ఎంబీఏ చదివాడు. రాయ్‌పూర్‌లో ఓ సీడ్స్ సంస్థలో ఉద్యోగం చేశాడు. అతనిది వ్యవసాయ కుటుంబం కూడా కాదు. అయినా.. ఆర్గానిక్ విధానంలో థాయ్ రకం జామ పంటలు పండించి, లక్షలకు లక్షలు లాభాలు ఆర్జిస్తున్నాడు. ఒక్కో ఎకరానికి ఖర్చులు పోగా ఏడాదికి కనీసం 6 లక్షల రూపాయల లభం కళ్ల జూస్తున్నాడు. 2017 నుంచి ఆర్గానిక్ విధానంలో థాయ్ రకం జామ సాగు చేస్తూ మిలియనీర్ అయ్యాడు. ఈ సక్సెస్‌ఫుల్ ఆర్గానిక్ రైతు కథేంటో తెలుసుకుందాం.
రాజీవ్ భాస్కర్ ఉత్తరాఖండ్‌లోని జీబీ పంత్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి హార్టీ కల్చర్‌లో బీఎస్సీ చేశాడు. ఆ చదువే తనను ఏదో ఒక రోజు రైతుగా మారుస్తుందనే విషయం రాజీవ్‌కు అర్థమైంది. ఆ చదువు వల్లే 2013లో రాజీవ్‌కు రాయ్‌పూర్‌లోని వీఎన్‌ఆర్ సీడ్స్ సంస్థలో సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగం వచ్చింది. సీడ్స్ సంస్థలో ఉద్యోగం చేస్తూనే సింబయోసిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ నుంచి ఎంబీఏ కూడా పూర్తిచేశాడు. దాంతో ఉత్తర భారతదేశంలో వీఎన్‌ఆర్ సీడ్స్ సంస్థ తరఫున సేల్స్ ఆపరేషన్స్‌లో పనిచేశాడు. నాలుగేళ్ల పాటు ఆ సంస్థ విత్తనాలు, మొక్కల పెంపకం విక్రయంలో అనుభవం గడించాడు. ఆ రోజుల్లోనే రాజీవ్ భాస్కర్‌కు వ్యవసాయం అంటే ఆసక్తి కలిగింది. మరీ ముఖ్యంగా థాయ్ రకం జామ పంట సాగుపై చక్కని అవగాహన కల్పించుకున్నాడు. వీఎన్‌ఆర్ సీడ్స్ సంస్థ సేల్స్ రిప్రజెంటేటివ్‌గా రైతులకు థాయ్ రకం జామ పంట గురించి ప్రచారం చేయడంలో తన హార్టికల్చర్ విద్య అనుభవాన్ని వినియోగించాడు రాజీవ్ భాస్కర్.ఈ క్రమంలో రాజీవ్ భాస్కర్ 2017లో హర్యానాలోని పంచ్‌కూలలో 5 ఎకరాల పొలాన్ని లీజుకు తీసుకున్నాడు. ఆ పొలంలో 2015లోనే భూమి యజమాని థాయ్ జామ మొక్కలైతే నాటాడు కానీ.. వాటి పోషణ గురించి అంతగా పట్టించుకోలేదు. రాజీవ్ లీజుకు తీసుకునే సమయానికే ఆ జామ మొక్కలకు రెండేళ్ల వయస్సు వచ్చింది. సరైన పోషణ లేక ఎరువులు, పురుగుమందులు కొట్టాల్సిన అవసరం ఉండింది. అయితే.. రాజీవ్ మాత్రం ఆ జామ మొక్కలను రసాయనాలు లేని ఆర్గానిక్ విధానంలో సాగు చేయడం ప్రారంభించాడు. జామ పండ్లపైన ప్రత్యక్షంగా ప్రభావం చూపని, రసాయన అవశేషాలు ఉండని హైడ్రోజన్ పెరాక్సైడ్ మాత్రం కీటక నాశనిగా వాడాడు. దాంతో పాటు జామ పంట కోత కోయడానికి 15 నుంచి 20 రోజుల ముందే జామ మొక్కలపై ఎలాంటి స్ప్రేలు చల్లకుండా ఆపేసేవాడు. రాజీవ్ భాస్కర్ అలా ఆర్గానిక్ విధానంలో వ్యవసాయం చేయడంతో కొద్ది నెలల్లోనే జామ పూలు పూసి, చిన్న చిన్న పిందెలు వచ్చాయి. నిమ్మకాయ సైజుకు జామకాయ వచ్చిన తర్వాత వాటికి ఎలాంటి చీడ పీడలు సోకుకుండా సంచులు తొడిగేవాడు రాజీవ్ భాస్కర్.
