దుక్కి దున్నక్కర్లేదు. ఏ మాత్రం ఖాళీ నేల ఉన్నా నాటుకోవచ్చు. ఎరువులు వేయాల్సిన పనిలేదు. పశువులు, మేకలు పాడుచేస్తాయని భయం లేదు. శ్రమపడి సాగు నిర్వహణ చేయాల్సిన అవసరం లేదు. పురుగుల బెడద ఉండదు. నీరు తక్కువ ఉన్న నేలలో కూడా దానంతట అదే బ్రతికేస్తుంది. ఏటేటా ఆదాయం తెచ్చిపెడుతుంది. అదే నాటు రకం కుంకుడు చెట్ల పెంపకం. నేల రాలిన కుంకుడు చెట్టు ఆకులు, పూతే భూమికి సారాన్ని ఇస్తాయి. కుంకుడు ఆకులే నేలకు మల్చింగ్‌ మాదిరిగా ఉపయోగపడతాయి. అవే వర్షాకాలంలో కుళ్లిపోయి నేలకు బలాన్నిచ్చే ఎరువుగా మారతాయి.

నాటు కుంకుడు మొక్క నాటిన మూడేళ్ల తర్వాత నుంచి కాపు కాస్తుంది. ఒక్కో చెట్టు నుంచి కనీసం 70 కిలోల దిగుబడి వచ్చినా కిలో రూ.50 అతి తక్కువ ధరకు అమ్మినా కనీసం రూ.3,500 ఆదాయం కనిపిస్తుంది. వేలకు వేల రూపాయలు పెట్టుబడి ఖర్చు లేదు. నాటు కుంకుడు చెట్టు నుంచి ఎంత ఆదాయం వచ్చినా అది లాభం కిందే లెక్క అవుతుంది.

కుంకుడు కాయలు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టు సంరక్షణకు ఆయుర్వేదంలో తయారుచేసే పదార్థాల్లో ప్రత్యేకంగా కుంకుడు కాయలను ఉపయోగిస్తారు. జుట్టు మందంగా ఉండేందుకు, బౌన్సీ హెయిర్ కోసం వినియోగించే సహజ హెయిర్ టానిక్‌ లలో కూడా కుంకుడు కాయలు వినియోగిస్తారు. కుంకుడు కాయల్లో ఉండే ఏ, డీ, ఈ, కే విటమిన్లు జుట్టును మెరిసేలా, మృదువుగా ఉండేలా చేస్తాయి. కుంకుడుకాయల్లో ఉండే యాంటీ మైక్రోబయల్ గుణాలు తలలో బాక్టీరియా, ఇతర ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. తలలో ఉండే పేనులను చంపేస్తాయి. కుంకుడుకాయ పొడి నెత్తిమీద వచ్చే చుండ్రు సమస్యనే ప్రభావవంతంగా నివారిస్తుంది. కుంకుడు కాయలు వాడిన వారి చర్మం తేమగా ఉంచి, పొడిబారకుండా కాపాడతాయి. మొటిమలు, బ్లాక్‌ హెడ్స్‌, తామర, సోరియాసిస్‌ లాంటి చర్మవ్యాధులను తగ్గిస్తాయి. తేలు, పాము కరిచినప్పుడు విష ప్రభావం నుంచి కాపాడతాయి. పొగాకు, మాదకద్రవ్యాలు వినియోగించాలనే కోరిక నుంచి దూరం చేసేందుకు కుంకుడు కాయలు బాగా పనిచేస్తాయి. కుంకుడుకాయల్లో ఉండే టానిక్‌, ఎమెటిక్‌, ఆస్ట్రిజెంట్‌, యాంటీ హెల్మెంటిక్‌ లక్షణాలు ఆస్తమా రోగులకు మంచి ఉపశమనాన్ని ఇస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఇఫ్లమేటరీ లక్షణాలు కీళ్ల నొప్పులను నయం చేయడంలో సమర్థంగా పనిచేస్తాయి. కుంకుడుకాయలోని గింజలను ఆభరణాలను శుభ్రం చేయడానికి, వాటిని ప్రకాశవంతం అయ్యేందుకు వాడవచ్చు.