‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు’ అన్నాడు కవి వేమన. ఆవు పాల ప్రాధాన్యతను, విశిష్టతను ఈ ఒక్క మాటలో చెప్పాడు వేమన. అలాంటి పాల దిగుబడి ఎక్కువ చేయాలంటే కాస్తయినా శాస్త్రీయ విధానంలో ఆవులను పోషించాలని చెబుతున్నారు పశు సంవర్ధకశాఖ రిటైర్డ్ డైరెక్టర్ డాక్టర్ జి. విజయ్ కుమార్ శర్మ. ఆవుల పోషణలో శాస్త్రీయ విధానం పాటిస్తే పాల దిగుబడి మరింత అధికంగా వస్తుందన్నారు. గో పోషణలో అన్నదాతలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన సవివరంగా తెలియజేశారు. రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో గో పోషణపై జరిగిన అవగాహన సదస్సులో విజయ్ కుమార్ శర్మ మాట్లాడారు.స్వచ్ఛమైన మంచి ఆహారాన్ని అందిస్తేనే ఆవుల నుంచి మనం అధిక దిగుబడి తీసుకోవచ్చని విజయ్ కుమార్ శర్మ తెలిపారు. అలాంటి స్వచ్ఛమైన మంచి ఆహారాన్ని ఆవులకు అందించడంపై గోశాలల నిర్వాహకులు బాగా దృష్టిసారించాలని అన్నారు. గో పోషణలో శాస్త్రీయ విధానాలు పాటించాలని సూచించారు. ఆవుదూడ మేత తినడం మొదలైనప్పటి నుంచి ఎలాంటి గ్రాసం పెట్టాలి? ఎంతెంత పరిమాణంలో వేయాలి? రోజుకు ఆవుదూడ ఎంత బరువు పెరగాలి? రోజుకు ఎంత బరువు పెరిగితే ఎన్నాళ్లకు ఎదకు వస్తుంది? చూలు ఎలా నిలబడుతుంది? చూలి ఆవును ఏ విధంగా సాకాలి అనే అంశాలపై విజయ్ కుమార్ శర్మ శాస్త్రీయంగా వివరించారు. గోపోషణలో పాటించాల్సిన పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చక్కగా వివరించారు.గోశాలల నిర్వాహకుల నుంచి ప్రధానంగా వినిపిస్తున్న కంప్లైంట్ ఆవులు చూలి కట్టడం లేదు. ఒకవేళ చూలి కట్టినా నిలబడడం లేదు. పాలు ఇవ్వడం లేదు. లేగదూడలు చనిపోతున్నాయి. ఇలాంటి సమస్యలతో గోశాలల నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆవు ఒక సజీవ కర్మాగారం అని విజయ్ కుమార్ శర్మ అభివర్ణించారు. మనిషికి పనికిరాని వ్యర్థ పదార్థాలను స్వీకరించి, మనకు పాలు అనే అమృత ధారలు వర్షిస్తున్నవి గోమాతలు అన్నారు. అలాంటి గోమాత పాలు సరిగా ఇవ్వడం లేదంటే లోపం గోశాల నిర్వహణలోనే ఉందన్నారు. సరైన పోషణ లేకపోవడం వల్లే గోవులు నశించిపోతున్నాయంటారాయన. పోషణ సరిగా లేకపోతే ఎంత పెద్ద పొదుగు అయినా మడతలు పడిపోయి క్షీణిస్తున్నాయన్నారు. ఆవులకు మనం వేసే ఎండుగడ్డి అసలు ఆహారమే కాదంటారు విజయ్ కుమార్ శర్మ. ఆవుకు సరిగా ఆహారం ఇవ్వకపోతే, దాని కడుపులోకి పీచు పదార్థం కావాలి కాబట్టి ఆవు ఎండుగడ్డి తింటుందన్నారు. ఆవుకు ఎండుగడ్డి వేయడం అంటే దాని కడుపు నింపిన కోరిక తీరుస్తున్నాం అంటారు. ఆవు వధశాలకు పోయేటప్పుడు ఏడవదు. రైతు సరైన పోషణ చేయకపోతే అది బాధపడుతుందన్నారు.ఒక ఆవు కానీ, గేదె కాని దాని శరీర బరువును ముందుగా రైతు తెలుసుకోవాలని విజయ్ కుమార్ శర్మ చెప్పారు. ఒక ఆవు బరువు 400 కిలోలు ఉందంటే దానికి ఏడు లేదా ఎనిమిది కిలోల ఎండుగడ్డి పెట్టొచ్చన్నారు. అంతకు మించి ఎండుగడ్డి పెట్టకూడదని చెప్పారు. అదే పచ్చగడ్డి అయితే.. ఆవు బరువులో కనీసం పది శాతం ఇవ్వాలని శాస్త్రీయంగా నిర్ణయించినట్లు వివరించారు. అంటే 400 కిలోల బరువున్న ఆవుకు రోజుకు 40 కిలోల పచ్చగడ్డి ఇవ్వాలన్నారు. ఆవు పొట్ట నింపేందుకు అనేక మంది రైతులు బిస్కెట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వేస్ట్, హోటల్ వేస్ట్, కొందరైతే దారుణంగా చికెన్ వేస్ట్ ఆవులకు పెట్టి పాలు పిండుతున్నారని విజయ్ కుమార్ శర్మ చెప్పారు. ఇలాంటి దారుణమైన దాణాలు పెట్టిన ఆవుల పాలు తాగడం వల్లే మనుషులకు రోగాలు వస్తున్నాయని హెచ్చరించారు.