ఆరుగాలం కష్టపడి మన ఆకలి తీరుస్తున్న రైతన్నకు ప్రతి ఒక్కరూ సామంతులే అని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్రపతి మొదలు సామాన్యుల వరకు అందరూ అన్నదాతకు సామంతరాజులే అని అభివర్ణించారు. హైదరాబాద్ లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో గురువారం జరిగిన ‘జాతీయ రైతు దినోత్సవం’ ఆదర్శ రైతులకు అవార్డుల ప్రదానం కార్యక్రమంలో లక్ష్మీనారాయణ ప్రసంగించారు.  పట్టెడన్నం పెట్టే రైతుల సమస్యల పరిష్కారానికి, రైతన్న విలువను నవతరానికి తెలియజెప్పే కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహిస్తున్న ర్యాడ రవీందర్, సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఫౌండేషన్ సభ్యులను అభినందించారు. ‘సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో జరిగిన ఈ ‘జాతీయ రైతు దినోత్సవం’లో భాగంగా తెలంగాణకు చెందిన 15 మంది ఆదర్శ రైతులకు అవార్డుల ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమానికి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా, తస్లీమా మహమ్మద్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. శ్రీమతి జయశ్రీ మూగ, వర్రే  గంగాధర్, డాక్టర్ గోలి మోహన్ ఆత్మీయ అతిథులుగా హాజరయ్యారు.రాత్రనక పగలనకా కష్టించి పంట పండించి, దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషించే రైతులందరికీ మనందరం రుణపడి ఉండాలని లక్ష్మీనారాయణ అన్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా సరే రైతే రాజు అన్నారు. నేలతల్లిని నమ్ముకుని, ప్రతికూల పరిస్థితులను తట్టుకుని రైతన్నలు పంటలు పండిస్తున్నారని తెలిపారు. అలాంటి రైతన్న కంట కన్నీరు మన దేశాన్ని ప్రళయంలో ముంచేయక ముందే అన్నదాతకు ఓదార్పునిచ్చే ఉద్యమం రావాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయం దండగ కాదు.. పండగ అనే వాతావరణం తీసుకురావాలని లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. రైతు లేకపోతే మనం ఏం తినాలి? అని ప్రశ్నించుకోవాలని ప్రజలకు ఆయన అన్నారు. ఫార్మర్‌ ప్రొడక్ట్‌ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసినప్పుడే వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. వ్యవసాయానికి ఎంబీఏ, ఇంజనీరింగ్‌, వైద్య విద్యల్ని అనుసంధానం చేస్తే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయన్నారు. పనికి ఆహారం పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ప్రభుత్వాలకు ఆయన సూచించారు.అన్నదాతను ఆదుకుంటేనే దేశం మనుగడ సాగించగలుగుతుందని  కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్న వర్రే గంగాధర్‌ అన్నారు. వీఈఆర్‌ ఆగ్రోఫార్మ్స్‌ ను గంగాధర్‌ విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రసాయనాలు లేని సాగుబడి ఎంతో మేలు అని చెప్పారు. రసాయన విషాలతో కూడిన ఆహారం తిని మన సమాజం రోగగ్రస్తం అవుతోందని గంగాధర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి సిద్ధమైన పంటలు పండిస్తేనే భవిష్యత్తరాలు ఆరోగ్యంగా జీవించగలుగుతాయని చెప్పారు. ప్రకృతి వ్యవసాయ విధానాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాలని గంగాధర్‌ విజ్ఞప్తి చేశారు.వ్యవసాయం చేసే రైతులు తమ పంటలను ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని మరో ఆత్మీయ అతిథి మూగ జయశ్రీ ఆకాంక్షించారు. అన్నదాతల సమస్యలు, వారిని ఆదుకోవాల్సిన ఆవశ్యకతపై తస్లిమా మహహ్మద్ తదితరులు ప్రసంగించారు.కామారెడ్డి జిల్లా ప్రత్తి రైతు వంకాయల రవి, రాజన్న సిరిసిల్ల జిల్లా బ్లాక్ రైస్ పండిస్తున్న వరి వెంకటేష్, నల్గొండ జిల్లా రైతు శంకర్ యాదవ్ ధోతి, కుంట రాజన్న, వాకిరెడ్డి నర్సారెడ్డి, డి.విజయపాల్ రెడ్డి, ఉషారాణి, ప్రవీణ్ కుమార్, రంగ ప్రసాద్, సందీప్ కుమార్, సురేష్, మల్లికార్జునరెడ్డి, సంజీవ్ కుమార్, అంతం నరేష్, లక్ష్మీనరసయ్య, రాధారపు రఘురాజ్, గుర్రాల గోపాల్ రెడ్డికి ముఖ్య అతిథి లక్ష్మీనారాయణ ఆదర్శ రైతు అవార్డులు ప్రదానం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here