తాను ‘బుల్లక్‌ ఎంట్రప్రెన్యూర్‌’ని అని సింహాచలం గర్వంగా చెప్పుకుంటాడు. నిజమే మరి సింహాచలం తన ఎడ్లజతతో చేసే పనులు చూస్తే అతడు బుల్లక్‌ ఎంట్రప్రెన్యూర్‌ అని మనం కూడా ఒప్పుకోవాల్సిందే. ఇంతకీ సింహాచలం ఎడ్లతో ఏం చేస్తాడంటే.. తన ఎడ్ల సాయంతో పైర్ల మధ్య పెరిగిన కలుపు తీస్తాడు. విత్తనాలు కూడా నాటిస్తాడు. తద్వారా వ్యవసాయంలో ఇంతవరకు వినియోగిస్తున్న రైతులు వినియోగించే ట్రాక్లర్లు, ఇతర యంత్రాలకు సింహాచలం చెక్‌ పెట్టేశాడనే చెప్పాలి.

విశాఖపట్నం జిల్లా సంగ్రా అనే గిరిజన గ్రామంలో 32 ఏళ్ల సింహాచలం నివసిస్తున్నాడు. ప్రతి ఏటా వ్యవసాయ సీజన్ మొదలైందంటే సంగ్రాకు సమీప గ్రామాల్లోని పొలాలకు తన ఎండ్లు, బండితో వెళుతుంటాడు. మొదట్లో సింహాచలం మిగతా అందరు గిరిజన రైతుల మాదిరిగానే సాంప్రదాయంగా పొలం దున్నేందుకు, రవాణా కోసమే తన ఎడ్లను వినియోగించేవాడు. బుల్లక్‌ ఎంట్రప్రెన్యూర్ అయిన తర్వాత సింహాచలం తన ఎడ్లతో విత్తనాలు నాటిస్తున్నాడు. పొలంలోని కలుపుమొక్కల్ని తీయిస్తున్నాడు. అందుకోసం వాటర్‌షెడ్‌ సపోర్ట్ సర్వీసెస్‌ అండ్‌ యాక్టివ్స్‌ నెట్‌వర్క్‌ (వాసన్‌) సంస్థ రూపొందించిన ‘వితినిగళ్ల’ అనే పరికరాన్ని ఎద్దుల సహాయంతో వాడుతున్నాడు.ఎడ్లతో పొలంలో కలుపు తీసే విధానాన్ని సింహాచలం 2018లో ఒక శిక్షణా కార్యక్రమంలో నేర్చుకున్నాడు. ఇప్పుడు సింహాచలం కనీసం 150 మంది ఇతర రైతుల పొలాల్లో కలుపు తీస్తున్నాడు. అలా ఒక హెక్టారులో కలుపు తీసేందుకు సింహాచలం రూ.750 చార్జిగా వసూలు చేస్తాడు. ఒక హెక్టారులో తన ఎడ్ల ద్వారా చేసే కలుపుతీతకు సింహాచలానికి ఆరు గంటల సమయం పడుతుందట. అదే కూలిపని వారితో కలుపు తీయించాలంటే కనీసం రెండు రోజులు పడుతుంది. దాదాపు రూ. 1,600 ఖర్చు కూడా అవుతుందని సింహాచలం చెప్పాడు. 2021లో సింహాచలం మరో శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యాడు. అక్కడ ఎడ్ల సాయంతో విత్తనాలు నాటే విధానంపై అవగాహన తెచ్చుకున్నాడు. ఈ విధానంలో ఒక హెక్టారులో విత్తనాలు నాటేందుకు సింహాచలానికి గంట సమయం సరిపోతుందట. ఎడ్ల సాయంతో తాను విత్తనాలు నాటే విధానాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు చుట్టుపక్కల అనేక పంచాయతీల నుంచి రైతుల ఆసక్తిగా వస్తుంటారని చెబుతాడు. సింహాచలాన్ని చూసి తమ గ్రామం నుంచి మరో ఎనిమిది మంది రైతులు కూడా తమ ఎడ్లతో విత్తనాలు నాటే పని చేస్తున్నారని సంతోషంగా చెబుతాడు.

