‘మట్టిని మనం రక్షిస్తే.. ఆ మట్టే మనల్ని, మన జీవితాలను రక్షిస్తుంది’ అని చెబుతున్నారు సీడబ్ల్యుఎఫ్‌ కృషి జ్యోతి నిర్వాహకురాలు, నేచురల్ ఫార్మర్‌ సుజాత గుళ్ళపల్లి. ప్రకృతి వ్యవసాయ పితామహుడు పద్మశ్రీ సుభాష్ పాలేకర్‌ చెప్పిన జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ (ZBNF) సుజాత గుళ్ళపల్లి 2014 నుంచి అనుసరిస్తున్నారు. వివిధ విధానాల్లో అనేక మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అనుసరించడం.. అందులోనే తన గురువు సుభాష్‌ పాలేకర్‌ విధానాలను తు.చ. తప్పకుండా అనుసరంచడం తనకెంతో తృప్తిని, ఆనందాన్ని ఇస్తుందంటారామె. అలా ప్రకృతి వ్యవసాయం చేయడమే తనకుచాలా సౌకర్యవంతంగా ఉందని ఆమె చెబుతున్నారు. జీరో బడ్జెట్‌ నేచురల్ ఫార్మింగ్‌ విధానంలో కాకుండా ఇతర పద్ధతుల్లో చేసే వ్యవసాయం కంటే మనం తక్కువ నీటితోనే పంటలు పండించవచ్చనే సూత్రం తనకు బాగా నచ్చిందని సుజాత గుళ్ళపల్లి అంటారు.ప్రకృతి వ్యవసాయ విధానం సుజాత గుళ్ళపల్లి ముందుగా ప్రతి 4 ఎకరాలకు పొలం గట్లు ఏర్పాటు చేస్తారు. ఆ గట్ల మీద సీజనల్ మొక్కలు నాటుతారట. ప్రతి సీజన్‌ లో గట్ల మీద పెంచే మొక్కల్ని మార్చేస్తారట. ఖరీఫ్‌ సీజన్‌ లో గట్లపైన సీసా పొట్లకాయ, పొట్లకాయ పాదులను పెంచుతామని చెబుతారు. ఇక రబీ సీజన్‌ లో అయితే.. గుమ్మడి పాదులు, బంతిమొక్కలు లాంటి వాటిని పెంచుతారట. ఆ తరువాత పొలంలో 1.5’X1.5’X1.5 లోతు, వెడల్పులతో కందకాలను 20 మీటర్ల పొడవున తవ్వుతామని సుజాత తెలిపారు. అలా తవ్విన కందకాలను పంట కోసిన తర్వా వచ్చే వ్యర్థాలతో పూర్తిగా నింపుతారట. ఆ వ్యర్థాలే క్రమంగా సహజసిద్ధంగా కంపోస్ట్‌ ఎరువుగా మారతాయని ఆమె వెల్లడించారు. కంపోస్ట్ జీవామృతంగా, కషాయంగా మారిన తర్వాత అందులో వంటి ఇంటిలో వచ్చే మొత్తం వ్యర్థపదార్థాలను కూడా కందకాల్లో వేస్తారట. ఇక మూడు ప్రయత్నంగా ఎండ వేడిమి నుంచి రేడియేషన్‌ నుంచి కాపాడేందుకు, గాలి ఎక్కువగా తగలకుండా ఉండేందుకు, వర్షం ఎక్కువగా కురిసినప్పుడు పొలం గట్లు, కందకాలకు ఆచ్ఛాదనగా కలుపుమొక్కల్ని పెంచుతామని తెలిపారు. దాంతో పాటుగా పొలాన్ని ఉత్తరం నుంచి దక్షిణం వైపు ఏటవాలుగా భూమిని తయారు చేస్తామని చెప్పారు. ఇలాంటి విధానాల కారణంగా మట్టి రూపం మారుతుంది. నీటిని నిల్వ చేసుకోగలుగుతుంది. తద్వారా పంటకు నీటి వినియోగం బాగా తగ్గిపోతుందని సుజాత గుళ్ళపల్లి వివరించారు. దాంతో పాటుగా భూమిలో మెత్తదనం వచ్చేందుకు ఉపయోగపడే వానపాములు కూడా భూమిలో మరింత ఎక్కువగా తయారవుతాయని చెప్పారు.