నమ్మకం, సంరక్షణ గృహిణి భువనేశ్వరిలో ఉన్న అతి గొప్ప బలాలు. ఆ బలాలతోనే ఆమె తన అత్తింటివారిని సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లించగలిగింది. అయితే.. భువనేశ్వరి కుటుంబానికి తొలుత ఆర్గానిక్‌ వ్యవసాయంలో ఓనమాలు కూడా తెలియవు. అత్తింటి వారికి ఉన్న 10 ఎకరాల్లో నిరుపయోగంగా ఉన్న ఒకటిన్నర ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయం చేయడానికి ముందుగా భువనేశ్వరి ఒప్పించింది. ఆ భూమిలో ఆమె రసాయనాలేవీ వినియోగించకుండా ప్రకృతి సిద్ధమైన ఆర్గానిక్ వ్యవసాయం ప్రారంభించింది.

అయితే.. అప్పట్లో భువనేశ్వరి చేస్తున్న సేంద్రీయ వ్యవసాయం అంటే పొలంలో పనిచేసే ఒక్క కూలీకి కూడా నమ్మకమే కుదరలేదు. అయితేనేం.. తనకు కిచెన్‌ గార్డెనింగ్‌లో ఉన్న అనుభవంతో ముందడుగు వేసిందామె. సరైన విధానాలతో సేంద్రీయ వ్యవసాయం చేస్తే ఫలితం ఉంటుందని పూర్తి నమ్మకంతో ముందుకు సాగిపోయింది. ఆ నమ్మకంతోనే ఇప్పుడామె తన కుటుంబం మొత్తాన్ని ఆర్గానిక్‌ వ్యవసాయం చేసేలా ప్రోత్సహించింది. పొలంలో ఆర్గానిక్‌ వ్యవసాయం ప్రయోగాన్ని 2013లో ప్రారంభించిన భువనేశ్వరి ఈ తొమ్మిదేళ్లలో ఆమె కుటుంబం మొత్తం రసాయన ప్రమాద రహితమైన ఆర్గానిక్‌ వ్యవసాయం పట్ల పూర్తి ఆసక్తి కలిగేలా చేసింది. వ్యవసాయంలో రసాయనాల వినియోగాన్ని విడిచిపెట్టడమే భువనేశ్వరి నిర్దేశించుకున్న గొప్ప లక్ష్యం. అయితే.. ఆ లక్ష్యాన్ని సాధించడం అంటే అంత ఈజీ అయితే కాదు.. అయినా భువనేశ్వరి మొక్కవోని ధైర్యంతో ముందడుగే వేసింది.

ఈ 54 ఏళ్ల భువనేశ్వరి తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లాలోని కల్యాణోడై గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టింది. ప్రకృతి ఒడిలోనే పెరిగింది. భువనేశ్వరి పుట్టిల్లు కావేరినది సమీపంలోనే ఉంటుంది. ప్రకృతి ఒడిలో స్వేచ్ఛగా పెరిగిన భువనేశ్వరికి వ్యవసాయం అంటే స్వతహాగానే ఇష్టం ఏర్పడింది. అయితే.. పెళ్లయిన తర్వాత తన ఇష్టాయిష్టాలను పక్కన పెట్టి కుటుంబ నిర్వహణలో కొంతకాలం తలమునకలైంది. పెళ్లయిన తర్వాత మదురై జిల్లా పుదుక్కోటై పరిధిలోని కరుప్పయూరని అనే కుగ్రామంలోని అత్తవారింటికి వెళ్లింది. అప్పటి నుంచి భువనేశ్వరి తమ ఇంటి పెరట్లో తొట్లలో మట్టి నింపి పూల మొక్కలు నాటింది. వాటికి ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజసిద్ధంగా ఎదిగేలా చూసింది. నాటిన ఆరు నెలల్లోనే ఆ మొక్కలు మందార, గులాబీలు, మల్లెపూలు విరివిగా పూశాయి. దీంతో రసాయనాలు విడిచిపెట్టి పూర్తి స్థాయిలో సేంద్రీయ వ్యవసాయ విధానంలో స్థానిక వరిధాన్యం పంట పండించాలనే బలమైన కోరిక భువనేశ్వరిలో కలిగింది. పెళ్లి చేసుకుని భువనేశ్వరి అత్తారింటికి వచ్చే సరికి వారు తమ పొలంలో హైబ్రీడ్‌ వరి పంట పండిస్తున్నారు. ఆ పంటకు నీటి వినియోగం ఎంతో ఎక్కువ. ఆ వరి పైరుకు క్రిమి కిటకాల బెడద కూడా అధికమే. దాంతో ఆ భూమిలో మరింత ఎక్కువగా కృత్రిమ రసాయనాలు, పురుగు మందుల్ని వాడాల్సి వచ్చేది. దాంతో పంట మొక్కల్లో పచ్చదనం తగ్గిపోయేది. మొక్కలు పాలిపోయినట్లు తెల్లబడిపోయేవి. వేసవికాలంలో, వర్షాలు పడి కరువు సమయంలో ఇలాంటి ఇబ్బందులను భువనేశ్వరి కుటుంబ వ్యవసాయంలో ఎదురయ్యేవి.

