లక్ష్మీసుజాత పోస్ట్‌ గ్యాడ్యుయేషన్‌ చేశారు. యాభైవేల రూపాయలకు పైగానే జీతం సంపాదించేవారు. అయితే.. లక్ష్మీసుజాతకు ఇవేవీ తృప్తి ఇవ్వలేదు. తండ్రి ఇచ్చిన భూమి, ఆయన చూపిన బాటే తన భవిష్యత్తు బాట అనుకున్నారు లక్ష్మీసుజాత. కన్న తండ్రిలాగా వ్యవసాయంలో రాణించాలనే తపనతో తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేశారు. నలుగురికీ అన్నంపెట్టే నేలతల్లి వైపు ఆమె అడుగులు వేశారు. రాళ్లతో నిండి ఉన్న తమ పొలాన్ని ఆమె రతనాల భూమిగా మార్చారు. ఏడేళ్ల నుంచి సేంద్రియ పద్ధతిలో పంటలు సాగుచేస్తూ చక్కని ఫలితాలు సాధించారు. అందరి చేతా శభాష్‌ అనిపించుకున్నారు. నిరుపేద మహిళలకు ఉపాధి చూపిస్తూ ఆ కుటుంబాలకు లక్ష్మీ సుజాత బాసటగా నిలిచారు.

ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం తిమ్మసముద్రానికి చెందిన బడ్డుపాటి నాగభూషణానికి ముగ్గురు కుమార్తెలు. వారిలో లక్ష్యీసుజాత రెండోవారు. లక్ష్మీసుజాత చిన్నతనం నుంచీ తండ్రితో పాటు పొలంపనులు చేశారు. మట్టిని, నేలతల్లిని నమ్ముకున్న నాగభూషణం నిజానికి ఇంటిలో కంటే ఎక్కువగా వ్యవసాయ క్షేత్రంలోనే ఎక్కువగా ఉండేవారు. నేలతల్లే కన్నతల్లి అనే నాగభూషణం భావన. తుదిశ్వాస విడిచే వరకూ ఆయన వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. తాను వ్యవసాయదారుడిగా ఉన్నా కుమార్తెలను మాత్రం మంచి చదువులు చదివించారు. స్థిరపడిన కుటుంబాల్లోని వ్యక్తులకు ఇచ్చి తన కుమార్తెలకు ఆయన పెళ్లిళ్ళు చేసి పంపించారు. నాగభూషణం ఇద్దరు కుమార్తెలు తండ్రి వారసత్వంగా వ్యవసాయం చేయడం అలవర్చుకున్నారు. కానీ.. లక్ష్మీసుజాత మాత్రం పై చదువుల కోసం హైదరాబాద్‌ లో స్థిరపడ్డారు. పెళ్లి చేసుకున్న తర్వాత హైదరాబాద్‌ లోనే ఓ పాఠశాలలో ప్రిన్సిపాల్‌ గా పనిచేశారు. ఎంతోమంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పారు. ప్రిన్సిపాల్‌ గా ఆమె మంచి జీతం పొందారు.

కానీ.. లక్ష్మీసుజాత మనసులో ఏదో వెలితిగా ఉండేదట. పొలంలో తండ్రి నాగభూషణం చేసిన కష్టాన్ని చూస్తూ పెరిగిన తనకి వ్యవసాయం చేయాలని ఉన్నా.. పరిస్థితులు అనుకూలిస్తాయా? అనే అనుమానం ఆమెలో ఉండేదట. ఏడేళ్ల క్రితం లక్ష్మీసుజాత తండ్రి నాగభూషణం అనారోగ్యానికి గురయ్యారు. ఆయనను చూసుకునేందుకు వచ్చిన లక్ష్మీసుజాతకి సొంతూరులోనే ఉండిపోవాలనిపించిందట. తండ్రి నాగభూషణం చూపిన వ్యవసాయ మార్గంలోనే నడవాలనుకున్నారట. లక్ష్మీసుజాత నిర్ణయాన్ని ఆమె భర్త గిరిధర్‌ కుమార్‌ రామరాజు కూడా అర్థం చేసుకున్నారు. ఆమె నిర్ణయాన్ని గౌరవించారు. లక్ష్మీసుజాతకు సహకరించారు. ఇక అంతే.. ఉద్యోగాన్ని వదిలిపెట్టి లక్ష్మీసుజాత తిరిగి సొంతూరికి చేరుకున్నారు.

