ధైర్యంగా ముందడుగేశాడు ఆ యువరైతు.. ఔషధ గుణాలు అధికంగా ఉండే అంజీర సాగుచేయడం ప్రారంభించాడు. అందులోనూ ఆర్గానిక్‌ సాగు పద్ధతిలో అంజీర పంటలు పండిస్తున్నాడు. ఆ ఊరిలో ఇతర రైతులు ఎవరికీ అందనంత ఆదాయం సంపాదిస్తున్నాడు. అతడే కరీంనగర్ జిల్లాకు చెందిన కట్ల శ్రీనివాస్‌. రామగుండం మండలంలోని తిర్మలాపూర్ శ్రీనివాస్‌ సొంతూరు. కట్ల శ్రీనివాస్‌ రైతు కుటుంబంలోనే పుట్టాడు. ఉత్నత విద్య ఎంబీఏ చేశాడు. మంచి పేరున్న ‘రెడ్‌ చిల్లీస్‌’ సంస్థలో వైట్‌ కాలర్ జాబ్ చేశాడు. జాబ్‌లో నెల నెలా మంచి జీతం అందుకుంటున్నా శ్రీనివాస్‌కు సంతృప్తి కలగలేదు. శ్రీనివాస్‌ను రైతుగా మారకుండా అంత చక్కని జీవితం కూడా ఆపలేకపోయింది. అతడు రైతు కుటుంబంలో పుట్టాడు కదా మరి.. అందుకే శ్రీనివాస్‌ను వ్యవసాయం ఆకర్షించింది. కుటుంబ సభ్యులతో చర్చించుకుని, మిత్రులతో మాట్లాడి రైతు అవతారం ఎత్తాడు.రైతు కుటుంబంలోనే పుట్టిన శ్రీనివాస్‌కు రైతుగా మారే సమయానికి సాగు విధానాలపై పూర్తి అవగాహన లేదు. చదువు, ఉద్యోగం ధ్యాసలో పడిన శ్రీనివాస్‌ వ్యవసాయంపై అంతగా మనసు పెట్టలేదు. వ్యవసాయం చేయాలనుకున్న తర్వాత శ్రీనివాస్‌ ఇక మరో ఆలోచనే చేయలేదు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్త డాక్టర్‌ ఆర్‌వీఎస్‌కే రెడ్డిని, కొత్తగూడెం వాసి మల్లేపల్లి రవిని, గద్వాల్‌కు చెందిన వినోద్‌ కుమార్‌, సారా ఆర్గనైజేషన్‌లో వ్యవసాయ నిపుణురాలు రోహిణీరెడ్డితో చర్చించాడు. ఆ వెనువెంటనే 2014లో ఆర్గానిక్‌ వ్యవసాయంలో శ్రీనివాస్‌ ప్రయోగాలు చేశాడు. మంచి దిగుబడులు సాధించాడు.ఇదే ధైర్యంతో మానవాళికి ఆరోగ్యం ప్రయోజనాలు చేకూర్చే పంటలు పండించే ప్రయోగం చేయాలని శ్రీనివాస్‌ నిర్ణయించాడు. తమ వ్యవసాయ క్షేత్రంలో 2016 నుంచి హైబ్రీడ్‌ కాకర (బోడ కాకర), చిక్కుడు, బీర, బెండ, ఆనపకాయ పంటలను ఆర్గానిక్‌ విధానంలో విజయవంతంగా పండించడం ప్రారంభించాడు. ఆర్గానిక్ హైబ్రీడ్ బీర సాగులో అధిక లాభాలు అందుకుంటున్న శ్రీనివాస్‌ను చూసి ఆకర్షితులైన తిర్మలాపూర్‌లోని ఇతర రైతులు కూడా శ్రీనివాస్‌ సలహాలతో, అతని అడుగుజాడల్లోనే ఆర్గానిక్‌ పంటల సాగు మొదలెట్టారు.