రసాయనాలతో చేసే వ్యవసాయంతో నష్టాలు వస్తున్న నేపథ్యంలో సాగుబడిని వదిలేయాలని పలువురు రైతులు చూస్తున్నారు. ఈ తరుణంలో అనేక మంది యువకులు, విద్యావంతులు, సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్లు సహజ పంటల వైపు ఆకర్షితులవుతుండడం చెప్పుకోదగ్గ పరిణామం అని చెప్పాలి. సహజ పంటలు పండించేందుకు పలువురు యువకులు నెల నెలా లక్షల రూపాయలు ఆదాయం వస్తున్న పెద్ద పెద్ద ఉద్యోగాలను కూడా వదిలిపెట్టేస్తున్నారు. రసాయనాలతో చేసే పంటల సాగుతో ఆరోగ్యాలు, నేలతల్లి సారం నాశనమైపోతున్న నేపథ్యంలో ఇలా అనేక మంది యువకులు ఆర్గానిక్‌ రైతులుగా మారుతుండడం హర్షించదగ్గ విషయం. సహజ పంటలు పండించడం ద్వారా పలువురు ఆరోగ్యంతో పాటు, మంచి ఆదాయాన్ని కూడా కళ్ల జూస్తున్నారు. ఇలా సహజ సిద్ధంగా పంటలు పండించాలని, ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని మెరుగుపరుచుకోవాలని సాఫ్ట్‌ వేర్ ఉద్యోగాన్ని వదిలేసిన వారిలో దేవరపల్లి హరికృష్ణ ఒకరు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని మందలపల్లి దేవరపల్లి హరికృష్ణ సొంత ఊరు.

సహజ పంటల రైతుగా మారాలనే నిర్ణయంతో హరికృష్ణ సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగాన్ని వదిలేశాడు. అమెరికాలో చేస్తున్న సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్‌ ఉద్యోగంతో హరికృష్ణకు సంతృప్తి కలగలేదట. అందుకే ఆ జాబ్‌ వదిలేసి ఇప్పుడు తనకు ఇష్టమైన, తన మనసుకు నచ్చిన, అందరికీ ఆరోగ్యాన్నిచ్చే ఆర్గానిక్‌ ఫార్మింగ్‌లో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. సహజపంటలు పండిచండంలో విజేతగా నిలుస్తున్నాడు. సహజ పంటలు పండించడాన్ని తమ కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే అనేక మంది యువ గ్రాడ్యుయేట్‌ రైతులకు హరికృష్ణ ఆశాజ్యోతిగా మారాడు.హరికృష్ణ 2004లో గుంటూరులో బీటెక్‌ పూర్తిచేశాడు. ముందుగా హైదరాబాద్‌లో కొన్నేళ్లు, అమెరికాలో మరో నాలుగేళ్లు మొత్తం మీద 15 ఏళ్లు సాఫ్ట్‌ వేర్ ఉద్యోగం చేశాడు. ఎంత చేసినా ఆ ఉద్యోగంలో హరికృష్ణకు సంతృప్తి కలగలేదు. ఏదో అలసట, విసుగు వచ్చేదట. ఆ క్రమంలో ఆర్గానిక్‌ ఫార్మింగ్‌లో తనకు సంతృప్తి, ఆనందం ఉంటుందని హరికృష్ణకు అర్థమైందట. ఆర్గానిక్ ఫార్మింగ్‌ ఆలోచన రావడంతో హరికృష్ణ సహజ పంటల విధానంపై పరిశీలన, పరిశోధన చేశాడు. హరికృష్ణ ఆర్గానిక్‌ సాగువైపు రావడానికి కూడా బలమైన కారణం ఉంది. జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ పితామహుడు సుభాష్‌ పాలేకర్‌ నుంచి హరికృష్ణ ప్రేరణ పొందానంటాడు. ఆయన సహజ పంటల విధానం గురించి తెలుసుకున్న వెంటనే తన కళ్ల ముందు ఏదో వెలుగు వచ్చినట్లయిందని చెప్పాడు. రసాయనాలతో చేసే సాగు వల్ల 30 నుంచి 40 శాతం పంట దిగుబడులు తగ్గిపోతున్నాయని హరికృష్ణ తన పరిశీలనలో తెలుసుకున్నాడు. అయితే.. ఉద్యోగం వదిలిపెట్టి ఆర్గానిక్ వ్యవసాయం చేస్తానని తాను చెప్పగానే తమ బంధువులు, తమ గ్రామంలోని ఇతర రైతులు అలా చేయొద్దని తనను గట్టిగానే మందలించారన్నాడు. తన తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారన్నాడు. అయితే.. హరికృష్ణ వారిలో నమ్మకాన్ని, ధైర్యాన్ని నింపాడు. ఆర్గానిక్‌ పంటల రైతుగా తన కొత్త ప్రయాణం మొదలెట్టాడు.