జామ మొక్కలు నాటిన మూడో ఏట నుంచే కాయలు కాస్తాయి. ఒక్కో మొక్క నుంచి కనీసం 10 కిలోల పంట దిగుబడి వస్తుంది. నాలుగో ఏట నుంచి సరాసరిన 25 కిలోల దిగుబడి ఇస్తుంది. అలా మొక్కకు 15 వయస్సు వచ్చే వరకు ఏటా 25 కిలోల పంట చేతికి వస్తుందని రాజీవ్ చెప్పాడు. అలా జామ మొక్కల్ని, కాయల్ని జాగ్రత్తగా సాకడంతో 2018లో రాజీవ్‌కు రూ.20 లక్షల ఆదాయం వచ్చింది. పంట చేతికి వచ్చేవరకు రాజీవ్ పెట్టిన ఖర్చు మాత్రం రూ.6.50 లక్షలే. ఇక 2019లో మార్కెట్లు రేట్లు తగ్గినప్పటికీ రాజీవ్ చేతికి రూ.24 లక్షల ఆదాయం అందుకున్నాడు.
ఆర్గానిక్ విధానంలో థాయ్ జామ పంట ద్వారా మంచి లాభాలు వస్తుండడంతో మరో ఇద్దరు పెట్టుబడిదారులను కలుపుకుని 2019లో నూర్పూర్ బేడి, రోపార్, పంజాబ్‌లలో రాజీవ్ భాస్కస్ మరో 50 ఎకరాల పొలాన్ని లీజుకు తీసుకున్నాడు. రాజీవ్ లీజుకు తీసుకున్న భూమి సట్లెజ్ నదీ పరీవాహక ప్రాంతంలో ఉంది. అది మధ్యరకం ఇసుకతో సెమీ నిర్జల నేల అది. నీటి సమస్య కారణంగా ఆ ప్రాంత రైతులు టింబర్ వుడ్ మాత్రమే వేస్తారు. మొక్కల వరకు నీరు పారకుండా మధ్యలోనే ఇసుకలో ఇంకిపోతుంది. అలాంటి చోట ఉత్తరాఖండ్‌కు చెందిన వాడైనప్పటికీ పెద్ద పెద్ద కమతాలు లీజుకు దొరుతుండడతో పంజాబ్, హర్యానాల్లో రాజీవ్ ఆర్గానిక్ వ్యవసాయం చేస్తుండడం విశేషం. ఇలాంటి నేలపై జామ మొక్కలను రాజీవ్ భాస్కర్ శాస్త్రీయ పద్ధతిలో నాటాడు. నీటి వినియోగాన్ని, వృథాను తగ్గించేందుకు మొక్కలకు డ్రిప్ విధానంలో నీరు సరఫరా చేస్తున్నాడు. డ్రిప్ విధానంలో ప్రతి మొక్కకు నీరు అందేలా చేస్తున్నాడు. లీజుకు తీసుకున్న ఓ 25 ఎకరాల్లో రాజీవ్ భాస్కర్ వీఎన్‌ఆర్ బిహి రకం జామ మొక్కలు నాటాడు. మొక్కకు మొక్కకు మధ్య 10 అడుగుల దూరం, వరుసకు వరుసకు మధ్య 8 అడుగులు ఉండేలా ఆ మొక్కల్ని నాటాడు. భూమిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ఆ వరుసల మధ్య పుచ్చ, కర్బూజ, కాలీఫ్లవర్, ముల్లంగి పంటలు సాగుచేస్తున్నాడు.
