ఏ దేశంలో అయినా ఎక్కువగా లభించే పండ్లలో అరటి పండు ఒకటి. అత్యంత చవకగా, అన్ని సీజన్లలోనూ లభించేది అరటిపండు. అరటిపండులో పొటాషియం, విటమిన్‌ బీ6, విటమిన్ సీ, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్‌, ఫైబర్‌, బయోటిన్‌, కొర్బోహైడ్రేట్లు పలు పోషకాలు ఉంటాయి. అరటిపండులో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది కనుక ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుతుంది. వారానికి రెండు మూడు అరటి పండ్లు తినే మహిళలు కిడ్నీ జబ్బుల బారిన పడే ప్రమాదం తప్పుతుందని ఓ అధ్యయనం తేల్చి చెప్పింది. రోజుకో అరటిపండు తినేవారికి ఆస్తమా లక్షణాలు తగ్గుతాయి. అరటిపండు తినేవారికి బీపీని తగ్గిస్తుంది. అరటిపండు తినేవారి చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అరటి పండుతో కళ్ల చుట్టూ ఉండే నల్లని వలయాలు, మొటిమలు, మచ్చలను పోగొట్టుకోవచ్చు. కండరాల తిమ్మిర్లు, నొప్పులు తగ్గేందుకు అరటిపండు పనిచేస్తుంది. అరటిపండులో ఉండే పోటాషియం, సోడియం రక్త ప్రవాహాన్ని మెరుగు పరుస్తాయి. ధమనుల్లోని అడ్డంకులను తొలగించి, రక్తపోటును నివారిస్తాయి. సహజసిద్ధమైన ఎనర్జీ బూస్టర్ లా అరటిపండు పనిచేస్తుంది. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే అరటిపంట సాగులో మెళకువలు, సులువైన పద్ధతుల గురించి తెలుసుకుందాం.అరటి చెట్టుకు గెల వచ్చిన తర్వా త దాని బరువుకు, ఎక్కువ గాలి వీచినప్పుడు పడిపోతుంటాయి. అలా పడిపోకుండా సర్వేకర్రలు, లేదా వెదురు గెడలు సపోర్ట్‌ గా పెడుతుంటాం. అలా సర్వేకర్రలు లేదంటే వెదురుగెడలు పెట్టాలంటే ఒక్కో దానికి 70 నుంచి 120 రూపాయల ఖర్చు అవుతుంది. ఒక ఎకరంలో వెయ్యి అరటిచెట్లు ఉన్నాయంటే వాటన్నింటికీ సపోర్ట్‌ కర్రలు పెట్టాలంటే 70 వేల రూపాయల నుంచి లక్షా 20 వేల దాకా ఖర్చు వస్తుంది. అవి రెండు మూడేళ్ల వరకు ఉపయోగపడతాయి. అలా సపోర్ట్ కర్రలతో కాకుండా కేవలం తాడుతో అరటి గెలను వంగిన వైపు కాకుండా వెనకవైపున మరో అరటిచెట్టు మొదలుకు లాగి కట్టుకుంటే అత్యంత తక్కువ ఖర్చుతోనే ఉపయోగం ఉంటుంది. ఎకరం పోలంలో అరటిచెట్లు వంగిపోకుండా, పడిపోకుండా తాడుతో కట్టుకోవడానికి కేవలం 3 నుంచి 5 వేల రూపాయలతో సరిపోతుందని గుంటూరు జిల్లా కోసూరు  సుమంత్ వాసిరెడ్డి ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. రెండున్నర ఎకరాల్లో నేచురల్ విధానంలో దేశీ అరటి పంటల్ని సుమంత్‌  సాగు చేస్తున్నారు.