ఉమ్మెత్త, కానుగ, వేప, ఆముదం, మారేడు, జిల్లేడు, ఎర్ర జిల్లేడు, కలబంద, తులసి ఆకులు, గోమూత్రం కలిపి ఉడికించి చేసిన కషాయాన్ని పంటలపై చల్లితే పంటలపై క్రిమి కీటకాలు రాకుండా నివారించుకోవచ్చని ప్రకృతి వ్యవసాయం చేసే ఔత్సాహాక రైతులకు సుజాత గుళ్ళపల్లి సూచించారు. అయితే.. తమారు చేసుకున్న కషాయం 24 గంటల పాటు అలాగే ఉంచాలని, ఆ తర్వాతే పంటలపై చల్లితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. పైన చెప్పిన అన్ని ఆకుల్ని ఒకేసారి వాడనక్కర్లేదట. వాటిలో కొన్నింటిని ఒకసారి, మరికొన్నింటిన మరోసారి కలిపి గోమూత్రంతో కలిపి ఉడకబెట్టి రకరకాల కాంబినేషన్లలో కషాయాలను తయారు చేసి వాడినా క్రిమి కీటకాలు బాగానే నివారణ అవుతాయని చెప్పారు. శీతాకాలం ప్రారంభంలో అయితే.. కట్టెలు, ఆవు పేడ కాల్చగా వచ్చిన బూడిదను పంటలపై వేసినా క్రిమి కీటకాలను బాగా నివారిస్తుందనే కిటుకు కూడా సోదర ప్రకృతి రైతులకు సుజాత సూచిస్తున్నారు. దాంతో పాటుగా గ్రీన్‌ మెన్యూర్‌ అంటే పచ్చిరొట్ట కూడా నేలను బలవర్ధకంగా చేస్తుందని ఆమె చెప్పారు. అంటే మట్టిని మనం జాగ్రత్తగా చూసుకుంటే.. ఆ మట్టే మనల్ని రక్షిస్తుందనేది సుజాత గుళ్ళపల్లి చెప్పేమాట.ప్రకృతి వ్యవసాయం అంటే.. అన్ని పనులూ మనుషులే చేయాలి, అన్నీ పూర్వ కాలపు సాంప్రదాయంలోనే చేయాలని మడికట్టుకుని కూర్చోనక్కర్లేదనేది సుజాత గుళ్ళపల్లి అభిప్రాయం. పొలంలో పని చేసేందుకు మనుషుల కొరత ఉన్న కాలంలో ట్రాక్టర్‌ లాంటి యంత్రాలను కూడా వినియోగించడంలో తప్పులేదనేది ఆమె చెప్పే మాట.ఘన జీవామృతం తయారు చేసే విధానం గురించి కూడా సుజాత గుళ్ళపల్లి వివరించారు. 100 కిలో ఆవుపేడ, 2 కిలోల బెల్లం, 2 కిలోల పప్పుల పొడి, 10 లీటర్ల గోమూత్రాన్ని బాగా కలిపి, గోనెసంచులతో కప్పి 10 రోజుల పాటు నీడలోనే ఉంచితే ఘన జీవామృతం తయారవుతుందని సుజాత చెప్పారు. అలా తయారైన ఘన జీవామృతానికి మరో 100 కిలోల ఆవు పేడ కలిపితే ఒక ఎకరం పంటకు మంచి ఎరువుగా సరిపోతుందని వెల్లడించారు.ప్రకృతి వ్యవసాయ విధానంలో సారవంతంగా తయారు చేసుకున్న భూమిలో పండించిన పంటల్ని వాడుకునే వినియోగదారులకు ఆరోగ్యం, రైతన్నలకు తక్కువ ఖర్చుతోనే అధిక ఆదాయం లభిస్తాయని సుజాత గుళ్ళపల్లి చెబుతున్నారు. తాను చెప్పిన విధానం అవలంబిస్తే నేల మెత్తగా, ఆరోగ్యంగా, సారవంతంగా మారుతుందని, అలాంటి భూమిలో చిరుధాన్యాలు, గింజ ధాన్యాలు, కూరగాయలను నిరంతరం అత్యధిక మొత్తం పంట దిగుబడులు సాధించవచ్చని సుజాత గుళ్ళపల్లి అంటారు. ప్రకృతి వ్యవసాయ ప్రేమిక రైతన్నలూ సుభాష్ పాలేకర్‌ మార్గంలో సుజాత గొల్లపల్లి చెప్పిన విధానంలో మనం కూడా ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ఎక్కువగా చేద్దామా!.. మన సమాజ మేలు కోసం, భవిష్యత్తరాల ఆరోగ్యం కోసం ముందడుగు వేద్దామా..?!

ఏవైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటే.. Mrs. SUJATHA ను 9444055548లో సంప్రదించవచ్చు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here