విష రసాయనాలకు అలవాటు పడిన అత్తింటివారి భూమి నిస్సారం అయిపోయింది. అకస్మాత్తుగా పంట దిగుబడులు తగ్గిపోయాయి. రసాయనాల ప్రభావం పంటలపై పడడంతో పంటలు పండే అవకాశం పోయింది.. లేదంటే పంటలే నాశనమైపోయాయి. ఇలాంటి తరుణంలో భువనేశ్వరి తన పుట్టింటి వ్యవసాయ నేపథ్యం, అలవాట్లు, కొన్ని ఏళ్లుగా వ్యవసాయంపై తాను సేకరించిన సమాచారం ఆసరాతో చీరకొంగు బిగించి కట్టింది. కుటుంబాన్ని ఏదోలా సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లించాలని వారికి నచ్చజెప్పింది. మొత్తం పొలంలో కాకపోయినా కనీసం ఒకటిన్నర ఎకరాల్లో అయినా తాను చెప్పే ఆర్గానిక్‌ వ్యవసాయం చేసేందుకు నచ్చజెప్పింది.

ఆర్గానిక్‌ వ్యవసాయం చేయడం మొదలుపెట్టిన భువనేశ్వరి ఆపై వెనక్కి తిరిగి చూడలేదు. పండ్లు, కూరగాయల పెంపకంలో తన చిన్పప్పటి నుంచి ఉన్న అనుభవాన్ని రంగరించి వ్యవసాయం చేయడం ప్రారంభించింది. మనకు మంచి జీవితాన్ని ఇచ్చేందుకు ప్రకృతి ఎన్నో వనరులను ప్రసాదించింది. ఆ వనరులను ఎలా వినియోగించుకోవాలో అనే దానిపై మనం కొద్దిగా దృష్టిపెడే చాలంటుంది భువనేశ్వరి. ప్రకృతితో తాను మమేకమై సేంద్రీయ వ్యవసాయం చేయడమే భువనేశ్వరి విజయ రహస్యం. ప్రకృతి సహజంగా కూరగాయలు, పప్పు ధాన్యాలు, పండ్లు పండించడంలో పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకునేందుకు కరూర్‌లో ఉన్న ‘వనగం నమ్మాళ్వార్‌ ఎకోలాజికల్‌ ఫౌండేషన్‌’ను భువనేశ్వరి సంప్రదించింది. ఫౌండేషన్‌ నుంచి మంచి అవగాహన సంపాదించిన భువనేశ్వరి తొలుత ఒకటిన్నర ఎకరాల్లో ఆర్గానిక్ వ్యవసాయం చేసింది. అందులో మంచి ఫలితాలు సాధించింది. ఆ తర్వాత ఆమె తమ కుటుంబానికి ఉన్న మొత్తం పొలాన్నే ఆర్గానిక్‌ వ్యవసాయంగా మార్చేసింది.

తమ వ్యవసాయ క్షేత్రాన్ని సారవంతం చేయడానికి, అధిక ఉత్పత్తి సాధించడానికి, పంటలపై క్రిమి కీటకాల బెడద లేకుండా చేసేందుకు భువనేశ్వరి అవలంబించిన విధానాలు ఇవీ.. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, మజ్జిగతో తయారు చేసిన మిశ్రమ ద్రావణాన్ని మొక్కలపై పిచికారి చేస్తుంది. ఈ ద్రావణాన్ని పలుమార్లు ప్రయోగాలు చేసిన తర్వాత భువనేశ్వరి రూపొందించింది. ఈ ద్రావణం చల్లడంతో కూరగాయలకు సహజసిద్ధంగా పచ్చరంగు వచ్చింది. ఈ ఫలితమే భువనేశ్వరిని ఆర్గానిక్‌ వ్యవసాయంలో మరిన్ని ప్రయోగాలు చేయడానికి పురిగొల్పింది. ఆవుపేడను బాగా కలిపి, ఒక రాత్రి అంతా నిల్వ ఉంచుతుంది. కలిపి ఉంచి నిల్వ చేసిన ఆవుపేడను పొలంలో చల్లుతుంది. పంటలపై క్రిమి కీటకాలు ఆశించకుండా చేసేందుకు ట్యాంకుల్లో నిల్వ ఉంచిన గోమూత్రాన్ని క్రమం తప్పకుండా చల్లుతుంది. నెయ్యి, గోమూత్రం, ఆవుపేడ, పెరుగు, పాల మిశ్రమానికి కొద్దిగా నీళ్లు కలిపి పంచగవ్య తయారుచేసి భువనేశ్వరి వాడుతుంది. పంచగవ్య ద్రావణాన్ని ఐదు రోజుల నిల్వ చేస్తే.. పైర్లపై ఈగలు, దోమల బెడదను కూడా నివారిస్తుంది. క్రిమి కీటకాలు గుడ్లు పెట్టకుండా నిరోధిస్తుంది. సింధువార, పాలకూర, బిల్వ, తులసి ఆకులు సహా మొత్తం 25 రకాల ఆకులు, ఆవు పేడను కలిపి ఆరు రోజులు కుళ్లబెట్టి, దానికి 10 నుంచి 15 లీటర్ల నీరు కలిపి, దాన్ని పైర్లపై చల్లుతుంది.

