జాజికాయ వినియోగించిన వారిలో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. శృంగారం మీద కోరిక పెరుగుతుంది. పురుషులలో వీర్యకణాలను వృద్ధి చేస్తుంది. సన్నని మంట మీద జాజికాయను నేతితో వేగించి పొడిగా చేసుకుని ఉదయం సాయంత్రం గోరువెచ్చని ఆవుపాలకు 5 గ్రాములు కలుపుకుని తాగితే నపుంసకత్వాన్ని పారదోలుతుంది. నరాల బలహీనత పోతుంది. కొద్దిగా జాజికాయ పొడిని నీళ్లు, లేదా తేనెతో కలిపి పేస్ట్‌ లా చేసుకుని ముఖానికి రాసుకుంటే ముఖ చర్మం కాంతివంతం అవుతుంది. కిళ్లీలో జాజికాయ వేసుకుని తింటే నోటి దుర్వాసన పోగొడుతుంది. జాజికాయను వినియోగిస్తే అలసట వల్ల వచ్చే జ్వరం పోతుంది. ఆవేశం, ఆగ్రహం, ఉద్రేకాన్ని తగ్గించి మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. జలుబు, దగ్గు, కఫానికి జాజికాయ చక్కని ఔషధంలా పనిచేస్తుంది. జాజికాయలో ఉండే ‘మిరిస్టిసిన్‌’ మెదడును చురుగ్గా పనిచేయిస్తుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాలను పూర్తిగా తొలగించే శక్తి జాజికాయలో ఉంది. మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది. అయితే.. గర్భవతులు మాత్రం జాజికాయ వినియోగానికి దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.మనం వాడుకునే సుగంధ ద్రవ్యాలలో జాజికాయకు మంచి స్థానం ఉంది. ఔషధ జాతి పంట అయిన జాజికాయకు మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. జాజికాయ వినియోగించిన వారికి ఆరోగ్యం, సాగు చేసిన రైతన్నకు అధిక ఆదాయం సమకూరుతాయి. ఇలాంటి ఎన్నో మేళ్లు చేసే జాజికాయ పంటను కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం యండపల్లికి చెందిన రైతు గుండ్ర అంబయ్య సాగు చేస్తున్నారు. జాజికాయ సాగులో ఉండే మెళకువలు, లాభనష్టాలేంటో అంబయ్య మాటల్లో తెలుసుకుందాం.జాజికాయలు సైజు బాగుంటే 100 కాయలు కిలో బరువు తూగుతాయి. వెయ్యి కాయల నుంచి జాపత్రి కిలో బరువు వస్తుందని అంబయ్య తెలిపారు. జాజికాయలను తాను ప్రస్తుతం కిలో రూ.,3,500 కు అమ్ముతున్నట్లు తెలిపారు. మొక్కలు, పంటలు అంటే అంబయ్యకు చిన్నప్పటి నుండీ ఎంతో ఇష్టం. చదువు పూర్తిచేసిన తర్వాత వ్యవసాయంలోకి వచ్చినప్పటి నుంచీ ఏదో ఒక కొత్తరకం పంటను సాగుచేస్తూనే ఉన్నారు అంబయ్య. ముందు తమ పొలంలో అరటి సాగుచేసేవాడ్నని, సముద్రానికి దగ్గరలో ఉన్నందున గాలికి చెట్లు పడిపోతుండడంతో పామాయిల్‌ వేసినట్లు చెప్పారు. పామాయిల్ తోటలో ముందుగా తాను కంద పంట వేసినట్లు చెప్పారు. అయితే.. కందకు గిట్టుబాటు ధర రాకపోవడంతో జాజికాయ పంట సాగు చేయాలనే ఆలోచన వచ్చిందన్నారు. అంబయ్య ఆరు ఎకరాల పామాయిల్ తోటలో అంతర పంటగా రెండు ఎకరాల్లో ఆరేళ్లుగా జాజికాయ సాగు చేస్తున్నారు.