విశాఖపట్నం జిల్లా పరిసరాల్లోని ప్రతి రైతు వద్దా ఎద్దులు ఉంటాయని వాసన్ సంస్థ ప్రోగ్రామ్‌ మేనేజర్‌ ఎం.ఎల్‌. సన్యాసిరావు చెప్పారు. చిన్న రైతులంతా తమ ఎడ్ల సహాయంతో విత్తనాలు నాటే, కలుపుతీసే విధానాల్లో శిక్షణ ఇస్తున్నామని అన్నారు. తద్వారా వారికి ఆర్థికంగా వెసులుబాటు కలుగుతోందని వెల్లడించారు. విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో కూడా పొలంలో ఎద్దుల సాయంతో విత్తనాలు నాటడం, కలుపు తీసే పద్ధతులకు ప్రాచుర్యం తీసుకొచ్చేందుకు వాసన్ సంస్థ కృషి చేస్తున్నదని సన్యాసిరావు వివరించారు. నిజానికి 1961 కి పూర్వం బరువులు మోసే పనికి 90 శాతం ఎడ్లనే వినియోగించేవారు. వాటి ద్వారానే పంటలకు 71 శాతం సహజసిద్ధమైన ఎరువు లభించేదని ఢిల్లీ ఐఐటీకి చెందిన రూరల్‌ టెక్నాలజీ యాక్షన్‌ గ్రూప్‌ అంచనా. ఎడ్ల వినియోగం 1991 నాటికి 23.3 శాతానికి తగ్గిపోయినట్లు ఢిల్లీ ఐఐటీ అధ్యయనంలో తేలింది. వినియోగం తగ్గిపోవడంతో క్రమంగా ఎడ్ల సంతతి కూడా తగ్గిపోయిందని గుర్తించింది.

కాగా.. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రల్లోని పలు ప్రాంతాల్లో మళ్లీ ఎడ్ల వినియోగం పెరుగుతోంది. 2018ను ‘చిరుధాన్యాల సంవత్సరం’గా ప్రకటించింది. ఆ తర్వాత చిరుధాన్యాల వినియోగం పట్ల ప్రజల్లో ఆసక్తి పెరిగింది. దీంతో చిరుధాన్యాలను సహజసిద్ధంగా పండించడానికి రైతులు గో సంతతి వినియోగించడం మొదలుపెట్టారు. ఆ కారణంగా గో సంతతికి డిమాండ్‌ వచ్చిందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. పూర్వపు రోజుల్లో గిరిజన ప్రాంతాల్లో చిరుధాన్యాలను పండించేందుకు గిరిజనులు అంతగా ఆసక్తి కనబర్చేవారు కాదు. అయితే.. పోషకాహార భద్రతలో భాగంగా ప్రభుత్వం చిరుధాన్యాలను బాగా ప్రాచుర్యంలోకి తీసుకురావడంతో వాటికి మంచి గిరాకీ పెరిగింది.

సంగ్రాలోని రైతులు, చుట్టుపక్కల గ్రామాల వ్యవసాయదారులు మొదట్లో విత్తనాలను వెదజల్లేవారు. దానికి లేబర్‌ అవసరం అంతగా ఉండదు. కానీ.. విత్తనాలను వెదజల్లడం వల్ల తక్కువ పంట చేతికి వచ్చేది. ఇప్పుడు ఆ ప్రాంత రైతులంతా విత్తనాలను వాసన్‌ సంస్థ రూపొందించిన వితినిగళ్లతో ఎద్దుల సహాయంతో వరుస విధానంలో నాటుకుంటున్నారు. దాంతో వ్యవసాయ పెట్టుబడి తగ్గించుకుంటున్నారు. తొందరగా విత్తనాలు చల్లుకుంటున్నారు. అంతే వేగంగా పొలంలోని కలుపు మొక్కల్ని కూడా తొలగిస్తున్నారు. చక్కని పంట దిగుబడులు రాబట్టుకుని ఆర్థికంగా ఎదుగుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here