వరిపంట సాగును మనం ఎక్కడ చేస్తాం? ఇదేం పిచ్చి ప్రశ్న? పొలంలోనే కదా ఇంకెక్కడ చేస్తాం అని ఠక్కున మీరు సమాధానం చెప్పొచ్చు. పొలంలో వరి సాగు చేయడం మన తాతలు, ముత్తాతలు, వారి ముత్తాతల కాలం నుంచీ వస్తున్నదే. మారుతున్న కాలమాన పరిస్థితులను బట్టి మనం కూడా మారాలంటారు కదా! అలా మారి చూపిస్తున్నారు కేరళకు చెందిన కొందరు మహిళలు. టెర్రస్‌ మీద సాధారణంగా ఎలాంటి పంటలు పండిస్తారు? ఏవో కొన్ని మనకు కావలసిన ఆకుకూరలు, మరి కొన్ని కాయగూరలు, మరికొన్ని తీగజాతి కాయలు, ఇంకొన్ని పండ్ల జాతులు.. ఇంతే కదా! అయితే.. మన కేరళ మహిళలు టెర్రస్‌ మీదే తమ తమ విధానాల్లో సహజసిద్ధంగా వరిపంట సాగుచేస్తూ.. అందరి చేతా శెభాష్‌ అనిపించుకుంటున్నారు. అది కూడా సహజ పంటల విధానంలో వారు వరి ధాన్యం పండించడం మరింత సంతోషాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించక మానదు మరి. టెర్రస్‌ మీద కుండీల్లో, మట్టి సంచుల్లో, ఖాళీ వాటర్ బాటిళ్లలో వరిమొక్కలు నాటి, చక్కగా ధాన్యం పండిస్తున్నారు. కొన్నేళ్లుగా ఆ మహిళలు టెర్రస్ మీద ధాన్యం పండించే విధానాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

తిరువనంతపురం సమీపంలోని శ్రీకారయం గృహిణి అంబిక ఐదేళ్ల క్రితమే ఐదేళ్ల క్రితం తమ టెర్రస్‌ మీద ప్లాస్టిక్ కుండీల్లో ధాన్యం పండించింది. అంబిక చేసిన ప్రయోగం ఆ చుట్టుపక్కల అందరినీ ఆకర్షించింది. అంబిక తమ టెర్రస్ మీద 100 ప్లాస్టిక్‌ కుండీలు పెట్టి, వాటిలో బెల్లం, ఆవుపేడ, గోమూత్రం, ఆకుపచ్చ కసువు, కోడిగుడ్ల సొనలతో తాను తయారు చేసుకున్న ‘హృదయామృతం’ నింపింది. వరిమొక్కలను చీడ పీడలు ఆశించకుండా ఉండేందుకు వేపగింజల పొడిని వాడింది. ఆ తర్వాత ఒక్కో కుండీలో మూడు లేదా నాలుగు ‘ఉమ’ రకం వరిమొక్కలు నాటింది. అలా నాటిన వరిమొక్కలు 110 రోజులో చక్కని పంట ఇచ్చాయి. అప్పుడు అంబిక పొందిన ఆనందానికి అవధులు లేవంటే నమ్మండి. తమ మిద్దెపై వయ్యారంగా వంగి ఉన్న వరి కంకుల్ని చూసుకుని రోజూ మురిసిపోయేది. ఆ పంట కూడా ప్రతిరోజూ తాము తినే బియ్యంగా మారినప్పుడు అంబిక హృదయం మరింత సంతోషంతో నిండిపోయింది.ఆధునిక ఆలోచనతో కేరళకే చెందిన మరో మహిళ విజయవంతంగా చేసిన సాగు ప్రయోగం గురించి తెలుసుకుందాం. ఆ సక్సెస్‌ఫుల్‌ మహిళ కొట్టాయంకు చెందిన గృహిణి సెలెని. కోవిడ్‌ సమయంలో ఆమె ఖాళీ లీటర్‌ వాటర్ బాటిళ్లలో వరి పంట పండించింది. సెలెని ప్రయత్నానికి ఆమె భర్త శామ్‌ జోసఫ్‌ కూడా బాగా సహకారం అందించాడు. నీళ్లు తాగి, పడేసిన 175 ఖాళీ బాటిళ్లలో సెలెని వరి సాగుచేసింది. వాటర్‌ బాటిళ్లను సగానికి కోసి, వాటిని మట్టి, పేడతో నింపింది. వాటిలో వరి మొక్కలు నాటి, బాటిళ్లలో తేమ ఆరిపోకుండా జాగ్రత్త పడింది. సహజ సిద్ధంగా పంట పండించాలని ముందే డిసైడైన సెలెని ఎలాంటి రసాయనాలు వాడలేదు. అలా తమ మిద్దెపైన ఆమె నాలుగు కిలోల ధాన్యం పండించింది. సెలెని పండించిన ధాన్యం పంట తక్కువే కావచ్చు కానీ.. ఆమె ప్రయోగాన్ని చూసి ఆశ్చర్యపోవడం స్థానికుల వంతు అయింది. అలా కరోనా కష్టకాలంలో, ఇంటి నుంచి బయటికి వెళ్లలేని కర్ఫ్యూ సమయంలో సెలెనికి, ఆమె భర్తకు చక్కని కాలక్షేపం దొరికింది. స్వయంగా తామే పండించుకున్న ఆ నాలుగు కిలోల ధాన్యం నుంచి వచ్చిన బియ్యం వండుకు తిన్నప్పు వచ్చిన ఆ కిక్కే వేరుగా ఉందని సెలెని సంతోషంగా చెప్పింది.