ఇలాంటి ఎన్నెన్నో ప్రయోజనాలున్న నాటు కుంకుడు చెట్లను దాదాపు మూడు దశాబ్దాలుగా పెంచి, పెట్టుబడి లేకుండా మంచి ఆదాయం కళ్లజూస్తున్న నల్గొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి రైతు లోకసాని పద్మారెడ్డి అనుభవాలేంటో తెలుసుకుందాం. పద్మారెడ్డి పలురకాల పంటలు సాగు చేస్తూ.. ఉత్తమ రైతుగా వనమాలి సహా పలు అవార్డులు అందుకున్నారు. నీటి సదుపాయం అంతగా లేని తన 12 ఎకరాల్లో పద్మారెడ్డి 27 ఏళ్లుగా కుంకుడు పంట తీస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియంలో ఓ నర్సరీ వారు తీసి పక్కన పెట్టేసిన నాటు కుంకుడు మొక్కల్ని 27 ఏళ్ల క్రితం తాను తెచ్చి నాటినట్లు చెప్పారు. అప్పట్లో నర్సరీ వారు తనకు మొక్కల్ని ఉచితంగా ఇచ్చారని, అయితే వాటిని తీసుకొచ్చేందుకు ఒక్కో మొక్కకు అప్పట్లో రూ.20 రవాణా ఖర్చు వచ్చిందన్నారు.కుంకుడు మొక్కలను ఎటు చూసినా 20 అడుగుల దూరం ఉండేలా ఎకరంలో 100 మొక్కలు నాటినట్లు పద్మారెడ్డి చెప్పారు. నాటు కుంకుడు మొండి మొక్క కాబట్టి నాటిన మొక్కలన్నీ బతికాయని, కాకపోతే పెరిగిన తర్వాత కొన్ని చెట్లు కాయడం లేదన్నారు. జెనిటికల్‌ గా అన్నీ నాటు కుంకుడే అయినా కొన్ని చెట్లకు సన్న ఆకులున్నాయని, కొన్ని పెద్దగా ఉన్నాయని, కొన్ని చెట్లు గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తుంటే మరికొన్ని చెట్లు కాస్త తక్కువ కాపు కాస్తున్నాయన్నారు. మొక్కలు నాటిన నాలుగో ఏట నుంచి కాయలు కాస్తున్నట్లు చెప్పారు. తమ పొలంలో పైన ఎర్రబెట్ట నేల ఉందని, కింద నల్ల బండ ఉందని తెలిపారు. గతంలో ఇదే నేలలో పద్మారెడ్డి ఆముదం, సజ్జ పంటలు పండించారు.  ఆ తర్వాత బత్తాయితోట పెంచాలనే ఉద్దేశంతో వ్యవసాయ శాస్త్రవేత్తలను సంప్రదించినప్పుడు నీటి లభ్యత తక్కువ ఉన్నందున బత్తాయి వేయొద్దన్నారని తెలిపారు. నీటి అవసరం అంతగా ఉండని రాతి ఉసిరి పండిస్తే బెటరని చెప్పారన్నారు.ఆ తర్వాత కంబాలపల్లి, చందాపల్లి ప్రాంతానికి వెళ్లినప్పుడు ఒకరి పొలంలో చాలా ఏళ్ల నుంచి సహజ సిద్ధంగా పెరిగిన నాటు కుంకుడు చెట్టు బాగా కాయలు కాసి ఉండడాన్ని చూశానన్నారు. కుంకుడు కాయలను వారు జీసీసీ సంస్థకు 30 ఏళ్ల క్రితం కిలోకు రూ.8 చొప్పున అమ్ముతామని చెప్పారన్నారు. ఆ ఒక్క చెట్టు ఆ రోజుల్లో 50 కిలోల బరువు ఉండే 15 నుంచి 20 బస్తాల కుంకుడు కాయలు కాసేది. అలా చూస్తే రూ.400 ఆదాయం ఎలాంటి ఖర్చూ లేకుండా వచ్చేది. అలా చూసుకుంటే ఎకరం నేలలో కుంకుడుకాయల ఆదాయం రూ.40 నుంచి 50 వేల ఆదాయం వస్తుందనే ఆలోచన తనకు వచ్చిందన్నారు.