ఆవులకు జొన్నలు, సజ్జలు, రాగులు, మొక్కజొన్నలు లాంటి ఒకే గింజ ఉండే పిండిపదార్థాలు పెడితే.. వాటిలోని పిండి పదార్థాలు కొవ్వుగా మారి, అది పాలుగా మారి మనకు వస్తాయన్నారు. ఆవు శరీరంలో పిండిపదార్థాలు ఉంటేనే మనకు పాల దిగుబడి పెరుగుతుందన్నారు. ఆవు శరీరంలో పిండిపదార్థలు, కొవ్వులు లేకపోతే చేపు ఇంజెక్షన్లు చేసినా పాలు ఎక్కడి నుంచి వస్తాయని అన్నారు. అందుకే బెల్లం, పిండిపదార్థాలు ఆవులకు పెట్టాలని తాను సూచిస్తానన్నారు. ఇలాంటి మంచి ఆహారం కాకుండా ఆవుకు పుట్టి, కందిపొట్టు, శెనగపొట్టు, మినపపొట్టు ఎక్కువగా పెడితే దాని పేగులు నడవక, పేగులు మెలికపడి, పేడ వేయక చనిపోయిన కొన్ని వందల సందర్భాలు చూశానన్నారు.ఆవుకు ఇచ్చే దాణాను పిండిపదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు అని మూడు భాగాలు చేయాలని విజయ్ కుమార్ శర్మ తెలిపారు. ఆవులకు కొవ్వుపదార్థాలు ఎలాగూ వేయడం లేదు కాబట్టి 50 నుంచి 60 శాతం వరకు పిండిపదార్థాలు ఇవ్వాలని సూచించారు. మిగతా 40 శాతం తవుడు, సెనగలు, మినుములు, కందులు, పెసలు, ఉలవలు లాంటి మాంసకృత్తులు ఉండే ఆహారం పెట్టాలన్నారు. ఆవు పోషణ సరిగ్గా ఉంటేనే పాల ఉత్పత్తి బాగుంటుందని, పునరుత్పత్తి శక్తి సరిగా ఉంటుందని చెప్పారు.ఒంగోలు ఆవుదూడ ఎదిగి చూలి కట్టాలంటే మూడు నుంచి మూడున్నరేళ్లు పడుతుందని శాస్త్రం చెబుతోందని విజయ్ కుమార్ శర్మ తెలిపారు. ఆవు ఎదకు రావడం వేరు. చూలి కట్టడం వేరు. ఎదకు వచ్చినవన్నీ చూలి కట్టవు. చూలికట్టినవన్నీ నిలవవు అని చెప్పారు. ఆవుదూడ రోజుకు 400 నుంచి 500 గ్రాముల బరువు పెరగాలని సైన్స్ చెబుతోందన్నారు. ఆవు 250 కిలోల బరువు మించితే కానీ ఎద లక్షణాలు బయటకు కనిపించవన్నారు. అప్పుడు కానీ చూలి నిలవదు అని పెద్దలు చెప్పారన్నారు. రోజుకు 400 గ్రాముల చొప్పున ఆవుదూడ బరువు పెరిగితే అది 250 కిలోలు రావడానికి కనీసం రెండేళ్లు పడుతుందన్నారు. అంటే శాస్త్రం ప్రకారం ఆవుదూడ రెండేళ్లకు ఎదకు వచ్చి తీరాలని వివరించారు. పోషణ సరిగా చేయకపోవడం వల్ల మన ఆవులు మూడు నుంచి మూడున్నరేళ్లకు గానీ ఎదకు రావడం లేదన్నారు. ఆవుదూడ తల్లి గర్భంలో ఉన్నప్పుడే దాని పునరుత్పాదక శక్తి పెరుగుతుందని తెలిపారు. ఆవు చూలికట్టిన 6,7, 8 నెలల్లో దాన్ని గర్భంతో ఉన్న కూతురును చూసుకున్నంత జాగ్రత్తగా మంచి ఆహారంతో మేపితేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు. దేశవాళీ ఆవులు ఎండను బాగా ఇష్టపడతాయని, వర్షానికి ఇబ్బంది పడతాయని విజయ్ కుమార్ శర్మ వివరించారు.
మన పెరట్లోని ఆవు ఎప్పుడైనా చక్కగా నెమరు వేస్తూ.. తనకు తానుగా పడుకుందంటే.. మన పోషణ బాగా ఉందని అర్థం అన్నారు. అలాంటి ఆవు దగ్గర చక్కని సువాసన వస్తుందని విజయ్ కుమార్ శర్మ చెప్పారు. ఆవు పేడ, మూత్రాన్ని జోడించుకుని సేంద్రీయ ఎరువు తయారు చేసుకోవాలని, తద్వారా ఆర్గానిక్ పంటలు పండించుకోవాలన్నారు. అప్పుడే మన సమాజం ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు.