పండ్ల మొక్కలను మనం సాధారణంగా ఎక్కడ పెంచుతాం? నేలలో పెంచుతాం. లేదంటే కుండీల్లో వేసి సాకుతాం. అయితే.. ఈ దుబాయ్‌ రిటర్న్‌డ్‌ ఆలోచన అంతకు మించి అనేలా ఉంది. ఏకంగా పండ్ల చెట్లను ప్లాస్టిక్ డ్రమ్ముల్లో పెంచుతున్నాడు. చక్కని పంట దిగుబడి కూడా సాధిస్తున్నాడు. అది కూడా ప్రకృతి సాగు విధానంలో ఆర్గానిక్‌ పండ్ల పంటలు పండిస్తున్నాడు. తమ టెర్రస్ మీద మొత్తం 250 రకరకాల పండ్లచెట్లు పెంచుతున్నాడు. వాటిలో 135 చెట్లను కేవలం ప్లాస్టిక్ డ్రమ్ముల్లోనే పెంచుతున్నాడు. తద్వారా ఆనందం, ఆత్మ సంతృప్తితో పాటు చేతి నిండా డబ్బులు కూడా సంపాదిస్తున్నాడు. అతనే కేరళలోని తిరూర్ వాసి అబ్దుర్ రజాక్‌. దుబాయ్‌లో ముప్పై ఏళ్ల పాటు అబ్దుర్ రజాక్‌ ఓ హోల్‌సేల్‌ పండ్లు, కూరగాయల కంపెనీలో పనిచేశాడు.

ప్రకృతి సిద్ధంగా పెరిగే చెట్లు అంటే అబ్దుర్‌ రజాక్‌కు ఎంతో ఇష్టం. అందులోనూ పండ్ల చెట్ల పట్ల రజాక్‌కు మక్కువ మరీ ఎక్కువ. 2018లొ దుబాయ్‌ నుంచి సొంతూరికి తిరిగి వచ్చిన తర్వాత అబ్దుర్ రజాక్ తమ ఇంటి ఆవరణలో నాటిన పండ్ల చెట్లు అంత బాగా ఎదగడం లేదని గ్రహించాడు. చెట్లకు కావాల్సినంత సూర్యరశ్మి వాటికి లభించకపోవడమే కారణం అని రజాక్ గ్రహించాడు. దాంతో రజాక్ ఓ సరికొత్త ఆలోచన చేశాడు. టెర్రస్‌పై ప్లాస్టిక్‌ డబ్బాల్లో పండ్లమొక్కలు పెంచితే.. చాలినంత సూర్యరశ్మి వాటికి లభిస్తుంది. ఖాళీగా ఉండే టెర్రస్‌ను కూడా వినియోగంలోకి తెచ్చినట్లు అవుతుందనే ఆలోచనతో రజాక్‌ పండ్లచెట్ల సాగు ప్రారంభించాడు.

రజాక్ దుబాయ్‌లో హోల్‌సేల్‌ పండ్లు, కూరగాయల కంపెనీలో పనిచేసే సమయంలోనే 56 దేశాలకు చెందిన రైతులు, ఏజెన్సీల ప్రతినిధులతో చక్కని పరిచయాలు ఏర్పర్పర్చుకున్నాడు. అలా వారితో పరిచయం తర్వాత ప్లాస్టిక్ డబ్బాల్లో పండ్ల చెట్లను పెంచే థాయ్‌ ఫ్రూట్‌ ఫాం విధానం తనను ఎంతగానో ఆకట్టుకుందని అబ్దుర్ రజాక్‌ చెప్పాడు. థాయ్‌ రైతులు వేలాది ప్లాస్టిక్ డబ్బాల్లో పండ్ల చెట్లు పెంచుతారు, అత్యధికంగా దిగుబడి సాధిస్తుంటారు. అందుకే ఈ విధానం పట్ల రజాక్‌ ఆసక్తి పెంచుకున్నాడు. కొందరు ఇతర హోమ్‌ గార్డెనింగ్‌ రైతులు గ్రోబ్యాగ్‌లలో మొక్కలు పెంచే విధానం పట్ల కూడా రజాక్‌కు అవగాహన ఉంది. అయితే.. వాటికన్నా.. భూమిలో నాటిన మొక్కల కన్నా ప్లాస్టిక్ డబ్బాల్లో పెంచిన పండ్ల చెట్ల నుంచి అధిక దిగుబడులు వస్తున్నాయని రజాక్ చెబుతాడు. పండ్ల ఆధారిత హోల్‌సేల్‌ కంపెనీలో మూడు దశాబ్దాలు పనిచేసిన అనుభవం కూడా రజాక్‌ తోడవడంతో పండ్లచెట్లను సాగుచేసే విధానంలో మంచి అవగాహన ఏర్పడింది.ప్లాస్టిక్ డబ్బాల్లో పండ్లచెట్ల పెంపకానికి పనివారు తక్కువగా అవసరం అవుతారు. అయితే.. భూమిలో నాటిన చెట్ల కంటే కాస్త ఎక్కువ నీటి అవసరం అవుతుందని రజాక్‌ వివరించాడు. డబ్బాల్లో వేసే చెట్లకు రోజుకు రెండుసార్లు నీరు పోయాల్సి ఉంటుంది. దీనికి కూడా పనివారి అవసరం అక్కరలేని విధంగా రజాక్‌ డబ్బాల మీదుగా ఓ పైప్‌ను అమర్చాడు. రోజూ రెండు సార్లు ఆ పైపుల ద్వారా డ్రిప్‌ ఇరిగేషన్ విధానంలో చెట్లకు నీరు అందేలా ఏర్పాట్లు చేశాడు. చెట్లు పెంచేందుకు రజాక్‌ తొలుత కొన్ని పెయింట్‌ బకెట్లు కొని తెచ్చుకున్నాడు. ఆ బకెట్లలో మట్టి నింపాడు. ఆ బకెట్లలోని మట్టిలో పండ్ల మొక్కలు నాటాడు. తమ ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులకు ఈ విధానం సరిపోతుందో లేదో అని ముందుగా బకెట్లలో మొక్కలు నాటి పరిశీలించాడు. అలా నాటిన మొక్కలు బాగా ఏపుగా ఎదిగాయి. దీంతో తాను అనుకున్న ప్రకారం పెద్ద పెద్ద ప్లాస్టిక్ డబ్బలు సేకరించి, తన విధానాన్ని అమలులో పెట్టాడు.

