ఈ యువ ఐటీ ఇంజనీర్లు ఇద్దరూ పదో తరగతి కలిసి చదువుకున్నారు.  సహజసిద్ధ వ్యవసాయానికి వారి ప్రతిరోజు దినచర్యలో ఓ నాలుగైదు గంటలు కేటాయించారు. అతి తక్కువ పెట్టుబడితో, నివాసాల మధ్య ఉన్న కొద్దిపాటి స్థలంలోనే ‘ఫ్రెష్‌ ఫీల్డ్స్‌’ ఫాం పేరిట ఆరోగ్యాన్నిచ్చే ఆకు కూరలు, కాయగూరలు విజయవంతంగా పండిస్తున్నారు. ఈ యువ ఇంజనీర్లు ఒక ప్రణాళిక ప్రకారం పండిస్తున్న చక్కని పంటలను స్థానికులే స్వయంగా వచ్చి తమకు నచ్చిన వాటిని కోసుకుని, ధర చెల్లించి తీసుకువెళ్తున్నారు. ప్రకృతి సిద్ధంగా పండించిన పంటలను వినియోగిస్తున్న వారు కూడా ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని పొందుతున్నారు. తెలంగాణలోని నల్గొండలో వర్క్‌ ఫ్రమ్ హోమ్‌ చేస్తున్న ఈ యువ ఇంజనీర్లు వంశీ, శ్రీ ఓం హాబీగా తాజా కూరగాయలు, ఆకు కూరలు పండిస్తున్నారు. వాటిని మార్కెట్లో దొరికే రసాయనాలతో పండిండే పంటల ధరలకు కాస్త అటూ ఇటూగా విజయవంతంగా విక్రయిస్తున్నారు. ఆటవిడుపుగా ఆర్గానిక్ పంటలు పండిస్తున్న యువ ఇంజనీర్లు చక్కగా అదనపు ఆదాయం కూడా సంపాదిస్తున్నారు.ముప్పావు ఎకరం నేలలో వంశీ, శ్రీ ఓం సహజ పంటల సేద్యానికి మొదటి పెట్టుబడిగా రూ.2.20 లక్షలు ఖర్చు చేశారు. ఈ ఖర్చులో క్షేత్రాన్ని శుభ్రం చేయడానికి, దుక్కి దున్నించడానికే ఎక్కువ ఖర్చు అయిందన్నారు. ఈ క్షేత్రంలో వారు 14 రకాల ఆకు, కాయగూరలు, వాటర్ మిలన్‌ పంటలు పండిస్తున్నారు. వంశీది వ్యవసాయ కుటుంబం. శ్రీ ఓం ఉపాధ్యాయుల కుటుంబం. వైద్య వృత్తిలో ఉన్న వీరి పదో తరగతి మరో మిత్రుడు కృష్ణసాయి తల్లిదండ్రుల స్థలంలో తాజా పంటలు పండించి, స్థానిక వినియోగదారులకు విక్రయిస్తున్నారు, శ్రీ ఓం సేంద్రీయ మందులు స్ప్రే చేసే పని చూస్తుండగా వంశీ మొక్కల పెంపకాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. వంశీ కుటుంబం వ్యవసాయ కుటుంబమే అయినా తాను స్వయంగా సాగు చేస్తున్నది మాత్రం ఇదే అన్నాడు. శ్రీ ఓంకు వ్యవసాయం చేయడం ఇదే తొలి అనుభవం.బెండ, గోకరకాయ అంటే గోరుచిక్కుడు, వంకాయ, బీర, మిర్చి, టమాట, దోస, కీర,  పాలకూర, తోటకూర, పుదీన, గోంగూర, మెంతికూర, క్యాబేజి, వాటర్ మిలన్‌ పంటలాను సేంద్రీయ విధానంలో ఈ యువ ఇంజనీర్లు పండిస్తున్నారు. వినియోగదారుల నుంచి వస్తున్న స్పందన చూస్తూ.. తాము ఊహించిన దానికన్నా ఎక్కువే ఉందని వంశీ తెలిపాడు. ఆదాయం కూడా తాము ఆశించిన దానికన్నా అధికంగా ఉందన్నాడు. రసాయనాలతో పండించిన పంటలు రోజుకు పది కిలోల వరకూ అమ్ముడవుతుంటే.. ఆర్గానిక్ విధానంలో తాము పండించిన కూరగాయలు, ఆకుకూరలు నాలుగైదు కిలోలు వెళ్తున్నాయన్నాడు. తాము ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం మొదలు పెట్టిన మూడు, నాలుగు నెలల్లోనే ఆదాయం రాబడుతున్నామన్నాడు.