భువనేశ్వరి కిచిలి సాంబ, తులసి సీర్గా సాంబ, వడన్ సాంబ, సిగప్పు కవుని (ఎర్రబియ్యం), కరున్‌కురువై లాంటి స్థానిక వరి ధాన్యం పంటలు పండిస్తున్నది. హైబ్రీడ్‌ ధాన్యం పంట దిగుబడులను చూసిన తర్వాత భువనేశ్వరి స్థానిక వరి రకాలే పండించాలని నిర్ణయం తీసుకుంది. ముందుగా సహజసిద్ధంగా తాను రూపొందించిన ఆర్గానిక్ ఎరువులు వాడడంతో పాటు చెరకుపిప్పిని ఆచ్ఛాదనగా వాడుతుంది. భూమిలో పోయిన నైట్రోజన్‌ స్థాయిలు తిరిగి రప్పించడం కోసం భువనేశ్వరి వరితో పాటుగా చిక్కుడు పాదులు కూడా పెంచుతుంది. భువనేశ్వరి చేసిన ఈ ప్రయోగం మంచి ఫలితం ఇచ్చింది. వరి దిగుబడి కూడా అంతకు ముందు కన్నా బాగా పెరిగింది. భువనేశ్వరి తమ పొలంలో మినుములు, పెసర పైర్లతో పాటుగా టొమాటో, వంగ, పచ్చిమిర్చి మొక్కలతో పాటు పొట్లకాయ పాదులు కూడా అంతరపంటలుగా వేస్తుంది. టొమాటో- వంగ మొక్కల మధ్యన పోషకాలు అత్యధికంగా ఉండే పాలకూర పండిస్తుంది. ఇలా భువనేశ్వరి ఆర్గానిక్‌ విధానంలో చేస్తున్న సాగుతో ఆమె కుటుంబానికి ఆదాయం కూడా బాగా పెరిగింది. భువనేశ్వరి కుటుంబం ఆర్థిక పరిస్థితి కూడా అంతకు ముందుకన్నా మెరుగుపడింది.

తమ పొలంలో పండించిన పంటలను కొనుగోలు చేసే ముందు వినియోగదారులు, విద్యార్థులు, రైతులను తమ క్షేత్రానికి ఆహ్వానిస్తుంది. అంతకు ముందు వారు కొన్న పంటల కన్నా తమ పంటల్లోని ఎక్కువ నాణ్యత గురించి వారికి వివరిస్తుంది. వారికీ తమ పొలాన్ని తిప్పి చూపిస్తుంది. ఆర్గానిక్‌ విధానంలో తాను చేస్తున్న సాగు వివరాలు తెలియజేస్తుంది. వారందరికీ తమ పొలంలోనే సేంద్రీయ విధానంలో పండించిన ధాన్యాలతో కోళుకట్టై, కంజి, హల్వా, పనియారమ్‌, పులిహోర, లెమన్ రైస్‌లను రుచికరంగా వండి వడ్డిస్తుంది. ప్రకృతి వ్యవసాయం చేయాలనుకునే వారందరిరీ భువనేశ్వరి ఒకటే సలహా ఇస్తోంది. ఎంత పొలంలో సేంద్రీయ పంటల సాగు చేస్తున్నామని చూడొద్దంటోంది. హృదయాన్ని, మనసును కేంద్రీకరించి సాగుచేస్తే చక్కని దిగుబడులు సాధించవచ్చని భవిష్యత్తరాలకు అనుభవ పూర్వకంగా భువనేశ్వరి సలహా ఇస్తోంది. భువనేశ్వరి సాధించిన విజయాలను చూసిన చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఎందరో రైతులు సేంద్రీయ వ్యవసాయం చేసేందుకు ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here