రసాయన ప్రయోగశాల నుంచి వ్యవసాయాన్ని బయటకు తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని రైతులకు సూచించారు. ప్రకృతి వ్యవసాయంపైనే రైతన్నలు ప్రధానంగా దృష్టిసారించాలని ఆయన పిలుపునిచ్చారు. రైతుల ఆదాయాన్ని మరింతగా పెంచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మోదీ తెలిపారు. రైతుల కోసం తాము చేపడుతున్న చర్యల కారణంగా వ్యవసాయ రంగంలో మార్పులు వస్తాయన్నారు. గుజరాత్‌లోని ఆనంద్‌ పట్టణంలో నిర్వహించిన ఆగ్రో అండ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రసంగించారు. మెరుగైన వ్యవసాయ ఉత్పత్తులను సాధించేందుకు, నేలతల్లి జీవిత కాలాన్ని పెంచేందుకు ప్రకృతి సహజ సాగు విధానాలు అవలంబించాలని రైతులకు ప్రధాని సూచించారు. ప్రకృతి ప్రయోగశాలతో వ్యవసాయాన్ని అనుసంధానం చేయాలని తెలిపారు. ప్రకృతి ప్రయోగశాల పూర్తిగా సైన్స్ ఆధారితమని, విత్తనాల నుంచి నేల వరకు అన్ని సమస్యలను దీని ద్వారా సహజంగా పరిష్కరించవచ్చన్నారు.ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయానికి మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని చెప్పారు. భూసారాన్ని, భూమిని పరిరక్షించడంలో దేశీ ఆవు పేడ, గోమూత్రం ప్రధాన పాత్ర పోషిస్తాయని ప్రధాని మోదీ ప్రస్తావించారు. పంటల సాగులో ఆవు పేడ, గోమూత్రం వినియోగించడం ద్వారా అధిక ఉత్పత్తులు సాధించవచ్చని అన్నారు. ఆకులు, అలములు, చెత్త లాంటి వాటిని కూడా కుళ్లబెట్టి మనం ప్రకృతి సాగు విధానంలో ఎరువులా వాడుకోవచ్చని తెలిపారు. మన ఆహార అవసరాలకు కావాల్సిన ప్రతీదీ ప్రకృతే ప్రసాదించిన విషయం మరచిపోకూడదన్నారు. రసాయన ఎరువుల వాడకం కంటే.. ప్రకృతి వ్యవసాయానికి తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. దేశంలోని 80 శాతం మంది సన్న చిన్నకారు రైతులకు ప్రకృతి సాగు విధానం ద్వారా మంచి లాభం పొందవచ్చన్నారు. రెండెకరాల లోపు వ్యవసాయం చేసే రైతులు అత్యధికంగా రసాయన ఎరువులు వినియోగిస్తున్నారని, తద్వారా ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారని మోదీ గుర్తుచేశారు. ఇలాంటి రైతులు ప్రకృతి సిద్ధంగా లభించే ఎరువులను వాడితే ఖర్చు తగ్గుతుందని, ప్రయోజనం పెరుతుందని ప్రధాని మోదీ సూచించారు.ప్రకృతి నుంచే వ్యవసాయానికి కావాల్సిన శక్తిని పొందవచ్చని ప్రధాని పేర్కొన్నారు. అది ఎలా చేయాలో మనం తెలుసుకుంటే చాలని ప్రధాని చెప్పారు. ప్రకృతి సహజమైన సాగు విధానంలో ఎరువులు, పురుగు మందుల కోసం వేలకు వేలు ఖర్చు చేయనక్కరలేదని అన్నారు. ప్రకృతి విధానంలో సాగునీటి అవసరం కూడా బాగా తగ్గిపోంతుందన్నారు. వరదలు, కరువుకాటకాలు వంటి విపత్తులను కూడా ఎదుర్కొనే సత్తా ప్రకృతి వ్యవసాయం ద్వారా లభిస్తుందని మోదీ పేర్కొన్నారు. భారతీయ రైతులు స్వయం సమృద్ధం అయ్యేందుకు ప్రకృతి సాగు విధానం ఎంతగానో దోహదపడుతుందని వివరించారు.ప్రకృతి సహజ సాగు విధానాలను రైతులు అవలంబించడం వల్ల గత కొన్నేళ్లుగా వ్యవసాయోత్పత్తులు ఏ విధంగా పెరిగాయో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ చెప్పారని మోదీ తెలిపారు. ప్రకృతి వ్యవసాయానికి ఆధారం సైన్సే అని మోదీ అన్నారు. ప్రపంచం సాంకేతికంగా ప్రగతి సాధించినప్పటికీ, అది తన మూలాలకు కూడా అనుసంధానం అయిందన్నారు. ఆధునిక సాంకేతిక ప్రగతిని సాగు రంగంలో కూడా అమలు చేయాలని రైతులకు ప్రధాని పిలుపునిచ్చారు.రసాయన ఎరువుల వినియోగం అన్నదాతలకు ఆర్థిక భారంగా మారిందని, దీంతో వారి ఆదాయానికి తగ్గిపోతోందని మోదీ తెలిపారు. మన వ్యవసాయ అవసరాలకు సరిపడినంతగా రసాయన ఎరువులు మన దేశంలో ఉత్పత్తి కావడంలేదని, దాంతో విదేశాల నుంచి కూడా చేసుకోవలసి వస్తోందన్నారు. రసాయన ఎరువుల దిగుమతి కారణంగా సాగు ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయని మోదీ గుర్తుచేశారు. అందుకే ప్రకృతి సహజ సాగు విధానంపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here