తెలంగాణలో సేంద్రియ వ్యవసాయం క్రమంగా విస్తరిస్తోంది. ప్రగతిశీల రైతులు పలువురు సేంద్రియ వ్యవసాయం వైపు మరలుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహార దినుసుల కోసం మంచి డిమాండ్ ఉన్నందున ఈ రైతులు సాగు విషయంలో కూడా వినూత్నమైన లాభసాటి దేశవాళీ పంటలను ఎంపిక చేసుకున్నారు.
సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జన్‌పహాడ్‌కు చెందిన సాదినేని జగ్గయ్య అలాంటి రైతుల్లో ఒకరు. ఆయన ఔషధ విలువలు కలిగిన ఎనిమిది రకాల వరి పంటలను సేంద్రియ విధానాల్లో సాగు చేస్తున్నారు. రసాయన ఎరువులు ఉపయోగించి మూడు దశాబ్దాలుగా పంటలు పండించిన తరువాత, జగ్గయ్య ఆ పద్ధతి భూసారానికి హాని కలిగించడమే కాక ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని గ్రహించారు. దీంతో మూడేళ్ల క్రితం తన ఐదు ఎకరాల భూమిలో ఆయన ప్రకృతి వ్యవసాయానికి శ్రీకారం చుట్టారు. దిగుబడి తగ్గినప్పటికీ తాను ఎంచుకున్న బియ్యం రకాలకు మంచి డిమాండ్ ఉండడంతో ఈ సేంద్రియ సాగు ఆయనకు మంచి లాభాలనే ఆర్జించి పెట్టింది.
వ్యవసాయం పట్ల మక్కువతో జగ్గయ్య తన కుమార్తెను అగ్రికల్చర్ బీఎస్సీ చేయమని ప్రోత్సహించారు.

జగ్గయ్య తన పొలంలో నవర, కాలాభట్, కులక్కర్, మైసూర్ మల్లిక, నారాయణ కామిని, సిద్ది సన్నాలు, మాపిళ్లై సాంబ, రత్నచోడి వంటి దేశీ రకాల వరి వంగడాలను సాగు చేస్తున్నారు. వీటికి మార్కెట్‌లో మంచి డిమాండ్ కూడా ఉంది. ఈ రకాలు కొన్ని తీవ్రమైన వ్యాధులను నియంత్రించడంలో సహాయపడతాయని పలువురు భావించడమే దీనికి కారణం.
వరిని మిల్లింగ్ చేసిన తరువాత, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, గుంటూరు, హైదరాబాద్ వంటి నగరాల్లోని వినియోగదారులకు జగ్గయ్య విక్రయిస్తారు. ఈ రకాల ధర కిలోకి రూ .80 నుంచి రూ .100 వరకు ఉంటోంది. ఇది మామూలు బియ్యం ధరతో పోల్చితే మంచి రేటు కిందే లెఖ్క.
కాగా, వీటిలో నవర బియ్యం మధుమేహం, ఊబకాయం, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నవారికి సహాయకారిగా ఉంటుందని జగ్గయ్య చెబుతారు. “నవర కేరళకు చెందిన బియ్యం. దీన్ని సాంప్రదాయకంగా వర్షాకాలంలో వినియోగిస్తారు. ప్రసిద్ధమైన నవరా కిళీ ఆయుర్వేద చికిత్సలో దీన్ని విస్తృతంగా ఉపయోగిస్తారు”అని ఆయన వివరించారు.

మాపిళ్లై సాంబ బియ్యం

“అదేవిధంగా, కాలాభట్ ఒక సుగంధ భరితమైన నల్ల బియ్యం రకం. ఇది క్యాన్సర్ నివారణలో ఉపకరిస్తుందని విశ్వసిస్తారు. తులకట్ (Thulakat) (బ్రౌన్) బియ్యం గర్భిణులకు మంచిదంటారు. బిడ్డ ఆరోగ్యంగా పుట్టేందుకు ఇది తోడ్పడుతుందని భావిస్తారు. అంతేకాదు, ఈ బియ్యం తింటే సాధారణ డెలివరీ అవుతుందన్న నమ్మకం కూడా ఉంది” అని ఆయన చెప్పారు.
మైసూర్ మల్లిక రకంలో ప్రోటీన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్నాయని జగ్గయ్య వివరిస్తారు. రోగనిరోధక శక్తిని కలిగించి దేహబలం పెంచడంలో ఇది సహాయపడుతుందని ఆయన అన్నారు. “ఇది హార్మోన్ల అసమతుల్యతను సరిచేయడంలో కూడా సహాయపడుతుంది. ఇక నారాయణ కామిని బియ్యంలో 30-40 శాతం ఫైబర్ ఉంటుంది. ఆర్థరైటిస్‌తోను, జీర్ణక్రియ సమస్యలతోను బాధపడేవారికి ఇది మంచిదని జగ్గయ్య చెబుతారు. సిద్దిసన్న బియ్యం కూడా ఆరోగ్యకరమైనదనీ, ఇందులో అధిక శాతం ఫైబర్, ప్రోటీన్లు ఉంటాయనీ ఆయన చెప్పారు. అలాగే మాపిళ్లై సాంబ బియ్యం లైంగిక రుగ్మతలను నయం చేయడంలో సహాయపడుతుందనీ, వంధ్యత్వ సమస్యను ఇది పరిష్కరించగలదనీ ఆయన వివరించారు. ఇక రత్నచోడి బియ్యం పూర్వం సైనికుల మెనూలో భాగంగా ఉండేదనీ, ఇది తక్షణ శక్తిని ఇస్తుందనీ ఆయన అంటున్నారు.

జగ్గయ్య తండ్రి రోశయ్య వయసు 90 సంవత్సరాలు. అయినా కూడా తాను ఇప్పటికీ వ్యవసాయ పనులను చేయగలనని రోశయ్య చెప్పారు. “ఈ బియ్యం రకాలను సాగు చేయడం ప్రారంభించిన తరువాత, నేనూ నా ఆరోగ్య సమస్యల నుండి బయటపడ్డాను. మంచి సత్తువ పుంజుకున్నాను” అని రోశయ్య చెబుతారు. మొత్తంమీద పండించే వంగడాలు ప్రజలకు ఉపయోగపడేవైతే సేంద్రియ వ్యవసాయం రైతుకు లాభసాటిగా ఉంటుందని సాదినేని జగ్గయ్య అనుభవం రుజువు చేస్తోంది.

(Telangana Today సౌజన్యంతో)

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here