థాయ్ రకం జామకాయ కోసిన 24 గంటలకు మంచి రంగు, రుచి వస్తుంది. అందుకే స్థానిక మార్కెట్లలో రాజీవ్ భాస్కర్ పండిస్తున్న జామ పండ్లు తక్కువగా లభిస్తాయి. ఢిల్లీ, ముంబై, సిలిగురి, లూధియానా, జలంధర్ లాంటి హోల్ సేల్ మార్కెట్లకు సరఫరా చేస్తున్నాడు. జామ పండ్లు పాడవకుండా, తాజాగా ఉంచేందుకు క్షేత్రంలోనే వాటికి చక్కని ప్యాకింగ్ చేస్తామని రాజీవ్ చెప్పాడు. జామ మొక్కలకు ఏడాదిలో మూడు సార్లు పూలు పూస్తాయి. అయితే.. పంట మాత్రం సంవత్సరంలో జులై, సెప్టెంబర్ నెలల్లోనే చేతికి వస్తుంది. ఇక అక్టోబర్ నుంచి జనవరి నెలల మధ్య ఇతర రకాల జామ పండ్లు కూడా మార్కెట్లో వస్తాయి కనుక ఆ నెల్లలో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందని, ధరలు కూడా తగ్గుతాయని రాజీవ్ భాస్కర్ వెల్లడించాడు. అందుకే ఆ సమయంలో జామ మొక్కల నుంచి కాయలు కోయకుండా విశ్రాంతి ఇస్తామని తెలిపాడు. ఒక ఎకరం పొలంలో సుమారు 540 జామ మొక్కలు నాటుకోవచ్చన్నాడు. 2021లో రాజీవ్ భాస్కర్ తమ క్షేత్రంలో పండిన థాయ్ జామ పండ్లకు రూ.86 లక్షల ఆదాయం సమకూరిందని వివరించాడు. కిలో థాయ్ జామ పండ్లను పండించేందుకు నీటి సరఫరా, లేబర్ ఖర్చు అన్నీ కలిపి రూ.40 ఖర్చవుతుందని తెలిపాడు. అయితే.. ఆ జామ పండ్లను కిలో రూ.100కి విక్రయిస్తే రూ.60 లాభం ఉంటుందని, ఒక వేళ మార్కెట్‌లో రేటు తగ్గి రూ.80కి అమ్మినా లాభమే ఉంటుందన్నాడు. అలా లాభాలు తగ్గినా ఎకరం జామ పంటతో ఏటా రూ.4 లక్షలు కనీస లాభం వస్తుందని రాజీవ్ భాస్కర్ వివరించాడు. ఔత్సాహికులెవరైనా థాయ్ జామ సాగు చేయాలనుకుంటే కనీసం 5 ఎకరాల్లో సాగు చేస్తే మంచి లాభాలు చూడొచ్చని అగ్రికల్చర్ కన్సల్టెన్సీని కూడా నడుపుతున్న రాజీవ్ భాస్కర్ సలహా ఇస్తున్నాడు. తొలిసారిగా ఎకరం భూమిలో జామ పంట పండించేందుకు సుమారు రూ.5.5 లక్షల ఖర్చు వస్తుందని, ఆ తరువాతి ఏడాది నుంచి రూ.4 లక్షలు అవుతుందని రాజీవ్ తెలిపాడు. డ్రిప్ పద్ధతిలో ఆర్గానిక్ జామ పంట ద్వారా రాజీవ్ భాస్కర్ ఆర్జిస్తున్న లాభాలను చూసిన ఆ ప్రాంత రైతులు కూడా ఆయననే అనుసరిస్తున్నారు. అంతకు ముందు నీటి లభ్యత సరిగా లేక పడావుగా పడి ఉండిన భూముల ధరలు ఇప్పుడు బాగా పెరిగాయి. ఇంకా పెరుగుతూనే ఉండడం విశేషం.