బత్తాయిలో పుష్కలంగా లభించే విటమిన్ సీ మనలో రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. దీనిలోని జీవరసాయనాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. బత్తాయిలో ఉండే ఫ్లేవనాయిడ్లు జీర్ణాశయాన్ని పరిశుభ్రం చేస్తాయి. బత్తాయిని తరచుగా తినేవారి మూత్రపిండాల్లోని విషపదార్థాలను బయటకు పంపేస్తుంది. మలబద్ధకం సమస్య ఉంటే తగ్గిపోతుంది. తరచుగా బత్తాయిరసం తీసుకుంటే మనలోని చెడు కొలెస్ట్రాల్‌ ను బాగా తగ్గించేస్తుంది. బత్తాయిలో లభించే పొటాషియం రక్తపోటును నివారిస్తుంది. బత్తాయిలోని కాల్షియం ఎముకల్ని బలంగా తయారుచేయడానికి ఉపయోగపడుతుంది. బత్తాయిపండు తింటే మన మెదడు, నాడీవ్యవస్థ చురుగ్గా తయారవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతారు.

సిట్రిక్‌ జాతియి చెందిన బత్తాయి రసం చక్కెర వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. బత్తాయిరసంలో  కొద్దిగా నిమ్మరసం, తగిన మోతాదులో తేనె కలిపి ప్రతిరోజూ ఉదయాన్ని బ్రేక్ ఫాస్ట్‌ తో తీసుకుంటే చెక్కెరస్థాయిలో బాగా తగ్గిపోతాయని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. రోజూ బత్తాయి రసం తాగే వారికి అధిక బరువు తగ్గుతుంది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. బత్తాయిలో సీ విటమిన్ తో పాటు పీచు పదర్థాలు, జింక్‌, కాల్షియం కాపర్‌, ఐరన్‌ ఉన్నాయి. బత్తాయిరసం తీసుకుంటే రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది. వంట్లో వేడిని తగ్గిస్తుంది. మూత్రనాళంలో మంట ఉన్నవారు బత్తాయి రసంలో గ్లూకోజ్‌ లేదా చక్కెర కలిపి తాగితే మంట తగ్గుతుంది. మూత్రా సాఫీగా వెళ్లుంది. బత్తాయి రసం యాసిడ్ గ్యాస్ట్రిక్‌ ఎసిడిటీని తగ్గిస్తుంది. గోరువెచ్చని నీటిలో బత్తాయిరసం కలిపి తాగితే నోటి అల్సర్, చెడు శ్వాస తగ్గిపోతాయి.ఇన్ని ప్రయోజనాలున్న బత్తాయి పంటలో కొన్ని యాజామాన్య మెళకువలేంటో ఉద్యానవనశాఖ అధికారుల సూచనలు, అధిక దిగుబడి సాధించేందుకు అనుసరించాల్ని విధానాలు, బత్తాయి పంట పండిస్తున్న రైతుల అనుభవాలేంటో తెలుసుకుందాం.

బత్తాయి దిగుబడి ఎక్కువ కావాలని కోరుకునే రైతులు ముందుగా మొక్కలకు ఫార్ములా 6 అంటే జింక్‌, మాంగనీస్‌, మెగ్నీసియం, కాల్షియం, బోరాన్‌, ఐరన్‌ లను సమృద్ధిగా అందించాలి. బత్తాయి మొక్కకు ఫార్ములా 6 అందించడం అంటే.. తల్లి వేరుకు మాత్రమే ఇవన్నీ అందిస్తే సరిపోతుందనుకోకూడదు. తల్లి వేరు చుట్టూ ఉండే పిల్ల వేర్లుకు కూడా ఫార్ములా 6 పోషకాలు అందించినప్పుడే చెట్టులోని ప్రతి అణుకు, ప్రతి కణమూ బలవర్ధకంగా పెరుగుతుందని ఉద్యానవనశాఖ అధికారులు చెబుతున్నారు. అంటే బత్తాయి మొక్క పిల్ల వేర్లు, పీచు వేర్లు ఎంతవరకు వ్యాపించి ఉంటాయో శాస్త్రీయ పద్ధతిలో ఉద్యానవన శాఖ అధికారి రావుల విద్యాసాగర్‌ వివరించారు.అదెలా అంటే.. మధ్యాహ్నం 11 నుండి 12 గంటల మధ్యలో బత్తాయి చెట్టు నీడ ఎంతవరకు ఉంటుందో అంతవరకు పిల్లవేర్లు, పీచు వేర్లు విస్తరించి ఉంటాయని వారు వివరించారు. అంటే బత్తాయి చెట్టుకు మనం మైక్రో న్యూట్రియంట్లు సమృద్ధిగా అందించాలంటే దాని మొదట్లో అంటే తల్లి వేరు ఉండే చోట మాత్రమే వేస్తే సరిపోదని చెప్పారు. మధ్యాహ్నం పూట చెట్టు నీడ ఆవరించి ఉన్నంత వరకు మనం న్యూట్రియంట్స్ వేయాలన్నారు. అప్పుడు పిల్లవేర్లు కూడా న్యూట్రియంట్స్‌ ను చక్కగా పీల్చుకుని బత్తాయి చెట్టు మొత్తం పోషకాలు అందేలా చేస్తాయన్నారు.

