భారతీయ చలనచిత్రరంగంలో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న సూపర్ స్టార్ మమ్ముట్టి. ప్రత్యేకించి ఆయన దక్షిణాదిన వందలాది మలయాళం, కన్నడ, తమిళ, తెలుగు సినిమాల్లో నటించారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంపై ‘యాత్ర’ టైటిల్‌తో తీసిన బయోపిక్‌లో ఆయన నటించి మెప్పించారు. సినీరంగంలో తన విశేష కృషికిగాను మమ్ముట్టి పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు. మూడు సార్లు జాతీయ స్థాయిలో అవార్డులకు ఎంపికయ్యారు.
సినిమాల కోసం పని చేస్తూనే వైద్యసేవల రంగంలో కూడా ఆయన ప్రవేశించారు. “మదర్‌హుడ్” పేరుతో ఆయన కుటుంబం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో ప్రసూతి ఆసుపత్రులను నిర్వహిస్తోంది. అంతేకాదు, మమ్ముట్టికి వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం. వారిది రైతు కుటుంబం కావడమే ఇందుకు కారణం. మమ్ముట్టి తండ్రి వ్యవసాయమే చేసేవారు. దీంతో ఒకపక్క సినిమాల్లో నటిస్తున్నా మరోపక్క మమ్ముట్టి సేద్యం పట్ల మక్కువతో వ్యవసాయం కొనసాగిస్తూ వచ్చారు.
కేరళలోని కొట్టాయంలో ఆయనకు 20 ఎకరాల పొలం ఉంది. ఆయన అందులో వరి సాగుచేస్తారు. అలాగే కేరళలోనే మున్నార్ దగ్గర ఆయనకు 50 ఎకరాల్లో cardamom estate ఉంది. అక్కడ ఏలకులు పండిస్తారు. చెన్నై పరిసర ప్రాంతాల్లోనూ మమ్ముట్టికి పొలాలున్నాయి. మొత్తం మీద మమ్ముట్టి పదహారణాల వ్యవసాయదారుడు. అంతమాత్రమే కాదు, ఆయన జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయాన్ని(ZBNF) గట్టిగా సమర్థిస్తారు. సమర్థించడమే కాదు, అనుసరిస్తారు కూడా. కుమారకోమ్ సమీపంలో చీపున్‌కల్ వద్ద ఉన్న తన వరి పొలంలో మమ్ముట్టి జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ పద్ధతులనే పాటిస్తారు. ఆర్గానిక్ సాగు పద్ధతులను అవలంబించమని మమ్ముట్టి తన అభిమానులకు కోరతారు. సంప్రదాయ విధానాల్లో వరి సాగును ఆయన గత పదేళ్లుగా ప్రోత్సహిస్తున్నారు.
మమ్ముట్టి తోటలో పండిన సన్ డ్రాప్స్ పండ్లు
తాజాగా ఈ సూపర్ స్టార్ తన ఆర్గానిక్ పండ్లతోట తాలూకు ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. చెట్టు దగ్గర కూర్చుని ‘సన్‌డ్రాప్స్’ (Sun Drops) పండ్లను తెంపుతున్న మమ్ముట్టి వాటిల్లో కనిపిస్తున్నారు. బ్లూ కలర్ షర్ట్ ధరించిన సూపర్ స్టార్ సంప్రదాయ కేరళ పంచెకట్టు (Mundu)లో ఉన్నారు. Harvesting Sun Drops! అని ఆయన తన పోస్టులో వ్రాసుకున్నారు.
Sun Drops పండ్ల శాస్త్రీయనామం Eugenia victoriana. అవి Myrtaceae ఫ్యామిలీకి చెందినవి. నాటాక మూడు, నాలుగేళ్లలో కాతకి వస్తాయి. సుమారు పది అడుగుల మేర పెరుగుతాయి. వేసవి పొడవూతా కాత వస్తుంది. చూడ్డానికి సంత్రాల్లా ఉంటాయి. పండులో రెండు నుంచి నాలుగుదాకా గింజలుంటాయి. రుచి బాగా పుల్లగా ఉంటుంది. వీటిని పండ్ల రసాలు తయారుచేయడానికి వాడతారు. విటమిన్ ‘సీ’ వీటిల్లో పుష్కలంగా ఉంటుంది. ఇది దక్షిణ అమెరికాకు చెందిన చెట్టు.
ఇదిలావుండగా, మమ్ముట్టి ప్రధానపాత్రలో నటించిన The Priest, One మూవీలు ఈ సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెలల్లో విడుదల కానున్నాయి. ఈ మధ్య లాక్‌డౌన్ సమయంలో తీరిక చిక్కడంతో మమ్ముట్టి వ్యవసాయం పనుల్లోనే గడిపారు.