దొండకాయ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. అయితే.. దొండకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే.. వదిలిపెట్టరని నిపుణులు చెబుతారు. దొండకాయలో ఫైబర్‌ ఉంటుంది. విటమిన్‌ బీ 1, బీ 2, బీ 3, బీ 6, బీ 9, విటమిన్ సీ, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, ఫాస్పరస్‌, పొటాషియం, సోడియం, జింక్‌ లాంటి ఎన్నో పోషకాలు అధికంగా ఉన్నాయి.దొండకాయను షుగర్ వ్యాధిగ్రస్తులకు వాడే ఆయుర్వేద ఔషధంలో వినియోగిస్తారు. వీటిలో ఉండే యాంటీ అడిపోజెనిక్‌ ఏజెంట్‌ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయని అధ్యయనాల్లో తేలింది. చక్కెర వ్యాధిగ్రస్తులు వారంలో ఒక రోజు దొండకాయ తిన్నా, దొండ ఆకుల రసం తాగినా బ్లడ్ షుగర్ లెవెల్స్‌ అదుపులో ఉంటాయి. దొండకాయలో ఉండే థయామిన్‌ కార్బొహైడ్రేట్‌ లను గ్లూకోజ్‌ గా మారుస్తుంది. దొండకాయ జీవక్రియను నియంత్రిస్తుంది. దొండలోని థయామిన్‌ రక్తం ప్లాస్మాలోకి ప్రవేశించి అధిక శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇదే ఎర్ర రక్తకణాల తయారీకి సహాయపడుతుంది. ఇది కొన్ని జన్యుపరమైన వ్యాధులను నయం చేస్తుంది. దొండకాయలు తినేవారికి రక్తహీనతను దూరం చేస్తుంది. దాంతో పాటు స్థూలకాయాన్ని నిరోధిస్తుంది. దొండకాయలో డైటరీ ఫైబర్‌ ఎక్కువ. దాంతో మలబద్ధకం, అల్సర్లు, ఎసిడిటీ లాంటి జీర్ణ వ్యవస్థ సమస్యలను తగ్గిస్తుంది. దొండలో ఉండే బీటా కెరోటిన్‌ విటమిన్ ఏ గా మారి కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఆస్తమా నివారణలో దొండకాయ కీలకపాత్ర పోషిస్తుందని అధ్యయనాలు స్పష్టం చేశాయి.ఇన్ని పోషకాలు ఉన్న దొండతీగ మొండి జాతికి చెందింది. ఎలాంటి నేలలో అయినా సులువుగా పెరుగుతుంది. సాధారణంగా దొండ సాగను మనం పందిళ్లపై చేయడం చూసి ఉంటాం. అయితే.. మొండి దొండ కనుక ఇది నేలపైన కూడా చక్కగా పంట ఇస్తుంది. వర్షాలు కురిసినా, దొండతీగ నీటిలో మునిగినా నీరు తగ్గిన కొద్ది రోజుల్లోనే మళ్లీ యధాస్థితికి వచ్చేసి కాయలు కాస్తుంది.

దొండతీగను మూడు నాలుగు కణుపులు ఉండేలా కత్తిరించుకుని భూమిలో పాతిపెడితే అది మళ్లీ వేర్లు పుట్టి మొలుస్తుంది. ఏపీలోని అమరావతి ప్రాంతం పెనుమాకలో గోవిందరెడ్డి 30 ఏళ్లుగా దొండ సాగులో మంచి ఫలితాలు రాబడుతున్నారు. దొండసాగులో ఆయన అనుభవాలేంటో తెలుసుకుందాం. రెండేళ్లుగా మాత్రం నేల మీద పాకే దొండసాగు చేస్తున్నారు.నేల మీద పాకించే దొండతీగను సాలుకు సాలుకు మధ్య గజం దూరం ఉండేలా నేలలో పాతుతామని గోవిందరెడ్డి చెప్పారు. మొక్కకు మొక్కకు మధ్య దూరం 30 నుంచి 34 అంగుళాల దూరం ఉంచుతామన్నారు. దొండపాదు సాగుకు కలుపు నివారణ అతి ముఖ్యమైన విషయం అన్నారు. దొండమొక్క నాటిన తర్వాత రెండేళ్ల వరకు అది పంట ఇస్తూనే ఉంటుంది. పందిరి దొండ సాగులో పంట దెబ్బతినే అవకాశాలు తక్కువే అయినా.. వానలు కురిసినా 20 నుంచి 30 రోజుల్లో మళ్లీ మొక్క నవనవలాడుతూ పెరిగిపోతుందని తెలిపారు. నీటిలో మొత్తం మునిగిపోయినా 55 నుంచి 60 రోజుల్లో మళ్లీ కాపు వచ్చేస్తుందని చెప్పారు. వారం రోజుల పాటు నీటిలో మునిగిపోయినా దొండమొక్క చచ్చిపోదు.. దానికి ఏమీ కాదు. ఎకరం దొండతోట కోసం పందిరి వేస్తే రూ.2 లక్షల కనీసం ఖర్చు అవుతుంది. పందిరి దొండకన్నా నేలమీద పాకే దొండపాదుకే ఎక్కువ దిగుబడి వస్తుందని గోవిందరెడ్డి అనుభవంతో చెప్పారు.