నాటు కుంకుడు మొక్కలు నాటిన తొలి రోజుల్లో డ్రిప్ సిస్టమ్‌ లో నీరు అందించామని, డ్రిప్‌పై అనుభవం లేకపోవడంతో మూడేళ్లకు ఫెలిలైపోయిందన్నారు. ఆ తర్వాత ఆర్థికంగా వెసులుబాటు కాకపోవడంతో మళ్లీ డ్రిప్ వేయలేకపోయామన్నారు. అయినప్పటికీ కుంకుడు మొక్కలు సహజసిద్ధంగానే పెరిగాయని, నాలుగో ఏట నుంచే కాయలు కాసినట్లు చెప్పారు. తొలి పంటలోనే ఎకరానికి 6 క్వింటాళ్ల దాకా దిగుబడి వచ్చిందన్నారు. అప్పట్లో కిలో పది రూపాయలకు తాను కుంకుడుకాయలు అమ్మినట్లు చెప్పారు. ఆ తర్వాత కుంకుడు చెట్ల మధ్య అంతర పంటగా మూడేళ్లు మునగ పంట పండించినట్లు తెలిపారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు కుంకుడు ఆకు రాలిపోయి, చెట్టు నిద్రావస్థలోకి పోతుందని అర్థమైందన్నారు. మార్చి చివరి నుంచి ఏప్రిల్ వరకు కుంకుడు ఆకు మొత్తం రాలిపోతుంది. రాలిపోయిన ఆకు మల్చింగ్ లా పనిచేస్తుందని, వర్షం కురిసిన తర్వాత ఆ ఆకే కుళ్లి భూమికి సారం ఇస్తుందన్నారు. కుంకుడు ఆకుల కారణంగా నేత అంతా స్పాంజిలా మెత్తగా తయారవుతుందని చెప్పారు. జూన్ నెల నాటికి వర్షాలు కురవకపోయినా గమ్మత్తుగా కుంకుడు చెట్లు మళ్లీ చిగురించి తోట మొత్తం పచ్చగా మారిపోతుందని చెప్పారు. దుక్కి దున్నకపోయినా, నీళ్లు పెట్టకపోయినా, ఎరువులు వేయకపోయినా ఎలాంటి సస్య రక్షణ చర్యలు చేపట్టకపోయినా ప్రతి ఏటా ఆదాయం వస్తూనే ఉందని ఆదర్శ రైతు పద్మారెడ్డి వివరించారు.పదేళ్ల క్రితం అత్యధికంగా కిలో పది రూపాయలకు కుంకుడు కాయలు అమ్మినట్లు పద్మారెడ్డి చెప్పారు. అలాగా ఏటా అత్యధికంగా ఎకరాకు పది క్వింటాళ్ల వరకు పంట దిగుబడి పస్తోందన్నారు. మధ్య మధ్యలో ఒక ఏడాది కాయలేదని, కొన్ని చెట్లకు కాయలు రాలేదన్నారు. అయనప్పటికీ తాము ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయకపోయినా ఆదాయం రావడంనాటు కుంకుడు తోట ప్రత్యేక అన్నారు. కుంకుడు ఆకు చేదు ఉంటుంది కనుక పశువులు, మేకలు తినవు. కోతుల బెడద ఉండదు. కుంకుకు చెట్టుకు పూత పూసినప్పుడు వాటిలోని తేనె తీసుకోడానికి తోట నిండా తేనెటీగలు వస్తాయన్నారు. వాటి ద్వారా చక్కగా పాలినేషన్ జరుగుతుందని వివరించారు. కుంకుడు చెట్లకు భారీగా పూత వస్తుందని, దాంట్లో 90 శాతం పూత రాలిపోయి, 10 శాతం కాయలుగా తయారైనా పంట ఎక్కువగానే ఉంటుందన్నారు. వర్షం కురిసినప్పుడు కుంకుడు చెట్టు పూతలో నీళ్లు నిల్వ ఉండి బూజులా వస్తోందని, అప్పుడు ఎం 45, బావిస్టిన్‌, కార్బండిజమ్‌, సిలీంద్ర నాశిని రెండు సార్లు స్ప్రే చేస్తే ఆ ఇబ్బంది పోయిందన్నారు. ఎర్రనల్లి లాంటి పురుగులు వచ్చి పూతను తింటుంటు చాలా తక్కువ ఘాటు ఉండాలా స్ప్రే చేశానన్నారు. తేనెటీగలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే తక్కువ మోతాదులో క్లోరిపైరిఫాస్, 525 లాంటి పురుగుమందులకు నీళ్లు కలిపి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుందన్నారు. నాటు కుంకుడు తోట పెట్టిన 27 ఏళ్ల తర్వాత ఈ రెండు ఇబ్బందులు కనిపించాయని పద్మారెడ్డి వెల్లడించారు.