అనావృష్టికి, కరువుకు, వలసలకు అనంతపురం జిల్లా పెట్టింది పేరు. దశాబ్దాలుగా ఏర్పడుతున్న కరువు కాటకాలు వారి జీవితాల్లో నిరాశా నిస్పృహలు నింపేశాయి. అక్కడ సరిపడినన్ని వర్షాలు ఉండవు. అప్పుడప్పుడూ కురిసే వర్షంతో భూమిలో చేరిన కొద్దిపాటి నీటిస్థాయిలు కూడా వేగంగా తగ్గిపోతుంటాయి. రసాయన ఎరువులతో సాగుచేసి, తమ జీవితాలు గడుపుకునే వారు. అందుకు ఏ మాత్రం ఆలోచన లేకుండా పశువులను అమ్మేసేవారు. లేదా అప్పు చేసి ఎరువులు తెచ్చి పొలాల్లో వేసేవారు. అప్పుడైనా కొద్దో గొప్పో పంట తమ వస్తుందనే ఆశతో ఉండేవారు. ఇదంతా జిల్లాలోని దిగువపల్లి వాసుల గతం. ఇప్పుడు ఆ గ్రామంలోని మహిళలు ప్రకృతి సిద్ధంగా చిరుధాన్యపు పంటలు పండిస్తున్నారు. సాగు ఖర్చు తక్కువ అవుతోంది. దిగుబడి ఎక్కువ వస్తోంది. పంటకు ధర కూడా అధికంగా వస్తుండడంతో దిగువపల్లి గ్రామస్థులంతా ఇప్పుడు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు.

అనంతపురం జిల్లాలోని ఓ కుగ్రామం దిగువపల్లి. బెంగళూరుకు ఉత్తర దిశలో 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. కదిరి మండలంలోని ఈ గ్రామంలో 100 రైతు కుటుంబాలు ఉన్నాయి. 2016లో ఏర్పడిన అతిపెద్ద కరువుతో గ్రామస్థులు తమ పశువులు పోగొట్టుకున్నారు. ప్రచండ సూర్యుడి భగభగలకు పంటలనూ పూర్తిగా కోల్పోయారు. బతుకు దెరువు కోసం బెంగళూరు లాంటి పెద్ద నగరాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి దాపురించింది. జిల్లా చరిత్రలోనే ఆ ఏడాది ఏర్పడినంత కరువు, దయనీయమైన పరిస్థితులు లేవని అధికారులే చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సాధారణ వర్షపాతం కన్నా 40 శాతం తక్కువ నమోదైనట్లు సీఎం ఆఫీస్‌ రియల్‌ టైమ్‌ ఎగ్జిక్యూటివ్‌ (కోర్‌) గణాంకాలు తెలిపాయి. దాంతో భూగర్భ జలాలు కూడా 19 మీటర్ల నుంచి 26 మీటర్ల దిగువకు పడిపోయాయి. దేశం మొత్తంలో అత్యంత తక్కువ నీటి లభ్యత ఉండే జిల్లాల్లో అనంతపురం ఒకటి. అలాంటి జిల్లాలోని దిగువపల్లి వాసులకు కరువులు, వలసలు కొత్తేమీ కాదు. ఆరు పదులు దాటిన వృద్ధులు కూడా ఆ ఏడాది అనుభవించినంత దుర్భర పరిస్థితులు అంతకు ముందెప్పుడు చూసి ఉండలేదని గుర్తుచేసుకుంటారు.