ను డబ్బాల్లో నింపడం, మరో డబ్బాలోకి మార్చడం సులువుగా ఉంటుందన్నాడు. ఈ మిక్స్‌ ను డబ్బాల్లో నింపడం వల్ల టెర్రస్ పైన మట్టి మరకలు ఏర్పడవని, మొక్కల పంపకానికి నీటి వినియోగం కూడా చాలా తక్కువే ఉంటుందని చెప్పాడు. సీవేజ్ ప్లాంట్‌ ద్వారా తయారైన బురదలాంటి మట్టిలో అమ్మోనియా, నైట్రోజన్‌, ఫాస్పరస్‌ మరికొన్ని ఉన్నత పోషకాలు ఉంటాయని, వాటి ద్వారా మొక్కలు బాగా ఏపుగా. పచ్చగా ఎదుగుతాయని ఆదిత్య వెల్లడించాడు. సారవంతమైన ఆర్గానిక్‌ ఎరువుల మిక్సర్‌ తయారు చేయడానికి తాము చాలా తక్కువ మట్టిని వినియోగిస్తామన్నాడు. అందువల్ల మిక్సర్ నింపిన డబ్బాలు తేలిగ్గా ఉంటాయన్నాడు. కేవలం మట్టిని మాత్రమే డబ్బాల్లో నింపితే ఒక్కొక్కటి కనీసం 50 కిలోల బరువు ఉంటుందన్నాడు. అదే మిక్సర్‌ అయితే.. అంతకన్నా సుమారు 15 కిలోల బరువు తక్కువే ఉంటుందని ఆదిత్య వెల్లడించాడు.టెర్రస్‌ మీద మొక్కలకు తాము శుద్ధి చేసిన నీటిని వినియోగిస్తామని ఆదిత్య చెప్పాడు. అంతేగానీ నగర పాలక సంస్థ సరఫరా చేసే తాగునీటిని మాత్రం ఉపయోగించం అంటాడు. ఇక తమ టెర్రస్‌ మీద మొక్కలను క్రిమి కీటకాలు ఆశించకుండా చేసేందుకు వేపనూనె, మిర్చి, ఇతర సహజసిద్ధ పదార్థాలను కలిపి వాడతామన్నాడు. ఆర్గానిక్‌ పంటలు సాగుచేయడం ఒక చాలెంజ్ లాంటిది అంటాడు ఆదిత్య. ఆర్గానిక్ విధానంలో పంట ఉత్పత్తి కాస్త తక్కువే వస్తుందంటాడు. అయితే.. ఆరోగ్యం విషయమై చూసుకుంటే తక్కువ ఉత్పత్తిని లెక్కలోకి తీసుకోకూడదంటాడు. టెర్రస్ పై ఆర్గానిక్‌ కూరగాయల సాగు ద్వారా మరీ ముఖ్యంగా తమ కుటుంబానికి కావాల్సినంత శారీరక శ్రమ లభిస్తోందని ఆదిత్య చెప్పాడు. టెర్రస్‌ పై కూరగాయల సాగు ప్రారంభించక ముందు తన తల్లి, భార్యకు డీ విటమిన్‌ లోపం ఉండేదట. అయితే.. టెర్రస్‌ గార్డెనింగ్‌ చేస్తుండడంతో వారికి డీ విటమిన్‌ లోపం క్రమేమీ తగ్గిపోయిందని సంతోషంగా ఆదిత్య వెల్లడించాడు.

టెర్రస్‌ మీద తాము ఆర్గానిక్‌ కూరగాయల సాగు చేయడాన్ని చూసి, తమ అపార్ట్‌ మెంట్‌ లోని పది మంది స్ఫూర్తి పొందారని, వారు కూడా ఆర్గానిక్‌ విధానంలో కూరగాయలు పండిస్తున్నారని ఆదిత్య తెలిపాడు. టెర్రస్ లో ఆర్గానిక్‌ గార్డెనింగ్‌ చేయాలంటే అపారమైన అభిలాష, అంకితభావం ఉండాలంటాడు ఆదిత్య.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here