చాలా ఏళ్ల క్రితం ఓ తాత.. అతని మనవడు తమ పొలం గట్టుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. రసాయనాలతో పొలంలో బాగా ఎదిగిన పైరును చూసి మనవడు ఎంతో సంబరపడుతున్నాడు. మనవడి ముఖంలో సంతోషాన్ని గమనించాడు ఆ తాత.. సేద్యం చేయడంలో దశాబ్దాలుగా డక్కీ మక్కీలు తిన్న అనుభవం ఆ తాతది.. అప్పుడప్పుడే వ్యవసాయంలో ఓనమాలు నేర్చుకుంటున్న మనవడు. అలాంటి మనవడితో తాత ఓ మాట చెప్పాడు. ‘రసాయన వ్యవసాయం స్లో పాయిజన్‌. దీనికి బానిసవి కావద్దు’ అని. తాత మాట మనవడి మనస్సుపై బలమైన ముద్ర వేసింది. ఇకపై రసాయనాలతో వ్యవసాయం చేయకూడదని ఆ మనవడు అప్పుడే నిర్ణయించుకున్నాడు. రసాయనాలు వాడని ప్రకృతి వ్యవసాయం చేయాలని బలంగా డిసైడ్‌ అయ్యాడు. అలా అప్పుడు ప్రకృతి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్న ఆ మనవడే ఇప్పుడు తమ గ్రామం మొత్తాన్ని సేంద్రీయ వ్యవసాయ గ్రామంగా మార్చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా ఆ ఊరికి ప్రసిద్ధి వచ్చేలా చేశాడు. ఆ మనవడే పొన్నం మల్లయ్య. ఆ ఆర్గానిక్‌ గ్రామం ఎనబావి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉంది. మల్లయ్య చేసిన కృషి ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఆర్గానిక్‌ వ్యవసాయ గ్రామంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. తెలంగాణ మొత్తంలో ఆర్గానిక్‌ వ్యవసాయ రైతుగా మల్లయ్యకు మంచి గుర్తింపు వచ్చింది. గ్రామం మొత్తాన్ని ఆర్గానిక్‌ విలేజ్‌గా మార్చడం వెనుక మల్లయ్య కృషి, పట్టుదలతో పాటు తాత చెప్పిన మాట ప్రభావమూ ఎంతో ఉంది.

ఎనబావిని ప్రకృతి వ్యవసాయం గ్రామంగా మార్చేందుకు పొన్నం మల్లయ్య ఏకంగా ఉద్యమమే చేశాడు. మల్లయ్య కృషి, పట్టుదలకు ‘క్రాప్‌’ (సెంటర్ ఫర్‌ రూరల్‌ ఆపరేషన్స్‌ ప్రోగ్రామ్స్‌ సొసైటీ) స్వచ్ఛంద సంస్థ తోడ్పాటు కూడా ఎంతో ఉంది. సేంద్రీయ వ్యవసాయం చేసేందుకు ఎనబావిలోని 52 కుటుంబాలను క్రాప్ సంస్థ ఎంతో ప్రభావితం చేసింది. మల్లయ్య ఆర్గానిక్‌ వ్యవసాయ విధానాలు నచ్చిన తెలంగాణలోని పలువురు రైతులు కూడా ప్రకృతి వ్యవసాయం వైపు ఆకర్షితులయ్యారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, వాటిని వినియోగించి ఆరోగ్యంగా, సంతోషంగా జీవిస్తున్నారు. పంటలు పండించేందుకు వినియోగించే రసాయనాల కారణంగా విత్తనాలు కూడా కొద్ది కాలానికి పనికిరాకుండా పోతాయి. దాంతో పంట దిగుబడులు కూడా తగ్గిపోతాయి. రసాయనాలు వాడిన భూమిలో సారం తగ్గిపోతుంది. నేల నిస్సారం అవుతుంది. అలాంటి నేలలో ఏ పంట వేసినా ఫలితం ఉండదు. ఎలాగైనా పంట దిగుబడి సాధించాలని రైతులు వేలకు వేలు ఖర్చు పెట్టి మరిన్ని ఎక్కువ రసాయనాలు వాడేస్తారు. దాంతో భూమిలో ఇక పంటలకు ఏమాత్రం అనువుగాని బంజర్లుగా మారిపోతాయి. వరంగల్‌ జిల్లాలో రైతులు ఎక్కువగా పత్తి తదితర వాణిజ్య పంటలు పండిస్తారు. ఎక్కువ రసాయనాలు వాడి చేసినా ఒక్కోసారి సరిగా దిగుబడి వచ్చే పరిస్థితి ఉండదు. దాంతో జిల్లాలో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలున్నాయి. దాంతో పాటు పొలంలో పురుగు మందులు చల్లే సమయంలో వాటి ప్రభావానికి గురై అసువులు బాసిన వారు ఎక్కువే.

