మృగశిర కార్తె ప్రారంభమైంది. ఆస్తమా రోగులకు హైదరాబాద్‌ లో చేప ప్రసాదం పంపిణీ జరుగుతోంది. బత్తిన కుంటుంబ వనమూలికలు, ఆకులతో తయారు చేసిన చేపమందును కొర్రమీను చేపపిల్ల నోట్లో పెట్టి, ఆస్తమా రోగుల చేత మింగిస్తుంది. చేప మందును కొర్రమీను పిల్లతో మాత్రమే వారు వేస్తారు?

మిగతా చేపల కన్నా కొర్రమీనులో అత్యధికంగా ప్రొటీన్‌ ఉంటుంది. కండరాలను గట్టిగా ఉంచడానికి, గాయాలు తగ్గడానికి, శరీరంలో రక్తప్రసరణ బాగుండేందుకు, పిల్లల్లో ఆటిజాన్ని అదుపులో ఉంచేందుకు, మధుమేహ నివారణలో కొర్రమీను బాగా పనిచేస్తుంది.కొర్రమీనుచేప ఎక్కువ లోతుగా ఉండే చోట, బురదలో దూరి ఉంటుంది. చిన్న చిన్న పురుగులు, శిలీంద్రాలు, శైవలాలు తింటుంది. కొర్రమీను అన్నింటినీ తినే జాతి. అందుకే ఇది చిన్న చిన్న చేపలను కూడా తింటుంది. చాలా బలంగా ఉండే కొర్రమీను నీటిలో నుంచి బయటకు తీసిన తర్వాత కూడా కొన్ని గంటలపాటు బతికే ఉంటుంది. చికెన్‌, మటన్ తో పోలిస్తే కొర్రమీనులో ప్రోటీన్‌ శాతం చాలా ఎక్కువ. కొర్రమీనును ఆహారంగా తీసుకుంటే దానిలో ఎక్కువ శాతంలో ఉండే ఆల్బుమిన్‌ అనే ప్రోటీన్‌ వల్ల మనకు తగిలిన గాయాలు త్వరగా తగ్గిపోతాయి. ఆపరేషన్ చేయించుకున్న వారికి కొర్రమీను ఆహారంగా పెడితే ఆ గాయాలు వేగంగా మానిపోతాయి. కొర్రమీనులో ఉండే లవణాలు, కొవ్వు పదార్థాలు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్‌్ మన శరీరంలో రక్తప్రసారాన్ని మెరుగుపరుస్తాయి. నెలకు రెండుసార్లయినా కొర్రమీను తింటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కొర్రమీనును తరచుగా తింటుంటే మన శరీరంలోని చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుతుంది. అన్నం తినే బదులు కొర్రమీను మాంసాన్ని తిన్నవారికి చక్కెరశాతం బాగా తగ్గిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇన్ని లాభాలున్న కొర్రమీను ఖరీదు మిగతా చేపల కంటే కాస్త ఎక్కువగానే ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచే కొర్రమీనును వయసుతో నిమిత్తం లేకుండా ప్రతిఒక్కరూ ఆహారంగా తీసుకోవచ్చు.ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా వాణిజ్యపరంగా కూడా లాభాలు తెచ్చిపెట్టే కొర్రమీను చేపల పెంపకం గురించి తెలుసుకుందాం. తెలంగాణలోని యాదాద్రి జిల్లా వలిగొండ మండలం వేములకొండలో పసిక రాజేశ్వరి అనే ఔత్సాహిక మహిళా రైతు ఎకరం భూమిని కౌలుకు తీసుకుని, ‘రాజేశ్వరి మురళి ఫిష్ ఫాం’ పేరిట కొర్రమీను చేపల పంపకాన్ని విజయవంతంగా చేస్తున్నారు. కొర్రమీను చేపల పెంపకంలోని కష్ట సుఖాలు, లభ నష్టాల గురించి, ఆమె అనుభవాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

