చక్కని పరిమళాలు వెదజల్లే మల్లెపువ్వులను అనేక సుగంధ సాధనాల తయారీలో వినియోగిస్తారు. సబ్బులు, హెయిర్ ఆయిల్స్‌, సౌందర్య సాధనాలు, అగరుబత్తీల తయారీలో మల్లెపూల వినియోగం బాగా ఉంటుంది. సెంట్లు, పర్‌ ఫ్యూమ్‌ లలో మల్లెపూలను ఎక్కువగా వినియోగిస్తారు. సువాసనలు గుభాళించే మల్లెపూలు పక్కన పెట్టుకుని పడుకుంటే వాటి ద్వారా వచ్చే చల్లదనానికి సుఖంగా నిద్రపడుతుంది. కళ్ల మంటలు, నొప్పులు తగ్గడానికి మల్లెపూలు, ఆకులతో తయారుచేసిన కషాయం వాడవచ్చు. మానసిక ఆందోళన, అతి కోపం, మానసిక చంచలత్వాన్ని మల్లెపూలు శాంతపరుస్తాయి. సుగర్ పేషెంట్లు మల్లెపూలతో చేసిన టీ తాగితే మంచిదని అంటారు. బీపీ, చక్కెర స్థాయిలను తగ్గించే గుణం మల్లెలకు ఉందంటారు. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది.ఇలా ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉండి పెరట్లోను, ఇంట్లో కూడా పెంచుకునేందుకు వీలైన మొక్కల్లో మల్లెమొక్క.కూడా ఒకటి. అలాంటి మల్లెపూల సాగు గురించి, అందులోనూ ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేసే విధానం గురించి తెలుసుకుందాం. కడపజిల్లా మైదుకూరు మండలం ఓబుళాపురంలో యువరైతు మూలే రామానందరెడ్డి ప్రకృతి సేద్యం విధానంలో పలు రకాల పంటలు పండిస్తున్నారు. అదే విధంగా రామానందరెడ్డి ఆర్గానిక్ విధానంలో పావు ఎకరంలో మల్లెపూల సాగును విజయవంతంగా చేస్తున్నారు.

ఈ యువరైతు మల్లెపూల సాగును మూడేళ్లుగా చేస్తున్నారు. తమిళనాడులోని రామేశ్వరం నుంచి బొండుమల్లె మొక్కలను తీసుకొచ్చి, 6X6 అడుగుల దూరంలో రామానందరెడ్డి నాటారు. అలా 25 సెంట్లలో 350 మల్లెమొక్కలు నాటుకున్నారు.  అప్పుడు ఒక్కో మొక్క ఖరీదు మూడున్నర రూపాయలు పడింది. ఒక్కో గొయ్యిలో 7 నుంచి 8 మొక్కలు నాటుకుంటే వాటిలో రెండు నుంచి మూడు మొక్కలు బతుకుతాయని యువరైతు తెలిపారు. ఈ విధంగా మల్లెమొక్కల్ని నాటుకుంటే తక్కువ సమయంలో ఎక్కువ గుబురు వస్తుందన్నారు. పావు ఎకరంలో నాటుకునేందుకు 3 వేల మల్లెమొక్కలు కొనుగోలు చేసినట్లు చెప్పారు. అంటే మొక్కల కోసం సుమారు రూ.10 వేలు ఖర్చు చేశారు.