నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఆ దంపతులిద్దరూ ఉన్నత ఉద్యోగాలు చేసి రిటైరయ్యారు. ఉద్యోగాలు చేసే సమయంలో వారు హైదరాబాద్‌, విజయవాడ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో ఉండేవారు. చలివేంద్ర వెంకట ప్రసాద్‌, ఆయన భార్య అళహరి సుమతి కుమారి మాత్రం రిటైర్‌మెంట్‌ జీవితాన్ని అందరిలా గడిపేసే కంటే కాస్త విభిన్నంగా ఆలోచించారు. పల్లెటూరిలో, పచ్చని ప్రకృతి ఒడిలో హాయిగా తమ శేష జీవితం కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఆర్గానిక్‌ వ్యవసాయంతో పాటు కోళ్లు, చేపలు, ఆవుల్ని పెంచుతూ ఆనందంగా, ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో వారు ఆదర్శప్రాయంగా మారారు. ప్రసాద్‌, సుమతి దంపతులు కొనసాగిస్తున్న స్వచ్ఛ జీవనం, సేంద్రీయ వ్యవసాయం విధానాల గురించి తెలుసుకుందాం.వెంకట ప్రసాద్‌ ది కావలి తాలూకా పువ్వలదొరువు గ్రామం. హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్‌ లో 40 ఏళ్ల పాటు ఉద్యోగం చేసి, రిటైరైన తర్వాత గ్రామీణ వాతావరణంలో ఉండాలని నిర్ణయించుకుని తమ గ్రామంలో పూర్వీకుల నుంచి వచ్చిన సుమారు అర ఎకరం భూమిలోని కొంత భాగంలో సింగిల్‌ బెడ్రూం ఇల్లు కట్టుకున్నారు. ఇంటి చుట్టూ ఉన్న మిగతా నేలలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అందులో తమకు కావాల్సిన కూరగాయలు, పండ్లు, పువ్వులను సేంద్రీయ విధానంలో పండించుకుంటున్నారు. అలాగే ఆవులు, కడక్‌ నాథ్‌ కోళ్లు కూడా పెంచుతున్నారు. వీటన్నింటినీ విక్రయించకుండా తాము వాడుకోవడంతో పాటు బంధు, మిత్రులకు ఉచితంగా పంపిణీ చేస్తుంటామని ప్రసాద్‌ చెప్పారు.

