‘జాతీయ రైతు దినోత్సవం’ సందర్భంగా వ్యవసాయంలో విశేషంగా కృషి చేసిన పలువురు రైతులకు ‘సేవ్‌ గ్లోబల్‌ ఫార్మర్స్‌ ఫౌండేషన్‌’ అవార్డులు అందజేసి సత్కరించింది. తెలంగాణలోని 15 మంది ఆదర్శ రైతులకు ఫౌండేషన్‌ తరఫున సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ, వీఈఆర్‌ ఆగ్రోఫామ్స్‌ అధినేత, సీనియర్‌ జర్నలిస్టు  గంగాధర్‌ వర్రే చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేసింది. సేవ్‌ గ్లోబల్‌ ఫార్మర్స్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన జాతీయ రైతు దినోత్సవం కార్యక్రమంలో తస్లీమా మహమ్మద్‌, శ్రీమతి జయశ్రీ మూగ, డాక్టర్ గోలి మోహన్‌ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.

‘సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఫౌండేషన్’ అవార్డులు అందుకున్న వారి విశేషాలను ఇప్పుడు చూద్దాం..

గుర్రాల శ్రీపాల్‌ రెడ్డి (రంగారెడ్డి జిల్లా): శ్రీపాల్‌ రెడ్డి వృత్తిరీత్యా ఐటీ ఉద్యోగి. ఉద్యోగ విధుల్లో వారం మొత్తం ఆయన ఊపిరి సలపనంత బీజీగా ఉంటారు. అయినా ప్రవృత్తి రీత్యా ఆయన వారాంతాల్లో తనకు అత్యంత ఇష్టమైన వ్యవసాయం చేస్తారు. అటు ఉద్యోగ ధర్మాన్ని, ఇటు వ్యవసాయ పథాన్ని సమన్వయం చేసుకుంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే ‘సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఫౌండేషన్’ సంస్థ శ్రీపాల్‌రెడ్డిని ఆదర్శ రైతుగా ఎంపిక చేసి, అవార్డు అందజేసింది.

రాధారపు రఘురాజ్‌ ప్రజాపతి (నిజామాబాద్‌ జిల్లా): హాసకొత్తూరు వాసి రాధారపు రఘురాజ్‌ ప్రజాపతి. ఎంబీఏ చదివారు రఘురాజ్‌. తన ఎంబీఏ విజ్ఞానాన్ని వ్యవసాయానికి వినియోగిస్తున్నారు. సీడ్ కంపెనీలో పనిచేస్తూ వాణిజ్య పంటల విత్తనాల మీద పరిశోధన చేస్తున్న రఘురాజ్‌కు సేవ్‌ గ్లోబల్ ఫార్మర్స్‌ ఫౌండేషన్‌ అవార్డుతో సంతోషంగా సత్కరించింది.

సంజీవ్‌ కానూర్‌ (నిజామాబాద్‌ జిల్లా): మోతె గ్రామానికి చెందిన సంజీవ్ కానూర్‌ బాక్సింగ్ కోచ్‌గా సేవలందిస్తున్నారు. మరో పక్కన విద్యార్థి నాయకుడిగానూ ప్రస్తానం కొనసాగిస్తున్న యువరైతుగా ప్రసిద్ధి చెందారు సంజీవ్‌ కానూర్‌. ‘రక్షణ కోసం బాక్సింగ్‌.. బతికేందుకు వ్యవసాయం’అనే నినాదం, జీవన విధానంతో సంజీవ్‌ కానూర్‌ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఈ క్రమంలోనే సేవ్‌ గ్లోబల్‌ ఫార్మర్స్ సంస్థ దృష్టిలో పడి ఆదర్శ రైతు అవార్డుకు ఎంపికయ్యారు.

శంకర్‌ యాదవ్ ధోతి (నల్గొండ జిల్లా): శంకర్ యాదవ్ ధోతి కూడా సాఫ్ట్‌ వేర్ ఉద్యోగే. ఒక పక్కన సాఫ్ట్‌ వేర్‌ జాబ్ చేస్తూనే మరో వైపున వ్యవసాయ క్షేత్రంలో కష్టించి పంటలు సాగు చేస్తున్నారు. మునుగోడు మండలంలో శంకర్ యాదవ్‌ తెలివైన వ్యవసాయం చేస్తూ ఎందరికో మార్గదర్శిగా నిలిచారు. అందుకే ‘సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఫౌండేషన్’ సంస్థ శంక్‌ యాదవ్‌ ధోతిని ఆదర్శ రైతుగా గుర్తించి, పురస్కారం ప్రదానం చేసింది.