ఉన్న చోటనే ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనుకున్నప్పుడు వంశీ, శ్రీ ఓం ఇద్దరు రెండు మూడు నెలలు వివిధ క్షేత్రాల్లోకి వెళ్లి పంటల సాగుపై అవగాహన తెచ్చుకున్నారు. తాము చేసే సాగులో కేవలం నీమ్ ఆయిల్‌, కానుగ ఆయిల్ మాత్రమే వాడతామని చెప్పాడు. తమ మిత్రుడి తండ్రి శ్రీనివాస్‌ రెడ్డిని భూమి అడిగిన కొద్ది రోజుల్లోనే దాదాపు రెండు లక్షలు ఖర్చుపెట్టి చుట్టూ ఫెన్సింగ్ వేసి ఇచ్చారని వంశీ తెలిపాడు. తమకు తమ టెన్త్‌ క్లాస్ మిత్రులు అవినాష్‌, సాయినాధ్‌ ఫ్రెండ్స్‌ తమకు సహాయం చేస్తుంటారని శ్రీ ఓం చెప్పాడు. వారు వారాంతాల్లో గాని, ప్రతి రోజూ ఉదయంపూట గాని తమతో పొలంలో పనిచేస్తుంటారని తెలిపాడు. వారితో పాటు వంశీ బాబాయ్‌, కజిన్ కూడా సాగులో మెళకువలు చెబుతుంటారని చెప్పాడు.తోటలో గతంలో ఉన్న బత్తాయి చెట్ల మొదళ్లు తొలగించి, దుక్కి దున్ని, బెడ్లుగా ఏర్పాటు చేసి, వాటిలో వర్మీ కంపోస్ట్‌ కలిపి, బెడ్లపై మల్సింగ్ కవర్ వేసి వంశీ, శ్రీ ఓం పంటల సాగు ప్రారంభించారు. తొలిసారిగా తాము వ్యవసాయం మొదలుపెట్టినందున అనుభవం లేక బెడ్స్‌ ఏర్పాటు కాస్త ఎక్కువగానే ఖర్చు పెట్టామన్నారు. విత్తనాలను తాము పలు చోట్ల నుంచి మేలైన రకాలను ఎంపిక చేసుకుని తెచ్చామని వంశీ చెప్పాడు. తాము వేసిన పంటల్లో క్యాబేజి ఒక్కటే కొద్దిగా ఇబ్బంది పెట్టిందని, మిగతా అన్నీ చక్కగా దిగుబడి ఇస్తున్నాయన్నాడు. సీతాకోక చిలుకలు వచ్చి క్యాబేజీ ఆకులపై మచ్చలు చేశాయన్నాడు. ఈ ఒక్క ఇబ్బందితో సగం పంట నష్టపోయినట్లు చెప్పాడు.ఏ సమయానికి ఎంత సేంద్రీయ ఎరువు వేయాలి? ఏ టైమ్‌ కి నీమ్‌ ఆయిల్ స్ప్రే చేయాలి? జీవామృతం ఎప్పుడు కొట్టాలనేది శ్రీ ఓం చూసుకుంటాడు. పంటల సేల్స్ విషయం వంశీ చూసుకుంటాడు. మరో మిత్రుడు ఏ మొక్క ఎలా ఉండి? నీళ్లు సరిగా అందుతున్నాయా? లేదా? లాంటి విషయాలను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తుంటాడని చెప్పారు. ప్రతి నాలుగు రోజులకు ఒకసారి నీమ్ ఆయిల్ లేదా జీవామృతం స్ప్రే చేస్తుంటామని, ప్రతి నాలుగు రోజులకు ఒక ఎరువు అందించేలా చూస్తామని శ్రీ ఓం చెప్పాడు. డైలీ పనుల కోసం ఒక పనిమనిషి పెట్ఉటకున్నామని వంశీ, శ్రీ ఓం తెలిపారు.