హరికృష్ణ ముందుగా ఓ 12 ఎకరాల్లో ఆయిల్‌ పాం సాగుతో ఆర్గానిక్‌ రైతుగా మారాడు. అనంతరం మరో 10 ఎకరాల్లో కొబ్బరి పంట, కొబ్బరి ఉత్పత్తులు, 8 ఎకరాల్లో వరి, రెండు ఎకరాల్లో మిర్చి పంట వేశాడు. ఈ పంటల్లో మంచి పంట దిగుబడులు, ఫలితాలు వచ్చాయి. దీంతో మరో ఒకటిన్నర ఎకరాల్లో అరటి, పసుపు పంటలు పండించాడు. అరటి, పసుపు పంటలతో హరికృష్ణకు ఊహించని విధంగా లాభాలు వచ్చాయట. తాను పెంచుతున్న అరటి చెట్ల నుంచి ప్రతి వారం 35 అరటి గెలలు కోతకు వస్తున్నాయని చెప్పాడు హరికృష్ణ. ఒక్కో అరటి గెలను హైదరాబాద్‌లో రూ.600, స్థానిక మార్కెట్లలో అయితే.. రూ.480 ధర పలుకుతున్నట్లు తెలిపాడు. త్వరలోనే ప్రతి వారం తన అరటి చెట్ల నుంచి కనీసం 50 గెలలు కోతకు వచ్చేలా కృషిచేస్తున్నట్లు చెప్పాడు.హైదరాబాద్‌ లాంటి నగరాలు, ఇతర పట్టణాల్లో ఆర్గానిక్‌ పండ్లకు ఎంతో డిమాండ్‌ ఉందని హరికృష్ణ తెలిపాడు. ఆర్గానిక్‌ ఉత్పత్తులు, వాటి వల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి అంతగా అవగాహన లేకపోవడం, రసాయన పంట ఉత్పత్తుల కన్నా కాస్త ఎక్కువ ధర ఉడడంతో సహజంగా పండే పండ్లకు స్థానికంగా కాస్త డిమాండ్ తక్కువే ఉంటుందని చెప్పాడు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న వారు మరింత ఎక్కువగా ఆర్గానిక్‌ పంట ఉత్పత్తుల పట్ల మొగ్గు చూపితే ఇంకా ఎక్కువ మంది రైతులు ఆర్గానిక్ పంటల వైపు వస్తాయరని హరికృష్ణ అభిప్రాయపడ్డాడు. ఆ విధంగా ప్రజల్లోనే ఆరోగ్యం, ఆర్గానిక్‌ పంటల విషయంలో మార్పు రావాలంటాడు. సహజ పంటల విధానంలో హరికృష్ణ సక్సెస్ గురించి తెలుసుకుంటున్న అనేక మంది యువరైతులు ఆకర్షితులవుతున్నారు. హరికృష్ణ మార్గాన్ని అనుసరించేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తుండడం విశేషం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆర్గానిక్ పంటలను ప్రోత్సహిస్తుండడం, యువరైతులు ఉత్సాహం చూపించడం మంచి పరిణామం. త్వరలోనే మన సమాజం ఆర్గానిక్‌ పంట ఉత్పత్తులు వినియోగించి, ఆరోగ్యవంతంగా, ఆనందంగా మారుతుందనే విశ్వాసం పలువురిలో కలుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here