నిజానికి సుమంత్ వాసిరెడ్డి సహజసిద్ధంగా వ్యవసాయం చేసి, ఉత్పత్తులను వాణిజ్యపరంగా విక్రయించాలనే ఉత్సాహంతో అరటితోట పెంపకం చేపట్టారు. రసాయనాలు లేని, ఆరోగ్యాన్నిచ్చే సహజ పంటల్ని వినియోగదారులకు అందించడం తన ధ్యేయం అని సుమంత్ చెప్పారు. సహజ వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడులు వస్తే చాలనుకుని తాను వ్యవసాయంలోకి దిగానన్నారు. ఈ రంగంలో దిగే ముందు ఓ ఆరు నెలల పాటు కొందరు అనుభవజ్ఞులు, వ్యవసాయ శాస్త్రవేత్తల నుంచి కొంత సమాచారం తెలుసుకుని, అవగాహన తెచ్చుకున్నట్లు  చెప్పారు. తమ పొలంలో ఒక్కో రకానికి పదేసి చెట్లు చొప్పున వేశామని తెలిపారు. నీటి సౌకర్యం బాగుండి, తేలికగా పంట పండించేందుకు అరటి మేలు అని ఎకరం నేలలో సాగుతున్నారు. నిజానికి అరటిచెట్టు మొండిది. ఆర్గానిక్ విధానంలో మిర్చి పండించాలంటే ఎంత కష్టమో అరటి పంట అంత సులువు అన్నారు.అయితే.. అరటితోట పెంపకంలో అతి ప్రధానమైన ఇబ్బంది గాలి అన్నారు. గాలి గట్టిగా వీస్తే అరటి చెట్లు పడిపోతాయి. అలాగే అరటి గెల బరువు పెరిగే కొద్దీ అది వంగిపోయే అవకాశం ఉంది. సహజ పంటల్లో ఖర్చు వస్తే చాలనుకునే సుమంత్‌ సాగు ఖర్చు వీలైనంత మేరకు తగ్గించుకునేందుకే సపోర్టుగా పెట్టే సర్వేకర్రలు, వెదురు గెడల బదులు తాళ్లను వినియోగించారు. రసాయనాలతో చేసే పంట సాగులో ఖర్చులు తడిసి మోపెడవుతుండడం కూడా తాను ఆర్గానిక్ విధానాన్ని ఎంచుకోవడానికి ఒక కారణం అన్నారు. ఎక్కువ ఖర్చుతో పంటలు పండించినా మార్కెట్లో గిట్టుబాటు ధర సరిగా లేక రైతులు నష్టపోతున్నారని, అందుకే సాగులో ఎంత ఖర్చు తగ్గించుకుంటే అదే మొదటి లాభం అని సుమంత్ చెప్పారు.

అందుకే సపోర్ట్ గా పెట్టే ఒక్క వెదురు గెడల కోసమే లక్ష 20 వేల రూపాయలు ఖర్చు పెట్టే కంటే గరిష్టంగా ఐదారు వేలతో అయిపోయే తాళ్లను తాను ఎంపిక చేసుకున్నానని సుమంత్ తెలిపారు. తాళ్లతో అరటిచెట్లను కట్టినప్పుడు గాలులు వీచినా చెట్లు తట్టుకుని నిలిచి ఉన్నాయి కాబట్టి ఈ విధానం సక్సెస్‌ అని ఆయన అన్నారు. అరటిచెట్టు ఎంతటి నీటినైనా తట్టుకుంటుంది. అరటితోటలో నీరు చెరువులా నిలిచిపోయినా ఇబ్బందేమీ ఉండదు. అయితే అరటికి ప్రధాన శత్రువు గాలులు.అరటిచెట్లకు సుమంత్‌ బాక్స్ టాప్‌ తాడు వాడారు. అంటే అట్టపెట్టెల్లో సామాను పార్శిల్ చేసేటప్పుడు వాడే కాస్త వెడల్పు ఉండే ప్లాస్టిక్‌ తాడును వినియోగించారు. తాడే కదా ప్లాస్టిక్ దారం కట్టేద్దామంటే సరిపోదన్నారు. బాక్స్‌ టాప్‌ తాడు ఒక రోల్‌ కు సుమారు రూ.300 వరకు ఉటుంది. వెయ్యి అరటి చెట్లకు ఇలాంటి పది రోల్స్‌ పట్టొచ్చు. అంటే ఎకరం నేలలోని వెయ్యి అరటి చెట్లకు కట్టేందుకు బాక్స్ టాప్‌ తాడుకు రూ.3 వేల నుంచి రూ.3,600 వరకు ఖర్చు అవుతుంది. వెదురు బొంగులు వేసేందుకు అయ్యేందుకు