మార్కెట్లో ఎక్కడ చూసినా కొద్ది రోజులుగా సీజనల్ ఫ్రూట్‌ సీతాఫలం గుట్టలు గుట్టలుగా కనిపిస్తున్నాయి. సీతాఫలం చక్కని రుచికరమైన పండు. చిన్న పిల్లలు మొదలు వృద్ధుల వరకు ఎంతో ఇష్టంగా తినే ఫలాల్లో సీతాఫలం ఒకటి. సీతాఫలంలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ‘సి’ కూడా అధికమే. సీతాఫలంలో ఉండే పీచుపదార్థం మనం తిన్న ఆహారం తేలికగా జీర్ణం అయ్యేందుకు ఉపయోగపడుతుంది. సీతాఫలం గుజ్జు మన నోటిలోని జీర్ణరసాలను బాగా పెంచుతుంది. సీతాఫలం తింటే అల్సర్లు నయం అవుతాయి. ఎసిడిటీని నివారిస్తుంది. మృదువైన చర్మ సౌందర్యానికి ఉపయోగపడే సూక్ష్మ పోషకాలు ఉంటాయి. సీతాఫలంలోని బి6 విటమిన్‌ ఎక్కువ ఉండడం వల్ల బ్రోంకైల్  ఇన్ఫ్లమేషన్‌ తగ్గించి ఆస్త్మా వ్యాధిని తగ్గిస్తుంది. దీంట్లో అధికంగా ఉండే మెగ్నీషియ కార్డియాక్ అటాక్స్‌ నుంచి రక్షిస్తుంది. సీతాఫలంలోని పొటాషియం, మెగ్నీషియంలు రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.  సీతాఫలంలోని మెగ్నీషియం మన శరీరంలో వాటర్ ను బ్యాలెన్స్ చేయడానికి సహాయపడుతుంది. తద్వారా కీళ్ల నొప్పులు తగ్గుతాయి.సీతాఫలం ఆకు నుండి గుజ్జు తిని పారవేసే దానిలోని గింజ వరకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్యశాస్త్రం చెబుతోంది. ఇందులోని ప్రతి అణువూ ఔషధ గుణాలతో నిండి ఉంటుందని పరిశోధనల్లో రుజువైంది. సీతాఫలం దేహ పుష్టిని పెంచుతుంది. దీర్ఘకాలిక రోగాలను నశింపజేసే శక్తి ఈ సీతాఫలానికి ఉంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సీతాఫలం జ్యూస్‌లో తేనె పాలు కలిపి తీసుకుంటే క్యాలరీలను పెంచుతుంది. గర్భిణులు సీతాఫలం తింటే గర్భంలోని శిశువు మెదడు, నాడీవ్యవస్థ, వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా సీతాఫలం గర్భస్రావాన్ని నివారిస్తుంది. సీతాఫలంలో ఉండే డైటరీ ఫైబర్‌ టైప్ 2 డయాబెటీస్‌ ను తగ్గిస్తుందని కూడా కొందరు చెబుతారు. సీతాఫంలో లభించే నియాసిన్, డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉండి, దీనిని తిన్నవారిలో కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తుంది. ఐరన్ బాగా ఎక్కువగా ఉండే సీతాఫలం అది తిన్నవారిలో అనీమియా సమస్యను తగ్గిస్దుంది. దంతాల ఆరోగ్యాన్ని సీతాఫలం పెంచుతుంది. దంతక్షయం కాకుండా కాపాడుతుంది. సీతాఫలంలో ఉండే రెబోప్లెవిన్‌, విటమిన్ సి వల్ల కళ్ల ఆరోగ్యాని, ప్రీరాడికల్స్‌ను నివారించి, చక్కని కంటిచూపు ఇస్తాయి.

