హానికరమైన రసాయనాలు వినియోగించకుండా సహజసిద్ధంగా చేసే సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తామని, ప్రోత్సాహకాలు అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. పూర్తిగా సేంద్రీయ విధానంలో వ్యవసాయం చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ముఖ్యం అని ఆమె తెలిపారు. నిర్మలా సీతారామన్‌ 2022 ఫిబ్రవరి 1న లోక్‌ సభలో 2022- 23 వార్షిక బడ్జెట్‌ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. నేచురల్ ఫార్మింగ్‌ కు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు.

మొదటి దశలో భాగంగా గంగానది పరీవాహక ప్రాంతాల్లోని ఐదు కిలోమీటర్ల లోపు వ్యవసాయ భూములు ఉన్న రైతులతో పైలెట్ ప్రాజెక్టుగా సేంద్రీయ వ్యవసాయం చేపడతామన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా సేంద్రీయ వ్యవసాయానికి ఊతం ఇచ్చేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లోని సిలబస్‌ లో మార్పులు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అందుకు అనుగుణంగా పాఠ్యాంశాలు తీసుకురావాలని కేంద్ర మంత్రి వ్యవసాయ వర్శిటీల అధికారులను కోరారు.ఆధునిక వ్యవసాయానికి ప్రోత్సాహకాలు తగ్గించినప్పుడే సేంద్రీయ వ్యవసాయం ఆచరణలోకి వస్తుందనే ఆశాభావాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యక్తంచేశారు. ప్రస్తుత కరోనా కష్టకాలంలో రసాయనాలు వినియోగించి పండిస్తున్న ఆహార పదార్థాలు అస్సలు మంచివి కావన్నారామె. అందుకే ఈ కష్ట సమయంలో రసాయన రహిత నేచురల్‌ ఫార్మింగ్‌ ఎంతో అవసరం అన్నారు. ప్రకృతి సిద్ధమైన పర్యావరణ నుకూలమైన జీవాధారిత వ్యవసాయమే సేంద్రీయ వ్యవసాయం అని నిర్మల చెప్పారు. స్థానికంగా లభించే వనరులతోనే పంటలు పండించడానికి అన్నదాతలు మరింతగా ముందుకు రావాలని కేంద్ర మంత్రి నిర్మల పిలుపునిచ్చారు. హానికరమైన రసాయనాలు, పురుగుమందుల వాడకాన్ని పూర్తిగా వదిలిపెడితేనే భవిష్యత్‌ భారతం ఆరోగ్యవంతంగా ఉంటుందన్నారు. ప్రకృతికి అనుగుణంగా వ్యవసాయం చేయడానికి తమ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని, అండదండలు అందిస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు.2023 ను చిరుధాన్యాల సంవత్సరంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కృష్ణా- గోదావరి, కృష్ణా- పెన్నా, పెన్నా- కావేరి నదులను అనుసంధానం చేస్తామని కూడా నిర్మలా సీతారామన్‌ తెలిపారు. రైతు ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యేక ప్లాట్‌ ఫాం ఏర్పాటు చేస్తామని, వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంచేందుకు స్టార్టప్‌ లకు ఆర్థిక సాయం చేస్తామన్నారు. రైతులకు అద్దె ప్రాతిపదికన వ్యవసాయ పనిముట్లు ఇచ్చేందుకు ప్రత్యేక పథకం తీసుకొస్తామని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్‌ ప్రస్తావించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here