మల్లెమొక్కలను భూమిలో రెండు మూడు అంగుళాల గుంత కొట్టి, మొక్క వేర్లు భూమిలోపలికి వెళ్లేలా పెట్టి, నీరు పెట్టాలన్నారు. ఆ తర్వాత డ్రిప్ ఇరిగేషన్ విధానంలో నీటి సరఫరా చేస్తున్నట్లు యువరైతు చెప్పారు. ఎండాకాలంలో అయితే.. మల్లెమొక్కలకు రెండు రోజులకు ఒకసారి రెండు గంటల పాటు డ్రిప్‌ ద్వారా నీరు సరఫరా చేస్తామన్నారు. మల్లెపూల క్రాప్ తీసిన తర్వాత నాలుగు రోజుల పాటు పూర్తిగా ఎండగడితే.. కొమ్మ పగిలి కొత్త చిగుర్లు, మొగ్గలు వస్తాయన్నారు. మల్లెమొక్కలు నాటిన ఏడాదిన్నరకి పావు ఎకరంలో రోజుకు కిలో నుంచి కిలోనర మల్లెపూల దిగుబడి వచ్చిందన్నారు.మల్లెతోటలో ఏడాది వరకు ఆదాయం ఉండదు కనుక అంతర పంటగా తొలుత కొత్తిమీర పంట వేసుకున్నట్లు రామానందరెడ్డి చెప్పారు. కొత్తిమీర సాగుకు రూ.2 వేలు పెట్టుబడి పెడితే.. 45 రోజుల్లోనే రూ.20 వేల ఆదాయం వచ్చిందన్నారు. దీంతో పొలం దుక్కికి, చదును చేయడానికి చేసిన ట్రాక్టర్‌ ఖర్చు, మల్లెమొక్కలు కొని నాటేందుకు అయిన డబ్బు మొత్తం తిరిగి వచ్చేసిందని తెలిపారు. కొత్తిమీర పంట తీసేసిన తర్వాత వేరుసెనగ పంటను అంతర పంటగా వేశారు. మల్లెమొక్కల మధ్య ఉన్న ఖాళీ భూమిలో వేరుసెనగ విత్తనాలు నాటినట్లు వెల్లడించారు. తద్వారా పావు ఎకరంలో పది బస్తాల వేరుసెనగ దిగుబడి వచ్చిందని చెప్పారు.యువరైతు రామానందరెడ్డి పంటలకు ఎరువులు, పురుగుమందులేవీ వినియోగించరు. ఎనిమిదేళ్లుగా ఈ రైతు ప్రకృతి వ్యవసాయం పద్ధతిలోనే సాగు చేస్తున్నారు. ప్రకృతి విధానంలో సాగు చేయడం వల్ల నేల గుల్లబారి ఉంటుందని, ఒక రోజు నీటి సరఫరా లేకపోయినా మొక్కలు వాడిపోవని అనుభవంతో చెప్పారు. మొక్కలకు ఆవుల ఎరువుతో తయారు చేసిన ద్రవ జీవామృతాన్ని డ్రిప్ ద్వారా వదులుతామన్నారు. మల్లె మొక్కలు పూత దశకు వచ్చే సమయానికి ముందు మొక్క చుట్టూ రెండు కిలోల ఘన జీవామృతం వేస్తామన్నారు. ఒకవేళ ఎప్పుడైనా మొక్కలకు తెగుళ్లు సోకితే గానుగ నూనె, లేదా వేపనూనె, లేదంటే నీమాస్త్రం స్ప్రే చేస్తామన్నారు. పురుగులను గుడ్డు దశలోనే నివారించుకుంటామ్నారు. మల్లెమొక్కల్ని నల్లి ఆశిస్తుందని, దాని నివారణకు ఎర్రగడ్డ అంటే ఉల్లిగడ్డలతో తయారు చేసిన కషాయం కొడతామని చెప్పారు. ఎప్పుడన్నా పురుగు వస్తే మాత్రం బ్రహ్మాస్త్రం వాడతామని తెలిపారు. వీటన్నింటినీ తామే సొంతంగా తయారు చేసుకుంటామని చెప్పారు. పురుగు నివారణ మందుల తయారీ కోసం రామానందరెడ్డి కేవలం బెల్లం ఖర్చు మాత్రమే చేస్తారు. మిగతావన్నీ ఇంట్లోను, తమ వ్యవసాయ క్షేత్రంలోనే లభిస్తాయన్నారు.