ఇలాంటి చేదు అనుభవాలు మల్లయ్య మనసులో బాగా నాటుకుపోయాయి. దాంతో పాటు తన చిన్నప్పుడు తాత చెప్పి మాటతో ప్రకృతి వ్యవసాయాన్ని ఓ ఉద్యమంలా చేపట్టాడు.

ప్రకృతి వ్యవసాయం విధానంలో మల్లయ్య ఏం చేస్తాడంటే..క్రిమి కీటకాలను అదుపులో ఉంచడం కోసం మల్లయ్య తన పొలంలో అంతర పంటలు వేస్తాడు. అంతర పంటలతో భూమి సారవంతం అవుతుంది. దీర్ఘ కాలం పాటు సాగుబడి లాభసాటిగా ఉంటుంది. పంటలను ఆశించే క్రిమి కీటకాలను నిరోధించేందుకు ఫెరోమాన్‌ ట్రాప్‌ లు వినియోగిస్తాడు. అలాగే సీసాలు కూడా కీటకాలను ట్రాప్ చేసేందుకు వినియోగిస్తాడు. కొన్నిసార్లు వేపగింజలతో తయారు చేసిన పదార్థాన్ని చల్లుతాడు. మరి కొన్నిసార్లు ఔషధ మొక్క నీరుగొండి పదార్థాన్నీ వాడతాడు. క్రిములు, రోగాల నుంచి రక్షణ కోసం మిర్చి- వెల్లుల్లి మిశ్రమాన్ని వేస్తాడు. పంటలకు ఎరువుగా వేసేందుకు అన్ని రకాల మొక్కల అవశేషాలతో కంపోస్ట్ ఎరువును సొంతంగా తయారు చేసుకుంటాడు. ప్రతి నాలుగేళ్లకోసారి తమ చెరువులోని పూడికను పొలంలో వేస్తాడు. దాంతో పాటు కోళ్ల ఫారం నుంచి వచ్చిన వ్యర్థ పదార్ధాలు కూడా పంటలకు బలం కోసం వినియోగిస్తాడు. ఆవు పేడ, ఆవు మూత్రాన్ని సేకరించి బయో ఎరువు, వర్మీ కంపోస్ట్ తయారు చేసి వినియోగిస్తాడు. పంట ఏపుగా ఎదిగేందుకు వాడే యూరియాకు బదులుగా అజోల్లాను వినియోగిస్తాడు. వేగంగా విస్తరించే గుణం ఉన్న నీటిలో లభించే ఫెర్న్‌ మొక్కలు, బయో ఫెర్టిలైజర్‌ను వరి పొలంలో వేస్తాడు. అవి వరి పైరుకు హాని చేసే కలుపు మొక్కలు ఎదగకుండా నిరోధిస్తాయి.