కొర్రమీను చేపల పెంపకం చేపట్టాలనుకున్న తర్వాత ఓ ఆరు నెలల పాటు ఈ రంగంలో ఫెయిలైన వారి నుంచి, సక్సెస్ అయిన వారి నుంచి అనుభవాలను రాజేశ్వరి క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. కొర్రమీనుకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది కనుక తాను వీటి పెంపకం చేపట్టడానికి ఒక ప్రధానం కారణం అన్నారు. ఏ డిసీజ్ అయినా తట్టుకుంటుంది.పొలాన్ని కొర్రమీను చేపలు పెంచే చెరువుగా తవ్వించేందుకు టాటా హిటాచి యంత్రానికి గంటకు రూ.2,200 ఖర్చు తనకు అయ్యిందని చెప్పారు. కొత్తగా కొర్రమీను చేపలు పెంచాలనుకునేవారు ఎవరైనా సరే చెరువును ఎండాకాలంలో తవ్వించుకుంటే ఖర్చు కాస్త తగ్గుతుందన్నారు. వర్షాకాలంలో తవ్వించడం వల్ల 50 గంటల సమయం పట్టిందన్నారు. కట్ట పోసే మట్టి నిలబడకుండా జారిపోతుందని అందుకే ఎండాకాలంలో అయితే మంచిదని రాజేశ్వరి చెప్పారు. వర్షాకాలంలో తాను చెరువు తవ్వించడం వల్ల లక్షా 10 వేల రూపాయల ఖర్చు వచ్చిందన్నారు. తాను చేసిన తప్పు ఇంకెవరూ చేయొద్దని, ఎండాకాలంలో గానీ, శీతాకాలంలో గాని చెరువు తవ్వించుకుంటే ఖర్చు తగ్గించుకోవచ్చని రాజేశ్వరి సలహా. చెరువు చుట్టూ వేసే గ్రీన్ క్లాత్‌, బర్డ్ నెట్‌ ఏర్పాటుకు రూ.80 వేలు అయిందని చెప్పారు. ఎకరం చెరువులో 12 నుండి 14 వేల పిల్లల్ని వేసుకోవచ్చు. అయితే.. తాను 9 వేల చేప పిల్లలు వేసినట్లు తెలిపారు. ఒక్కో పిల్లను రూ.20కి కొనుగోలు చేసినట్లు చెప్పారు. చేపపిల్లను చెరువులో వదిలే ముందు 300 మిల్లీ లీటర్ల పొటాషియం ఫర్మాంగనేట్‌ ను నీటిలో కలిపి శానిటైజ్ చేయాలని చెప్పారు.

చేపల చెరువు కట్ట ఆరు అడుగుల ఎత్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. చెరువు నీటి నుండి కట్ట ఎత్తు మొత్తంగా 10 నుండి 12 అడుగుల ఎత్తు చేసుకోవాలన్నారు. చెరువు తవ్వకం పూర్తయిన తర్వాత చుట్టూ గ్రీన్ క్లాత్ కట్టాలని చెప్పారు. ఆ తర్వాత చెరువుపైన బర్డ్ నెట్‌ ఏర్పాటు చేయాలి. బర్డ్ నెట్ కట్టిన తర్వాతే చెరువులో నీరు నింపాలని రాజేశ్వరి చెప్పారు. చెరువు తవ్వకం, గ్రీన్ క్లాత్‌, బర్డ్ నెట్‌ ఖర్చు మొత్తం రూ.1.90 లక్షల అయిందని, చేపపిల్లల కొనుగోలుకు రూ.1.80 వేలు అయిందని, చేపపిల్ల ఫీడ్ కోసం రూ.6.50 లక్షలు అయిందన్నారు.  మొత్తంమీద రూ.8.50 లక్షలు ఖర్చు వచ్చిందని చెప్పారు.కొర్రమీనుల్లో నాటు కొర్రమీను అయితే.. ఏడాది పాటు పెంచినా అరకిలో లేదా ముప్పావు కిలో మాత్రమే బరువు వస్తుందని, వియత్నాం కొర్రమీను అయితే ఐదు నెలల్లోనే కిలో బరువు వరకు ఎదుగుతాయన్నారు. పైగా నాటు కొర్రమీను చేపలు ఒకదాన్ని మరొకటి పీకి తినే అలవాటు ఉంటున్నారు. వియత్నాం కొర్రమీను చిన్నప్పటి నుంచీ ఫీడ్‌ కే అలవాలు పడి ఉంటుంది కనుకు రెండు మూడు రోజులు ఫీడ్ వేయకపోయినా ఒకదాన్ని ఒకటి పీక్కుని తీనే అలవాటు ఉండదని చెప్పారు. వియత్నాం కొర్రమీను ఏడాదిలో రెండుసార్లు పంట తీయొచ్చు కనుక ఇది లాభసాటిగా ఉంటుందని రాజేశ్వరి వివరించారు.