ఆ కరువు ఏర్పడిన ఆరు నెలల తర్వాత ఆ ఊరి మహిళా రైతులంతా ఓ నిర్ణయానికి వచ్చారు. తమ ఊళ్లో ఏర్పడిన కరువు పరిస్థితులను అధిగమించేందుకు కనీసం 100 ఎకరాల్లో ప్రత్యేకంగా చిరుధాన్యపు పంటలే సాగుచేసేందుకు ముందుకు వచ్చారు. రసాయనాలు అస్సలు వాడకుండా చేసే చిరుధాన్యాల సాగుకు ఇతర వాణిజ్య పంటల కన్నా నీటి అవసరం తక్కువ అవడమే ఆ మహిళా రైతుల నిర్ణయానికి ముఖ్య కారణం. నీటి అవసరం పెద్దగా ఉండని సజ్జలు, ఫాక్స్‌ టైల్‌, చిరు ధాన్యపు పంటలు వేయాలని ప్రధానంగా వారు నిర్ణయించారు. గ్రామంలోని 100 వ్యవసాయ క్షేత్రాలకు గాను 25 క్షేత్రాలను ఆ మహిళలే నిర్వహిస్తున్నారు. ఒక్కో మహిళకు ఒకటిన్నర ఎకరం నుంచి రెండెకరాల పొలం ఉంది. వారిలో ఎక్కువ మంది వితంతువులో లేక వారి భర్తలు పని చేసే శక్తి లేనివారో లేదా మద్యానికి బానిసలుగానో ఉండేవారు. అలాంటి దిగువపల్లి మహిళలంతా ’మహిళా రైతుల ఉత్పత్తిదారుల సంఘం’ పేరుతో సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంఘం మహిళలంతా భూతాపం వల్ల ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో బాగా అర్థం చేసుకున్నారు. పూర్వం నుంచి తాము చేస్తున్న సాంప్రదాయ వ్యవసాయ విధానాలను వదిలిపేట్టేశారు.

ప్రతి 10 వేరుశెనగ, కంది మొక్క వరసల మధ్య ఒక వరస చిరుధాన్యం మొక్కలు నాటినట్లు రైతు సంఘం సభ్యురాలు 60 ఏళ్ల హైదర్‌ వల్లియమ్మ పేర్కొంది.  హైదర్‌ వల్లియమ్మకు మూడెకరాల పొలం ఉంది. పండించిన చిరుధాన్యాల్లో చాలా వరకు తమ కుటుంబమే వాడుకునేవారమని చెప్పింది. తాము వాడుకోగా మిగిలిన చిరుధాన్యాలను మార్కెట్‌లో అమ్మేదట. దిగువపల్లిలో ఉన్నవి అసలే బంజరు భూములు. రాళ్లు రప్పలతో నిండి ఉండి, అత్యల్పంగా కురిసే వర్షం వల్ల వేడి సెగలు ఎగదన్నేవి. అయినప్పటికీ అప్పుడు ఇప్పుడూ కూడా జిల్లా రైతులు వేరుశెనగ పండిస్తుంటారు. అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతంలో వేరుశెనగ లాంటి వాణిజ్య పంటలు పండించడం అంటే అది ఒక విలాసం అనే చెప్పాలి. వర్షం లేక పంటలు పండకపోతే రైతులు పస్తులు ఉండాల్సి పరిస్థితి ఉండేది. నీరు సదుపాయం లేని కారణంగా ఎకరం పొలంలో కేవలం 300 కిలోల కంది పంట మాత్రమే వచ్చిందని 38 ఏళ్ల నాగేశ్వరమ్మ చెప్పింది. ఆమెకు ఐదెకరాల పొలం ఉంది. అదే ఎకరం భూమిలో నీరు సమృద్ధిగా ఉన్నప్పుడు 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చిందని తెలిపింది.