ఆ తర్వాత శ్రీనివాస్‌ తన దృష్టిని అంజీర పండ్ల సాగు వైపు మళ్లించాడు. ఔషధ గుణాలు పుష్కలంగా ఉండే అంజీర పంట సాగును రసాయన ఎరువులకు బదులుగా ఆర్గానిక్‌ ఎరువులు వాడుతూ ప్రారంభించాడు. తెలంగాణలో మరే ఇతర రైతు సాగుచేయని అంజీరలో డయానా, పుణె, బళ్లారి రకాల పంటలు సాగు చేశాడు. అంతే కాకుండా.. మార్కెట్‌లో అత్యధికంగా డిమాండ్ ఉండే అరుదైన ‘బ్రౌన్ టర్కీ అంజీర‘ రకం పండ్ల సాగు కూడా చేశాడు. బ్రౌన్ టర్కీ రకం అంజీర పండ్లను మన దేశంలోని పుణె విశ్వవిద్యాలయం రూపొందించడం విశేషం. బ్రౌన్ టర్కీ అంజీర పండు ‘కింగ్ ఆఫ్‌ ఆయుర్వేదిక్‌ మెడిసిన్‌’గా ప్రసిద్ధి చెందింది. రక్త సంబంధమైన వ్యాధులను బ్రౌన్ టర్కీ అంజీర నివారిస్తుంది. మనుషుల్లో రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. ఇంకా అనేక ఔషధ గుణాలు బ్రౌన్‌ టర్కీ అంజీర పండులో ఉంటాయి.రాయచూర్‌కు చెందిన రైతు రామచంద్రరావు నుంచి 2019లో శ్రీనివాస్‌ 900 బ్రౌన్‌ టర్కీ రకం అంజీర మొక్కల్ని కొనుగోలు చేశాడు. ఆ మొక్కల్ని ఎకరం పొలంలో నాటాడు. మొక్కకు మొక్కకు మధ్య 8 అడుగుల దూరం ఉండేలా.. వరసకు వరసకు మధ్య దూరం 12 అడుగుల దూరంలో బ్రౌన్‌ టర్కీ అంజీర మొక్కలు నాటినట్లు శ్రీనివాస్ తెలిపాడు. ఆ మొక్కలకు డ్రిప్ ఇరిగేషన్‌ విధానంలో నీరు, ఆర్గానిక్‌ ఎరువులు అందించినట్లు వెల్లడించాడు. ఏడు లేదా ఎనిమిది నెలల్లో బ్రౌన్‌ టర్కీ అంజీర పంట చేతికి వస్తుందని శ్రీనివాస్‌ వివరించాడు.ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేలా ఇతర రైతులకు తాను ప్రేరణ కలిగించడం ఎంతో ఆనందం కలిగిస్తోందని శ్రీనివాస్‌ హర్షం వ్యక్తం చేస్తున్నాడు. ఔషధ గుణాలు చెడిపోకుండా అంజీర పౌడర్‌, అంజీర జామ్‌, సిరప్‌ కూడా తయారు చేయాలనే ఉద్దేశం తనకు ఉందని చెప్పాడు శ్రీనివాస్‌. ఆర్గానిక్‌ విధానంలో శ్రీనివాస్‌ చేస్తున్న అంజీర సాగు క్షేత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ పరిశీలించారు. ఆర్గానిక్‌ వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక విధానాలు అవలంబిస్తున్న శ్రీనివాస్‌ను ప్రశంసించారు. మంచి దిగుబడులు, అత్యధికంగా లాభాలు రావాలంటే రొటేషన్‌ క్రాప్‌ విధానాన్ని రైతులందరూ ఆచరించాలని వినోద్‌ కుమార్ పిలుపునిచ్చారు. కట్ల శ్రీనివాస్‌ చేస్తున్న ఆర్గానిక్‌ వ్యవసాయ విధానాలు, పొందుతున్న లాభాలు తెలుసుకుని, స్ఫూర్తి పొందాలని ఇతర రైతులకు వ్యవసాయాధికారి యాస్మిన్‌ విజ్ఞప్తి చేయడం విశేషం.

ఆర్గానిక్ పంటల విషయంలో కట్ల శ్రీనివాస్‌తో మాట్లాడాలనుకుంటే.. 9949194232లో సంప్రదించవచ్చు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here