నేలమీద పాకే దొండలో ఎకరానికి 50 కిలోల బరువు ప్రకారం 20 నుంచి 25 సంచుల దిగుబడి వస్తుంది. 50 కిలోల దొండకాయలకు రూ.2,800, రూ. 2,900 తగ్గకుండా ధర పలుకుతుంది. దొండకాయ ఒక్కో కోతకు రూ.75 వేల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు.  ఏడాదిలో నాలుగు కోతలు తాము కోశామని రూ.3 లక్షల ఆదాయం వచ్చిందని గోవిందరెడ్డి చెప్పారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో దొండకాయలకు మంచి రేటు పలుకుతుందని, ఆ సమంలో నెల రోజులు దొండకాయలు కాస్తే లాభాల పంట పండుతుందని తెలిపారు. మిగతా రోజుల్లో వచ్చే పంటతో పెట్టుబడి, కూలీల ఖర్చు, మందులు లాంటి ఖర్చులకు సరిపోతుందన్నారు. అప్పుడు లక్ష రూపాయల ఆదాయం వస్తుందని అన్నారు. 2002 నుంచీ తాను దొండ సాగు చేస్తున్నానని ఏనాడూ తనకు నష్టం రాలేదని చెప్పారు. నవంబర్‌, డిసెంబర్, జనవరి నెలల్లో తప్ప మిగతా నెలల్లో వచ్చే దొండ దిగుబడిలో ఖర్చులు పోగా కోతకు రూ.10 నుంచి 15 వేలు మిగులుతూనే ఉందన్నారు.ఎకరం భూమిలో దొండ సాగు చేయడానికి సుమారు రూ.30 నుంచి రూ. 32 మధ్యన ఖర్చు అవుతుందని గోవిందరెడ్డి వివరించారు. నాటుకునే ఒక్కో దొండకాడకు రూ.25 రూపాయలు ఉంటుందని, నాటే కూలీలకు రూ.20 వేలు ఖర్చు అవుతుంది. మొక్క నాటిన రెండు నెలలకే దొండకాయ కోతకు వస్తుంది. తొలి కోత నుంచి ప్రతి పది రోజులకు ఒక కోత వస్తుందని గోవిందరెడ్డి తెలిపారు. ఒక టిక్కీకి తక్కువలో తక్కువ ధర అంటే రూ.150 కి తగ్గదన్నారు. దొండసాగు చేసే రైతుకు బస్తాకు 50 కిలోల చొప్పున 25 నుంచి 30 బస్తాల దిగుబడి వచ్చి, బస్తా రూ.400 నుంచి రూ. 500 ధర వస్తే.. నో లాస్ నో గెయిన్‌ గా ఉంటుందన్నారు.తాము పండించే దొండకాయలు కాస్త లావుగా ఉంటాయని రావులపాలెం లాంటి ప్రాంతాల నుంచి తెచ్చిన టిష్యూ కల్చర్‌ దొండపాదులకు కాసే కాయలు సన్నంగా ఉంటాయని గోవిందరెడ్డి వివరించారు. పందిరి వేస్లే ఖర్చు ఎక్కువ అవుతుందని, నేల మీద పాకించే పాదుకు ఖర్చు తక్కువ అవుతుంది. దొండపాదును కలుపుతీత, మందులు చల్లడం ద్వారా మనిషి తొక్కితేనే పంట దిగుబడి మరింత ఎక్కువ వస్దుందన్నారు.

దొండసాగులో సస్య రక్షణ విషయానికి వస్తే.. డీఏపీ, 28:28లు, 1026 లాంటి ఎరువులు వాడతామని గోవిందరెడ్డి తెలిపారు. ఎకరానికి రెండు బస్తాల చొప్పున కోతకోతకు ఎరువు వేస్తామన్నారు. దొండపాదుకు పచ్చ పురుగు ఆశిస్తుంది కనుక పురుగు మందులు మాత్రం తప్పనిసరిగా కొట్టాల్సి ఉంటుందన్నారు. దొండపాదుకు తెగుల్లు వస్తూ ఉంటాయి, పోతాయని వాటి గురించి రైతు పట్టించుకోవాల్సిన పనిలేదని చెప్పారు. ఏదైనా తెగులు వచ్చి ఆకులు ఎర్రబడినా పది రోజులకు దానికదే పచ్చబడుతుందన్నారు. నేలమీద దొండ సాగుకు ఎకరం మీద ఏటా ఖర్చులు పోను రూ.2 లక్షల వరకు మిగులు ఉంటుందని గోవిందరెడ్డి వెల్లడించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here