అంబయ్య పామాయిల్‌ తోటలో అంతర పంటగా జాజికాయ పంట సాగుచేస్తున్నారు. జాజికాయ పంట ఖరీదైనది, సాగు చేయడానికి ఖర్చు తక్కువ అవుతుందని అంబయ్య చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక రైతు జాజికాయ పంట సాగుచేస్తున్న తీరును గమనించి, తాను కూడా దానివైపే మొగ్గు చూపానన్నారు. జాజికాయ సాగుకు వాతావరణంలో చల్లదనం ఎక్కువ కావాలన్నారు. 25 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత దాటని ప్రాంతంలో బహిరంగ ప్రదేశంలో కూడా ఈ పంట చక్కగా సాగు అవుతుంది. జాజికాయ మొక్కలకు నీడ అవసరం కనుక కొబ్బరితోటలో కాని, పామాయిల్‌ తోటలో కాని అంతర పంటగా వేసుకుంటే మంచిదని చెప్పారు. ఎండ తగిలితే జాజికాయ మొక్కలు సరిగా ఎదగవని అంబయ్య తన అనుభవంతో తెలిపారు. పామాయిల్ తోటలో అయితే.. ఎకరంలో 50 జాజికాయ మొక్కలు పెంచుకోవచ్చు. అదే కొబ్బరితోటలో ఎకరానికి 100 మొక్కల దాకా నాటుకోవచ్చని చెప్పారు.దేశవాళీ జాజికాయ మొక్కలు ఒక్కొక్కటి రూ.100 చొప్పున తూర్పు గోదావరి జిల్లా కడియపులంక నర్సరీలో దొరుకుతాయి. బెంగళూరులోని ప్రభుత్వ నర్సరీ నుంచి బడ్డింగ్ ప్లాంట్‌ లు రెండు తీసుకొచ్చినట్లు చెప్పారు అంబయ్య. తమ తోటలో జాజికాయ మొక్కలు పచ్చగా బాగా ఎదుగుతుంటే.. తమ ప్రాంతం ఈ పంటకు అనుకూలంగా ఉంటుందని భావించి, కేరళ నుంచి కూడా మరో ఐదు జాజికాయ మొక్కలు తీసుకొచ్చినట్లు తెలిపారు. అలా దేశీయ, గ్రాఫ్టింగ్‌, బడ్డింగ్ మొక్కలను ముందుగా 20 సెంట్లలో 20 మొక్కలు నాటినట్లు చెప్పారు. దేశవాళీ మొక్కలు నాటిన ఆరు సంవత్సరాలకు కాపుకు వచ్చాయన్నారు. క్రాప్టింగ్‌, బడ్డింగ్ మొక్కలైతే నాలుగేళ్లకు కాపు కాసినట్లు చెప్పారు.జాజికాయ మొక్కలను ప్రభుత్వం కేరళశ్రీ, విశ్వశ్రీ అనే రెండు రకాల గ్రాఫ్టింగ్‌ తయారు చేసింది. ప్రైవేట్ నర్సరీల్లో అయితే గోల్డెన్ నట్‌, ఇంకా చాలా రకాలు రూపొందించాయన్నారు. దేశవాళీ జాజికాయ మొక్కలు నాటుకున్నప్పుడు పాలినేషన్ కోసం తప్పనిసరిగా ప్రతి 15 ఫిమేల్ మొక్కలకు ఒక పోతు మొక్క కూడా తోటలో వేసుకోవాలని అంబయ్య తెలిపారు. అదే అంటుకట్టిన మొక్కలకు మేల్ మొక్కలు పెట్టాల్సిన అవసరం ఉండదన్నారు.దేశవాళీ జాజికాయ మొక్కలు కాతకు వచ్చేదాకి ఎక్కువ చల్లదనం ఉండేలా చూడాల్సిన అవసరం ఉంటుంది. నీటి సదుపాయం కూడా ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. మొక్కకు వేడి ఎక్కువ తగలకుండా చేసి, మొక్కను బతికించడమే జాజికాయ సాగులో కీలకం అన్నారు అంబయ్య. పది పదిహేను ఏళ్ల పాటు నీడ ఇవ్వాలన్నారు. ఆ తర్వాత ఓపెన్ గా కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో జాజికాయ పంట సాగు చేయాంటే పైన నీడ తప్పకుండా ఉండాలన్నారు. కేరళలో వందేళ్లు కూడా బతికిన జాజికాయ మొక్కలు ఉన్నాయంటారు అంబయ్య. ఆరేళ్ల వయస్సు దాటిన మొక్కలు ఎక్కువ ఎండ కాసినప్పడు చిగుర్లు మాడాయి తప్ప చెట్టుకు ఇబ్బంది కలగలేదన్నారు. ఆరేళ్లలో జాజికాయ మొక్క 20 అడుగులు పెరిగింది. జాజికాయ పంట సాగుకు మనుషుల అవసరం అంతగా ఉండదు. స్వయంగా జాజికాయ ఔషధ మొక్క కనుక దానికి చీడ పీడలు వచ్చే అవకాశాలు తక్కువ అని, మందులు స్ప్రే చేయాల్సిన అవసరమూ లేదని అంబయ్య చెప్పారు. జాజికాయ మొక్క ఎదుగుదలకు అవసరమైన ఎరువులు వేసుకుంటే సరిపోతుందన్నారు. పంట చేతికి వచ్చిన తర్వాత దిగుబడిని మార్కెట్‌ కు తీసుకె్ళ్లేందుకు ట్రక్కుల అవసరం ఉండదన్నారు.