అతివృష్టి, అనావృష్టి ఇలాంటి అనేక కష్టనష్టాలను తట్టుకుని అహ‌ర్నిశ‌లు అన్నదాత క‌ష్టప‌డితే త‌ప్ప మ‌న కంచంలోకి అన్నం మెతుకు రాదు. ఆరుగాలం రైతు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పంట పండిస్తేనే మన నోటికి అన్నంముద్ద దొరుకుతుంది. అందుకే రైతు లేనిదే ప్రపంచం లేదు.. రైతే దేశానికి వెన్నుముక అని మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతించారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 23న మెగా స్టార్ చిరంజీవి రైతన్నకు తనదైన శైలిలో శుభాకాంక్షలు చెప్పారు. పంట చేతికి వస్తే ఆ రైతు పొందే ఆనందం ఎలా ఉంటుందో వీడియో ద్వారా వివరించారు.చిరంజీవి తమ పెరట్లో ఒక ఆనప గింజను నాటారు. అది మొలకెత్తి, పెరిగి, పందిరిపై పెద్దగా ఎదిగి కాయలు కాస్తోంది. తమ ఆనప పాదులో తొలిసారిగా కాసిన రెండు ఆనపకాయలు కోస్తూ చిరంజీవి చెందిన ఆనందం, అనుభూతిని వర్ణించతరం కాదు. తాను పండించిన ఆనపకాయలను ముద్దాడి మరీ చిరంజీవి మురిసిపోయారు. ‘మా పెరట్లో ఆనపకాయ కాస్తేనే నాకు ఇంత సంతోషం అనిపిస్తే.. రాత్రనకా పగలనకా కష్టం చేసి, మట్టి నుంచి పంట పండించి, మనందరికీ అన్నం పెట్టే రైతు ఇంకెంత సంతోషంగా ఉండాలి’ అంటూ మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. అంతేకాదు.. అన్నదాతలందరూ సంతోషంగా ఉండేలా మనమే చూసుకోవాలన్నారు. వ్యవసాయం చేస్తూ మనందరికీ సాయం చేస్తున్న ప్రతి రైతన్నకీ సెల్యూట్ అని చెప్పారు చిరంజీవి.

ప్రకృతి ఎంత గొప్పది అంటే.. మనం సరదాగా ఒక విత్తనం భూమిలో నాటితే… అది మన కడుపు నింపుతుంది. దానికి మనం ఎంత గొప్పగా కృతజ్ఞతగా ఉన్నాం.. ఎంత కృతజ్ఞతగా ఉంటామన్నది తెలియాల్సి ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఒక తొట్టిలోనైనా విత్తనం నాటండి.. స్వయంగా పండించిన కూరగాయలతో వండిన వంట ఎంతో రుచికరంగా ఉంటుందని చిరంజీవి సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా చిరంజీవి పెట్టిన ఈ వీడియో బాగా వైరల్‌ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here