మంగలరాపు ప్రవీణ్‌: ఒక వైపున ప్రవీణ్‌ వ్యవసాయాధికారి. మరో వైపున తన స్మార్ట్‌ ఆలోచనలను వ్యవసాయంలో అమలు చేస్తున్నారు. వీటితో పాటుగా ‘జైకిసాన్‌’అనే యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వహిస్తున్నారు. ఎకరం పొలంలో నెలకు 50 వేల రూపాయలు ఎలా సంపాదించాలి అనే తానే ఒక ప్రయోగశాలగా మారి విజయం సాధించారు ప్రవీణ్‌. తాను విజయం సాధించి వైనంపై వీడియో చేసి, దాన్ని ఎందరో రైతులకు అందజేసి ఉత్సాహపరిచి ఆదర్శ రైతుగా నిలిచారు మంగలరావు ప్రవీణ్‌. అలా ప్రవీణ్‌ను ఆదర్శ రైతుగా అవార్డు అందజేసి సన్మానించింది సేవ్‌ గ్లోబల్ ఫార్మర్స్‌ ఫౌండేషన్‌.

సందీప్ కుమార్‌ (నిజామాబాద్‌ జిల్లా): ధర్మారం గ్రామానికి చెందిన ఆదర్శ రైతు సందీప్‌ కుమార్‌. ఉన్నత చదువులు చదివారు. ఉద్యోగ అవకాశాలు ఎన్నో ఉన్నా వాటిని తృణప్రాయంగా వదిలేశారు వ్యవసాయం చేయడం కోసం. మొత్తం 40 ఎకరాల్లో డ్రాగన్‌ ఫ్రూట్‌తో పాటు ఇతర పండ్ల సాగు చేస్తున్నారు. పండ్ల పంటలతో పండుగ చేస్తున్నారు సందీప్‌ కుమార్‌. అలాంటి సందీప్‌ కుమార్‌కు ఆదర్శ రైతు అవార్డు అందజేసింది సేవ్‌ గ్లోబల్‌ ఫార్మర్స్‌ ఫౌండేషన్‌.

రంగప్రసాద్‌ (నాగర్‌ కర్నూల్‌ జిల్లా): జూపల్లికి చెందిన ఆదర్శ రైతు రంగప్రసాద్‌లో ఎన్నో కోణాలున్నాయి. ఫార్మా చదువులు చదివారు. పలు బ్యాంకుల్లో పనిచేశారు. ఎన్నో వృత్తులు నిర్వహిస్తున్నారాయన. ఆయన చేసే ప్రతి పనిలోనూ రైతు ఆత్మే కనిపిస్తుంది. రంగప్రసాద్‌ ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో ఎన్నో ప్రయోగాలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా యువతరం వ్యవసాయం వైపు ఆకర్షితులను చేయడాని రంగప్రసాద్‌ అహర్నిశలూ కృషిచేస్తున్నారు. ఐ ఫార్మ్స్‌ లాంటి అగ్రి స్టార్టప్‌ స్థాపించి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలాంటి రంగప్రసాద్‌కు సేవ్‌ గ్లోబల్‌ ఫార్మర్స్‌ ఫౌండేషన్‌ ఆదర్శ రైతుగా పురస్కారం అందజేసింది.

మల్లికార్జునరెడ్డి (కరీంనగర్‌ జిల్లా): ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనేది పెద్దల మాట. అలాంటి ఆరోగ్యాన్ని సమాజానికి అందించేందుకు మల్లికార్జునరెడ్డి అహర్నిశలూ కృషిచేస్తున్నారు. సమాజం కోసం ఉద్యోగాన్ని, విలాసవంతమైన జీవితాన్ని వదిలిపెట్టిన శ్రీమంతుడు మల్లికార్జున్‌రెడ్డి. ప్రకృతి వ్యవసాయం చేస్తూ.. ఔషధ మొక్కలు పెంచుతున్నారు. సమాజం కోసం తన ఒక్కడి కృషే సరిపోదని భావించిన ఆయన తన సతీమణి చేత కూడా ఉద్యోగానికి రాజీనామా చేయించి, ప్రకృతి వ్యవసాయంలో సాయం తీసుకుంటున్నారు. అలా మల్లికార్జునరెడ్డి దంపతులు ఆదర్శ రైతులుగా ప్రసిద్ధులయ్యారు. భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కూడా మల్లికార్జునరెడ్డిని ఆదర్శ రైతుగా మెచ్చుకోవడం విశేషం. అలాంటి మల్లికార్జునరెడ్డి సేవ్‌ గ్లోబల్‌ పార్మర్స్‌ ఫౌండేషన్‌ నుంచి ఆదర్శరైతుగా పురస్కారం అందుకున్నారు.

