తలకు మించిన రుణభారం, పంట నష్టాలు, తక్కువ దిగుబడి వంటి కడగండ్లు వ్యవసాయం మీద కారు మేఘాల్లా కమ్ముకుని ఉన్న నేటి పరిస్థితుల్లో మావురం మల్లికార్జున్ రెడ్డి వంటి సేంద్రియ రైతులు జలతారు మెరుపుల్లాంటి వారు. తెలంగాణ కరీంనగర్ జిల్లాలోని పెద్ద కురుమపల్లి గ్రామానికి చెందిన మల్లికార్జున్ రెడ్డి పలు వ్యవసాయ ప్రయోగాలతో తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సేంద్రియ పద్ధతుల్లో ప్రయోగాలు చేసి వివిధ రకాలైన పంటలు పండించినందుకుగాను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) నుండి మల్లికార్జున్ రెడ్డి ‘జగ్జీవన్ రామ్ అభినవ్ కిసాన్ పురస్కారం’ అందుకున్నారు. ఈ అవార్డుకు తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపికైంది మల్లికార్జున్ రెడ్డి ఒక్కరే కావడం విశేషం. మల్లికార్జున్ రెడ్డి సాధించిన ఈ విజయం వెనుక ఎంతో కృషి ఉందని ఆయన భార్య సంధ్య చెబుతారు.   
“ఉద్యోగం విడిచిపెట్టి, గ్రామానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు తనతో విభేదించిన చాలా మంది స్నేహితులు, బంధువులు ఇప్పుడు ఆయన విజయాన్ని మనసారా అభినందిస్తున్నారు. నిరంతర శ్రమ, సృజనాత్మకత తాలూకు ఫలితాలను పొందడం ఎంతో ఆనందంగా ఉంది” అని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
మల్లికార్జున్ రెడ్డి 2006లో బి.టెక్ (కంప్యూటర్ సైన్స్) పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ‘సెమాంటిక్స్ స్పేస్ టెక్నాలజీస్‌’లో చేరారు. ఎంబీఏ పూర్తి చేసిన సంధ్యతో 2010లో తనకు వివాహం జరిగింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం బాగానే ఉంది. కానీ కొన్నాళ్లకు క్రమంగా మల్లికార్జున్ రెడ్డి ఆలోచనల్లో మార్పు రావడం మొదలైంది. చివరకు, 2014లో మల్లికార్జున్ రెడ్డి తన హైదరాబాద్‌ ఉద్యోగాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. నిజానికి ఈ నిర్ణయం ఆకస్మికమైనదేమీ కాదు. కొన్ని వరుస ఘటనలు, పరిణామాలు ఆయన మనసుపై తీవ్ర ప్రభావం కలిగించాయి. చాలా మంది బంధువులు, స్నేహితులు ఆసుపత్రి వైద్య అవసరాల కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు మల్లికార్డున్ రెడ్డి ఇంట్లో బస చేసేవారు. కొన్నిసార్లు వారి వెంట మల్లికార్జున్ రెడ్డి కూడా ఆసుపత్రులకు వెళ్లేవారు.