ప్రసాద్‌ సతీమణి సుమతి కుమారి హైదరాబాద్‌ లోనే రెవెన్యూ విభాగంలోని సీసీఎల్‌ఏ ఆఫీసులో, మెదక్‌ ఆర్డీఓగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయిన తర్వాత అమరావతిలో డిప్యూటీ కలెక్టర్‌ గా సుమతి కుమారి పనిచేసి 2019లో రిటైర్‌ అయ్యారు. మొత్తం 36 ఏళ్ల పాటు ప్రభుత్వ అధికారిగా పనిచేసినప్పటికీ సుమతి కుమారి కూడా భర్తతో పాటు ప్రకృతికి దగ్గరగా జీవిస్తున్నారు.ప్రసాద్‌ దంపతులు ఇంటి పెరట్లో చిన్న చెరువు ఏర్పాటు చేసుకుని దాంట్లో హాబీగా చేపల్ని కూడా పెంచుతున్నారు. 20 సెంట్లలో తాము సాకుతున్న ఆవులకు పచ్చిగడ్డి పెంచుతున్నారు. ఆ పక్కనే కడక్‌ నాథ్‌ కోళ్లను పెంచుతున్నారు. మరొక వైపున మామిడి లాంటి ఫలజాతి చెట్లు పెంచుతున్నారు. మరి కొంత నేలలో సేంద్రీయ వ్యవసాయ విధానంలో ఘన జీవామృతం, ద్రవజీవామృతం, బ్రహ్మాస్త్రం లాంటివి వినియోగించి మిర్చి పంట సాగు చేస్తున్నారు. మిర్చిపై క్రిమి కీటకాలు ఆశించకుండా నివారించేందుకు నీమ్ ఆయిల్‌ స్ప్రే చేస్తున్నారు. తాము ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందులు వాడడం లేదని వారు చెప్పారు.ప్రసాద్‌ దంపతులు పలు కూరగాయల మొక్కలతో పాటు అనేక పాదుజాతి కూరగాయలను కూడా పండిస్తున్నారు. వాటితో పాటు గులాబీ, కనకాంబరం, మల్లె లాంటి రకరకాల పూలమొక్కలు పెంచుతూ నలుగురికీ ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచుతున్నారు. తమ చేపల చెరువులో మేత వేసేటపుడు చేపపిల్లలు ఎగురుతూ చేసే సందడి చూస్తే ఎంతో ఆనందం కలుగుతుందని ప్రసాద్‌, సుమతి దంపతులు చెప్పారు. ప్రసాద్‌ దంపతులు పలు కుండీల్లో లెమన్ గ్రాస్‌ కూడా పెంచుతున్నారు. హైదరాబాద్‌ నుంచి 15 రూపాయలు ఇచ్చి ఒక లెమన్‌ గ్రాస్ మొక్క కొనుక్కొచ్చి కుండీలో నాటామని చెప్పారు. అది ఇప్పుడు అనేక మొక్కలుగా పెరిగిపోయిందన్నారు. లెమన్‌ గ్రాస్‌ ను కోసి చెరువులో వేస్తే చేపలు చాలా ఇష్టంగా తింటున్నాయని ప్రసాద్ చెప్పారు.తమ పెరటి తోటలో ఒక మూలన ప్రసాద్‌ దంపతులు అల్లం పంట సాగుచేస్తున్నారు. సిమెంట్‌ తో ఒక చిన్న కుండీ ఏర్పాటు చేసి, దాంట్లో తామరపూల మొక్కలు కూడా పెంచుతున్నారు. కొన్ని కుండీల్లో పసుపు మొక్కలు పెంచుతున్నారు. చేపల చెరువుపై ఇనుప కంచె వేశారు. చెపల చెరువు నుంచి ఎక్కువ అయిన నీటిని రివర్స్‌ పంపింగ్‌ విధానంలో తమ తోటలోని మొక్కలకు వెళ్లేలా ఏర్పాటు చేశారు. చేపల చెరువులో వచ్చిన వ్యర్థాలు కూడా ఆ నీటితో పాటే మొక్కలకు సరఫరా అవుతూ.. అవి ఏపుగా ఎదుగుతున్నాయని చెప్పారు. దాంతో పాటు ఆవుల షెడ్‌ ను కడిగినప్పుడు కూడా ఆ నీరు నేరుగా మొక్కలకు సరఫరా అయ్యేలా వారు ఏర్పాటు చేశారు. వంట ఇంటిలోని వ్యర్ధాలను ఓ పెద్ద ప్లాస్టిక్‌ డబ్బాలో వేసి నాలుగు రోజుల పాటు ఉంచి, కుళ్లిన ఆ ఎరువును మొక్కలకు వేస్తుంటామన్నారు.ప్రసాద్‌ దంపుతుల పెరటితోటలో కొలంబో కంది రకాన్ని కూడా ఎంతో ఇష్టపడి సేంద్రీయ వ్యవసాయ విధానంలోనే పండిస్తున్నారు. తమ పెరటి తోటలో సరిహద్దు చుట్టూరా ప్రసాద్‌, సుమతి దంపతులు మూడు రకాల అరటి మొక్కలు కూడా పెంచుతున్నారు. కొంత నేలలో జామచెట్లు పెంచుతున్నారు. సహజసిద్ధ విధానంలో తమ తోటలోని జామచెట్లు విరివిగా కాపు కాస్తున్నాయని ప్రసాద్‌ తెలిపారు.

ప్రకృతి ఒడిలో రిటైర్డ్ జీవనం కొనసాగించాలని నిర్ణయించుకోవడం, అందుకు అనుగుణంగా తమ కొద్దిపాటి భూమిలోనే ప్రసాద్‌, సుమతి దంపతులు ఆహ్లాదకరంగా జీవిస్తున్నారు. ఉద్యోగ బాధ్యతల నుంచి రిటైరైన ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

(లేడీస్‌ జోన్‌ సౌజన్యంతో..)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here