ఇన్ని ప్రయోజనాలున్న సీతాఫలం సాగు గురించి, అందులోని మెళకువలు, పెట్టుబడి, రాబడి తదితర విషయాల గురించి తెలుసుకుందాం.సీతాఫలం పొలంగట్లు, రోడ్ల పక్కన, పెరట్లో, అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో ఇలా ఎక్కడ అంటే అక్కడ సహజసిద్ధంగా పెరిగి మనకు వర్షాకాలం వచ్చే సరికి చక్కని ఆరోగ్యాన్నిచ్చే ఫలాలను అందిస్తుంది. ఇప్పటికీ అవి సహజసిద్ధంగా దొరుకుతున్నప్పటికీ ఆధునిక కాలంలో సీతాఫలం సాగును వాణిజ్యపరంగా రైతులు సాగుచేస్తున్నారు. సీతాఫలం సాగు చేయడానికి పెట్టుబడి పెద్దగా అవసరం ఉండదు. మెయింటెనెన్స్ సున్నా అనే చెప్పాలి. ఆదాయం మాత్రం స్థిరంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం బాగా పెరిగిన తర్వాత వెంచర్లలో కూడా సీతాఫలం మొక్కలు నాటి, పెంచుతున్నారు.కమర్షియల్ గా సాగు చేస్తున్న సీతాఫలాల్లో రెండు రకాలు ఉన్నాయని సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని ఆకుపాముల వద్ద అమృత నర్సరీ నిర్వహిస్తున్న రైతు మధు చెప్పారు. అవి బాలానగర్‌, సూపర్ గోల్డ్‌. బాలానగర్ సీతాఫలం చెట్టు ఆకు చాలా చిన్నగా ఉంటుంది. ఇది గ్రాఫ్టింగ్ చేసిన మొక్క. రెండేళ్లలోనే బాలానగర్ సీతాఫలం నుంచి దిగుబడి మొదలవుతుంది. ఇది చలికాలం పంట కనుక తొలకరి వర్షాలు అంటూ జూన్, జులై నెలల్లోనే పూత, పిందె మొదలవుతాయి.  దసరా, దీపావళి నాటికి పంట పూర్తయి, మనం వినియోగించేందుకు అందుబాటులోకి వస్తుంది. నర్సరీల్లో అభివృద్ధి చేసిన సూపర్ గోల్డ్ సీతాఫలం మొక్కను ఆరు నెలల వయస్సు నుంచి అమ్మకానికి పెడతారు. దీన్ని నాటిన రైతు మొదటి రెండేళ్లు కొమ్మ కత్తిరింపు అంటే ప్రూనింగ్ చేసి, ఎక్కువ కొమ్మలు వచ్చేలా చూసుకోవాలి. ఈ రకం సీతాఫలం మొక్కకు మూడో సంవత్సరం రాగానే జనవరి నుంచి ఐదు నెలల పాటు నీటి సరఫరాను పూర్తిగా నిలిపివేయాలని మధు చెప్పారు. ఎండాకాలంలో సీతాఫలం మొక్క విశ్రాంతి మూడ్ లోకి వెళ్లి, ఆకు మొత్తం రాల్చేస్తుంది. జూన్ వర్షాలు కురిసిన తర్వాత కణుపులు ఉన్న చోటల్లా కొత్త చిగుర్లు వస్తాయి. వాటి నుంచి 15 నుంచి 20 రోజుల తర్వాత పూత కూడా మొదలవుతుందన్నారు మధు.సీతాఫలం మొక్క పూతలోనే మేల్, ఫిమేల్ రెండూ ఉంటాయి కనుక దాన్ని చేతితో పాలినేషన్ చేయక్కర్లేదు. స్వయం పాలినేషన్ చేసుకుంటుంది. సూపర్ గోల్డ్ రకం సీతాఫలం మొక్కల నుంచి నవంబర్ లో కాయలు పండ్లుగా తయారై మనం వినియోగించేందుకు సిద్ధంగా ఉంటాయి. సహజంగా లభించే సీతాఫలాలు, బాలానగర్ సీతాఫలాలు మనకు దసరా, దీపావళి సమయంలో వినియోగానికి వస్తే.. నవంబర్ నుంచి సూపర్ గోల్డ్ సీతాఫలాలు వస్తాయి. జనవరి మొదటి లేదా రెండో వారానికి దీని పంట పూర్తవుతుంది. జూన్‌, జులై నుంచి నవంబర్ వరకు మాత్రమే రైతు సూపర్ గోల్డ్‌ రకం సీతాఫలం సాగుపై ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. నవంబర్ నుంచి పంట తీసుకుంటాం. జనవరిలో పంట మొత్తం తీసుకున్న తర్వాత నీటి సరఫరా నిలిపేయాలని మధు చెప్పారు. సీతాఫలంలో అక్కడక్కడా పిండినల్లి మాత్రమే కనిపిస్తుంది. లీటర్ నీళ్లలో 5 గ్రాముల సున్నం కలిపి స్ప్రే చేయడం ద్వారా పిండినల్లిని మొత్తం నివారించవచ్చు.సీతాఫలానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తోట వద్దే సీతాఫలానికి కిలో రూ.50 పలుకుతోంది. ఈ రేటుకు అమ్మినా ఎకరాకు 2 నుంచి 3 లక్షల రూపాయల ఆదాయం వస్తుందని మధు వెల్లడించారు. సీతాఫలం మొక్క నాటిన మొదటి రెండేళ్లు క్రమం తప్పకుండా ప్రూనింగ్ చేయడం, మొక్కకు బలం అందించడం, కొమ్మలు ఎక్కువగా పెరిగేలా చూసుకోవడం మాత్రమే సీతాఫలం రైతుకు ఖర్చు అవుతుంది. మూడో ఏట నుంచి జూన్ నుంచి నాలుగు నెలల పాటు జాగ్రత్తగా చూసుకుని, జీవసంబంధ ఎరువులు, యూమిక్ యాసిడ్, న్యూట్రింట్స్‌ ను డ్రిప్ ద్వారా పంపించాలి.  సీతాఫలాలు మంచి సైజ్ వచ్చిన తర్వాత హార్వెస్ట్‌ చేసుకుని, మార్కెటింగ్ చేసుకోవడం రైతు చేయాల్సి ఉంటుంది. అతి తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడితో సాగు చేసి, అధిక దిగుబడులు, ఆర్థిక లాభాలు తెచ్చిపెట్టే పంట సీతాఫలం అనే చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here