అది బంజరునేల.. అంతకు ముందెప్పుడూ ఆ నేలలో పంటలు పండించింది లేదు. అలాంటి నేలలో సహజసిద్ధ విధానంలో ఓ సాఫ్ట్‌ వేర్ ఉద్యోగి బంగారు ఫలాలు పండిస్తున్నాడు. వ్యవసాయం అంటే ఓనమాలు కూడా తెలియని అతను ఎలాంటి రసాయనాలు వాడకుండా ఆర్గానిక్‌ విధానంలో యాపిల్‌, కివీ పంటలు సమృద్ధిగా పండిస్తున్నాడు.. ఆపైన ఏటా 40 లక్షల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నాడు. ఎలాంటి పూర్వపు అనుభవం లేకుండానే బంజరు భూమిలో వ్యవసాయం చేస్తున్న ఆ కృషీవలుడి విజయగాధను తెలుసుకుందాం.

మన్‌ దీప్‌ వర్మ 2010లో ఎంబీఏ పూర్తిచేశారు. ఆ తర్వాత మార్కెటింగ్‌ బిజినెస్ సంస్థలో జాబ్‌ లో చేరారు. తన జాబ్‌ లో భాగంగా మన్‌ దీప్ వర్మ పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులతో నిత్యం కలుసుకునేవారు. నాలుగున్నరేళ్ల పాటు ఐటీ మార్కెటింగ్‌ ఉద్యోగం చేసిన మన్‌ దీప్ వర్మకు సరికొత్త అనుభవాన్నిచ్చింది. ఉద్యోగంలో, తన కెరీర్‌ లో మన్‌ దీప్ ఏనాడు ఇబ్బంది పడలేదు. ఐటీ సెక్టార్‌ మార్కెటింగ్‌ జాబ్‌ లో చక్కని అనుభవం, ధైర్యం వచ్చిన తర్వాత ఉద్యోగాన్ని వదిలేశారు. కొత్త కెరీర్‌ ను ఎలా ప్రారంభించాలనే దానిపై మన్‌ దీప్‌ ఎన్నెన్నో రకాల ఆలోచనలు చేశారు. ఆ కొత్త కెరీర్‌ కూడా తనకు అంతకు ముందు అసలేమీ తెలియని సరికొత్తది, తనకే సొంతమైనది, తాను గడించిన విద్యా నైపుణ్యాలతో విభిన్నమైన మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నారు.తాను సరికొత్త కెరీర్‌ ను ఎంచుకోవాలనుకున్న ఆలోచనను తన భార్యతో పంచుకున్నారు. ఆమె కూడా మన్‌ దీప్ వర్మ ఆలోచనను సమర్థించడమే కాకుండా మద్దతుగా నిలిచారు. కొత్త కెరీర్‌ కార్యాచరణపై మన్‌దీప్ కసరత్తు చేశారు. మన్‌దీప్‌ వర్మ దంపతులకు నాలుగు ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో వ్యవసాయం చేయాలని నిర్ణయించారు. మార్కెటింగ్‌ అనుభవం తప్ప ఎలాంటి వ్యవసాయ అనుభవం లేకపోయినా తమ పొలంలో రసాయనాలు వాడని పూర్తి సేంద్రీయ వ్యవసాయం చేయాలని డిసైడ్‌ అయ్యారు. ఆ నిర్ణయం తీసుకునేటప్పటికి మన్‌దీప్‌కు కూరగాయలు ఎలా పండించాలో తెలియదు. ఇతర ఏ పంటలు పండించాలో కూడా ఏమాత్రం అవగాహన లేదు. దాంతో పాటుగా అప్పటి వరకు ఆ భూమిలో ఎలాంటి పంటలు పండించలేదు. అయినప్పటికీ ఆ నేలలోనే ఆర్గానిక్ పంటలు పండించేందుకు రెడీ అయ్యారు మన్‌ దీప్ వర్మ. హిమాలయ పర్వత సానువుల సమీపంలోని షిల్లీ గ్రామంలో ఉన్న ఆ భూమిలో సహజ పంటలు పండించేందుకు సిద్ధమయ్యారు. మన్‌దీప్ వర్మ ముందుగా ఆర్గానిక్ వ్యవసాయ విధానాలపై ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వందలాది వీడియోలు చూసి అవగాహన పెంచుకున్నారు. దాంతో పాటుగా స్థానిక రైతులను కూడా అడిగి సమాచారం తెలుసుకున్నారు.

ఆ భూమి ఎన్నో ఏళ్లుగా ఎలాంటి పంటలు వేయలేదు. మనుషులెవ్వరూ తిరగని ప్రాంతంలో ఉంది. భూమి నిండా గడ్డి, కలుపు మొక్కలు, ఎలాంటి ఉపయోగమూ లేని ఇతర కంపచెట్లతో నిండిపోయి ఉంది. అయితే.. హిమాలయ పర్వతసానువుల్లో ఉన్న ఆ నేల సారవంతమైనదనే నమ్మకం మన్‌దీప్ వర్మకు ఉంది. ఆ నేలలో పశువుల విసర్జించిన కుళ్లిన వ్యర్థాలు ఉండడంతో పంట పండించడానికి అనువుగా ఉంటుందని భావించారు.
తమ పొలాన్ని సాగుకు సానుకూలం చేయడానికి మన్‌దీప్ వర్మ ఐదు నెలలు కష్టపడ్డారు. అయితే.. మన్‌దీప్ వర్మ సమీప ప్రాంతాల్లో పంటల్ని పాడుచేసే కోతుల సమూహం బాగా ఎక్కువగా ఉండేది. అలాంటి సందర్భంగా ఓ వ్యవసాయశాస్త్ర అధ్యాపకుడి సలహాతో తమ పొలంలో కివీ పంట వేయాలని నిర్ణయించుకున్నారు. మన్‌దీప్ వర్మ పొలంలో ముందుగా పండిన కివీ పండ్లు పుల్లగా ఉండేవట. దాంతో పాటు కివీ కాయలపై ముళ్లు లాంటివి ఉండడంతో కొంటె కోతుల ఆటలు సాగలేదట. కివీ పండ్ల జోలికే అవి వచ్చేవి కావని మన్‌దీప్ చెప్పారు. కివీ పండ్లకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. దాంతో మన్‌దీప్‌కు ప్రతి సంవత్సరం 40 లక్షల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు. తమ వ్యవసాయక్షేత్రానికి ‘స్వస్తిక్‌ ఫాం’ అనే పేరు పెట్టుకున్నారు మన్‌దీప్ వర్మ. ఇప్పుడు స్విస్తిక్ వ్యవసాయ క్షేత్రంలో మన్‌దీప్ వర్మ కివీ పండ్లతో పాటుగా యాపిల్‌ పండ్లను కూడా విరివిగా పండిస్తున్నారు. తాను పండించే పండ్లను నేరుగా వినియోగదారులకు చేరేలా మన్‌దీప్ వర్మ ఏర్పాట్లు చేశారు. ఆ పండ్లు రసాయనాలు వాడకుండా పూర్తిస్థాయి ఆర్గానిక్‌ విధానంలో పండించినవి కావడంతో వినియోగదారుల నుంచి మంచి డిమాండ్‌ ఉంది. దీంతో మన్‌దీప్‌కు మరింత అధికాదాయంతో పాటు లాభాలు కూడా తెచ్చిపెడుతున్నాకి. తాను అనుకున్న కొత్త కెరీర్‌లో మన్‌దీప్ వర్మ విజేతగా నిలిచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here