మిద్దె మీదే బోలెడంత ధాన్యం పండించి, సెభాష్‌ అనిపించుకున్న మరో మహిళ సుగంధా దేవి. ఆమె ప్రతి ఏటా తమ టెర్రస్‌ మీద 40 కిలోల బియ్యం దిగుబడి వచ్చేలా ధాన్యం పండిస్తోంది. అలా పదేళ్లుగా ఈ 56 ఏళ్ల సుగంధాదేవి టెర్రస్‌ మీద వరిధాన్యం పంట పండిస్తోంది. అలా ఇప్పుడామె మిద్దె మీద ధాన్యం పండించడంలో నిష్ణాతురాలు అయింది. తమ మిద్దె మీదే కాకుండా ఇప్పుడామె తమ కుమార్తె ఇంటి మీద కూడా వరిసాగు చేస్తోంది. సుగంధా దేవి ఏడాదికి ఒకసారి మాత్రమే అది కూడా వర్షాకాలం మాత్రమే వరి పంట పండిస్తుంది. జూన్‌ నుంచి వరి సాగు ప్రారంభించి, సెప్టెంబర్‌ మధ్య వరకు సుగంధాదేవి వరి సాగు చేస్తుంది. నిజానికి కేరళలో వ్యవసాయాన్ని, టెర్రస్‌ తోటల ప్రోత్సాహానికి గ్రామ పంచాయతీల్లో ఎరువు, మట్టి సంచులు సబ్సిడీ మీద అమ్ముతుంటారు. అలా అమ్మే సంచులను ప్రతి సంవత్సరం సుగంధాదేవి కొని, వాటిలో వరిధాన్యం పండిస్తుంది. సుగంధాదేవి టెర్రస్‌పై వరి పండించే విధానం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం.టెర్రస్‌ మీద సుగంధాదేవి బల్లలు ఏర్పాటు చేస్తుంది. ఆ బల్లల మీద మట్టి సంచులు పెడుతుంది. వాటిలో మట్టి, కలప పొట్టు, పేడ సమపాళ్లలో కలిపిన మిశ్రమం నింపుతుంది. మట్టి సంచుల్లో వరి మొక్కలు నాటి ఎంతో జాగ్రత్తగా సాకుతుంది. సంచుల్లో తేమ ఆరిపోకుండా ఉండేందుకు రోజుకు రెండుసార్లు నీటిని స్ప్రే చేస్తుంది. మూడు నాలుగు రోజులకోసారి వేపనూనెను క్రిమిసంహారకంగా వాడుతుంది. అలా 120 రోజుల్లో 45 కిలోల వరి ధాన్యం పండిస్తోంది సుగంధాదేవి. సుగంధాదేవికి చిన్నప్పటి నుంచీ పంట పొలంలో పనిచేసిన అనుభవం ఉంది. ఆ అనుభవం వల్ల మిద్దెపై స్వయంగా ధాన్యం పండించుకుని తాము, తమ కుమార్తె కుటుంబం కల్తీ లేని అన్నం తింటున్నారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో కూడా సుగంధాదేవి, ఆమె కుమార్తె కుటుంబం ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి రసాయనాలు వాడకుండా.. సహజసిద్ధంగా పండించుకున్న పంట తినడం వల్లే అని సుగంధాదేవి చెబుతోంది. తాము తమ టెర్రస్‌పై పండించుకున్న బియ్యం ఎవరికీ విక్రయించబోమని ఆమె చెబుతోంది. కనీసం ఒక కిలో అయినా ఇవ్వాలని అడిగిన కొందరికి ఇస్తుంటామని సుగంధాదేవి గర్వంగా చెబుతోంది. సహజ పంటల విధానంలో టెర్రస్‌పైనే వరి ధాన్యం పండిస్తున్న సుగంధాదేవి కృషిని మెచ్చి, ఆమె గ్రామ పంచాయతీ ‘ఉత్తమ రైతు పురస్కారం’ అందజేసింది.

సహజ పంటల సాగు విధానంలో టెర్రస్‌లపై వరి ధాన్యం పండిస్తున్న ఈ ముగ్గురు మహిళలూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారనడంలో అతిశయం ఉండదు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here