ఫార్ములా 6ను బత్తాయి చెట్టుకు పూత రాక ముందు ఒకసారి, పూత వచ్చిన తర్వాత మరోసారి, బత్తాయి కాయ క్రికెట్ బాల్ సైజులో తయారయ్యాక ఇంకోసారి, కాయ పండు అయ్యేందుకు రెడీగా ఉందనే దశకు నెల రోజుల ముందు మరోసారి తల్లివేరు, పిల్ల వేర్లన్నింటికీ అందేలా ఇవ్వాలని ఉద్యానవన శాఖ అధికారి విద్యాసాగర్‌ సూచించారు. యూరియాను మొక్కలకు భూమి మీద చల్లితో దానిలోని నైట్రోజన్‌ గాలికి ఆవిరైపోతుంది. అందుకే యూరియా వేసే ముందు చెట్టు చుట్టూ నాలుగైదు సెంటీమీటర్ల లోతు గుంత తీసి దాంట్లో యూరియా వేసి, వెంటనే తేమ ఉండే మట్టితో పూర్తిగా కప్పి, దానిపైన నీళ్లు పెట్టుకుంటే మరింత ఉపయోగం ఉంటుందన్నారు విద్యాసాగర్.వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన ఈ ఫార్ములా 6 ప్రకారం బత్తాయి మొక్కల్ని పెంచుకుంటే దాన్ని నాటిన మూడేళ్లు పూర్తయి, నాలుగో ఏట ప్రవేశించినప్పటి నుంచి కొంచె కొంచెంగా పూత, కాయ రావడం మొదలవుతుంది. తొలిసారి రెండు నుంచి మూడు వందల కాయలు వస్తే, మరుసటి ఏడాది ఐదారు వందల కాయలు కాస్తాయి. సుమారు 8 నుంచి 10 సంవత్సరాల వయస్సు వచ్చినప్పటి నుండీ ఒక్కో చెట్టుకు వెయ్యి 1500 బత్తాయి కాయలు కోసిన రైతులు ఉన్నారని వ్యవసాయ నిపుణులు వెల్లడించారు.