చీమకుర్తి మండలం ఇలపావులూరు, గాడిపర్తివారిపాలెం, శివరాంపురం గ్రామాలకు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ ప్రాంతంలో 25 ఎకరాలలను లక్ష్మీసుజాత కొనుగోలు చేశారు. చుట్టూ కొండలు, మట్టి కన్నా ఆ ప్రాంతంలో రాళ్లే ఎక్కువ. ఆ భూమి ఎందుకూ పనికిరాదని, నష్టం వస్తుందని చుట్టుపక్కల రైతులు, బంధువులు లక్ష్మీసుజాతకు సలహా ఇచ్చారట. అయితే.. తండ్రి ఇచ్చిన ధైర్యం, తోబుట్టువుల చేయూత లక్ష్మీసుజాతకి బాధ కలగనివ్వలేదు. వ్యవసాయ అధికారుల సూచన మేరకు తాము కొన్న భూమిలో పండ్లతోట సాగుచేస్తే బాగుంటుందని భావించారు. భూమిని మెత్తగా దున్ని, మంచి మట్టిని తోలారు. మహారాష్ట్ర నుంచి భగవాన్‌ రకం దానిమ్మ మొక్కలు తెచ్చి ఐదెకరాల్లో నాటారు. అంతర పంటగా లోక్నో 49 రకం జామమొక్కలు వేశారు. వీటితో పాటు మరో ఐదెకరాల్లో బత్తాయి, నిమ్మ పంటల సాగు కూడా చేపట్టారు. నీటి నిల్వ కోసం రెండెకరాల్లో పొలంలోనే రెండు పెద్ద పెద్ద కుంటలు తవ్వారు. బిందు సేద్యం విధానంలో సేంద్రీయ పద్ధతుల్లో సాగు చేశారు. దీంతో జామ, దానిమ్మ పంటలు బాగా వచ్చాయి. ఆ పంటలకు మంచి ధర పలికింది. చక్ని లాభాన్ని కూడా లక్ష్మీసుజాత కళ్లజూశారు. ఆ మరుసటి ఏడాది ఆమె బొప్పాయి, దొండ, సొరకాయ పంటలు సాగు చేశారు.

సేంద్రీయ ఎరువుల తయారీ:

రసాయన ఎరువులు, పురుగుమందులతో పండించిన పంటలతో కలిగే అనర్థాలపై లక్ష్మీసుజాతకి పూర్తి అవగాహన ఉంది. ఎక్కువ లాభం కన్నా ఆరోగ్యం ముఖ్యమని తండ్రి నాగభూషణం చెప్పిన మాటలను ఆమె మర్చిపోలేదు. సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేశారు. లక్ష్మీసుజాత వేప, ఆముదపు పిండి, ఆవు పేడ, గోమూత్రం ఉపయోగించి ఎరువులు తయారు చేయిస్తున్నారు. పిచికారీ కోసం వేప కషాయం, మజ్జిగ, శనగపిండి, నల్లబెల్లం ఉపయోగించి మొక్కలకు తెగుళ్లు రాకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. విప్ప పువ్వు నూనె, వేపనూనె కలిపి చీడపీడలు రాకుండా మొక్కలకు ఎరువుగా వేస్తున్నారు. పొలంలోనే సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటుచేసి మోటార్‌ ద్వారా మొక్కలకు నీళ్లు సక్రమంగా అందేలా చేస్తున్నారు.