ఏటేటా వర్షాలు, నీరు లేక పంటలు ఎండిపోతుండడంతో చిరుధాన్యాల పంటలు వేసేలా ప్రభుత్వం దిగువపల్లి మహిళా రైతులను ప్రోత్సహించింది. ప్రభుత్వంతో పాటు వాటర్‌షెడ్‌ సపోర్ట్‌ సర్వీసెస్‌ అండ్‌ యాక్టివిటీ నెట్‌వర్క్‌ (వాస్సన్‌) రెడ్స్‌ లాంటి ఏజెన్సీలు సామూహిక చిరుధాన్యాల పునరుద్ధరణ కార్యక్రమం కింద రైతులు మరింత ఎక్కువగా చిరుధాన్యాల పంటలు వేసేలా ప్రోత్సహించాయి. రీడ్స్ సంస్థ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ కలిసి ‘రాయలసీమ క్రాప్‌- బయోడైవర్సిటీ ఫెస్టివల్‌’ నిర్వహించాయి. రైతులను ఒకచోట చేర్చి, ఎలాంటి విత్తనాలు వేస్తే నీటి కరువును తట్టుకుని పంటలు పండుతాయో వారికి అవగాహన కల్పించడం ఈ ఫెస్టివల్‌ ముఖ్య  ఉద్దేశం అని ఉత్పవ కమిటీ కో ఆర్డినేటర్‌ భానుజ తెలిపారు. రైతులు పండించిన ఫాక్స్‌ టైల్‌ క్వింటాల్‌ మిల్లెట్స్‌ను రూ.1,750 కొనేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. దిగువపల్లి మహిళా రైతులు చిరుధాన్యాలు పండించడానికి ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం ఇది. చిరుధాన్యపు పంటల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ కొనుగోలు కేంద్రాలను రైతులే నిర్వహించేలా చేసింది. ఇది కూడా రైతులు చిరుధాన్యపు పంటలు పండించడానికి ప్రోత్సాహం కలిగించిందని అలయెన్స్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ అండ్‌ హోలిస్టిక్‌ అగ్రికల్చర్‌ (ఆషా) కో కన్వీనర్‌ కవిత కురుగంటి తెలిపారు.చిరుధాన్యపు పంటలు పండించక ముందు దిగువపల్లి రైతుల వద్ద అంతగా డబ్బులు ఉండేవి కావని, చిరుధాన్యాలు పంటతో తమకు ఇప్పుడు చేతి నిండా డబ్బులు ఉంటున్నాయని మహిళా రైతు హైదర్‌ వల్లియమ్మ సంతోషంగా చెప్పింది. అంతకు ముందు చిరుధాన్యాలు ఎవరు కొంటారో తెలిసేది కాదని హైదర్‌ వల్లియమ్మ తెలిపింది. ఇప్పుడు తమకు ఉన్న సగం పొలంలో చిరుధాన్యాలు పండిస్తున్నామని పేర్కొంది.

సామూహిక మిల్లెట్‌ రివైవల్‌ ప్రోగ్రామ్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా జీరో బడ్జెట్‌ నేచురల్ పార్మింగ్‌ విధానాన్ని ప్రోత్సహించింది. రైతులకు తొమ్మిది రకాల నవధాన్య విత్తనాలు ప్రభుత్వం అందజేసింది. జెడ్‌బీఎన్‌ఎఫ్‌ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత దిగువపల్లి మహిళా రైతులకు ఇక బయటి నుంచి ఎలాంటి వనరుల అవసరం లేకపోయింది. రసాయన ఎరువుల వాడకం లేకపోవడంతో వారి సాగు ఖర్చు 60 నుంచి 70 శాతం దాకా తగ్గిపోయిందని ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక వ్యవసాయ సలహాదారు టి. విజయ్‌కుమార్‌ తెలిపారు. చిరుధాన్యం విత్తనాలు నాటిన దగ్గర నుంచి పంట పండించే వరకు గ్రామస్థులకు ప్రభుత్వమే సహాయ సహకారాలు అందిస్తుందని కుమార్‌ వెల్లడించారు. మిల్లెట్ రివైవల్‌ ప్రోగ్రామ్‌ కింద రాయలసీమలోనే కాకుండా కోస్తా ఆంధ్ర ప్రాంతంలో కూడా చిరుధాన్యాల సాగును మరింతగా పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వాస్సన్‌ డైరెక్టర్‌ ఏ.రవీంద్ర వెల్లడించారు. ప్రభుత్వం పథకాల కారణంగా భూగర్భ జలాల వినియోగం తగ్గిందని విశ్లేషకులు చెబుతున్నారు. చిరుధాన్యపు పంటల ద్వారా రైతుల జీవన ప్రమాణాలు కూడా బాగవుతున్నాయని వారు అంటున్నారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here