కొబ్బరి సాగు చేసే రైతులకు త్వరగా కాపు వచ్చే రకం, అధిక ఆదాయాన్ని వెరైటీ మలేసియన్‌ డ్వార్ఫ్‌. ఈ రకం కొబ్బరి మొక్క మూడేళ్ల వయసు నుండే కాపు మొదలవుతుంది. మొక్క మూడు అడుగులు పెరిగినప్పటి నుంచీ దిగుబడి ఇస్తుంది. అయితే.. ఈ డ్వార్ఫ్ రకం హైబ్రీడ్‌ మొక్క పెట్టేటప్పుడు ఒక విధానం, వాటర్ మేనేజ్ మెంట్‌, సస్యరక్షణ అంటే ఆహారం అందించే విధానం, పెస్ట్ మేనేజ్‌ మెంట్‌ తో పాటు ఫ్లవర్ మేనేజ్ మెంట్‌ సరిగ్గా చేస్తే అధిక దిగుబడి ఇస్తుంది. ఇండియాలో రైతులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న రకాల్లో మలేసియన్ డ్వార్ఫ్ గ్రీన్‌, మలేసియన్ డ్వార్ఫ్‌ యెల్లో ఒకటి. మలేషిన్ డ్వార్ఫ్‌ ఏడాది పొడవునా కాయలు కాస్తూనే ఉంటుంది.కొబ్బరి పంట సాగు రెండు రకాల ఆలోచనలతో చేయాల్సి ఉంటుంది. ఒకటి వాటర్‌ కు పనికివచ్చేది, రెండు ఆయిల్ దిగిబడి ఇచ్చేది అనే విధానాల్లో రైతులు ఎంపిక చేసుకోవాలి. కొబ్బరిలో హైబ్రీడ్ రకం సాగుకు, టాల్ వెరైటీ సాగు చేయడానికి చాలా తేడాలు ఉన్నాయి. టాల్ వెరైటీ వేర్లు విస్తరించిన తర్వాత నాలుగైదు ఏళ్ల తర్వాత పంట మొదలవుతుంది. డ్వార్ఫ్ రకం హైబ్రీడ్ కొబ్బరి వేళ్లు ఎక్కువ దూరం విస్తరించవు. మొక్క ఆరేళ్ల వయస్సులో కూడా జేసీబీతో తవ్వి మరోచోట నాటుకున్నా చక్కగా బతుకుతుంది. అంటే చిన్న తత్వంలోనే ఎక్కువ దిగుబడి ఇస్తుంది. సరిపడినంత ఆహారం అందిస్తే జీవితాంతం కాయలు కాస్తూనే ఉంటుంది.కొబ్బరి రైతులు సర్వసాధారణంగా ఎదుర్కొనే సమస్య పిందె దశలో నల్లగా మాడిపోవడం లేదా పూత, పిందె రాలిపోవడం. అలా పూత, పిందె రాలిపోతోందన్నా, పిందె మాడిపోతోందన్నా కారణం ముఖ్యంగా రైతు వాటర్ మేనేజ్‌సరిగా చేయలేదని అర్థం అంటారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం చర్లపల్లి గ్రామ రైతు కృష్ణారెడ్డి. కొబ్బరి మొక్కల పెంపకంలో వాటర్ మేనేజ్ మెంట్ చాలా ముఖ్యం అంటారు. కొబ్బరి మొక్క చుట్టూ లీటర్లకు లీటర్ల నీరు నిల్వ చేయకూడని కృష్ణారెడ్డి హెచ్చరించారు. కొబ్బరి మొక్క మొదట్లో 365 రోజులు పదును అంటే చెమ్మ ఉండాలి. అలాగని చెమ్మ ఎక్కువ ఉన్నా పిందెలు రాలిపోయే ప్రమాదం ఉందన్నారు.  