అయ్యే కూలీల ఖర్చే ఇంచుమించు తాళ్లు కట్టేందుకు కూడా అవుతుంది. ఎకరం పొలంలో అరటిచెట్లకు తాళ్లు కట్టేందుకు ఇద్దరు మనుషులు ఉంటే ఐదారు రోజులు పడుతుంది. తాడు కట్టేందుకు కూలీల ఖర్చు సుమారు రూ.1,200 అవుతుంది. బాక్స్ టాప్‌ తాడు రెండేళ్ల దాకా పనికివస్తుంది. వెదురు బొంగులకు పెట్టే ఖర్చు లక్షా 20 వేలకు నెలకు వచ్చే వడ్డీకి ఇంచుమించు సమానంగా తాళ్లకు ఖర్చవుతుందని సుమంత్ చెప్పారు.అరటిచెట్టుకు చెట్టుకు మధ్య దూరం 7 అడుగుల దూరంలో తాను నాటినట్లు సుమంత్ తెలిపారు. ఇలా పెట్టుకున్నప్పుడు ఒక్కోదానికి మూడున్నర బార్ల తాడు సరిపోతుందన్నారు. తాడు కట్టుకునే చెట్టుకు సరిగ్గా వెనక ఉండే అరటిచెట్టుకు సాధ్యమైనంతగా నేలకు దగ్గరగా ముందుగా కట్టుకోవాలి. తర్వాత ఏ గెల ఉన్న చెట్టుకు కడతామో దాన్ని కాస్త వెనకవైపు లాగి కట్టుకోవాలి.ఇక చివరిగా.. ఆర్గానిక్‌ విధానంలో పండించే అరటి పండ్లు హైబ్రీడ్‌ పండ్లకన్నా సైజులో కాస్త తక్కువ ఉంటాయి. అరటిగెలలో కాయలు ఎదుగుతున్న కొద్దీ వాటిపై మచ్చలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంతో పాటు హైబ్రీడ్‌ కాయల కన్నా సహజసిద్ధంగా పండించిన అరటిపండుకు కొద్దిగా షైనెంగ్ తక్కువ ఉంటుంది. అరటిపండు పరిమాణం, షైనింగ్, కాయ షేప్‌ సరిగా ఉండేందు కోసం అరటి గెలకు కవర్లు కడుతున్నారు. ఒక్కో అరటి గెలకు ఒకటిన్నర్ల మీటర్ల కవర్ అవసరం అవుతుందని సుమంత్ చెప్పారు. 200 మీటర్ల పొడవు ఉండే కవర్ రోల్‌ ఖరీదు రూ. 1500 నుంచి రూ. 1600 మధ్య ఉంటుంది. అంటే ఒక్కో గెలకు అయిన ఖర్చు రూ.10 నుంచి రూ.11 మధ్య పడుతుంది. అరటి గెలకు కట్టే కవర్ పచ్చదోమ, ఇతర పురుగుల నుంచి రక్షణగా కూడా ఉంటుంది. పైగా పురుగుల నివారణకు కషాయాలు లాంటిని స్ప్రేచేసే పనిభారం, ఖర్చు కూడా తగ్గుతుంది. కేరళ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోని అరటి రైతులు ఈ విధంగా కవర్ల కట్టడం చూసి, తాను కూడా కడుతున్నట్లు తెలిపారు.కవర్ తో పాటు గెల చివరిలో ఆవుపాలు, ఆవునెయ్యి, ఆవుపెరుగు, ఆవు మూత్రం, ఆవుపేడతో తయారు చేసిన 50 మిల్లీలీటర్ల పంచగవ్య, 50 మిల్లీలీటర్ల నీరు కలిపి ఓ ప్లాస్టిక్ కవర్‌ పెట్టి కట్టుకుంటే గెల మొదటి అస్తంలోని కాయలు ఏ సైజులో ఉంటాయో చివరి అస్తంలోని కాయలు కూడా అదే సైజులో ఎదుగుతాయి. అంటే పంచగవ్య గ్రోత్ బూస్టర్‌ లా పనిచేస్తుందన్నమాట. అరటి పువ్వును తెంపిన వెంటనే పంచగ్యను కట్టుకోవాలి. అరటి పువ్వు తెంపిన తర్వాత కారే దాని జ్యూస్ కూడా పంచగవ్యతో కలిసి అరటికాయలు ఒకే సైజులో పెరిగేలా పనిచేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here