పద్మారెడ్డి కుంకుడో తోటలో ఒక్కో చెట్టుకు 60 కిలల నుంచి క్వింటాల్ వరకు కాయలు వస్తున్నాయి. ఏ చెట్టుకు ఎంత దిగుబడి వచ్చిందో, ఏ చెట్టు కాయలు బాగా నాణ్యతగా ఉన్నాయనే విషయాలను తాము చెట్లకు నెంబరింగ్ ఇచ్చి, రికార్డు నమోదు చేస్తున్నామని, ఔత్సాహిక రైతులు వస్తే.. ఒక చెట్టు కుంకుడు కాయలను విత్తనాలుగా అందించే ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి, అనంతపురం జిల్లా నుంచి కూడా అనేక మంది రైతులు విత్తనాల కోసం వస్తున్నారన్నారు. కుంకుడు విత్తనం తయారుచేసేందుకు బలంగా ఉన్న చెట్లు, విపరీతంగా కాపు కాసిన, కాయలు చక్కని షేప్‌ ఉండే చెట్ల నుంచి మాత్రమే తాను విత్తనాలు తయారుచేస్తున్నట్లు చెప్పారు. కుంకుడు సాగుకు ఇప్పుడిప్పుడే ఔత్సాహిక రైతులు ఎక్కువగా వస్తుండడంతో నర్సరీ పెంచాలనే ఆలోచన కూడా పద్మారెడ్డి చేస్తున్నట్లు చెప్పారు.గత ఏడాది తమ 12 ఎకరాల నుంచి నాటు కుంకుడు కాయల ద్వారా రూ.12.50 లక్షలు ఆదాయం వచ్చిందన్నారు. కిలో రూ.70కి తాను అమ్మినట్లు చెప్పారు. అవే కాయలు మార్కెట్లో రూ.250 నుంచి రూ.300 వరకు ధర పలుకుతోందన్నారు. కుంకుడు కాయలకు మంచి ధర పలకడంతో ఈ సారి తాను తోటను దున్నించినట్లు చెప్పారు. అందువల్లనో ఏమో కొన్ని చెట్లకు మూడు క్వింటాళ్ల దిగుబడి వచ్చేలా కాపు కాశాయన్నారు. ఒక వ్యాపారి ఇప్పుడు తనకు కిలో రూ.150 చొప్పున 800 క్వింటాళ్లు కావాలని వచ్చారన్నారు. అంటే కుంకుడు పంటకు ఎంత డిమాండ్ ఉందో అర్థం అవుతోందన్నారు. ఐదేసి, పదేసి కిలోల చొప్పున మంచి కుంకుడు కాయలు కావాలని, కిలోకు రూ.300 కూడా ఇస్తామని ముంబై, అహ్మదాబాద్‌ ఇతర రాష్ట్రాల నుంచి తనకు ఫోన్లు వచ్చాయన్నారు. అలాంటి వారికి 2, 5 కిలోల చొప్పున ప్యాకింగ్ చేసి కోరుకున్నవారికి కొరియర్ ద్వారా అందజేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు పద్మారెడ్డి చెప్పారు.నాటు కుంకుడు కాయలు నీళ్లలో వేసిన పది నిమిషాల్లోనే మెత్తగా గుజ్జులా అయిపోయి, గింజ బయటికి వస్తుందని, అదే హైబ్రీడ్ కాయలైతే ఎంతసేపు నానబెట్టిన గట్టిగా ఉంటాయన్నారు. ఈ ఆధునిక కాలంలో ఇళ్లలో ఫ్లోర్ క్లీనర్లు, డిష్ బార్లు వాడుతున్నారని, అయితే. క్రమక్రమంగా ప్రతి ఒక్కరూ ఆర్గానిక్‌ జీవన విధానానికి అలవాటు పడుతుండడతో ఫ్లోర్ క్లీనింగ్‌, డిష్ బార్లకు బదులు కుంకుడు కాయల నురుగును వినియోగించే అవకాశం ఉందని, తద్వారా మరింత డిమాండ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. రూపాయి పెట్టుబడి లేకుండా ఏడాదికి ఎకరం పొలంలో నాటుకుంకుడు చెట్ల నుంచి రూ.50 వేలు ఆదాయం తగ్గకుండా వస్తుందని పద్మారెడ్డి వివరించారు.

వివరాల కోసం ఆదర్శ రైతు పద్మారెడ్డిని 9948111931లో  సంప్రదించవచ్చు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here