వాటర్ మేనేజ్ మెంట్ ఎక్కువ అయిదా? తక్కువ ఉందా అని తెలుసుకోవడానికి కృష్ణారెడ్డి ఒక పద్ధతి వివరించారు. కొబ్బరిమొక్కకు వాటర్ పెట్టిన గంటా రెండు గంటల తర్వాత ఆరు అంగుళాల లోతు వరకు చేతితో తవ్వి అక్కడి మట్టి తీసుకుని, ముద్దగా చేసి నేలకు కొట్టినప్పుడు ఆ ముద్ద విడిపోతే తరువాతి రోజే నీరు పెట్టాలన్నారు. మట్టి ముద్ద విడిపోకపోతే రెండు రోజులు ఆగి నీరు పెట్టాలన్నారు. రెండు రోజుల తర్వాత నీరు పెట్టి ఆ పైన రెండు రోజులకు మళ్లీ మట్టి ముద్దను పరీక్షించుకోవాలని చెప్పారు. అప్పుడు కూడా మట్టి ముద్ద విడిపోకపోతే నాలుగు రోజులకు ఒకసారి నీరు అందించాలన్నారు. వాటర్ మేనేజ్‌ మెంట్ లో కూడా కొబ్బరి మొక్కకు ఒక క్రమపద్ధతి అలవాటు చేయాలన్నారు. డ్రిప్ వేసుకుని గంటకు 16 లీటర్లు నీరు అందేలా పెట్టాలని చెప్పారు.  అప్పటికి నీరు సరిపోకపోతే మరో అరగంట నీరు ఇవ్వాలన్నారు.పూత, పిందె రాలడానికి కెమికల్ మేనేజ్‌ మెంట్ రెండో అంశం. నత్రజని, భాస్వరం, పొటాష్ వేస్తే సరిపోతుందని చాలా మంది రైతు అనుకుంటారని కృష్ణారెడ్డి చెప్పారు. ఈ క్రమంలో షాపులో దొరికిన ఎరువులు తెచ్చి వేస్తారని, దాంట్లో కొబ్బరికి ఇవ్వాల్సిన పర్సెంటేజీలో ఉందా లేదా చూసుకోవడం ముఖ్యం అన్నారు. 14:35:14 మోతాదులో నత్రజని, భాస్వరం, పోటాష్ ను 3:2:1 కిలోల రేషియోలో వేయాలన్నారు. రెండో న్యూట్రింట్‌ గా కాల్షియం, సల్ఫర్, మెగ్నీషియం, నికిల్‌, కోబాల్ట్, సిలికాన్‌ న్యూట్రింట్‌ లు అందించాలన్నారు. ఈ ఎరువులను రూట్ జోన్‌ ప్రాంతానికి కొద్ది దూరంలో సన్నటి గాడి అంగుళం లోతులో కొట్టి దాంట్లో వేసి, మట్టిని కప్పేయాలని చెప్పారు.మలేషియన్ డ్వార్ఫ్‌ కొబ్బరి మేనేజ్‌ మెంట్‌ లో రైతులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఆరు సంవత్సరాల వరకు క్రమం తప్పకుండా ప్రతి 60 రోజులకు ఒకసారి చొప్పున రసాయన ఎరువులు కానీ, ఆర్గానిక్ ఎరువులు కానీ ఇవ్వాలని కృష్ణారెడ్డి చెప్పారు. అలా చేయకపోతే రూట్ జోన్ పెరగదు, ఒకవేళ రూట్ జోన్ పెరిగినా ఒకసారి పూత వచ్చి, ఆ తర్వాత రాకపోవచ్చని హెచ్చరించారు. మైక్రోన్యూట్రింట్స్ విషయానికి వస్తే.. సీఎంఎస్‌ అంటే కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్‌ మిశ్రమం వాడాల్సి ఉంటుంది. ఈ మిశ్రమం వాడితే చెట్టుకు కావాల్సి పోషకాలు సక్రమంగా అందుతాయి. కాయలు కూడా మంచి సైజు పెరుగుతాయి. కొబ్బరి నీళ్లు, కొబ్బరి కూడా అధికంగా వస్తుంది.