రైతులందరి మాదిరిగానే తానూ రసాయన ఎరువులు వినియోగించే వ్యవసాయం చేశాడు సూర్యనారాయణ. రసాయనాల వాడకంతో పంట సాగు పెట్టుబడి ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. రసాయనాల ప్రభావంతో సూర్యనారాణకు ఉన్న రెండెకరాల వ్యవసాయ భూమిలోని సారం అంతకంతకూ క్షీణించిపోయింది. దాంతో పంట దిగుబడులు కూడా తగ్గిపోయాయి. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం హుసేనపురానికి చెందిన సూర్యనారాయణ సుమారు 14 ఏళ్లపాటు రసాయనాలు వాడుతూనే వ్యవసాయం చేశాడు. దీంతో పెట్టిన పెట్టుబడి తిరిగి రావడం దేవుడెరుగు.. బాగా నష్టాలు చవిచూశాడు. రసాయనాలు వాడి పంటలు పండించడం ఇక సాగదని, దిగుబడి లేని సాగు ఇంకెంతకాలం చేయాలని ప్రత్యామ్నాయాల గురించి సూర్యనారాయణ ఆలోచన మొదలుపెట్టాడు. రసాయన ఎరువులకు బదులు ఏమి వాడితే తన శ్రమ ఫలించి, తమ పొలంలో పంట బాగా పండుతుందో అనే దిశగా వెదుకులాట ప్రారంభించాడు. ఆ క్రమంలోనే ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్‌ జీరో బడ్జెట్‌ నేచురల్ ఫార్మింగ్‌ (జెడ్‌ బీఎన్‌ఎఫ్‌) విధానం గురించి సూర్యనారాయణ తెలుసుకున్నాడు.సుభాష్ పాలేకర్‌ ప్రకృతి వ్యవసాయ విధానంలోనే అప్పటి నుంచీ తన రెండెకరాలతో పాటు, మరో నాలుగు ఎకరాలు కూడా కౌలుకు తీసుకుని సూర్యనారాయణ వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. ఆ క్రమంలో సహజ ఎరువులు కూడా తానే స్వయంగా తయారు చేసుకుని పంటలకు వాడుతున్నాడు. పుట్టమట్టి, ఆవుపేడ, బెల్లం, సెనగపిండి, గోమూత్రాన్ని బాగా కలిపి సూర్యనారాయణ సహజ ఎరువులు తయారు చేసుకుంటున్నాడు. తాను తయారు చేసుకున్న ఎరువుల ద్వారా పైర్లకు సహజసిద్ధమైన పోషకాలు అందేలా చూసుకుంటున్నాడు. ఆ విధంగా ప్రజలకు ఎలాంటి హాని లేని, సహజసిద్ధంగా.. తాజాగా ఉండే, నాణ్యమైన ఆహార ఉత్పత్తులు అందిస్తున్నాడు. దాంతో పాటుగా భూమిని దున్నటానికి తక్కువ ఖర్చుతోనే ఓ ప్రత్యేకమైన పరికరాన్ని కూడా సూర్యనారాయణ తయారుచేసుకున్నాడు. సుమారు ఆరు సంవత్సరాలుగా సూర్యనారాయణ సేంద్రీయ పద్ధతిలో విజయవంతంగా సహజ పంటల సాగు చేస్తున్నాడు. జేబీఎన్‌ఎఫ్‌ సాగు పద్ధతి వల్ల అంతకు ముందు నష్టాలు చవిచూసిన తాను ఇప్పుడు లాభాలు ఆర్జిస్తున్నానని సూర్యనారాయణ చెప్పాడు.ఏమి పండిస్తున్నాం.. ఎంత ఎక్కువ పండిస్తున్నామని కాకుండా ఎంత ఆరోగ్యవంతమైన ఆహార పంటలు పండిస్తున్నామనే ప్రశ్న ప్రతి రైతూ వేసుకోవాలని ప్రకృతి వ్యవసాయంతో లాభాలు చవిచూస్తున్న సూర్యనారాయణ అంటున్నాడు. ప్రతి రైతూ ప్రకృతి వ్యవసాయం చేయాలని, అప్పుడే మన సమాజం ఆరోగ్యంగా జీవించగలుగుతుందని చెబుతున్నాడు. ప్రకృతి వ్యవసాయ విధానంలో ఖర్చు తక్కువ ఉంటుంది గానీ, పని ఎక్కువ ఉంటుందని వివరిస్తున్నాడు సూర్యనారాయణ. ప్రకృతి వ్యవసాయంతో భూసారం పెరుగుతుందని అనుభవ పూర్వకంగా సూర్యనారాయణ వివరిస్తున్నాడు. ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి, ఉల్లి ఇలా ఏ పంట వేసినా వారికి రాను రాను దిగుబడులు పెరుగుతున్నాయని అన్నాడు. ప్రకృతి సేద్యం వల్ల మంచి ఆరోగ్యాన్నిచ్చే పంటలు మనకు లభిస్తాయంటున్నాడు. మన ఆరోగ్యంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడాలనే మంచి ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయం చేయడానికి ప్రతి రైతు ఆనందంగా ముందుకు రావాలని సూర్యనారాయణ పిలుపునిస్తున్నాడు. పరిమితి లేకుండా రసాయన ఎరువులు వాడి, అధిక పంటలు పండించాలనుకుంటున్న ఈ రోజుల్లో.. సూర్యనారాయణ లాంటి ప్రకృతి వ్యవసాయం చేసేందుకు మరింత మంది రైతులు ముందుకు రావాలి. వారు పండించే సహజ పంటలతో ప్రజల ఆరోగ్యం, భవిష్యత్తు సంతోషం, ఆనందాలతో నిండిపోవాలని కోరుకుందాం. ప్రకృతి విధానంలో పంటలు పండిస్తున్న రైతు సూర్యనారాయణ మరింకా ఎందరో రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here