అధిక దిగుబడిని ఇచ్చే పంట రకాలను అభివృద్ధి పరచిన ఐసీఏఆర్

భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) గత మూడేళ్లలో అధిక దిగుబడినిచ్చే 838 పంట రకాలను అభివృద్ధి పరిచింది. వీటిలో 578 ఆయా వాతావరణ పరిస్థితులకు అనువైనవి కాగా, 41 రకాలు స్వల్పకాలికమైనవి. అలాగే మరో 47 బయో-ఫోర్టిఫైడ్ రకాలు వీటిలో ఉన్నాయి. అంతేకాకుండా, ఐసీఏఆర్ దేశంలోని 18 రాష్ట్రాల్లో 63 ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్‌(ఐఎఫ్ఎస్)లను అభివృద్ధి చేసింది. ఈ నమూనాలు 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అనుకూలంగా ఉంటాయి. వీటి ద్వారా రాగల మూడు, నాలుగేళ్లలో రైతుల ఆదాయం 2 నుండి 3 రెట్లు పెరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రైతుల ఆదాయం పెంచడం కోసం ప్రత్యేకంగా 2020లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్(ఐసిఏఆర్) 345 రకాల పంటలను అభివృద్ధి పరచడం విశేషం.
లోక్‌సభలో ఫిబ్రవరి 10న కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ ఐసిఏఆర్ అభివృద్ధి పరచిన పంటరకాలను గురించి వివరించారు. చిన్న కమతాల్లో యాంత్రీకరణను ప్రోత్సహించడానికి 77 యంత్రాలు, ప్రాసెసింగ్ పరికరాలు అభివృద్ధి చేయబడ్డాయని ఆయన చెప్పారు. ఇవి పంటకోతల తర్వాత సంభవించే నష్టాలను తగ్గించేందుకు ఉపయోగపడతాయన్నారు. పంటల ప్రాసెసింగ్ కోసం మొత్తం 101 సాంకేతికతలను కూడా అభివృద్ధి పరచడం జరిగిందని మంత్రి వెల్లడించారు. మరోవైపున మత్స్యసంపదకు సంబంధించి ఐసిఏఆర్ 9 రకాల ఆహార చేపలు, 12 రకాల (ఆర్నమెంటల్) అలంకార చేపల పెంపకం, విత్తనోత్పత్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అభివృద్ధి చేసిందని ఆయన తెలిపారు. ఈ తరహా చేపల పెంపకం కోసం తక్కువ వ్యయం కాగల ఫీడ్‌ను (feeds for fish) ఐసీఏఆర్ అభివృద్ధి పరచిందని ఆయన చెప్పారు.

Union Agriculture Minister Narendra Singh Tomar

నిజానికి వ్యవసాయ విద్య, పరిశోధనల కోసం ప్రభుత్వం చేస్తున్న వ్యయం మొత్తం స్థూల జాతీయోత్పత్తిలో 0.62 శాతం మాత్రమే. ఇందుకుగాను 2020-21లో జరిగిన బడ్జెట్ కేటాయింపులు రూ. 7762.38 కోట్లు కాగా, 2021-22లో రూ. 8513.62 కోట్లను కేంద్రం ప్రతిపాదించింది. అయితే ఈసారి బడ్జెట్‌లో పంట విజ్ఞానాల అధ్యయనం కోసం రూ. 968.00 కేటాయించారు.
ఇదిలావుండగా, రాజ్యసభలో ఎంపి సుశీల్ కుమార్ గుప్తా అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ఐసీఏఆర్ 18 రాష్ట్రాల్లోని రైతుల భాగస్వామ్యంతో 63 సమగ్ర వ్యవసాయ వ్యవస్థలను అభివృద్ధి పరిచిందని మంత్రి వివరించారు. వీటిలోని అనేక సమీకృత వ్యవసాయ విధానాలు (Integrated Farming System) రైతుల ఆదాయాన్ని 2-3 రెట్లు పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయనీ, బిహార్, కర్ణాటక, కేరళ, జమ్మూ-కాశ్మీర్, తమిళనాడు రాష్ట్రాల ప్రణాళికలలో ఇప్పటికే ఇవి చేర్చబడ్డాయనీ అని తోమర్ తెలిపారు.
వ్యవసాయ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం, 22 రాష్ట్రాలకు అనువైన 31 బ్యాంకింగ్ ప్రాజెక్టులను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) తయారు చేసింది. వీటికి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా మధ్యస్థ, స్వల్పకాలిక రుణ సదుపాయం లభిస్తుంది. ఇలా గత మూడేళ్లలో 22 పంట విధానాలకు సంబంధించి సేంద్రియ వ్యవసాయ ప్యాకేజీలను అభివృద్ధి పరచినట్లు తోమర్ వెల్లడించారు.
2019-20 సంవత్సరాలకు సంబంధించి దేశంలో మొత్తం ఆహార ధాన్యం ఉత్పత్తి రికార్డు స్థాయిలో 291.95 మిలియన్ టన్నులుగా ఉంటుందని అంచనా. కాగా, దేశంలోని 12 రాష్ట్రాల్లో 51 సేంద్రియ పంట పద్ధతులను ఐసీఎఆర్ అభివృద్ధి చేసిందని మంత్రి మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here