కొబ్బరి సాగులో పెస్ట్‌ మేనేజ్‌ మెంట్ కూడా ముఖ్యమే. దీనికి ప్రధానంగా రెండే సమస్యలు ఉంటాయి. ఒకటి రైనోసార్ బీటిల్ అంటే కొమ్ము పురుగు, రెండోది కొమ్ముల్లేని కస్టడ్ బీటిల్. కొబ్బరి, పామాయిల్‌, ఈత, ఖర్జూర చెట్ల మీద రైనోసార్ బీటిల్ ప్రభావం చూపిస్తుంది. దానికి అవే ఆహారం. కొమ్ము పురుగు అమావాస్యకు పది రోజుల ముందు ఆయా మొక్కల మొవ్వులో గుడ్లు పెడుతుంది. ఉష్ణోగ్రత వల్ల అమావాస్య వచ్చేసరికి గుడ్లు పగిలి, చిన్న పిల్లలు మెల్లిగా మొవ్వులోపలికి వెళ్లిపోతాయని కృష్ణారెడ్డి వివరించారు. మొక్కలు చిన్నగా ఉన్నప్పుడే కొమ్ముపురుగు పిల్లలు మొవ్వు లోపలికి వెళ్లిపోయి వాటిని చంపేస్తాయి. పెద్ద చెట్లకైతే మొవ్వు లోపలి ఆకులకు కొమ్ముపురుగు పిల్లలు గీరుకుని తింటాయి. దాంతో కొబ్బరి ఆకులు ఎర్రగా మారిపోతాయి. దాంతో చెట్టు కాయలు ఎక్కువగా కాయదు. అలాగే కొమ్ము పురుగు నుంచి మరో బెడద ఉంటుంది. కొబ్బరి కాయకు చిన్న పగులు వచ్చినా దాంట్లో కూడా గుడ్లు పెట్టేస్తుంది. గుడ్డు నుంచి వచ్చిన చిన్న పరుగులు కాయను తింటూ తింటూ లోపలికి వెళ్తుంది. దాంతో కొబ్బరికాయ పైభాగంలో సగం నల్లగా అయిపోతుంది. అలాంటి కాయలకు మార్కెట్లో డిమాండ్ ఉండదు. రైనోసార్ బీటిల్, కస్టడ్‌ బాటిల్ నివారణకు ప్రతి రైతు ప్రతి అమావాస్యకు ఐదారు రోజుల ముందు రెండు చిటికెల మంచి కంపెనీకి చెందిన కార్బో ఫ్యూరాన్‌ 4G గుళికలు మొవ్వులో వేయాలన్నారు. చిన్న పోచ్‌ బ్యాగుకు కింద రెండు పక్కలా రెండు రంధ్రాలు చేసి, గుళికలు వేసి, తెల్లని కాటన్ బట్టలో కట్టి, మొవ్వులో పెట్టి రెండు పక్కలా కొంచెం కొంచె ఉప్పు వేయాలని కృష్ణారెడ్డి వివరించారు. ఉప్పు తేమను ఆకర్షిస్తుంది. ఆ తేమకు గుళికల్లోని రసాయనం కొద్ది కొద్దిగా కరిగి మొవ్వులోకి దిగుతుంది. దీంతో కొమ్ము, కొమ్ము లేని పురుగుల బెడద తప్పుతుంది.