భార్య సంధ్యతో కలిసి వ్యవసాయం పనులు

“ఆసుపత్రులు నిత్యం రోగులతో నిండిపోయి ఉంటున్నాయి. డాక్టర్లు తరచు మన ఆహారంలో చేరుతున్న హానికర రసాయనాల విషప్రభావం గురించి మాట్లాడడం విన్నాను. మనల్ని, మన పర్యావరణాన్ని ఈ రసాయనాలు కలుషితం చేస్తున్న తీరు చూస్తే ఎంతో భయంకరంగా తోచింది.” అని మల్లికార్జున్ రెడ్డి చెబుతారు.
మల్లికార్జున్ రెడ్డి మనసును బాగా కలచివేసిన మరో విషాద ఘటన ఆయన స్నేహితుడి కుమార్తె అకాల మరణం. క్యాన్సర్ కారణంగా మిత్రుడి కుమార్తె మరణించడం చూసి ఆయన తట్టుకోలేకపోయారు. “నా కుటుంబం కూడా ఇలాంటి విషపు కోరల్లో చిక్కుకోవడం నాకిష్టం లేదు. అందుకే ఒక మంచి మార్పును ఆశించి నా కొత్త ప్రయాణం ప్రారంభించాను” అని మల్లికార్జున్ రెడ్డి వివరించారు.
ఆమీర్ ఖాన్ పాపులర్ టాక్ షో ‘సత్యమేవ జయతే’ కార్యక్రమంతో మల్లికార్జున్ రెడ్డి విశేషంగా ప్రభావితమయ్యారు. అలాగే జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ సృష్టికర్త సుభాష్ పాలేకర్, సామాజిక కార్యకర్త రాజీవ్ దీక్షిత్ సిద్ధాంతాల నుండి ప్రేరణ పొందారు. నెమ్మదిగా మల్లికార్జున్ రెడ్డి ఆలోచనలకు ఒక నిర్దిష్టమైన రూపం వచ్చింది. ఇక ఆలస్యం చేయకుండా సేంద్రియ వ్యవసాయంలోకి ప్రవేశించాలని ఆయన నిర్ణయించుకున్నారు.
నిజానికి వ్యవసాయం వారి కుటుంబానికి కొత్తేమీ కాదు. తండ్రి లక్ష్మారెడ్డి వ్యవసాయంలోనే ఉన్నారు. అలా కుటుంబం సాగు చేస్తున్న 12 ఎకరాలలోనే మల్లికార్జున్ రెడ్డి తనదైన పద్ధతుల్లో సేద్యం ప్రారంభించారు. మొదట పాక్షిక సేంద్రియ విధానాల్లో వరి పండించారు. ఫలితాలు ఆశించిన విధంగా లేకపోవడంతో బిందు సేద్యంలో వరి సాగు చేశారు. ఆ తరువాత హైబ్రిడ్ కందిసాగుకు ప్రయత్నించారు. ఆపై వరి దిగుబడిని పెంచడానికి సిస్టం ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ (ఎస్ఆర్ఐ) వ్యవసాయ పద్ధతిని అనుసరించారు.