పండ్లచెట్లకు రజాక్‌ దేశీ ఆవుపేడ, వేప కేక్, ఎముకల పొడి, బెల్లం, ఆకులతో తయారుచేసిన మిశ్రమాన్ని నీటిలో కలిపి పిచికారి చేస్తుంటాడు. ప్లాస్టక్‌ డబ్బాల్లో పెంచే పండ్ల చెట్ల నుంచి భూమిలో పెంచే చెట్ల కన్నా త్వరగా పంట దిగుబడి వస్తుందని రజాక్‌ తన అనుభవంతో చెప్పాడు. నేలలో పెరిగిన చెట్ల నుంచి ఫలసాయం రావడానికి ఐదేళ్ల సమయం తీసుకుంటుందని, డ్రమ్ముల్లో పెంచే మొక్కలైతే రెండేళ్లలోనే పంట వస్తుందని వివరించాడు. అలాగే నేలలో ఒక చెట్టు ఆవరించే ప్రాంతంలో 10 నుంచి 15 చెట్లను డ్రమ్ముల్లో పెంచుకోవచ్చని తెలిపాడు. డ్రమ్ముల్లో పెంచే పండ్ల చెట్లను 7 నుంచి 8 అడుగుల వరకు పెంచుకుంటే పండ్లు కోయడం సులువుగా ఉంటుందని పేర్కొన్నాడు. అబ్దుర్‌ రజాక్‌ తమ మిద్దె మీద పెంచేందుకు విదేశాల నుంచి పండ్ల మొక్కల్ని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తాడు. కోల్‌కతాలోని ఓ ఏజెన్సీ ద్వారా ప్రపంచంలో ఉండే వివిధ రకాల మామిడి మొక్కల్ని తాను కొనుగోలు చేసి పెంచుతున్నానన్నాడు. అలా రజాక్‌ పలు రకాల జామచెట్లు, పనస రకాలతో పాటు థాయ్‌లాండ్‌, పాకిస్తాన్‌, బ్రెజిల్‌, ఆస్ట్రేలియా దేశాల నుంచి సేకరించిన 70 రకాల విదేశీ మామిడి చెట్లు నాటాడు. రజాక్‌ మిద్దె తోటలో మన దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన 250 వెరైటీల పండ్ల చెట్లను పెంచుతున్నాడు.

ఆయా పండ్ల చెట్లు పెరిగే పరిమాణాన్ని బట్టి ప్లాస్టిక్ డబ్బాలను 70 నుంచి 130 లీటర్ల కెపాసిటీ ఉన్నవి తీసుకుంటాడు. ఆ డబ్బాల అడుగుభాగంలో 8 నుంచి 16 మిల్లీ మీటర్ల సైజులో మూడు అంగుళాల దూరంలో రంధ్రాలు చేస్తాడు. డ్రమ్ములో నీరు ఎక్కువ అయినప్పుడల్లా ఆ రంధ్రాల నుంచి బయటికి వెళ్లిపోతుంది. ప్లాస్టిక్‌ డబ్బాలో నాలుగింట మూడు వంతుల మేర పాటింగ్ మిక్స్‌ లేదా మట్టి, బయో ఫిర్టిలైజర్‌, కొబ్బరి పొట్టుతో నింపి దాంట్లో పండ్లమొక్కలు నాటుతాడు. మొక్కలకు రోజుకు కనీసం ఒకసారైనా నీరు అందేలా చేస్తాడు. ఆవుపేడ తదితరాలతో సహజసిద్ధంగా తయారు చేసిన ఆర్గానిక్‌ ద్రావణాన్ని నెలకు ఒకసారి లేదంటే రెండు నెలలకు ఒకసారైనా స్ప్రే చేస్తాడు. పండ్ల మొక్కలు పెంచుతున్న డ్రమ్ముల్లో కలుపు లేదా అనవసరమైన పదార్థాలేవీ లేకుండా క్రమం తప్పకుండా శుభ్రం చేస్తుంటాడు. ఇలా చేయడం వల్ల ఆయా పండ్ల మొక్కలు త్వరగా పుష్పించి, పంట పండుతుంది. భూమిపై పెరిగే ఒక చెట్టురే 100 పండ్లు పండితే.. ప్లాస్టిక్‌ డబ్బాల్లో పెంచిన ఒక్కో చెట్టు నుంచి 25 నుంచి 50 వరకు దిగుబడి వస్తాయి. అయితే.. ఒక్క చెట్టు ఆవరించిన ప్రాంతంలో డ్రమ్ముల్లో పెంచే 10 నుంచి 15 చెట్ల ద్వారా అంతకు మించిన పంట మన చేతికి వస్తుంది.

రైతు సోదరులూ.. పంటకు పంట.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఆదాయానికి ఆదాయం సంపాదిస్తున్న మన దుబాయ్ రిటర్న్‌డ్‌ అబ్దుర్ రజాక్ ను ఆదర్శంగా తీసుకుందామా? భవిష్యత్తరాలకు మంచి పండ్లను అందజేద్దామా?!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here