మలేషియన్ డ్వార్ఫ్‌ కొబ్బరి చెట్టుకు పూత వస్తుందనగా ప్రతి 15 రోజులకు ఒకసారి కార్బండిజమ్‌, క్లోరోఫైరిపాస్ అంటే ఒక పెస్టిసైడ్‌, ఒక ఫంగిసైడ్‌ తప్పనిసరిగా గెలలపైన, కొత్తగా బయటికి వస్తున్న మొవ్వు పైన స్ప్రే యాలని కృష్ణారెడ్డి సూచించారు. కొబ్బరిపూత వచ్చే సమయంలో పురుగులను ఆకర్షించేలా ఫర్మాంటేషన్ వాసనను విడుదల చేస్తుందని చెప్పారు.  దాంతో పురుగులు వచ్చి పూతలో చేరిపోతాయి. పురుగుల నివారణ కోసం ప్రతి 15 రోజులకు ఒకసారి పెస్టిసైడ్‌, ఫంగిసైడ్ స్ప్రేచేయాలని అన్నారు. కొబ్బరి పువ్వులు ముడుచుకుని ఉన్నప్పుడు ఒకసారి, విచ్చుకున్నప్పుడు మరోసారి స్ప్రే కొడితే పురుగులన్నీ వెళ్లిపోతాయన్నారు. అయితే.. మలేసియన్ డ్వార్ఫ్‌ కొబ్బరిచెట్టుకు రోగస్ అనే వైట్ ఫ్లై వచ్చేది. ఇప్పుడు కొత్తగా మొక్కలు వేసుకునే వారికి ఈ ఇబ్బంది అంతగా కనిపించడం లేదు. ఆకులు కత్తిరించే కేటర్ పిల్లర్స్‌ వస్తాయి. వీటికి మామూలు స్ప్రే ఇచ్చినా వెళ్లిపోతాయి.

సస్యరక్షణ, పెస్ట్‌ కంట్రోల్‌ సక్రమంగా చేసుకుంటే మలేసియన్‌ డ్వార్ఫ్‌ కొబ్బరిచెట్టు నుంచి కింది వరుసలో ఉన్న కాయలు పెద్దవి అవుతుంటాయి. ఒక గెల సెట్ అవుతుంటాది. మరో గెలకు పువ్వు వస్తుంది. ఇలా ఏడాది పొడవునా మలేసియన్‌ డ్వార్ఫ్ కొబ్బరి కాస్తూనే ఉంటుంది.మలేసియన్ డ్వార్ఫ్ కొబ్బరికాయలు పెద్దగా ఉంటాయి. 650 నుంచి 780 మిల్లీ లీటర్ల నీరు వస్తుంది. అదే గంగాబొండం అయితే 500 నుంచి 600 మిల్లీలీటర్ల నీరు రావచ్చు. మలేసియన్ డ్వార్ఫ్‌ నట్ సైజ్ పెద్దగా వస్తుంది. ఎక్కువ కాయలు వస్తాయి. మలేసియన్‌ డ్వార్ఫ్‌ కొబ్బరికాయ నుంచి నూనె శాతం మిగతా రకాల కన్నా ఎక్కువగా ఉంటుంది.మలేసియన్ డ్వార్ఫ్‌ రకాన్ని సహజసిద్ధ విధానంలో ఆర్గానిక్ పద్ధతిలో సాగుచేయాలనుకునే రైతులు కూడా చేయవచ్చని కృష్ణారెడ్డి చెప్పారు. అయితే.. పంట దిగుబడి కొంచెం తక్కువ రావచ్చన్నారు. వాటర్ మేనేజ్ మెంట్‌ రసాయనాలతో చేసే వారికైనా, ఆర్గానిక్ పద్ధతిలో చేసేవారికైనా ఒకటే ఉంటుంది. ఆర్గానిక్‌ విధానంలో కొబ్బరి సాగుచేయాలంటే రైతు ముందుగా నత్రజని, భాస్వరం, పొటాష్ బ్యాక్టీరియాలు ఉండేలా ఎరువులను తయారు చేసువాలి. ఈ మూడు రకాల బ్యాక్టీరియాను 200 లీటర్ల డ్రమ్ములో తయారుచేసి, దాంట్లో రెండు కిలోల బెల్లం వేసి, ఎరువును కుప్పలా పోసి, ఒక