బత్తాయి పంట దిగుబడి ఏటికేడాది తగ్గిపోతున్నాయని, కొన్ని చెట్లు ఎండిపోతున్నాయని కొందరు రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదు ఉంది. దాని గురించి కూడా వ్యవసాయ నిపుణులు ఏం చెబుతున్నారంటే.. కర్బన పదార్థం ఉండే పశువుల పేడ, జనుము, జీలుగ లాంటి పచ్చిరొట్ట ఎరువులు వాడకుండా కేవలం రసాయన ఎరువులే విపరీతంగా వాడితే చెట్లు ఎండిపోవచ్చని, దిగుబడి ఎక్కువ రాకపోవచ్చని అధికారి విద్యాసాగర్‌ హెచ్చరించారు.బత్తాయి మొక్కల్ని 6మీటర్లు X 6 మీటర్ల దూరంలో నాటుకోవాలి. ఈ విధంగా నాటుకుంటే ఎకరం నేతలో 111 మొక్కల్ని నాటుకోవచ్చు. ఇటీవలి కాలంలో బ్రెజిల్ బత్తాయికి వినియోగదారుల నుంచి, మార్కెట్ నుండి ఎక్కువ డిమాండ్ వస్తోంది. అయితే.. ఏ బత్తాయి మొక్కనైనా దట్టంగా పెంచుకునేటప్పుడు ప్రూనింగ్ సక్రమంగా చేసుకోవాలని విద్యాసాగర్ సూచించారు. మొక్క నాటినప్పటి నుంచి మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే.. నాలుగు నుంచి ఐదో ఏట వచ్చేసరికి బత్తాయి పంట వాణిజ్యపరంగా దిగుబడి వస్తుందన్నారు. బత్తాయికి ఏ సమయంలో అధిక ధర వస్తుందో అవగాహన లేకపోతే.. టన్ను రూ. 5 నుంచి 10 వేల మధ్యలో వస్తే.. రైతులు నష్టాలు చవిచూసి వేసిన పంట తీసేసిన సందర్భాలు ఉన్నాయని అధికారి విద్యాసాగర్ వెల్లడించారు. ఫిబ్రవరి ఆఖరు నుంచి మార్చి, ఏప్రిల్ నెల చివరి వరకు డిమాండ్ బాగుంటుంది. మే నెలలో అయితే బత్తాయికి రేటు ఎక్కువ పలుకుతుంది. వర్షాలు మొదలైన జూన్, జులై, ఆగస్టు నెలల నాటికి వినియోగదారుల నుంచి డిమాండ్‌ తగ్గుతుంది. తద్వారా ధర కూడా మందగిస్తుంది.

బత్తాయి పండించే రైతు అధిక లాభాలు కళ్ల చూడాలంటే కొన్ని మెళకులను ఉద్యానవనశాఖ అధికారి రావుల విద్యాసాగర్‌ చెప్పారు. సాధారణంగా బత్తాయికి ఎండాకాలంలో ధర బాగా వస్తుంది కనుక ఎప్పుడు కాత రావాలి, ఎప్పుడు పూతరావాలనేది రైతులు నిర్వహించే యాజమాన్య పద్ధతుల బట్టి ఉంటుందని ఉద్యానవనశాఖ అధికారి రావుల విద్యాసాగర్ చెప్పారు. బత్తాయిచెట్టుకు పూత వచ్చినప్పటి నుంచి కాయను మార్కెట్‌ తీసుకెళ్లే వరకు 240 రోజులు పడుతుంది. అంటే 8 నెలల సమయం అన్నమాట. జూన్‌, జులైల్లో తొలిపూత వస్తే.. మార్చి నెలలో బత్తాయి కాయ కోతకు వస్తుంది. అందుకే జూన్‌, జులై, ఆగస్టు లోగా బత్తాయి చెట్టుకు పూత వచ్చేలా చూసుకోవాలన్నారు.జూన్, జులై నెలల్లో బత్తాయి చెట్టుకు పూత రావాలంటే.. అంతకు ముందు పంటను ఎండాకాలం లోపు తెంపి ఉండాలి. పంట తెంపిన తర్వాత నెల రోజుల పాటు సమయం విడిచిపెట్టాలి. ఆ సమయంలో చెట్లకు పొటాష్ ఎరువు అందించాలి. దీంతో చెట్టులో వేడి పుట్టి, పూత వస్తుందని విద్యాసాగర్ వివరించారు. బత్తాయికాయ పైన పసుపురంగులో గానీ, బంగరు రంగులో కాని మెరిసినట్లు నిగారింపు వచ్చినప్పుడు కోతకు సిద్ధంగా ఉందని రైతులు గుర్తు పెట్టుకోవాలి. బత్తాయి చెట్టు మొడట్లో డబుల్ రింగ్ విధానం పెట్టుకోవాలని విద్యాసాగర్ సూచించారు. చెట్టు మొదట్లోనే ఎక్కువ పోషకాలు వేయడం వల్ల ఉపయోగం అంతగా ఉండన్నారు.  అందుకే చెట్టు మొదట్లో ఒక రింగు మాదిరిగాపాదు చేయాలని, తర్వాత మధ్యాహ్నం పూట చెట్టు నీడ ఆవరించి ఉన్న చోటకు కొంచెం బయట మరో రింగు మాదిరిగా గట్టు ఏర్పాటు చేసి, ఆ రెండు రింగుల లోపల పోషకాలు వేయాలన్నారు.