పంటలను మార్కెటింగ్‌ చేయడంలో తమకు అస్సలు అనుభవం లేదని, అయితే.. తాము చేస్తున్న పనిని చూసి, పంటలను చూసి స్థానికంగా ఉంటే వినియోగదారులే రెండు రోజులకోసారి స్వయంగా వచ్చి తమకు నచ్చిన వాటిని తెంపుకుని తీసుకెళ్తున్నారని వంశీ తెలిపాడు. దాంతో పాటు వినియోగదారులే తమ పంటలకు మౌత్‌ పబ్లిసిటీ ఇస్తున్నారని చెప్పాడు. క్రమేపీ సూర్యాపేటలోని ఇతర కాలనీల నుంచి కూడా ఉదయం 20 మంది, సాయంత్రం 15 మంది వినియోగదారులు వచ్చి తాజా కూరగాయలు, ఆకుకూరలు తీసుకెళ్తున్నట్లు వెల్లడించాడు. తాము ఎలాంటి మార్కెటింగ్‌ వ్యూహాలు చేయకుండానే ఒకరి నుంచి ఒకరు తెలుసుకుని వినాయోగదారులు రోజు రోజుకూ పెరుగుతున్నారని అన్నాడు. ఒకసారి వచ్చిన వినియోగదారులు మళ్లీ మళ్లీ తమ పంటలు కొనుగోలు చేసేందుకు రావడం పట్ల వంశీ ఆనందం వ్యక్తం చేశాడు.పంట చేతికి వచ్చిన ప్రాథమిక దశలోనే రోజూ రూ.2 వేలు వరకు తమకు ఆదాయం వస్తోందని వంశీ తెలిపాడు. రాను రాను ఆదాయం మరింత పెరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఆర్గానిక్‌ విధానంలో పంటలు సాగు చేసి, దిగుబడులు మొదలైన 40 రోజుల్లోనే తమ పెట్టుబడిలో దాదాపు సగం తిరిగి వచ్చిందన్నాడు.యువ ఇంజనీర్లు చేస్తున్న సాగు, దిగుబడులు బాగున్నాయని, వీరు పండించే కాయగూరలు, ఆకుకూరలు రుచికరంగా ఉన్నాయని తమకు బాగా నచ్చాయని, వాడుతున్న తమకు ఆరోగ్యం కూడా బాగుందని కొందరు వినియోగదారులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రకృతి వ్యవసాయం చేయాలని, ఆదాయమే పరమావధిగా కాకుండా ప్రయోగాత్మకంగా ఈ యువ ఇంజనీర్లు చేస్తున్న కృషి మెచ్చుకోదగ్గది అని భూమిని ఇచ్చిన పాదూరి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. వంశీ, శ్రీ ఓం చేస్తున్న విధానం చూస్తే.. రైతు బిడ్డ అయిన తానే ఆశ్చర్యపోతున్నట్లు తెలిపారు.వినాయోగదారుడికి నాణ్యమైన పంటలు అందించాలనే తమ లక్ష్యం తమకు విజయం చేకూర్చిపెడుతోందని శ్రీ ఓం అన్నాడు. మార్కెట్ రేట్లకు కాస్త అటూ ఇటూగా తమ పంటలకు ధర పెడతామన్నారు. ఒకసారి కొన్న వినియోగదారుడు మళ్లీ తమ దగ్గరకు వచ్చాడంటే అదే తమ విజయం అని చెప్పాడు. తాము ఇష్టపడి చేస్తున్న ఆర్గానిక్ సాగు కాబట్టి ఒక్కసారి కూడా ఎందుకు పెట్టుకున్నాంరా బాబూ అనే ఆలోచనే తమకు రాలేదని వెల్లడించాడు. మరుసటి రోజు క్షేత్రంలోకి వచ్చి ఏమేం పనులు చేయాలనే ముందురోజే తాము పనులను కేటాయించుకుంటామని, దాంతో ఒక క్రమ పద్ధతిలో పనులు జరిగిపోతాయన్నారు. వినియోగదారులకు ఇలాగే నాణ్యమైన ఉత్పత్తులు అందిస్తే.. తప్పకుండా లాభాలు వస్తాయని వంశీ, శ్రీ ఓం ధీమాగా చెప్పారు. ఆర్గానిక్ విధానంలో ప్రతిరోజు పంటసాగు పనులు చేస్తుండడం వల్ల తాము హ్యాపీగా, హెల్దీగా ఉన్నామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here