ఉషారాణి: నగరాల్లోని మేడలు, బంగ్లాలు ఉషారాణి పేరు చెబితేనే పులకరించిపోతాయి. వ్యవసాయానికి ఎకరాల కొద్దీ భూమి అవసరం లేదని, గుప్పెడంత మనసుంటే చాలని ఈమె నిరూపించారు. తమ బంగ్లా టెర్రస్‌ గార్డెన్‌లో ఆర్గానిక్‌ పంటలు పండిస్తూ ఎందరిలోనూ స్ఫూర్తి నింపుతున్నారు ఉషారాణి. అస్తమించిపోయిన నగర ఆరోగ్యానికి ఉషాకిరణంగా దూసుకొచ్చి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు ఉషారాణి. అలాంటి ఉషారాణికి సేవ్‌ గ్లోబల్‌ ఫార్మర్స్‌ ఫౌండేషన్‌ ఆదర్శ రైతు అవార్డు అందజేసింది.

నర్సారెడ్డి (నిర్మల్‌ జిల్లా): కౌట్ల బి గ్రామం నుంచి మొదలైన నర్సారెడ్డి కోట్ల మంది రైతులకు స్ఫూర్తిగా నిలిచారు. నర్సారెడ్డి వచ్చిన నిర్మల్‌ జిల్లా కౌట్ల బి గ్రామం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. 2003లో కౌట్ల బి ఎఫ్‌పీఓని 51 మంది రైతులతో నర్సారెడ్డి ప్రారంభించారు. ఈ ఎప్‌పీఓ రైతు సంస్థలో ఒక్కొక్కరు వెయ్యిరూపాయలు పెట్టుబడి పెట్టారు. నర్సారెడ్డి విత్తనం వేసిన ఎఫ్‌పీఓ షేరు ఇప్పుడు 6.5 లక్షలా దాకా పెరిగింది. అలా ఎఫ్‌పీఓని నర్సారెడ్డి దినదిన ప్రవర్ధమానం చేశారు. ఈ రైతు సంస్థ గోడౌన్‌లు, సూపర్‌ మార్కెట్లు ఏర్పాటు చేసింది. నర్సారెడ్డి స్థాపించిన ఈ ఎఫ్‌పీఓకి జాతీయ స్థాయిలోనూ అనేక అవార్డులు గెలుచుకోవడం విశేషం. అలాంటి ఎఫ్‌పీఓ తరఫున నర్సారెడ్డి, ఆయన బృందం సేవ్ గ్లోబల్‌ ఫార్మర్స్‌ ఫౌండేషన్‌ పురస్కారం అందుకున్నారు.

కర్నె లక్ష్మీనర్సయ్య (నిజామాబాద్‌ జిల్లా): మోర్తాడ్‌ గ్రామానికి చెందిన లక్ష్మీనర్సయ్య ఇందూరు జిల్లాలో అందరివాడిగా మారారు. సెర్ఫ్‌ లాంటి సంస్థలో పనిచేసి, సేంద్రీయ వ్యవసాయంలో తన సతీమణితో కలిసి సొంతంగా ఎరువులు తయారు చేసుకుంటున్నారు. తద్వారా జిల్లాలో ఎందరో రైతులకు ఆదర్శంగా నిలిచారు. లక్ష్మీనర్సయ్య సేవ్‌ గ్లోబల్‌ ఫార్మర్స్‌ ఫౌండేషన్‌ అవార్డు అందుకున్నారు.

కుంట రాజన్న (నిజామాబాద్‌ జిల్లా): ఆదర్శ రైతు కుంట రాజన్న వయస్సు 73 ఏళ్లు. కుటుంబం మొత్తం ఉన్నతంగా స్థిరపడింది. కొడుకులు మనవలు తమ తమ జీవితాల్లో మంచి స్థానాల్లో ఉన్నారు. అలాంటి రాజన్న ఈ వయస్సులో ఇంట్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చోవచ్చు. అయితే.. తనకు సంతోషం, ప్రశాంతత కేవలం వ్యవసాయం చేయడంలోనే ఉందంటారు. అందుకే సాగుబడిలో ప్రయోగాత్మక విధానాలు అవలంబిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. అందుకే ఈ పెద్ద రైతన్నను సేవ్‌ గ్లోబల్‌ ఫార్మర్స్‌ ఫౌండేషన్‌ అవార్డు వరించింది.

వంకాయల రవి (కామారెడ్డి జిల్లా): ప్రత్తి పంట అంటే దండగ కాదు పండగ అని నిరూపించారు రైతు వంకాయల రవి. కొత్త కొత్త విధానాలతో తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ దిగుబడులు సాధిస్తున్నారీయన. ప్రత్తి సాగులో వెలుగులు పంచుతున్న వంకాయల రవిని ఆదర్శ రైతుగా గుర్తించి సేవ్‌ గ్లోబల్‌ ఫార్మర్స్‌ ఫౌండేష్‌ అవార్డు అందజేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here