ఇలా చెట్టులోని అన్ని భాగాలకు పోషకాలు సమానంగా, సమృద్ధిగా సరఫరా అయ్యేలా చూసుకుంటే అది ఏపుగా, బలంగా ఎదుగుతుంది. చెట్టు మొదట్లో ఉండే రింగులో పోషకాలు వేస్తే.. కేవలం 10 నుండి 15 శాతం మాత్రమే వేరు పీల్చుకునే అవకాశం ఉంటుంది. మీగతా 85 శాతం వేరు వ్యవస్థ రెండో రింగులోనే ఉంటాయి. అందుకే రెండె రింగుల వ్యవస్థలో యాజమాన్య పద్ధతి పాటించాలని విద్యాసాగర్ సలహా ఇచ్చారు. ఇలా చేసినప్పుడు చెట్టుకు వచ్చిన అన్ని కాయలు, ఒకే సైజులో, పూర్తిస్థాయిలో దిగుబడికి వస్తుందన్నారు. బత్తాయికాయ గోళి సైజులో ఉన్నప్పుడు చెట్టుకు ఐదు గ్రాముల పొటాషియం నైట్రేట్‌ ను లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకుంటే చెట్టుకు వేడి పుడుతుందని, మరికొంత పూత కూడా రావడానికి అవకాశం ఉంటుందన్నారు.బత్తాయి చెట్టు చుట్టూ పెరిగే కలుపు నివారణ కోసం ఆరు నుంచి ఏడాది పాటు ప్రభావం చూపించే గడ్డి మందును కొందరు రైతులు బత్తాయి చెట్టు పాదులోపల కొడుతుంటారని, అది చాలా తప్పు అని విద్యాసాగర్‌ హెచ్చరించారు. గడ్డిమందును బత్తాయి చెట్టు వేర్లు కూడా పీల్చుకుని ఎండు తెగులు వచ్చి చచ్చిపోకే  ప్రమాదం ఉంది కనుక ఈ తప్పు చేయొద్దని అధికారి సూచించారు.

ఉద్యానవనశాఖ అధికారి విద్యాసాగర్ చెప్పిన యాజమాన్య పద్ధతులు సక్రమంగా పాటిస్తే.. ఐదు నుంచి ఆరేడు సంవత్సరాల వయసున్న ఎకరం తోటలోని బత్తాయి చెట్ల నుంచి పది టన్నుల దిగుబడి వచ్చే అవకావం ఉంది. టన్ను రూ.20 నుంచి 30 వేలు ధర పలికినా రెండు నుంచి మూడు లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఇంతకీ ఇంత ఆదాయం వచ్చిన ఎకరం బత్తాయి తోటను పెంచేందుకు రూ.50 నుంచి 60 వేల వరకు ఖర్చు వస్తుందని విద్యాసాగర్ చెప్పారు. మరీ ఎక్కువ ఖర్చు అయిందంటే లక్ష రూపాయలకు మించి అయ్యే అవకావం ఉండదన్నారు. లక్ష రూపాయలు ఖర్చు వచ్చినా లక్ష నుంచి రెండు లక్షలు లాభం వచ్చే అవకాశం ఉంది. ఉద్యానవనశాఖ కూడా బత్తాయి రైతులకు సబ్సిడీ ఇస్తుందని చెప్పారు. ఒక్కో హెక్టారుకు బత్తాయి మొక్క నాటిన తొలి ఏడాది రూ.9 వేలు, మరుసటి సంవత్సరం రూ.3, మూడో ఏడాది రూ.3 వేలు మొత్తం కలిపి రూ.15 వేలు సబ్సిడీ ఇస్తుందని ఉద్యానవనశాఖ అధికారి విద్యాసాగర్ వెల్లడించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here