కూరగాయల మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడే జీవామృతాన్ని, ఆవుపేడ, గోమూత్రం, పాలు, నెయ్యి, పెరుగుతో తయారుచేసిన పంచగవ్యను కూడా పొలంలో వేస్తాడు మల్లయ్య. జీవామృతం, పంచగవ్య వాడిన పొలంలో కూరగాయలు, పండ్లు రుచికరంగా ఉంటాయి. మంచి రంగు కూడా వస్తుంది. ఆవుపేడ, నీళ్లు, బెల్లంపొడి, శనగపిండి, ఆకులు కలిపి రెండు రోజుల పాటు కుళ్లబెట్టి జీవామృతాన్ని స్వయంగా తయారుచేస్తాడు మల్లయ్య. ఆర్గానిక్‌ వ్యవసాయం చేయడం కొంచెం కష్టంతో కూడుకున్న పనే. అందుకే సులువుగా చేసే రసాయన వ్యవసాయం వైపు కొందరు రైతులు వెళ్లిపోతారు. అలాంటి వారితో పొన్నం మల్లయ్య మాట్లాడి, మళ్లీ ఆర్గానిక్ వ్యవసాయం చేసేలా ప్రోత్సహిస్తాడు. మల్లయ్య కృషి కారణంగా ఇప్పుడు ఎనబావి గ్రామం మోడల్ విలేజ్‌గాను, నాలెడ్జ్ సెంటర్‌ గాను పేరు తెచ్చుకుంది. ఆర్గానిక్‌ వ్యవసాయంలో అవగాహన కోసం ఎనబావి గ్రామాన్ని ఇప్పుడు దేశం నలుమూలల నుంచీ అనేక మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఔత్సాహిక రైతులు, అధికారులు సందర్శిస్తున్నారు.ఎనబావి రైతులు తొలుత పలు సహకార సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత తమ పంటలను వినియోగదారులకే విక్రయించేందుకు ‘సహజ ఆహారం ప్రొడ్యూసర్‌ కంపెనీ’ పేరుతో వాటన్నింటినీ ఒకేదానిగా కలిపేశారు. ఈ కంపెనీలో రైతులు చాలా మంది సన్న చిన్నకారు రైతులే. రెండున్నర నుంచి 7 క్వింటాళ్ల పంట దిగుబడులను ఈ సంస్థ ద్వారా విక్రయించుకునేవారే. తమ పంట ఉత్పత్తులను కంపెనీ ద్వారా విక్రయించి ఏటా రెండున్నర వేల నుంచి 7 వేల రూపాయల వరకు అదనపు ఆదాయం పొందుతున్నారు. ఎనబావి చుట్టు పక్కల గ్రామాలైన మాణిక్యపురం, సిరిపురం, కళ్లెం తదితర గ్రామాల రైతులు కూడా పొన్నం మల్లయ్య, ఎనబావి గ్రామస్తులు చేస్తున్న సేంద్రీయ వ్యవసాయమే చేస్తున్నారు. మల్లయ్య కృషి కారణంగా ఎనబావికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. మల్లయ్య ఆర్గానిక్‌ వ్యవసాయ అనుభవాల గురించి తమ రైతులకు అవగాహన కల్పించాలని ఆస్ట్రేలియా, అమెరికా, శ్రీలంక దేశాలు ఆహ్వానించాయి.

ఎర్నబావి ఎలాంటి రసాయనాలు వాడని, పూర్తిస్థాయి ఆర్గానిక్‌ విలేజ్‌ అని 2016లో ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఎర్నబావిలోని సన్న చిన్నకారు రైతులు ఆర్గానిక్‌ పద్ధతిలో పండిస్తున్న వరి, గోధుమ, పత్తి, మిర్చి, పప్పు ధాన్యాలు, నూనెగింజలు, చిరుదాన్యాలు, కూరగాయలకు సింగపూర్‌, హైదరాబాద్‌, స్థానిక మార్కెట్లలో కూడా మంచి గిరాకీ ఉంది. ఆర్గానిక్‌ వ్యవసాయ విధానాల గురించి అధ్యయం చేసేందుకు పలు అంతర్జాతీయ సంస్థలు ఎనబావి వస్తుండడం విశేషం. అప్పుడెప్పుడో తాత చెప్పిన ఒక మంచి మాట వల్ల తన గ్రామం మొత్తానికి ఆర్గానిక్‌ వ్యవసాయంలో ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చిపెట్టాడు పొన్నం మల్లయ్య.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here