రామానందరెడ్డి క్షేత్రంలో మూడో ఏట నుంచి మల్లెపూలు రోజుకు సగటున 6 కిలోల మల్లెపూలు దిగుబడి వస్తున్నట్లు చెప్పారు. మల్లెపూలు కిలోకు రూ.270 కనీస ధర పలుకుతుందని రామానందరెడ్డి తెలిపారు. అదే పెళ్లిళ్ల సీజన్ అయితే.. ధర మరింత ఎక్కువ వస్తుందన్నారు. అయితే.. మల్లెపూలు ఎండాకాలంలో అంటే ఏప్రిల్‌, జూన్, జులై, ఆగస్టు వరకు బాగా దిగుబడి వస్తుంది. అందుకే మిగతా రోజుల్లో ఆదాయం వచ్చేలా అంతరపంటగా లిల్లీ, సంపెంగ పూలు సాగుచేస్తున్నట్లు చెప్పారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో మల్లెతోటను ఎండగడితే మార్చి నుంచి మల్లెమొగ్గల సీజన్‌ మొదలవుతుంది. అప్పటి నుంచి ఐదు నెలల వరకు పావు ఎకరంలో రోజుకు కనీసం రెండు వేల రూపాయలు ఆదాయం వస్తుంది. ఏడాది గడిచే కొద్దీ తమ మల్లెతోటలో రోజుకు 10 నుంచి 13 కిలోల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని అనుభవం ఉన్న రైతులు చెప్పారన్నారు.నాటురకం మల్లెమొక్కలైతే నాటినప్పటి నుంచి 30 ఏళ్ల పాటు పంట దిగుబడి వస్తుందని ఉద్యానవనశాఖ నిపుణులు చెబుతున్నారు. వేరుపురుగు లాంటి ఇబ్బందులు వచ్చినా కనీసం పదేళ్ల పాటు దిగుబడి, ఆదాయం వస్తూనే ఉంటుంది. ఈ పదేళ్ల పాటు పొలంలో కలుపు ఉండదు, భూమిని దున్నాల్సిన అవసరం ఉండదు. అదనపు సేద్యపు ఖర్చులు ఉండవు. మల్లెపూల సాగులో ప్రధానంగా పువ్వులు కోయడం ఒక్కటే ఖర్చు. అది కూడా రైతు కుటుంబ సభ్యులే కోసుకుంటే ఆ ఖర్చు కూడా తగ్గుతుంది. లేదంటే కూలీలతో పూలు కోయిస్తే ఆ ఖర్చు కొంత అవుతుంది. అనుభవం ఉన్నవారైతే నాలుగు గంటల్లో ఐదు కిలోల మల్లెపూలు కోస్తారు. అంతగా అనుభవం లేనివారైతే అదే సమయంలో రెండున్న కిలోల దాకా కోయగలుగుతారు. మల్లెపూలను ఉదయం 6 గంటలకు కోయడం ప్రారంభిస్తే 10 గంటల వరకు కోసుకోవచ్చన్నారు.మల్లెపూల సాగుతో ఏడాదిలో ఐదు నెలల పాటు రోజూ ఆదాయం వస్తుంది. మొక్కలు నాటేటప్పుడు పెట్టే ఖర్చు, రోజూ నీరు అందించేందుకు ఏర్పాటు చేసే డ్రిప్ ఖర్చు, సేంద్రీయ ఎరువులకు అయ్యే కొద్దిపాటి ఖర్చు, పూలు కోసేందుకు చేసే ఖర్చు తప్ప అదనపు ఖర్చేమీ ఉండదు. పైగా మల్లెమొక్కల నుంచి పదేళ్ల పాటు ప్రతి ఏటా ఆదాయం వస్తూనే ఉంటుంది కనుక ఆర్గానిక్ విధానంలో మల్లెసాగు లాభదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు.

మల్లెపూల సాగులో ఇతర వివరాల కోసం యువరైతు రామానందరెడ్డి ఫోన్ నెంబర్‌ 9866614342లో సంప్రదించవచ్చు.

 

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here