జాజికాయ చెట్టు పరిమాణాన్ని బట్టి దిగుబడి ఉంటుంది.  100 జాజికాయలు కిలో తూగుతున్నాయని, దాని లోపల ఉండే జాపత్రి అయితే.. 1000 కాయల నుంచి తీస్తే కిలో ఉంటుందన్నారు. జాపత్రి కిలో మార్కెట్లో కిలోకు రూ.2,500 నుంచి రూ.3,000 వరకు పలుకుతోంది. అదే జాజికాయ అయితే కిలోకు వెయ్యి నుంచి 1,200 వరకు ఉంటుంది. జాజికాయ చెట్టు నుంచి తొలిసారి పంటగా జాపత్రి అరకిలో దిగుబడి వచ్చిందని, ఇంకా కాయలు ఉన్నాయన్నారు. జాజికాయలు ఒక్కసారిగా దిగుబడి రావని, కాయ ఉండగానే ఏడాది పొడవునా పూత వస్తుంటుందని చెప్పారు. చలికాలంలో అయితే కాస్త ఎక్కువగా పూత పూస్తుందన్నారు. పూత నుంచి జాజికాయ పూర్తిగా పక్వానికి రావడానికి 7 నెలల సమయం తీసుకుంటుంది. జాజికాయ బాగా పక్వానికి వచ్చి పగిలిపోయి జాపత్రి వచ్చినప్పుడు కింద పడిపోక ముందే కాయ నుంచి తీసుకుంటే నాణ్యత ఉంటుంది. జాపత్రి కింద పడినా పెద్దగా ఇబ్బందేమీ ఉండదన్నారు. జాజికాయను, జాపత్రిని చెట్టు నుంచి కోసిన తర్వాత రెండు రోజులు ఎండబెడితే మార్కెట్‌ కు వేసుకోవచ్చు. జాజికాయ మొక్కకు బలాన్నిచ్చేందుకు దిబ్బ ఎరువులు, పశువుల ఎరువు వేసుకుంటే సరిపోతుంది. జాజిమొక్క మొదట్లో నీరు నిల్వ ఉండకుండా, నిత్యం చెమ్మ ఉండేలా చూసుకోవాలి. నాలుగైదు రోజులకు ఒకసారి నీరు సరఫరా చేస్తే సరిపోతుందన్నారు. ఎండాకాలంలో ఎక్కువసార్లు, వర్షాకాలంలో అయితే.. తక్కువ సార్లు నీరు ఇవ్వాలన్నారు. సీవీఆర్ విధానంలో మట్టి ద్రావణాన్ని, జీవామృతాన్ని, పంచగవ్య స్ప్రే చేస్తామన్నారు. జాజిమొక్కను పేను గీకినప్పుడు మాత్రం దశపర్ణి కషాయం స్ప్రే చేస్తే సరిపోతుందని చెప్పారు. తన జాజిపంట సాగును చూసి, ఏలూరు తదితర జిల్లాల నుంచి వచ్చిన రైతులు అడిగితే మొక్కలు తెప్పించి ఇచ్చానని అంబయ్య చెప్పారు. కొబ్బరి తోటల రైతులు కూడా జాజిపంట సాగు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారన్నారు.జాజికాయ, జాపత్రిలను కిరాణా షాపుల్లో సులువుగా అమ్ముకోవచ్చు. అలాగే ఆర్గానిక్ విధానంలో పండిస్తున్న కారణంగా ఆయుర్వేద మందులు తయారు చేసేవారు కూడా కొనుగోలుకు ముందుకు వస్తున్నారని అంబయ్య చెప్పారు. దేశవాళీ జాజిమొక్క రూ. 150, గ్రాఫ్టింగ్‌ మొక్కలైతే ఒక్కొక్కటి రూ.400 నుంచి రూ. 500 పడుతుందన్నారు. జాజికాయ సీడ్‌ ను పాతుకుని పంట సాగు చేయాలంటే కాయ సైజు కాస్త పెద్దది తీసుకుంటే మొక్క త్వరగా ఎదుగుతుందన్నారు. జాజికాయ మొక్క నుంచి పొల్యూషన్ రాదు, ఖర్చు తక్కువ, మెయింటెన్స్‌ కూడా తక్కువ, విలువ ఎక్కువ కాబట్టి ఈ పంటను రైతులు సాగుచేసుకోవచ్చని అంబయ్య సలహా ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here