పైప్ తో ఆ కుప్పకు రంధ్రాలు చేయాలన్నారు. ఫర్మాంటేషన్ అభివృద్ధి చేసి బ్యాక్టీరియాను ఆ రంధ్రాల్లో నింపాలని కృష్ణారెడ్డి చెప్పారు. అప్పుడు సహజ ఎరువు లోపల లోపలే కుళ్లిపోయి హ్యూమస్ ఫంగస్ ఏర్పడుతుంది. ఆ తర్వాత ఓ పది పదిహేను రోజుల తర్వాత గోనె పట్టాల్లాంటివి కప్పితే ఎరువు పై భాగం కూడా కుళ్లిపోతుంది. దాన్ని మళ్లీ ఒకసారి బాగా కలిపేసి, మరోసారి ఎన్‌ బీకే ద్రవాన్ని ఎరువుకు రంధ్రాలు చేసి నింపితే కంప్లీట్‌ ఆర్గానిక్ ఎరువు తయారవుతుంది. దీన్ని చెట్టుకు 50 నుంచి 60 కిలోలు వేస్తే మంచి బలాన్నిస్తుంది. మలేసియన్‌ డ్వార్ఫ్ కొబ్బరికి నెమటోడ్ ఇబ్బంది రాదు. అయినా ముందు జాగ్రత్తగా బెల్లం, 200 కిలోల వేపపిండి బెడ్ లా వేసి కప్పి పెడితే 30 రోజుల్లో కోటాను కోట్ల బ్యాక్టీరియా తయారవుతుంది. జూన్, జులైలో వర్షాలు పడినప్పుడు ఒకసారి, వర్షాలు తగ్గిపోయే ముందు ఒకసారి పెడితే చెట్టుకు రూట్ జోన్‌ బాగా అభివృద్ధి చెందుతుంది. అలాగే మనం పొలంలోని మంచి మట్టిని రెండు మూడు అంగుళాల లేయర్‌ వేసి, దానిపైన పశువుల ఎరువు, మళ్లీ మట్టి లేయర్‌, దానిపై పశువుల ఎరువు ఇలా లేయర్లుగా మూడు నాలుగు అడుగుల ఎత్తు వరకు బెడ్ తయారు చేసి, దాని మీద జొన్నలు, నవధాన్యాలు కలిపి 30, 40 కిలోలు చల్లి, దానిపై మట్టి కప్పి నీళ్లు పెడితే మొలుస్తాయి. విత్తనాలు చల్లేటప్పుడే రెండు మూడు కిలోల బెల్లం నీళ్లు మైక్రో రైజాలో కలిపి చల్లుకుంటే బాగా మొలుస్తాయి. ఆ మొక్కలు మూడు నాలుగు అడుగుల ఎత్తు ఎదిగి పూత స్టేజిల్లో బెడ్‌ తో పాటుగా బాగా కలిపేయాలి. అప్పడప్పుడూ బెల్లం నీళ్లు కొట్టి నిల్వ చేసుకుంటే అద్భుతమైన సంజీవని ఎరువు తయారవుతుంది. ఈ ఎరువును కొబ్బరి చెట్లకు వేస్తే.. మైక్రో న్యూట్రింట్లు బాగా అందిస్తుంది.మలేసియన్‌ డ్వార్ఫ్‌ కొబ్బరి చెట్లకు ప్రధానంగా వాటర్ మేనేజ్ మెంట్‌, ఫుడ్ మేనేజ్ మెంట్‌, స్ప్రేయింగ్ మేనేజ్ మెంట్ సక్రమంగా చేసుకుంటే అధిక దిగుబడులు ఇస్తుందని కృష్ణారెడ్డి తెలిపారు. మలేసియన్ డ్వార్ఫ్ కొబ్బరిచెట్టు నుంచి నాలుగైదు సంవత్సరాల నుంచి ఏటా 450 కాయలు వరకు దిగుబడి వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here