చేపపిల్లల్ని చెరువులో వేసిన తర్వాత చెరువులో ఏదో ఒక పక్కన నిలబడి ఒక్ డబ్బాపై చప్పుడు చేయాలన్నారు. డబ్బా చప్పుడుకు పిల్లలన్నీ ఒక దగ్గరకు వస్తాయన్నారు. మొదటి మూడు నాలుగు రోజులు చేపపిల్లలు డబ్బా చప్పుడికి రాకపోవచ్చని, ఆ తర్వాత క్రమంగా అలవాటు పడి చప్పుడు వచ్చిన చోటకు వస్తాయన్నారు. అప్పుడు వాటికి ఫీడ్ వేస్తే చక్కగా తింటాయన్నారు. ప్రతిరోజూ ఉదయాన్నే చెరువు చుట్టూ రెండు మూడు సార్లు తిరిగి, ఏ చేపకు ఏ డిసీజ్ వచ్చిందనేది నిశితంగా పరిశీలించుకోవాలని రాజేశ్వరి సలహా ఇచ్చారు. కొర్రమీను చేప మొండి జాతిదే అయినా.. ఒక్కొక్కప్పుడు తెల్లమచ్చ లేదా రెడ్ డిసీజ్ అనేవి రావచ్చన్నారు. చేపపిల్లకు రెడ్ డిసీజ్‌ వచ్చినప్పుడు దాని నివారణకు అవసరమైన మినరల్స్‌, విటమిన్లు వేస్తే తగ్గిపోతుందన్నారు. అలాగే అయోడిన్ ను చెరువు నీటిలో కలుపుకోవాలన్నారు. దాంతో పాటు చెరువులో నీటిని మార్చాల్సిన అవసరం ఉందా? అని కూడా ప్రతిరోజూ ఉదయం గమనించాలన్నారు.చెరువులో కొర్రమీను చేపపిల్లలు వేసిన నెల రోజుల వరకూ నీటిని మార్చాల్సిన అవసరం అంతగా ఉండదు. ఎందుకంటే అవి విసర్జించే మలినాలు అంత ఎక్కువగా ఉండవు కాబట్టి నీటిని మార్చాల్సిన ఆవశ్యకత ఉండకపోవచ్చు. నెల రోజుల తర్వాతి నుంచి పిల్ల ఎదుగుదల ఎక్కువ అవుతుంది, అది ఫీడ్ ఎక్కువ తనడంతో పాటు మలినాల విసర్జన కూడా అధికం అవుతుంది కనుక రోజు విడిచి రోజు తప్పనిసరిగా పాత నీరు చెరువు నుండి తీసేసి కొత్తనీరు ఇవ్వాలని సలహా ఇచ్చారు. మినరల్స్, విటమిన్లు క్రమంగా వేయకపోయినా నీటిని రోజు విడిచి రోజు మార్చడం మాత్రం మరిచిపోవద్దు, అశ్రద్ధ చేయొద్దని రాజేశ్వరి ఇచ్చిన ముఖ్య సూచన. నీటిని ఎప్పటికప్పుడు మారుస్తుంటే చేప చాలా ఆరోగ్యంగా, త్వరగా ఎదుగుతుంది.చెరువులో తక్కువ పిల్లల్ని వేసుకుంటే తక్కువ ఫీడ్ తీసుకుంటాయని, త్వరగా ఎదుగుతాయని శాస్త్రవేత్త నవాజ్ చెప్పారని, ఆయన సలహాతో పాటు తన బడ్జెట్ ను బట్టి కూడా తాను 9 వేల చేపపిల్లల్నే చెరువులో వేసినట్లు రాజేశ్వరి వెల్లడించారు. ఎక్కువ పిల్లల్ని వేస్తే ఎక్కువ ఫీడ్ తిన్నా ఆక్సిజన్ సరిగా అందక ఎదుగుదల బాగా ఉండదన్నారు. చెరువు మెయింటెనెన్స్ సరిగా చేయకపోతే గడ్డి పెరుగుతుంది, జలగలు వస్తాయి. చేపలకు డీసీజ్ లు కూడా సోకే అవకాశం ఉందని అన్నారు. వేసవి కాలంలో కొర్రమీను చేపకు 6 అడుగుల లోతు నీరు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని చెప్పారు. ఆ మాత్రం లోతు నీరు లేకపోతే చేపలు చనిపోయే ప్రమాదం ఉందన్నారు. అదే వర్షాకాలం, చలికాలంలో అయితే.. 4 లేదా 3 అడుగుల నీరు ఉన్నా సరిపోతుందని చెప్పారు.వియత్నాం కొర్రమీను చేపల పెంపకంలో యాజమాన్య పద్ధతులు సరిగా పాటిస్తే. చెరువులో పిల్ల వేసిన ఐదు నెలల్లోనే కిలో బరువు వస్తుందన్నారు. చెరువులో నీటిని క్రమం తప్పకుండా మార్చడం వల్ల తమ చెరువులో ఐదు నెలల్లో కేవలం 25 నుండి 26 చేపలు మాత్రమే చనిపోయాయన్నారు. మెయింటెనెన్స్ సరిగా చేసుకుంటే కొర్రమీను చేపల పెంపకంలో నష్టం వచ్చే అవకాశం లేదని రాజేశ్వరి అనుభవ పూర్వంగా చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here