మహిళా కూలీలకు నిత్యం ఉపాధి:

లక్ష్మీసుజాత ఒక్కరే పొలం పనులన్నీ చూసుకోవడం కష్టం కావడంతో చెల్లెలు విజయలక్ష్మిని భాగస్వామిగా చేసుకున్నారు. అక్కచెల్లెళ్లిద్దరూ రేయింబవళ్లూ కష్టపడ్డారు. ప్రతిరోజూ పొలం పనుల కోసం 30 మంది మహిళా కూలీలను పెట్టుకున్నారు. లక్ష్మీసుజాత పొలంలో సేంద్రీయ ఎరువుల తయారీ, కలుపు తీయడం, మందులు పిచికారీ చేయడం, కాయలు కోయడం లాంటి పనులన్నీ మహిళలే చేయడం విశేషం. మహిళా కూలీలకు ప్రతిరోజూ ఉపాధి కల్పిస్తూ, వారి కుటుంబ సమస్యలు తెలుసుకుంటూ.. వారికి అండగా నిలుస్తున్నారు. తమ అందరి కష్టమూ ఫలించి తొలి ఏడాది 20 టన్నుల దిగుబడి వచ్చిందని లక్ష్మీసుజాత సంతోషంగా చెబుతారు. ఇప్పుడు 120 టన్నుల దిగుబడి వచ్చేలా కృషిచేస్తున్నారట. ఈ సంవత్సరం కోటిన్నర వ్యాపారం జరుగుతుందంటూ లక్ష్మీసుజాత ఆనందం వ్యక్తం చేశారు. తమ పొలంలో సహజసిద్ధ విధానంలో పండించే పంటలను చెన్నై, హైదరాబాద్‌, ముంబై ప్రాంతాలకు సరఫరా చేస్తున్నామన్నారు లక్ష్మీసుజాత. చుట్టుపక్కల పండ్ల వ్యాపారులు కూడా లక్ష్మీసుజాత వ్యవసాయ క్షేత్రం వద్దకే వచ్చి కూరగాయలు, పండ్లు కొనుగోలు చేస్తున్నారట.

పేద రైతుల కోసం సొసైటీ:

లక్ష్మీసుజాతకి వ్యవసాయం చేయడం ఒక ఎత్తయితే పండిన పంటను మార్కెటింగ్‌ చేయడం తొలిరోజుల్లో చాలా కష్టంగా ఉండేదట. పంటను అమ్ముకునే క్రమంలో నష్టంతో పాటు సవాళ్లను కూడా ఆమె ఎదుర్కొన్నారట. తన పరిస్థితే ఇలా ఉంటే పేద రైతుల పరిస్థితి ఇంకెలా ఉంటుందో అని ఆమె ఊహించారు. చుట్టుపక్కల గ్రామాల్లోని చిన్న, సన్నకారు రైతులను కలిశారు. వారి కష్టాలు, కన్నీళ్లు విని చలించిపోయారు. వారి కోసం ‘ప్యాసెంట్‌ సొసైటీ’ని ఏర్పాటుచేశారు. ఆ సొసైటీ సభ్యులకు ఏ కాలంలో ఏ పంటలు వేయాలి? ఎలా సాగుచేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు, ఎరువుల తయారీపై లక్ష్మీసుజాత సూచనలు చేస్తున్నారు. వారి దగ్గర నుంచి కూరగాయలు, పండ్లు కొనుగోలు చేస్తూ.. రైతుల అభివృద్ధికి సహకరిస్తున్నారు.

లక్ష్మీసుజాతకు తండ్రే స్ఫూర్తి:

‘నాన్న నాగభూషనం నాలుగేళ్ల క్రితం మరణించారు. వ్యవసాయ రంగంలో ఆయనే నాకు స్ఫూర్తి. ఆయన కష్టం నాకు బాగా తెలుసు. అందుకే పేద రైతులకు సహాయపడుతున్నాను. వారు నష్టపోకుండా పంటని కొనుగోలు చేసి మార్కెటింగ్‌ చేస్తున్నాను. ‘ప్యాసెంట్‌ ఆగ్రో’ సంస్థను ప్రారంభించి ఇతర రైతులకు దానిమ్మ సాగులో మెళకువలు అందిస్తున్నాం. త్వరలో కావ్య ఆగ్రో పేరుతో దానిమ్మ, స్నాక్‌ ప్యాక్‌, జ్యూస్‌, జామ్‌ లాంటి ఉత్పత్తులు తీసుకువచ్చేలా ప్రయత్నం చేస్తాం’ అని లక్ష్మీసుజాత చెబుతున్నారు.

Subbarao Kunapareddy.. Prakruti farms సౌజన్యంతో..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here