తన పొలంలో మావురం మల్లికార్జున్ రెడ్డి

హైదరాబాద్ (రాజేంద్రనగర్‌)లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిపాదించే నూతన ఆవిష్కరణలను అనుసరిస్తూ మల్లికార్జున్ రెడ్డి నిరంతరం తన వ్యవసాయ పరిజ్ఞానాన్ని పెంచుకుంటారు. ఈ విశ్వవిద్యాలయం నుండి ఆయన ‘ఉత్తమ రైతు’ అవార్డు కూడా గెలుచుకున్నారు. ఇప్పుడు, తన సేంద్రియ వ్యవసాయం ఇతర రైతుల కంటే ఎక్కువ రాబడిని ఇస్తున్నదని ఆయన సంతృప్తిగా చెబుతారు. సాధారణ వ్యవసాయంలో 60 క్వింటాళ్ల వరి దిగుబడికి రూ.50,000 దాకా పెట్టుబడి అవసరమైతే, మల్లికార్జున్ రెడ్డి అంతే దిగుబడిని కేవలం రూ. 25,000 పెట్టుబడితోనే సాధించి చూపారు. దాని నుండి మొత్తంగా రూ. 1,13,000 ఆదాయం రాబట్టి అందర్నీ ఆశ్చర్య పరిచారు. అతి తక్కువ పెట్టుబడితో అత్యధిక ఆదాయం సాధించడమే ఆయనకు ICAR అవార్డు లభించడానికి ప్రధాన కారణం.
సమగ్ర వ్యవసాయం, పొలంలో కుంటల ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసి ఉపయోగించుకోవడం, భూగర్భ జలాలు పెరగడం కోసం బావుల ఏర్పాటు, పురుగుమందుల వినియోగాన్ని వారిస్తూ తోటి రైతులలో అవగాహన కల్పించడం వంటివి మల్లికార్జున్‌ రెడ్డికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. మల్లికార్జున్ రెడ్డికి వ్యవసాయ ప్రయోగాలంటే చాలా ఇష్టం. పంట వ్యర్థాలను తగులబెట్టడం కాకుండా ఆయన bio-decomposer techniqueని అనుసరిస్తారు. 
“పంట వ్యర్థాలను తగులబెట్టడం పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రజల ఆరోగ్యానికి అది హాని కలిగిస్తుంది. అందుకే 11 ఏళ్ల పరిశోధనల ఫలితంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన బయో-డికంపోజర్ టెక్నిక్‌ (bio-decomposer technique)ను నేను అనుసరిస్తాను. ఈ వేస్ట్ డికంపోజర్‌ విధానం రైతులకు చాలా ప్రయోజనకరమైంది” అని చెబుతారు మల్లికార్జున్ రెడ్డి. తన పొలంలో మల్లికార్జున్ రెడ్డి ఏకంగా 26 రకాల పంటలను పండించడం విశేషం. వరితో పాటు కూరగాయలు, అల్లం వంటివి కూడా ఆయన సాగు చేస్తారు. తమ 12 ఎకరాలకు తోడు మరో 5 ఎకరాలను కౌలుకు తీసుకున్న మల్లికార్జున్ రెడ్డి పంటల వైవిధ్య సూత్రాన్ని అనుసరిస్తారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మల్లికార్జున్ రెడ్డి వ్యవసాయ శ్రామికులతో అవసరం లేకుండా ఒక్కరే పొలం సాగు చేస్తారు. “నేను ఏక వ్యక్తి సైన్యాన్ని” (I am a one-man army) అని ఆయన సరదాగా అంటుంటారు. రోజూ పొలంలో ఆయన 12 గంటల పాటు పని చేస్తారు. తెల్లవారు జామున 4 గంటలకే నిద్ర లేస్తారు. పొలానికి వెళ్లే ముందు గొర్రెలు (9), మేకలు (21), ఆవుల (3- ఒంగోల్, గిర్, సాహిల్వాల్) కు మేత వేస్తారు.
“రోజూ నేను పొలంలో సగటున 26,000 అడుగుల మేర నడుస్తాను. వ్యవసాయం మొదలుపెట్టిన తర్వాత నేను ఆరు కిలోల దాకా బరువు తగ్గాను కూడా” అని మల్లికార్జున్ రెడ్డి నవ్వుతూ చెబుతారు. పొలం బావిలో ఆనందంగా ఈదులాడే 600లకు పైగా చేపలతో మల్లికార్జున్ రెడ్డి చిన్నారి కూతుళ్లు రోజూ కాసేపు వినోదంగా కాలక్షేపం చేస్తారు.
ఆదర్శ రైతుగా మారిన ఈ టెకీ హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బి కాలనీలో ఒక ఆర్గానిక్ షాపును కూడా ప్రారంభించారు. అక్కడ మల్లికార్జున్ రెడ్డి తన గ్రామం రైతులు సరఫరా చేసే ఉత్పత్తులను విక్రయిస్తారు. “సేంద్రియ వ్యవసాయం పర్యావరణాన్ని కాపాడుతుంది. చిన్న రైతులు పర్యావరణ హితం కోసం, తమ జీవనోపాధి కోసం చిన్నగా దీన్ని ప్రారంభించాలి” అని మల్లికార్జున్ రెడ్డి సూచిస్తారు. సాఫ్ట్‌వేర్ లైఫ్ వదిలిపెట్టి, పొలం బాట పట్టి, సేంద్రియ సాగును చేపట్టి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న మావురం మల్లికార్జున్ రెడ్డి ఎంతో అభినందనీయులు.

(The Hindu సౌజన్యంతో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here